పట్నం బస్సు (ఆంధ్రజ్యోతి ‘1975’) - యండమూరి వీరేంద్రనాథ్

యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పట్నం బస్సు ఆంధ్రజ్యోతిలో 1975 లో వచ్చింది, యండమూరి దీనిని తెలంగాణా మాండలికంలోవ్రాసారు. యండమూరి వ్రాసిన ఈ కథ సహజత్వానికి అతి దగ్గరగా ఉంటుంది...ఇదే వ్రాసి 30 సంవత్సరాలు దాటినా, కథలో ఎటువంటి మార్పు చేయకుండా ఉన్నప్పటికీ ఇపుడు కాలానికి కూడా సరిపోతుంది. సమాజంలో ఎన్ని మార్పులోచ్చినా.. కొన్ని కథలు అన్ని కాలాలకు సరిపోతాయి. అలాంటిదే యండమూరి వీరేంద్రనాథ్ గారు వ్రాసిన ఈ పట్నం బస్సు...

ఎండ పెళపెళలాడుతోంది. అరవడానికి కూడా భయపడ్తున్నట్టూ కాకులు విశ్రాంతి తీసుకుంటున్నాయి. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. దూరంగా కిళ్ళీకొట్టు దగ్గిర మాత్రం ఎవరో ఏదో కొనుక్కుంటున్నారు.

పటుత్వం తగ్గిపోయిన శరీరంవైపు, వణుకుతున్న చేతి వేళ్ళకేసి ఒకసారి చూసుకున్నాదు మోచోడు. చేతిలో కత్తి పక్కన పెట్టేడు. ఎదురుగా గుట్టలా ఉన్న తోళ్ళని పక్కకి జరిపేడు. వేళ్ళు విరుచుకుని గట్టిగా నిట్టూరుస్తూ రోడ్డు కేసి చూశేడు.

పడమటి వైపు జారిపోతున్న వయస్సు గురించి చింత మోచోడికి కలగటం లేదు. ఏదో సాధించిన తృప్తి హృదయం నిండా పరుచుకొని ఉంది. బొడ్లోంచి చుట్ట తీసి వెలిగించుకున్నాడు. మళ్ళీ రోడ్డు వైపు దృష్టి సారించేడు. బస్సు వస్తున్న జాడ ఎక్కడా కనబడలేదు. దూరం నుంచి నడుచుకుంటూ యాదగిరి వచ్చేడు.

