కరిగిపోయిన సైకత శిల్పం..నాకు నచ్చిన 'అరుణపప్పు' గారి కథ

అద్దం మూసిన కిటికీలోంచి మబ్బులు వెనక్కి జరగడం గమనించకపోతేగనక, విమానం ముందుకెళుతోందన్న సంగతే తెలియదేమో. చదువుతున్న పుస్తకంలోకి మళ్లీ తలదూర్చబుద్ధి కాలేదు. ఇటుపక్కకు చూస్తే సూటూబూటూ వేసుకున్న పెద్ద మనిషి ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటున్నాడు. దానికి బదులు అతను ఏ పుస్తకమో చదువుతుంటే ఈపాటికి అతన్ని కదిపి సంభాషణలో పడేసే మనిషినే నేను. అలా అనుకోగానే మనసులో ఆచార్య నేర్పించిన ఆట మెదిలింది. మా వయసుల్లోని తేడా మర్చిపోయి మరీ దాన్ని ఆడుతూ నవ్వుకునేవాళ్లం.

ఆచార్య…

అసలాయనతో పరిచయమే గమ్మత్తుగా జరిగింది. ఎన్నో ఏళ్ల క్రితం ఒక ఆగస్టు నెల. సికింద్రాబాద్‌ క్లాక్‌టవరు దగ్గర బజార్లో ఏదో పుస్తకం కోసం వెతుకుండగా అకస్మాత్తుగా వాన జల్లు మొదలయినప్పుడు నేనొక దుకాణం మెట్లమీదికి వెళ్లాను.


‘లోపలికి రండి. అక్కడే ఉంటే తడిసిపోతారు..’ అంటూ నన్ను పిలిచిన శాంత స్వరం ఎవరా అని చూస్తే సన్నగా పొడుగ్గా మనిషి కనిపించారు. కేవలం రెండు గదులున్న దుకాణం యజమాని ఆయన. అప్పుడుగానీ గుర్తించలేదు నేను అదొక పుస్తకాల షాపని. నేను నెల రోజుల నుంచీ వెతుకుతున్న పుస్తకం ఆయన బల్లమీద ఉండటం చూశాక మాత్రం దుకాణ యజమాని మీద గౌరవం కలిగింది. నేననుకున్నట్టు ‘కదంబం’ మామూలు పుస్తక దుకాణం కాదు. మంచి అభిరుచి ఉన్న పాఠకులు ఏవి అవసరమనుకుంటారో అవన్నీ ప్రత్యేకంగా తెప్పించి ఉంచడం ఆచార్యకు అలవాటని ఆరోజు సంభాషణలోనే తెలిసింది.

మా పరిచయం స్నేహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పుస్తకాలు కావాలన్నప్పుడే కాకుండా, ఏమీ తోచనప్పుడు కూడా అక్కడికి వెళ్లి కూచుంటే ఆచార్య సరదాగా ఒక ఆట ఆడించేవాళ్లు. దుకాణానికి వచ్చినవాళ్లు ఒక పుస్తకం అడగ్గానే రెండోది ఏమడుగుతారో ఊహించి చెప్పాలి. సరిగా చెబితే ఐదు మార్కులు. చెప్పలేకపోతే మైనస్‌ మార్కులు. వచ్చిన మార్కులను బట్టి నచ్చిన పుస్తకాన్ని ఇచ్చేట్టు. అది మొదలు – ఎవరి చేతిలోనైనా పుస్తకం కనిపిస్తే చాలు, వాళ్లు ఇంకేం చదువుతారో, వాళ్ల ఇష్టం ఏమిటో అంచనా వేసెయ్యడం ఒక అలవాటుగా మారిపోయింది నాకు. అప్పట్లో మాత్రం ఆ ఆటలో తరచూ ఓడిపోయేది నేనే. వైద్యులు నాడి చూసి రోగలక్షణాలు తెలుసుకున్నంత సులువుగా ఆచార్య అవతలివాళ్ల పుస్తకావసరాలు తెలుసుకునేవాడు. తరచుగా వచ్చిపోయే మావంటి స్నేహితులందరి అభిరుచుల్ని కూడా అంతలా ఎలా గుర్తుపెట్టుకునేవాడోనని ఆయన జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోయేవాళ్లం. మాకు ఏ పుస్తకం కావాలన్నా ఆచార్యను ఆశ్రయించడమే. దేశంలో ప్రతి బుక్‌ఫెయిర్‌కూ ఆయన హాజరు తప్పనిసరి. వెళ్లొచ్చాక అక్కడి అనుభవాలు చెబుతుంటే మిత్రులందరం చేరి వినేవాళ్లం. అలా ఎన్ని సాయంత్రాలు కరిగిపోయాయో! అప్పుడప్పుడు షాపులో అన్ని పుస్తకాల మధ్య ఆయనా ఓ పుస్తకమే అయిపోయి, భౌతికంగా తానో మనిషినని సైతం మర్చిపోయేవాడేమో అనిపించేది ఆయన్ని చూస్తుంటే

