చిన్నా చెప్పిన కథ.......

కథ మూలం: నాకు "నా ఫ్రెండ్ చిన్నా చెప్పిన కథ" ఇది.. ఎక్కడ ఎపుడూ చదివిందో తెలియదు, చెప్పిన కథకి  నా భావాలు జోడించి యిలా మీ ముందుకు  మీకోసం.


అప్పటికి ఇంకా మనకి స్వతంత్రం రాని రోజులు. ఎక్కువగా ఆర్ధికంగా వెనకపడిన చిన్న కుంటుంబాల వాళ్ళంత, మంచి వేతనాలున్న మిలటరీ ఉద్యోగాలకి వెళ్ళేవారు. మిలటరీ వాళ్లకు పిల్ల నివ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు తక్కువ. అలాంటి కుటుంబంలోని వాడే ప్రకాశం.అప్పటికి  ప్రకాశం, లక్ష్మి కి పెళ్లి అయ్యి 6 నెలలు అయింది, ప్రకాశంకి  'సెలవులు రద్దు చేయబడినవి అత్యవసరంగా డ్యూటీ లో వచ్చి చేరమని' మిలిటరీ నుండి ఉత్తరం రావడంతో తన తల్లిని భార్యకి తోడుగా ఉంచి, బయలు దేరి వెళ్ళాడు. ఆతను వెళ్ళిన నెలకే యుద్దంలో అతని ఆచూకి తెలియరాలేదన్న వార్త ఇంటికి చేరింది. కొన్ని పరిస్థుల్లో అత్తా కోడళ్ళు ఇద్దరు బ్రతుకు తెరువుకోసం లక్ష్మి మేనమేమ ఊరు చేరారు.

ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచాక ఒకరోజు  ప్రకాశం ఇల్లు చేరాడు. అతన్ని చూసి అత్తాకోడళ్ళు ఇద్దరు అనుకోని తుఫాను చూసినట్టుగా నివ్వెరపోయారు. ప్రకాశం భార్యని, ఆమె చేతిలోని  పిల్లాడిని చూసి  నిర్ధాంత పోయాడు. చింతాక్రాంతుడయ్యాడు భార్యని మునపటిలా ప్రేమించలేక పోయాడు, ఎవరి  పిల్లాడినో తన పిల్లడిగా అంగీకరించలేను, భార్యని ఇల్లు వదిలి వెళ్లిపొమ్మన్నాడు. ప్రకాశం తల్లి 'ఓరే ఎన్నో తుఫానులూ  వస్తాయి అందులో విలువైనవి కొట్టుకుపోతాయి, నష్టం వాటిల్లుతుంది, మన చేతిలో మిగిలి ఉన్నదానితో మళ్లీ జీవితం గడపాలని అనుకుంటాం, ఇది అలాంటి తుఫానే" నీ భార్యని కొడుకుని నీ వాళ్ళే, కాదనుకోకు, అని చెప్పింది.

ఆతను తన తల్లి చెప్పిన ప్రకారంగా ప్రవర్తించకుండా, భార్యని కొడుతూ, పిల్లవాన్ని చంపేయాలన్న కసి చూపడం మొదలెట్టసాగాడు. అతని ఆగడాలు మితిమీరిపోవడంతో ఒకరోజు  లక్ష్మి తన పిల్లవాడితో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది.రెండు నెలలు తిరక్కుండానే  తల్లి కూడా గతించడంతో అతని పెళ్లి ప్రయత్నాల్లు చేసేవాళ్ళే కరువయ్యారు, మళ్లీ పెళ్లి చేసుకోవడం కోసం మిలిటరీ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేయడం మొదలెట్టాడు, కొంతకాలానికి దూర గ్రామంలో లేని కుటుంబలో పిల్ల సోలంకి తో వివాహం జరిగింది. పెళ్లి అయి పది సంవత్సరాలు గడిచినా సంతానం మాత్రం కలగలేదు కానీ ఆస్థి మాత్రం సమకూరింది.

అక్కడి వాళ్ళకి కుంతీ ఆలయం లో పూజా నివేదన చేస్తే సంతానం కలుగుతుందని చాలా నమ్మకం.. (అపుడు అనుకున్నదే తడువు వెళ్ళే ఒంటరి ప్రయాణాలు, ఇంతటి రవాణా సౌకర్యం లేవు కదా) అపుడు ఆ చుట్టూ పక్కల గ్రామాల వాళ్ళు  అందరు కలసి ఒక గుంపుగా వెళుతున్నారని తెలిసి తన భార్యని వాళ్లతో కలసి  వెళ్ళి రమ్మని చెప్పాడు. అందుకు అతని భార్యా ఒంటరిగా తెలియని వాళ్లతో కలసి వెళ్ళలేనని, మనమిద్దరం  కలసి వెళదామని పట్టుపట్టింది.