పక్కనే కూర్చుని చుట్ట అడిగి తీసుకుంటూ “ఏందయ్యా - మంచి హుషారుగున్నావ్?’ అడిగేడు.
“ఏమ్లే’ అన్నాడే గానీ మోచోడి దృష్టి అంతా రోడ్దుమీదే ఉంది. రొడ్డు తిన్నగా సాగి, దూరంగా ఎక్కడో మలుపులో అదృశ్యమైపోతోంది.
“మరి గట్ల చూస్తాంటివే?’
మోచోడు మాట్లాడలేదు. మళ్ళీ యాదగిరి అడిగేడు. ‘పెద్దోడు వస్తాన్నాడు గీ సర్వీసులా?
తలూపేడు. “పొద్దున్నే పాయె. వచ్చెదుంది.”
“ఇయ్యాల నౌకరీలో తిస్కోనీకి గదేందో ఉన్నదంట"
ఏమిటి
మోచోడు క్షణం ఆలోచించి ‘ఇంటరూ’ అన్నాడు.
‘ఇంటరూ?’ గదేరా ఇంటరూనో..ఇంటవూనో..’
అంతలో దూరంగా దుమ్ము కనబడింది. మోచోడి మొహం విప్పారింది. చుట్ట గట్టిగా పీల్చేడు. బస్సు గర్భిణి స్త్రీలా నెమ్మదిగా వస్తోంది.
“గైతే పట్లంలో నౌకరీ జేయిస్తావు?’
“మల్లగింత సదువు సదివింది నౌకరీ జెయ్యనీకి గాక గిట్ల సెప్పకలు గుట్టడానికనుకున్నావు?”
“నీకేమయ్యా? గీ సుట్టుపక్కల నాలుగు పల్లెలకీ నీవొక్కన్వేగాదు మోచోన్వి. మాసానికి మూడు నాల్గు నూర్లు సంపాయిస్తున్నావాయె’
వాడి మాటలకు అడ్దు తగులుతూ ‘నే జేసే పనే చేసేదుంటే వాన్ని గింత సదివించేది దేనికిరా.. మూడో క్లాసులో మాన్పిమ్చి ఉండేది కాదు? అన్నాడు.
“ఎంతొస్తదంట తన్కా?’
‘అయిదారు నూర్లు రాదంటావు’ తిరిగి వాడ్నే అడిగేడు.
“అయిదారు నూర్లు?’
‘మల్ల’ మల్ల ఆడు సదివింది ఏమనుకున్నావ్ రా.. బియ్యే.. సమఝయినాది?’ చాలా మందికి తరచు చెప్పడం వల్ల ‘బియ్యే’ అనే పదాన్ని స్పష్టంగా పలికిండు.
బస్సు వచ్చి ఆగింది. క్షణం ఆగి కదిలింది.
పెద్దోడొక్కడే దిగేడు.
తెల్ల షర్టు నల్ల ఫాంటులోకి ఇన్ షర్ట్ చేసేడు. కాళ్ళకి నల్లటి బూట్లు నిగనిగలాడుతున్నాయి. చేతిలో సర్టిఫికేట్ల బ్రీఫ్కేసుంది. ఎర్రటి టై గాలికి అందంగా వూగుతోంది.
దూరం నుంచి తండ్రినీ, యాదగిరినీ చూసి పలకరింపుగా నవ్వేడు. యాదగిరి మోచోడువైపు చూసేడు.
వాడు తనవైపు చూస్తూ ఉండటం చూసి, తన ఆతృత వాడు గుర్తించకుండా వుండేందుకు, తను చాలా మామూలుగా ఉన్నట్లూ మొహం పెట్టి ‘నాకిదే సమఝయిక లేదురా’ అన్నాదు.
‘ఏందయ్యా’
‘ఈ బస్సు పట్నంకు పోయేప్పుడు గింతమందిని తీసుకుపోతంది కదా! మల్లగా పట్నంకెళ్ళి పల్లెకు తిరిగొచ్చేప్పుడు ఖాళీగా వస్తదేందిరా?
యాదగిరి నవ్వి ఏదో చెప్పబోయేడు. ఇంతలో పెద్దోడు వాళ్ళ దగ్గరకొచ్చాడు.
“ఏమైనాదిరా’ మోచోడి కంఠంలో ఆతృత ధ్వనించింది. పెద్దోడి మొహం వెయ్యి క్యాండిల్ బల్బులా వెలిగిపోతోంది. వచ్చి వాళ్ళ పక్కనే కూర్చోబోయి ఫాంటు నలుగుతుందని భయపడి, నిలబడి అన్నాడు.
‘ఉద్య్ణోగ మొచ్చినాదె నాయనా’
మోచోడు ఆనందంతో తబ్బిబ్బు అయిపోయి, ‘వచ్చినాది’ అన్నాదు.
‘అయితే సక్కుర దినిపియ్యాలె’ అన్నాడు యాదగిరి, తండీ కొడుకులవైపు చూస్తూ
‘తినిపిస్తలేదియ్’ అని మోచోడు కొడుకువైపు తిరిగి నువ్ బో యింటికి. అమ్మకు జెప్పు నే నొస్త గిప్పుడే అన్నాడు పెద్డోడు వెళ్ళీపోయేడు.
‘గదేంద్వియా’ ఆడు పరీక్ష పూర్తిజేసి రెండేండ్లాయె. ఇప్పుడు దొరికింది. ఎంతుషారు గుండాలె’