.
కదంబానికేదో ప్రత్యేకమైన పరిమళం ఉండేదనిపిస్తోంది ఇప్పుడు గుర్తు చేసుకుంటే. ఆ పరిమళంలోకి ధూపం వేసినట్టు ఉదయాన్నే వచ్చేవాడు ఆచార్య. మామూలు జనానికి సొంత పిల్లలంటే ఎంత ఇష్టమో, ఆయనకు పుస్తకాలంటే అంత ప్రేమ. పనివాళ్లున్నా సరే, ఉదయాన్నే వచ్చి ఎక్కడా దుమ్ము కనిపించకుండా ర్యాకులన్నీ దులిపేవాడు. తాను చేస్తున్నది వ్యాపారం కాదు పూజ అన్నట్టుండేవాడాయన. కదంబంలో ఆయన్ని చూసినప్పుడల్లా పుట్టలో మౌనంగా తపస్సు చేస్తున్న ఋషులు అలానే ఉంటారేమో అనిపించేది. ఎంట్రన్స్‌ కనిపించేలా ఆయన కుర్చీ. దుకాణానికి వచ్చిపోయే వాళ్లు కూడా పుస్తకాల్లాగా కనిపించేవారేమో తెలీదు. లావుగా, సన్నగా, పొడుగ్గా, ఒద్దిగ్గా.. వాళ్లనీ నిశ్శబ్దంగా చూపులతో చదువుతున్నట్టే అనిపించేవాడాయన.


రోడ్డు వెడల్పు చెయ్యడానికి ఈ దుకాణాలు అడ్డం కనుక కొట్టెయ్యాలని నిర్ణయించుకున్నామనీ ఎంతోకొంత నష్టపరిహారం అప్పజెబుతామనీ తాఖీదు వచ్చిన రోజు ఆచార్య మ్రాన్పడిపోయారు. సాయంత్రం దాన్ని నాకు చూపిస్తున్నప్పుడు ముందే ఆయన మాట్లాడ్డం తక్కువ. మూడు నెలల్లోపు కదంబాన్ని వేరే చోటుకు తరలించాలనే ఆలోచన ఆచార్యను పూర్తి నిశ్శబ్దానికి అంకితం చేసింది. ‘ఏం నష్టం, ఎంత నష్టం.. ఏది పరిహారం’ అని మాత్రం నిర్వేదంగా అన్నారొకసారి. అంతే. అంతకు మించి జరుగుతున్నదాని పట్ల ఇంకేం స్పందించలేదు.


కదంబం మూత పడుతోందని ఓ పత్రికలో ఫీచర్‌ వచ్చింది. మర్నాటి నుంచీ కదంబానికి వచ్చిపోయేవారి సంఖ్య పెరిగింది. ఎప్పుడెప్పుడో చూసినవాళ్లు. ఎన్నాళ్లో స్నేహంగా మెసిలినవాళ్లు. కొందరయితే తమ పిల్లలను, మనవలనూ తీసుకొచ్చి, ఈ షాపుతో వాళ్ల అనుభవాలను చెప్పడం మొదలెట్టారు.
‘ఇక్కడే కదా నాకీ పుస్తకం దొరికింది..’
‘ఆచార్యగారూ, మీరు నా కోసం పుస్తకాలు కలకత్తానుంచి తెప్పించడం గుర్తుందీ..?’
‘మా అబ్బాయికి ఇంటర్నేషనల్‌ ఎఫయిర్స్‌ మీదేమైనా కాస్త సజెస్ట్‌ చేస్తారని…’
ఈ మాటలు వింటున్నప్పుడు ఆచార్య ముఖం చిన్నబోయేది. అన్నేళ్ల అనుబంధం ఉన్న షాపును విధిలేక వదులుకోవాల్సి వస్తున్నప్పుడు ఆయన పడుతున్న బాధ ఏ స్కేలుకైనా అందుతుందని నాకు అనిపించలేదు.


