మల్లాది వెంకటకృష్ణమూర్తి..కథాకేళి 2

మల్లాది వెంకటకృష్ణమూర్తి 'కథాకేళి' 1991 లో మొదటి ప్రచురణ.  మల్లాది వెంకటకృష్ణమూర్తి 'కథాకేళి' పుస్తకం లోని 600 మాటలు  మించని అద్బుతమైన ట్విస్ట్ తో ముగిసే కధలు...మీ కోసం మరీ కొన్ని

 

నేనేం చేయాలి...?

చంద్రగ్రహానికి మొదటిసారిగా రాకెట్ పంపారు రష్యా వాళ్ళు . ఈ సారి ప్రత్యేకత సరాసరి ఆ రాకెట్ చంద్రగ్రహం మీద దిగుతుంది. ఆ రాకెట్ లొ ఒక మనిషిని, ఒక కోతిని కలిపి పంపారు.
ముందుగా ఆ కోతికి తగిన శిక్షణ ఇచ్చారు. చెవులకి ఇయర్ ఫోన్స్ అమర్చారు క్రింద గ్రౌండ్ కంట్రోల్ నుంచి కోతికి ఏ సమయానికి ఏ మీట నొక్కాలో ఏ లివర్  కదపాలో, ఏ స్విచ్ నొక్కాలో వైర్ లెస్స్ ద్వారా సూచనలు చెపుతున్నారు. ఆ ప్రకారం ఆ కోతి ఆ రాకెట్ ని చంద్రగ్రహం వైపు నడుపుతోంది.

రష్యన్ కూడా వైర్ లెస్స్ చెవులకి తగిలించుకొని తనకి సూచనలు చేస్తారని ఎదురు చూస్తున్నాడు.
రాకెట్ బయలుదేరి దాదాపు ఎనిమిది గంటలయింది. రాకెట్ నడిపే పనంతా ఆ కోతే చేస్తుంది. క్రిందనుంచి వచ్చే సూచనల ప్రకారం.
రష్యన్ కాసేపు ఆగి అడిగాడు గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళని, "నేనేం చేయాలి?"
"ఇంకో ఇరవై నిముషాలు ఆగు చెప్తాం " సమాధానం చెప్పారు.
సరిగ్గా ఇరవై నిముషాల తర్వాత చెవులు రిక్కిన్చుకుని ఆ రష్యన్ తనకివ్వబోయే సూచనలకోసం ఎదురు చూడసాగాడు.
కింద నుంచి ఆఖరుకి వచ్చింది సూచన.
"వేళయింది. ఆ కోతికి భోజనం వడ్డించు. తర్వాత ఎప్పుడు భోజనం పెట్టాలో మళ్లీ చెపుతాం."
"ఆ తర్వాత....?"
"హాయిగా నిద్రపో..."


కస్టమర్

"అది కాదు ఆ పక్కది చూపించండి"
సేల్స్ కౌంటర్ ముందున్నచిన్న స్టూల్ మీద కూర్చున్న నలభై ఏళ్ళావిడ ఎదురుగా ఉన్న బట్టలని చూపించింది.
సేల్స్ గర్ల్ ప్రభావతికి విసుగ్గా ఉంది. కానీ తప్పదు, అప్పటికే దాదాపు నలభై రకాల చీరెలు తీసి చూపించింది. ఒక్కటీ నచ్చలేదు ఆవిడకి.
ఆవిడ చూపించిన చీర తీసి, కౌంటర్ మీద పరిచింది. చేత్తో దాని నాణ్యాన్ని పరిశీలించింది ఆవిడ. పెదవి విరిచింది. అంచు చూసి చెప్పింది.
"ఆకుపచ్చ రంగు అంచు ఉండే  చీర దొరుకుతుందా ఇదే రంగులో?"
తల అడ్డంగా ఊపింది ప్రభావతి. ఆవిడ కళ్ళు మళ్లీ చీరల  మీదకి వెళ్ళాయి. కొన్ని నిముషాలు పరీక్షగా చూసి చెప్పింది.
"ఆ ఊదా రంగు చీర చూపించండి"
ప్రభావతి విసుగుని ప్రదర్శించకుండా దాన్ని బయటికి తీయడానికి వెనక్కి తిరిగింది. ఆవిడ కూతురి మాటలు వినబడ్డాయి.
"వర్షం తగ్గిందే అమ్మా! తగ్గాక చెప్పమన్నావుగా"
ఆవిడ మాటలు వినబడ్డాయి వెంటనే.
"వద్దులెండి తీయకండి....థాంక్స్"
వెనక్కి తిరిగేసరికి ఆవిడ తన ఆరేళ్ళ కూతురి చేతిని పట్టుకుని వెళ్ళడం ప్రభావతి కంటపడింది.