మోచోడు తృప్తిగా నవ్వి “దినిపిస్తలే - ఇగలే అన్నాదు. ఎండిన తోళ్ళని చెక్క పెట్టెలోకి తోసేడు. మూకుడులో నీళ్ళు పారబోసేడు. కత్తీ దారం లోపల పడేసేడు. బద్ధకంగా వళ్ళు విరుచుకొని లేచి, ఇంటివైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ నడిచేడు.
* * *
‘తన్కా రెండు నూర్లా’ నిర్ఘాంతపోయేడు మోచోడు. వాడి బలహీనమైన శరీరం ఈ వార్త విని తట్టుకోలేక ఎండుటాకులా వణికింది.
తలూపాడు పెద్దోడు.
మోచోడికి నోటివెంట మాటరాలేదు. బ్రీఫ్ కేస్ సర్దుకుంటూన్న కొడుకుని విస్తుబోయి చూస్తూ ఉండిపోయేడు.
అంతలో వాడి తల్లి అక్కడికి వచ్చింది. “ఇయ్యాలే పోవాల్నేందిరా? రెండ్రోజులాగి జేర్రాదు?”
“లే పోవాలె’ అన్నాడు పెద్దోడు. ఈ ఉద్యోగం కోసం తనెంత కాంపిటీషన్ ఎదుర్కోవలసి వచ్చిందో, రెండు సంవత్సరాలపాటు ఈ మాత్రం ఉద్యోగం కోసం తనెంతగా ఎదురిచూశాడో ... తల్చుకుంటేనే భయంగా ఉంది. అటువంటిది - వెంటనే జేరమని వాళ్ళు అన్నప్పుడు జేరకపోతే ఆ కారణంగా వాళ్ళూ ఉద్యోగం ఇంకొకరికి ఇచ్చే మనేస్తే -
ఆపైన ఊహించలేక పోయేడు. టైమ్ చూసుకున్నాడు. నాలుగున్నర.. ఇంకో గంటలో బస్సు.
గబగబా రెండు జతల బట్టలు పెట్టుకున్నాడు. ఇంటర్వ్యూకి కట్టుకెళ్ళిన టై ఓ మూల అరలో పెట్టేడు. పెట్లోంచి ఇంకో టై తీసి లోపల పెట్టేడు.
“అయ్యెందుకురా? అంది వాడి తల్లి.
“ఇవి ప్రతిరోజూ కట్టుకోవాలే. లేకుండ బోతే ఊర్కోరు.
తల్లి మనసు ఆనందంతో ఉప్పొంగింది. సూటూ, బూటూలో కొడుకుని ఊహించుకుంది. పెద్దోడు వంగి బూటు లేసులు బిగించుకుంటున్నాడు.
అప్పుడు చూసేడు మోచోడు. అవి తను కుట్టిన బూట్లు కావు. వాడి మనసు చివుక్కుమంది. తక కందంగా బూట్లు కుట్టేది రాదు. అవున్నిజవే. ఆ కంపెనీవోడు కుట్టినట్ట్లు తనెట్ల కుట్టగల్గుతాడు?
పెద్దోడు బ్రీఫ్ కేసి మూసేసాడు.
మోచోడు అతికష్టం మీద నోరు పెగల్చుకుని తన మనసులో భావం బైట పెట్టేడు.
“రెండు నూర్ల తన్కాకి గంత దూరం పోయెదెందుకురా? ఈడ్నో ఉండ్రాదు.
గారెండొందలు ఈడ్నే వస్తయ్ గదా!
పెద్దోడు అర్ధం కానట్టూ చూసేడు.
“ఎట్లొస్తయ్?
“నా పన్జేస్తే రావా? సంపాదిస్తున్నాను గదా”
షాక్ తగిలిలట్టూ నిశ్చేష్టుడయ్యాడు పెద్దోడు. వాడి మొహంలో బాధ, అసహ్యం, రోషం ఒక్కసారిగా నాట్యం చేసినాయి.
“ఏం పని జెయ్యమంటావు?
“ఏమ్ర? రెండు నూరలకన్న ఎక్కువ దొరకదంటావు?
తండ్రి అజ్ఞానానికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు పెద్దోడికి. సుకుమారంగా ఉన్న తన చేతులవైపు చూసుకున్నాడు. తను బి.ఎ.లో చదివిన ఎకనామిక్స్ పాఠం జ్ఞాపకం వచ్చింది. చిన్న గొడుగు క్రిందో రావిచెట్టు నీడలోనో కుర్చొని చెప్పులు కుడుతున్న దృశ్యాన్ని ఊహించుక్న్నాడు. తన పేరు వెనుక బి.ఎ. డిగ్రీ రాసి, రావి చెట్టుకి మేకు వేసి కొట్టినట్టు కనిపించింది. నవ్వొచ్చింది. తండ్రివైపు జాలిగా చూసేడు. ఏదో మాట్లాడబోయేడు. అంతలో అతను  మాట్లాడదల్చుకున్నది  వాడి తల్లే మాట్లాడింది.