షాపు మూసేసే రోజు… ‘కదంబం’తో అనుబంధమున్న చాలామంది వచ్చారు. ఎంత వింతగా అనిపించిందో.షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభోత్సవాలకు, అందునా సినీతారలు వస్తుంటే అంతమంది జనాలు రావడం తెలుసుగానీ, ఒక చిన్న పుస్తకాల దుకాణం మూసేస్తున్నారంటే రావడం వింతకాదూ మరి! ఆ రెండు రోజులూ అమ్మకాలు లేవు. దాదాపు అన్ని పుస్తకాలనూ అడిగినవాళ్లకల్లా ఇచ్చేశాడాయన. రెండోరోజు సాయంత్రానికి ఏవో నాలుగయిదు పుస్తకాలు తప్ప షాపంతా ఖాళీ. వాటిని చేత్తో పట్టుకుని మూసేసిన షట్టర్ల ముందు చిన్న మెట్ల మీద నిస్సత్తువగా కూలబడిన ఆచార్య రూపం ఫోటో తీసినట్టు నాకిప్పటికీ గుర్తుండిపోయింది. తర్వాత నేను ఉద్యోగాలూ ఊళ్లూ దేశాలూ మారిపోవడంతో ఆయన సంగతులేవీ స్పష్టంగా తెలియలేదు. ఏదైనా సభలూ సమావేశాలప్పుడు హైదరాబాద్‌ నుంచి వచ్చినవాళ్లను ఆయన గురించి అడిగితే తెలిసినవి పొడిపొడి వివరాలే.

విమానం కరాచీలో ల్యాండవుతోందన్న ప్రకటన వినిపించేసరికి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. హోటల్‌ గదిలో కాసేపు పడుకుని లేచి సాయంత్రం మూడవక ముందే నగరం మధ్యలోనున్న ఎక్స్‌పో సెంటర్‌కు చేరుకున్నాను.కిందటి వారం జరిగిన బాంబు పేలుళ్ల గురించి ట్యాక్సీ డ్రైవ రేదో చెబుతుండగానే గమ్యం వచ్చేసింది. ‘పాకిస్తానీ పబ్లిషర్స్‌ అండ్‌ బుక్‌సెల్లర్స్‌ అసోసియేషన్‌ వెల్‌కమ్స్‌ యూ టూ ద ఫిఫ్త్‌ కరాచీ ఇంటర్నేషనల్‌ బుక్‌ఫెయిర్‌’ మైక్‌లో స్వాగత ప్రకటన వినిపిస్తోంది.


లోపల పుస్తకాల స్టాల్స్‌ను చూస్తూ కలియదిరుగుతుంటే ఇక్బాల్‌ మహమ్మద్‌ కనిపించి పలకరించాడు. ఆయన ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసిన మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి. పుస్తకాల వ్యాపారంలో తలపండిన అతను వస్తూనే ‘సలామ్‌జీ, మీరింకా రాలేదేమో అనుకుంటున్నా. అటువైపు ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ గ్యాలరీల్లో వెతికాను మీకోసం. కనిపించకపోయేసరికి రెస్టు తీసుకుంటున్నారేమో రేపు పలకరిద్దాం అనుకుని పనిలో పడ్డాను. ఓ ఫోను చెయ్యొచ్చుగా’ అంటూ గబగబా మాట్లాడేశాడు.


ఇక్బాల్‌ తీరే ఇంత.
‘లేదు, మీరిక్కడే ఎక్కడో ఉంటార్లే, ఈలోగా ఓ రౌండు వేద్దామని తిరుగుతున్నా’నన్నాను నవ్వుతూ.
‘కిందటేడు ఐదు రోజుల్లో రెండు లక్షల మంది వచ్చారు. వందమంది స్టాళ్లు పెడతారనుకుని ఎక్స్‌పో సెంటర్లో మూడు పెవిలియన్లు బుక్‌ చేశాం. ఓ పదిమంది తప్ప పబ్లిషర్లందరూ వచ్చారు. మొత్తమ్మీద వంద మిలియన్ల వ్యాపారం జరిగింది.. నాకు గొప్ప సంతృప్తిగా అనిపించిందనుకోండి. అసలే మావాళ్లు పుస్తకాలకు దూరందూరంగా మెసిలే మనుషులు. అయినా ఆమాత్రం అమ్ముడుపోయాయంటే గొప్పే మరి. ఏం, మీకలా అనిపించడం లేదూ? అయినా మీరు కిందటిసారి రాలేదుగా, ఈసారి ఎలా నడుస్తుందో మరి…’