పరిణామం

అబిడ్స్ లొ గబగబ నడుస్తున్న షణ్ముఖరావుని, అతని నడక తీరుని బట్టి గుర్తించాను. వెంటనే చప్పట్లు కొట్టి పిల్చాను. బాగా దగ్గరగా వచ్చాక గుర్తుపట్టాడు నన్ను.
"ఏం చేస్తున్నారు?" అడిగాడు ఆప్యాయంగా
చెప్పాను.
"మరీ మలక్ పేటలో  డైరీ ఫారం నడుపుకున్నారటగా....?" అడిగాను.
"అవును అబ్బ! ఇంతకాలానికి కలిసాం?" అన్నాడు సంతోషాన్ని ప్రదర్శిస్తూ
"మీకభ్యంతరం లేకపోతే ఓ పెగ్ వేసుకొందామా?" అడిగాను జేబు తడిమి చూసుకొని.
"పద౦డి.....! నేనే ఆమాట అందామనుకుంటున్నాను...." అన్నాడు.
అయిదు నిముషాలు నడిచి, ఓ బార్ లోకి వెళ్లాం. రెండు పెగ్స్ బదులు "నిస్" తాగుదాం అన్నాడు. ఆలా ఆర్డర్ ఇస్తే కొంచెం కాస్ట్ తక్కువట. క్వార్టర్ డిప్లమాట్ కి ఆర్డరిచ్చాను. చికెన్ నూడుల్స్ అక్కడ బావుంతాయంటే, దానికీ ఆర్డరిచ్చాను.
నేను పావుగంటలో మొత్తం కొట్టేసి, 'బాత్ రూం కి వెళ్లొస్తాను గురూగారు, ఇంకో పెగ్ కి ఆర్దరివ్వండి' అని, షణ్ముఖరావుని బార్ లొ వదిలి బయటకి జారుకొని ఇంటిదారి పట్టాను.
నాలుగు సంవత్సరాల క్రితం, మేం కాలేజీలో ఆఖరి టర్మ్ లొ ఒకరోజు కూల్ డ్రింక్  షాపుకు వెళ్ళిన సంఘటన మర్చిపోలేదు. అది గుర్తుండే పిల్చాను వాడిని బార్ కి.
ఆ రోజు బిల్ పది ఇవ్వాల్సి వస్తే, ఇలాగే స్టైల్ గా చెక్కేసాడు గురుడు. వాడు పిలిస్తే వెళ్ళి, తెల్ల ముఖం  వేసుకుని నేనే ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలిసింది ఈ వెధవ యిలా చాలా మంది చేత బిల్ల్స్ ఇప్పించి మోసం చేసాడని, నా మిత్రులంతా నన్ను హేళనచేసి  నవ్వడం ఎంతో బాదించింది నన్ను.
బహుశ షణ్ముఖరావు దగ్గర ఆ బార్ బిల్ ఇచ్చే డబ్బు లేకపోతే, ఉంగరమో, వాచినో పెట్టి ఏ రాత్రి ఒంటిగంట వరకో నాకోసం చూసి వెళ్ళి ఉంటాడు. మర్నాడు ఆ బిల్ కట్టి ఆ ఉంచిన వస్తువు విడిపించుకొని ఉంటాడు.
ఇక్కడితో ముగిస్తే ఇది 'మినీ కథ' ఎలాగవుతుంది?
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఓ రోజు నాకు సుదినం!
ప్రైవేటు కంపెనీ లలో  పనిచేసే నాలాంటి వాళ్ళు ఉద్యోగాలు మార్చడం మామూలే, ఎక్కువ జీతం కోసం, పాత కంపెనీకి రాజీనామా ఇచ్చి, కొత్త కంపెనీ ఇచ్చిన అప్పాయింట్మెంట్ ఆర్డరు పట్టుకొని వెళ్లాను ఉద్యోగంలో చేరడానికి.
"సార్! మిమ్మల్ని డిజపాయింట్ చేస్తున్నాం. మీకిద్దామనుకున్న పోస్ట్ మరొకరికి నిన్ననే ఇచ్చేసాం" అన్నాడు బ్రాంచ్ మేనేజర్ నాతో.
గుండె ఝల్లు మంది నాకు.
"వెరీ సారీ ! మీ ఆర్డర్ లొ ఉద్యోగం గ్యారంటీ గా ఇస్తామని లేదు. ఆ క్లాజ్ కూడా ఉంది....అన్నట్లు చెప్పటం మరిచాను. షణ్ముఖరావు నాకు తమ్ముడవుతాడు. అప్లికేషనుకు అ౦టించిన ఫోటో చూసి మీరు వాడికి స్నేహితుడవుతారని చెప్పాడు" అన్నాడు నవ్వుతూ.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!