“ఆడు నీ పన్జెయ్యాలె..దిమాఖ్ ఖరాబ్ అయింది? గింత సదువు సదివింది నీ పన్జెయ్యమంటావు.?
తల్లి మాటల్తో పూర్తిగా ఏకోభవించినట్టూ పెద్దోడు మౌనంగా ఉండిపోయాడు. వాడి మనసులో తను పని చెయ్యబోయే ఎయిర్ కండిషన్డ్ రూమ్,మెత్త్గటి సోఫాలూ, వాల్ టు వాల్ కార్పెట్లు మెదుల్తున్నాయి. నీట్ గా కట్టుకున్న టై గాలికి ఎగుర్తూ ఉంటే, అందమైన లైట్ల కాంతి డ్రైక్లీన్ చేసిన బట్టల మీద నుంచి విశ్లేషణ చెందితూ ఉంటే..చుట్టూ అందమైన అమ్మాయిలూ, కిలకిల నవ్వులూ...
"సర్వీసు బస్సు కి టైం కాలేదా రా" అన్న తల్లి మాటల్తో ఈలోకంలోకి వచ్చేడు. క్రాఫ్ సర్దుకున్నాదు. బ్రీఫ్ కేసి చేతిలోకి తీసుకుని ‘పోయొస్తా’నన్నాడు.
“మల్లా ఆదివారం తప్పక రావాలె”
“గట్లనె” వెళ్ళిపోయాడు.
మౌనంగా నిల్చున్న మోచోడిని భార్య కుదిపింది. “గట్ట నిలబడితివి ‘బస్సు దాక అన్నా వానితో  పోరాదు? నువ్వట్ల పరేషన్ గా నిలబడ్తే వానికి ఏం  మనసుబాగుంటది?
మోచోడు కదిలేడు. కొడుకుతో కలిసి నడవటం ప్రారంభించేడు. చాలా సేపటి వరకూ తండ్రి ఏమైనా మాట్లాడతాడేమోనని చూసేడు పెద్దోదు. తండ్రి బాధ అతనికి అర్ధరహితంగానూ, అనవసరమైనదిగానూ కనబడింది. తను వెళ్ళిపోతున్నాడనే విషయాన్ని జీర్ణం చేసుకోవడం కోసం, తండ్రి మౌనంగా బాధ అనుభవిస్తూ ఉంటే కొడుకు హృదయం ఊరుకోలేకపోయింది. తండ్రి మనసులో బాధను తనకున్న ఎకనామిక్స్ పరిజ్ఞానంతో పోగొడ్దామని చూసేడు.

“చూడు నాయనా, నేను గింత చదువు చదివింది, నువ్వు నా చదువు కోసం ఇంత ఖర్చు పెట్టిందీ గిట్ల నీ పన్జేసేటందుకు కాదుకదా! నేనూ గిట్ల నీ పనేజేస్తే, నా తర్వాత నా కొడుక్కూడా చెప్పులుకుట్టేవాడే అయితడు, ఇక్కడే ఇట్లనే సెప్పులు కుట్టుకుంట వుండిపోవాలె. కాదంటావా"
మోచోడు మాట్లాడలేదు. మళ్ళీ పెద్దోడే అన్నాడు.
“నువ్వన్నదీ నిజమే. చెప్పులుకుడ్తూ రెండొందలకన్నా ఎక్కువే సంపాదిస్తన్నవు. కానీ అక్కడ నా పని వేరు.. డిగ్నిటే ఆఫ్ లేబర్. అంటే..? .. ఆగిపోయాడు. తను వాడిన పదానికి సరిఅయిన అర్ధం ఏమిటో .. తండ్రికి ఎలా వివరించి చెప్పాలో తెలియక క్షణం సేపు సడువుకున్నాడు..“అంటే అదే ..సివిలైజేషన్.. అంటే..నాగరికత.