ఏవిటో ఈ మనిషి హడావుడి. కిందటి బుక్‌ ఫెయిర్‌ ముగిసిన వెంటనే ఈ విషయాలన్నిటి తోనూ ఇక్బాల్‌ నాకు పెద్ద మెయిల్‌ ఒకటి రాయకపోలేదు. అది సంతోషించాల్సిన విషయవేననీ ఒక సంప్రదాయం అంటూ మొదలయితే నెమ్మదిగా పుంజుకుంటుందనీ తోచిన సూచనలతో నేనూ సమాధానం రాశాను. అయినా మళ్లీ అవన్నీ నా కళ్లకు కట్టినట్టు చెప్పాలన్నది ఆయన తాపత్రయం.
నిజానికి ఇక్బాల్‌ లోపల్లోపల చాలా టెన్షన్‌ పడుతున్నట్టున్నాడు. ఈసారి భారతదేశం నుంచి 25మంది ప్రచురణకర్తలు, అమ్మకందార్లు వస్తారని వీళ్లు లెక్కేసుకుంటున్నారు. మొన్న జరిగిన దాడుల పుణ్యమాని ఎంతమంది వస్తారో ఎందరు మానేస్తారో తెలియదు. దానికి తోడు ఇక్కడేం అఘాయిత్యాలు జరుగుతాయోనని కూడా ఆయన భయపడుతున్నాడు.


‘మీకు తెలుసా, ఎప్పుడూ ఇస్లామిక్‌ పుస్తకాలే అమ్మకాల్లో ముందు వరసలో ఉండేవా, కిందటేడు మాత్రం రాజకీయాలు, ప్రముఖులు రాసిన జ్ఞాపకాల్లాంటివి ఎక్కువ అమ్ముడయ్యాయి’ ఇక్బాల్‌ ఇలా ఏవేవో చెబుతుంటే వింటూ నడుస్తూంటే తెల్లటి లాల్చీపైజమా వేసుకున్న ఓ వ్యక్తి మీద పడింది నా దృష్టి. అంతమంది జనాల్లో అవునాకాదా అన్న సంశయం కమ్మేసి పోల్చుకోవడం కష్టమయింది… అయినా గుర్తు పట్టగలిగాను.


‘అరె, ఆచార్య..’
కుటుంబాలతో వచ్చినవాళ్లు, తూనీగల్లా అటూఇటూ సందడి చేస్తున్న పిల్లలు.. దీక్షగా పుస్తకాలను చూస్తున్నవాళ్లు అందర్నీ తప్పించుకుంటూ దాదాపు పరుగెత్తుతున్నట్టే వెళ్లాను ఆయనవైపు. దగ్గరగా వెళ్లి ‘నమస్కారం ఆచార్యగారూ, ఎలా ఉన్నారు…’ అంటున్నానో లేదో… ఆయనకు నా పలకరింపేమీ అసలు వినిపించనట్టు నేనంటూ ఓ మనిషిని కళ్ల ముందు కనిపించనట్టు మరోవైపు నడవడం మొదలెట్టారు. ఇదేమిటి? ఏమయిందీయనకి? చేతికర్ర ఊతతో నింపాదిగా అడుగులేస్తున్న ఆయన ఎటు వెళుతున్నారో తెలియలేదు. అసలు ఆయనకే తెలిసినట్టు లేదు. ఏదో నిద్రలో నడుస్తున్న మనిషిలా ఉన్నారు.


‘కదంబం ఆచార్య కదా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు…’ నా పక్కనుంచి ఇక్బాల్‌ ఆశ్చర్యపోవడం వినిపిస్తోంది. ఆచార్య అంటే ఎంతో ఇష్టం ఇక్బాల్‌కి. చార్మినార్‌ను చూడాలంటూ హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలుసుకున్నాడు ఆయనను. అప్పటినుంచీ వీళ్లిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి.
మాకు పదడుగుల దూరంలో ఆచార్య. ఏదో తడుముకుంటున్నట్టు నిలబడిపోయారు. అప్పుడే చూశాను, కొడుకు శ్రీకృష్ణ ఆయన చెయ్యి పట్టుకుని నడిపించడం. అతను అమెరికాలో యాంటిక్‌ పుస్తకాల డీలర్‌గా స్థిరపడ్డాడని విన్నాను. పలకరించి ఆచార్య యోగక్షేమాలడిగాను.
అతను చెప్పింది విని మతిపోయింది.


