రెండు చిన్న కథలు......

జ్వరమొస్తే బావుండు

” ఇక చదువు”
మూడేళ్ళ పాప పుస్తకం తీసి చదవడం మొదలెట్టింది. ” అ అమ్మ, ఆ ఆవు….” అంటూ గట్టిగా పైకి చదువుతోంది.
నేను నా పనిలో ఉన్నాను.
“ప… పండు..”అని చదువుతూ, పుస్తకాన్ని నా దగ్గరకి తెచ్చింది. పుస్తకంలోని బొమ్మని చూపిస్తూ ” ఇదేం పండు నాన్నా?” అని అడిగింది.
” ఇదా, దీన్ని దానిమ్మ పండని అంటారు.లోపల ఎర్రని తియ్యటి గింజలుంటాయి” అని చెప్పాను.
“నాకు దానిమ్మ పండు కావాలి” అంటూ చదవడం ఆపేసి పాపాయి గొడవ చేస్తోంది.
నాకు చిరాకేసింది. “పళ్ళని జ్వరమొచ్చిన్న వాళ్ళు తింటారు. నీకేమి జ్వరం లేదుగా? చదువుకో. తెలుగు చాలు. వెళ్ళి ఇంగ్లీష్ చదువు” అన్నాను. పాపం, బిక్క మొహం వేసుకుని ఇంగ్లీష్ పుస్తకం తెరిచింది. ” ఎ ఫర్ ఆపిల్….” అంటూ చదువుతోంది.
ఆపిల్ అనగానే గుర్తొచ్చింది. మందులు రాసాక, డాక్టర్ చెప్పారు మా ఆవిడకి ఆపిల్ పెట్టమని. మందులు కొన్నాక, మిగిలిన కొన్ని డబ్బులతో కూరలు కొందామనుకున్నను. వాటితో ఓ రెండు పూటలు గడిపేయచ్చు. కాని, మరి మా ఆవిడ కోసం ఆపిల్? నేను ఎటూ తేల్చుకోలేకపోయాను. కసేపు ఆలోచించాక, ఆపిలే కొనాలని నిర్ణయించుకున్నాను.
పాపాయి ” ఎ ఫర్ ఆపిల్….” అనే మాటలనే వల్లె వేస్తోంది. ఉన్నట్టుండి, “నాన్నా, ఆపిల్‌ని కూడా జొరమొచ్చిన వాళ్ళే తినాలా? అంటే అమ్మ లాంటి వాళ్ళా?” అని అడిగింది.
పాపకి నేను జవాబు చెప్పలేకపోయాను. తనకేసే రెప్పలార్పకుండా చుస్తుండిపోయాను.
పాప ఇంగ్లీష్ పుస్తకన్ని దగ్గరగా తీసుకుని అందులోని ఆపిల్ బొమ్మని తదేకంగా చూస్తూ “నాకు జొరం ఎప్పుడొస్తుంది నాన్నా?” అని అడిగింది.