మోచోడు రావిచెట్టి కేసి, పెద్దోడు బస్ స్టాప్ కేసి విడిపోయేరు. సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. రావిచెట్టు నీడ దట్టంగా పరుచుకుంటూంది. గూటికి చేరుకుంటున్న పక్షుల కలకలం అప్పుడే మొదలవుతోంది.
మోచోడు పెట్లోంచి సూది దారం తీసేడు. తోలి నీళ్ళలో తడిపి, కుట్టడం ప్రారంభించేడు.
దూరంగా ఎక్కడో తీతువుపిట్ట అరుస్తోంది. మువ్వలు గలగల లాడ్తోంటే ఎడ్ల జత ఒకటి పొలం నుంచి పరిగెత్తుకుంటూ వస్తోంది. గొడ్లు కాసుకొనే కుర్రవాడొకడు గొంతెత్తి యేదో పాడుకుంటూ ఇంటికి సాగిపోతున్నాడు.
మోచోని పక్కనే వచ్చి కూర్చున్నాడు యాదగిరి.
“నీ ఇంటికెల్లే వస్తాన్నా!!
“......”

“పెద్దోడు ఇయ్యాల్నే పోతున్నాడంట గాదు?”
ఔనన్నట్టూ తలూపేడు.
ఒక నిముషం నిశ్శబ్దం. యాదగిరి స్టాప్ వైపు పరీక్షగా చూసి, “ఆడు పెద్దోడు గాదు” అన్నాదు. “పట్నం బస్సింకా రాలె?”
“రాలె”
యాదగిరి అటే చూస్తూ “ఆడ్ని పట్నం పోవద్దన్నావంట” అన్నాదు.
మోచోడు మాట్లాడలేదు.
“ఆడొచ్చేదాక ఉద్యోగ మొస్తదా రాదా అన్జూస్తివి, వచ్చినాక పోవద్దన్నావ్?”
“.....”
“గిట్ల మాట్లాడకుండ గూసుంటివీ?”
“ఏం మాట్లాడాలె?”
“ఆడ్ని నువ్ చేసే పనే చెయ్యమన్నావంటగాదు!”
“ఔ! చేయమన్న.."
“దిమాఖ్ ఖరాబైనాది?”
భార్య అన్నమాటే వాడూ అనేసరికి మోచోడిలో అణిగి ఉన్న ఆవేశం చెలియలికక్క దాటింది. తువుక్కున వూసేడు. చేతిలో దారం వదిలేసి యాదగిరివైపు తిరిగేడు.
“నా దిమాఖ్ ఖరాబైందంటావ్?”....నీయవ్వ..నా దిమాఖ్ ఖరాబ్ కాలేద్రా.. గదో ..గాడ నిల్చున్నడుసూడు... ఆడు.. ఆనికిరా ఖరాబైంది.ఇయ్యాల రెండు నూర్లు దొరుకుతున్నయని పట్నం పోతున్నడు.
“మల్ల నీ లెక్క ముడు నూర్లు సంపాదించేటంద్కు ఎండలో గూసుని పన్జేయాలె?”
మోచోన్ల అవ్వమని నేనెందుకంట? కానీ ఆడు గట్ల మంచి బట్టలేసుకుని, మెడకు టై కట్టుకొని పట్నంలో జేసే పనేందో నీకు తెల్సారా?
కొనుక్కునేటందుకు వచ్చినోళ్ళ కాళ్ళకి రకరకాల సెప్పులు తొడిగే ఉద్యోగం!
యాదగిరి కట్రాటే అయ్యేడు.
మోచోడి ఆవేశం ఆవేదనోకి దిగింది.
“నువ్వే సెప్పులు స్వయంగ తయార్జెసి నా తీర్న అమ్మరా అంటే ఆనికి సదువడ్డొంచినాదంట.. దానికన్న ఆ సెప్పుల కంపెనీ వోడిచ్చింది మంచి ఉద్దోగమట. ధూ...
వూసేడు. వాడికంఠం రుగ్ధమైంది. దాదాపు ఏడుస్తూ.. “గా సుప్పుల కంపేనీవోడు నా కొడుకుని లాగేసుకున్నాడు. ఇంగ కొంత కాలంబోతే నన్ను లాగేసుకొంటడు.; అన్నాడు. కంఠంలో నిస్సహాయత ధ్వనిస్తోంది. పట్నం వెళ్ళే బస్సు వచ్చి ఆగింది. ఒకరో ఇద్దరో దిగేరు. ఎక్కటానికి మాత్రం జనం కుమ్ములాడుకుంటున్నారు.
“సిబిలైషనంట.. సిబిలైషను” గొణుక్కున్నాడు మోచోడు.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!