షాపు మూసేసినా మర్నాడుదయం ఠంచనుగా ఎనిమిదిన్నరకల్లా వెళ్లి ఎదురుగా ఉన్న డివైడర్‌ చెట్టు నీడన కూచున్నారట ఆచార్య. ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లూ వచ్చాయి. కూలీలు వచ్చారు. ఒకొక్క దుకాణమూ కూలిపోతూ… కదంబం దాకా వచ్చింది… నిన్నటిదాకా సర్వస్వమనుకున్న ఆవాసాన్ని ఒకో గునపపు పోటుతో తవ్వేస్తుంటే గుండెను తవ్వేసినట్టుండదూ? అది కేవలం ఒక ప్రాణంలేని నిర్మాణాన్ని కూల్చటం మాత్రమే కాదు.. అనుబంధాలను, జ్ఞాపకాలను తవ్వేయటం. ఆ శకలాలకు ‘డెబ్రి’ అని రాళ్ల భాషలో పేరు పెట్టి గంపలకెత్తి నిర్లక్ష్యంగా దూరంగా పారెయ్యటం. ఆయన గుండెలో ఎంత బాధ ఉండేదో తెలియదు. బయటకు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదట.


తర్వాత గుండెపోటు. ప్రాణగండం నుంచి బయటపడ్డారుగానీ కనుదృష్టి తగ్గిపోతూ వచ్చింది. అలాగే వినికిడి కూడా. మాటలు ముందే తక్కువ… ఇప్పుడింకా పూర్తిగా మౌనంగా మారిపోయారట. ఎంతో అవసరమైతే తప్ప ఏ నెల రోజుల కో ఓ మాట మాట్లాడితే గొప్పేనన్నాడు శ్రీకృష్ణ.
మాతో మాట్లాడుతున్నంతసేపూ ఆచార్య చేతిని కొడుకు వదలకుండా పట్టుకోవడం నా దృష్టిని దాటిపోలేదు. ఆయన చూపులు మాత్రం ఏ శూన్యంలోకో! ఏ ప్రపంచాల్లోనో!!
శ్రీకృష్ణే మళ్లీ కదిపాడు.


“అన్నిటికన్నా ముఖ్యంగా మరొకటి చెప్పాలండీ. ఈ పదేళ్లలో అప్ప నెమ్మదిగా అన్నీ మర్చిపోయారు. అసలాయనకు ఇప్పుడెవరూ గుర్తులేరు. మీరే కాదు, అంత ప్రాణంగా ప్రేమించిన షాపే గుర్తులేదు.. వేళకు పెడితే తింటారు. లేకపోతే లేదు. మూణ్ణాలుగు నెలల పసిపిల్లలను చూసుకున్నట్టే. ఇంట్లో అన్ని పుస్తకాలుంటాయా, ఏవీ తిరగెయ్యరు. ఎప్పుడైనా అకస్మాత్తుగా ఏం గుర్తుకొస్తుందో మరి టేబుల్‌ మీదున్నవాటిని తడిమిచూస్తారు. పేజీలు తిప్పుతారు. చదువుతారని అనుకోనుగానీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలేవో చుట్టుముడతాయేమో. ఒక్కటిమాత్రం నిజం. పుస్తకాల వాసన మాత్రం ఆయనకు బాగా గుర్తుంటుంది. లీలగా మిగిలిన చూపుతో పుస్తకాలను చూస్తున్నప్పుడు ఆయన ముఖంలో కాస్త వెలుగు వస్తుంటుంది. దానికోసమే నేను ప్రతి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌కూ అప్పను వెంటబెట్టుకునే వెళతాను. అన్ని స్టాల్సూ తిప్పుతాను. ఆయనకు వినిపిస్తోందో లేదో అని ఆలోచించకుండా నేను కొన్న పుస్తకాల గురించి ప్రతి రాత్రీ చెబుతాను. నేను కలిసిన యాంటిక్స్‌ కలెక్టర్ల గురించి, వాటి అమ్మకాల్లోని సంగతులూ అన్నీ పిల్లలకు చెప్పినట్టు నెమ్మదిగా చెబుతాను. ఏమో, ఏవి వింటున్నారో తెలియదు మరి. మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. వెళ్లొస్తామండీ…”


కొడుకు ఊతంతో ఆచార్య పసిపిల్లాడిలా అడుగులోఅడుగు వేసుకుంటూ మా నుంచి దూరంగా నడిచారు. ఆ మునిమాపు వేళలో నేనూ ఇక్బాల్‌ ఆచార్యను చూస్తూ అలా నిలబడిపోయాం. ఒక అద్భుతమైన సైకత శిల్పం జారిపోతున్నప్పుడు చూస్తున్న బెంగ మాలో. తానేమవుతున్నానో దానికేమీ తెలియదు, గుర్తుండదు. అదే విషాదం. ఆయన మౌనంలో ఏ జ్ఞాపకాలు తిరుగుతున్నాయో, కదంబాన్ని నామరూపాల్లేకుండా చేసిన ఏ గునపం పోట్లు ఆయన మెదడును తూట్లు పొడిచాయో మా ఊహకు అందలేదు…!!

మనసుని సృజించే మరో రచయిత కథ:

 
Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!