మట్టి

“సోనూ పాపాయి, బయటకి వెళ్ళకే. అక్కడంతా మట్టి, కక్కా – తెలిసిందా? ఇంట్లోనే ఆడుకోవాలి” రమ చెప్పింది. పాపాయికి పాకడం వచ్చిన రోజునుంచి రమది ఇదేవరస. పాప బయటకు వెళ్ళి మట్టిలో ఆడకోకూడదని ఆమె కోరిక.
“ఛీ, ఛీ, చెత్త మట్టి తల్లీ, దీంట్లో ఆడకూడదు. చూసావా, చేతులు కాళ్ళు ఎంత మురికిగా తయారయ్యాయో? ” అంటూ రమ సోనూని లోపలికి తీసుకొచ్చేస్తుంది, పాపాయి బయటకు వెళ్ళినప్పుడల్లా. పాపాయి అర్ధమయ్యేలా ప్రేమగా చెప్పడానికి యత్నిస్తుంది.
సోనూ నడవడం మొదలు పెట్టేసరికి మా ఇద్దరి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కాని ఇప్పుడు రమకి బెంగ ఎక్కువై పోయింది. పాపాయి చల్లాగా జారుకుని మట్టిలో ఆడుకునేది. రమకి కోపం వచ్చేస్తుంది. ” దీన్ని వెతికి పట్టుకుని లోపలికి తీసుకొస్తాను. క్షణంలో పారిపోతుంది. నాకు విసుగొచ్చేస్తోంది” అని నాతో చెప్పి పాప కేసి తిరిగి ” అబ్బబ్బా, నీకెన్ని సార్లు చెప్పాలి? మట్టిలో ఆడొద్దని? చెబితే అర్ధం కాదా?” అంటూ కేకలేసింది.
ఈ మధ్య రమ సోనూని తిడుతోంది, బెదిరిస్తోంది కూడా. “జాగ్రత్త, ఈసారి మట్టిలోకి వెళ్ళావంటే తోలు వలిచేస్తాను…”
” ఏం? ఇంట్లో కూర్చుని ఆడుకోలేవా? ఎప్పుడు నీ దృష్టంతా మట్టి మీదేనా?”
ఒక్కో సారి నేను కూడా పాపాయిని మందలిస్తూంటాను.
ఉన్నట్టుండి, ఏమైందో ఏమో, సోనూ మట్టిలోకి వెళ్ళడమే కాదు, ఇంట్లోను ఆడుకోడం మానేసింది. ఇంట్లోనే ఒక గదిలోంచి మరో గదిలోకి తిరుగుతుంది. బయటి గుమ్మం దాకా వెడుతుంది, మళ్ళీ అంతలోనే – “ఛీ చెత్త మట్టి…” అనుకుంటూ వెనక్కి వచ్చేస్తుంది.
ఇప్పుడు పాప్పయి మొహంలో నవ్వు లేదు, మా ఇంట్లో కిలకిలారావాలు లేవు. ఎప్పుడూ ఏదో నిశ్శబ్దం! భరించలేని మౌనం!!
సోనూ అమ్మమ్మకీ, తాతయ్యలకి ఈ సంగతి తెలియగానే వాళ్ళు కంగారు పడ్డారు. సోనూతో పాటు మమ్మల్ని కూడా వచ్చి వాళ్ళ ఊర్లో కొన్ని రోజులు ఉండి వెళ్ళమన్నారు. మాకూ ఆ పల్లెటూరుకి వెళ్ళలనిపించింది. సరేనన్నాం. ఆ రాత్రే బస్సు పట్టుకుని బయల్దేరాము. మా అత్త గారు, మావగారు, బావమరిది, మరదలు సోనూని చూసి ఎంతో సంతోషించారు.
కాని ఇక్కడికి వచ్చాక, సోనూ మరింత నిశ్శబ్దంగా ఉంటోంది. ఎంతసేపూ వాళ్ళమ్మ వొడిలోనే ఉంటోంది. కిందకి దించాలని చూస్తే ఏదుపు లంకించుకుంటోంది, మళ్ళీ అమ్మ ఒడిలోకి వెళ్ళిపోతోంది.
అప్పుడు మా మావగారు, సోనుని ఎత్తుకుని సముదాయించి బయటకు తీసుకెళ్ళారు. కాసేపటి తర్వాత ఆయన ఒక్కరే లోపలికి వచ్చారు.
“పిల్లేదండి?”నేను మా ఆవిడ ఒకేసారి కంగారుగా అడిగాము.
“బయట పిల్లలతో ఆడుకుంటోంది” అని ఆయన గంభీరంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయారు. ఇంతలో ఇంటి బయట పిల్లల సందడి వినిపించింది.
మేము బయటకి వెళ్ళి చూసాము. తోటి పిల్లలో కలిసి కేరింతలు కొడుతూ హాయిగా మట్టిలో ఆడుకుంటోంది సోను.
మా మొహాల్లో పోయిన నవ్వు తిరిగొచ్చింది.

చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఈ రెండు కథలు చక్కగా ఆవిష్కరించాయి. లేత పసిమనసులను పెద్దలు తమ అశక్తత వలనో లేదా భయం వలనో ఎలా నొక్కేస్తారో చెప్పే కథలివి. ఇవి కొల్లూరి సోమ శంకర్  గారి తెలుగు అనువాదం (హింది: శ్రీ సుభాష్ నీరవ్)

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!