తనకి వ్యవసాయ పనులు ఉన్నాయి వెళ్ళి రాడానికి  ఒక మాసం పడుతుంది కదా! నేను నీతో కలసి రావాలంటే కుదరదు.నీవు వాళ్లతో వెళ్ళి పిల్లలకోసం శ్రద్దగా చేయవలసిన వాణ్ణి చెయ్యి, పైకం కావలసినంత తీసుకువెళ్ళు, నీ సహాయం కోసం ఒక మనిషిని ఏర్పాటు చేసుకో, డబ్బు గురించి వెనుకాడకు అని చెప్పి వారితో పాటు ఒప్పించి భార్యని పంపించాడు.

ఆ గుంపులో ప్రతివాళ్ళు  ఒకరికొకరు తెలిసినవాళ్ళే, వారిలో  తనలా ఎవరు ఒంటరిగా కనిపించలేదు సోలంకి కి,  వారిలో  ఒక యువకుడు ఈ అమ్మాయి బేలతనం, కలవరపాటు చూసి, ఆమెకు సహాయంగా నిలిచాడు, దారిలో వంటకు కావలసి ఏర్పాట్లు కాని, రాత్రిబస ఏర్పాట్ల విషయంలో ఆమెకి అండగా నిలిచాడు, ఆలయం చేరేసరికి ఆమెకి కొంచెం అస్వస్థతగా ఉంది, మొక్కు కొంచెం కష్టమైనదే, ఒకరోజు ఉపవాసం ఉండి, కోనేరులో ఒక రాత్రి అంతా దేవి దీపం నెత్తిన పెట్టుకొని మరుసటి  రోజు ప్రొద్దున నైవేద్యం నివేదించాలి, ఆతను ఆమెకు అండగా నిలిచి ఆ మ్రొక్కు తీరడానికి తోడ్పడ్డాడు. ఆమెకు  ప్రతి చిన్నపనికి  అతనిపై ఆధారపడడం అలవాటు అయ్యింది.   ఆమెకి ఆతను ఎంతగా అలవాటు అయ్యాడు అంటే ఆతను కనపడక పొతే కలవరపడెంతగా,

అందరు మళ్లీ తిరుగు ప్రయాణం సాగించడం మొదలెట్టారు, తన గ్రామం చేరే సమయం దగ్గరపడుతుండగా ఆమె ఆ యువకుడిని వదిలి వెళ్ళలేనని, నిన్ను వదిలి జీవించలేను అన్నది. ఆ యువకుడు కూడా నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, నీకు వివాహం అయ్యిందని అడగలేక పోయాను. నీకు  సమ్మతమైతే  మనం ఇద్దరం కలసి వెళ్ళిపోదాం అన్నాడు.

అందరు తిరిగి వచ్చినా ఇంకా ఇల్లు చేరని భార్య సోలంకి  గురించి ప్రకాశం ఆరా తీయాగా, ప్రయాణంలో పరిచయం అయిన యువకుడితో వెళ్ళిపోయిందని తెలియవచ్చింది. 15 నెలల తరవాత ఒకరోజు తన భార్య ఆచూకి తెలిసింది, ఆమెకు ఒక పిల్లవాడు కూడా పుట్టాడని తెలిసింది. తన ఊరి వాళ్ళని తీసుకొని పంచాయతి పెట్టించాడు. తన భార్యని, ఆమెకు పుట్టిన పిల్లవాడిని తనతో పంపించమని..  నీ భార్యని తీసుకెళ్ళు కానీ ఈ అబ్బాయి నీకు పుట్టిన వాడు కాదు అని అన్నారు ఆ ఊరి పెద్దలు, అపుడు తీగ నా తోటలోది అయినపుడు, దాని పండు ఎక్కడ కాచిన అది నాదే అవుతుంది, కాబట్టి భార్యా కొడుకు ఇద్దరినీ నాకు ఒప్పగించమని ప్రకాశం అన్నాడు. రెండు గ్రామాల పెద్దలు చర్చించి భార్యని పిల్లవాడిని ప్రకాశంకే ఒప్పచేప్పారు. కొడుకుని భుజాలమీద ఎక్కించుకొని తన ఊరికి ప్రయాణం అయ్యాడు, ఆమె లేగదూడ వెనుక ఆవులా   ప్రకాశంని అనుసరించింది.

లక్ష్మి, సోలంకి ఈ ఇద్దరికీ పుట్టిన బిడ్డలు తనకు పుట్టిన వాళ్ళు కాదని ప్రకాశం కి తెలుసు.. లక్ష్మి కి పుట్టినవాడి జన్మ రహస్యం కుంటుంబం మధ్యనే ఉన్న కూడా లక్ష్మిని స్వీకరించలేని ప్రకాశం, తనకు ఎట్టి పరిస్థుల్లో అందనిది సంతానం అని తెలిసి, సోలంకి తన భార్యగా ఉండడానికి ఇష్టం లేదని, వాడు  తనపిల్లవాడు కాదని తెలిసినా,అందరి మధ్యనా ఇద్దరు తనకే చెందాలని పట్టుపట్టి వారసున్ని అందుకున్నాడు  ప్రకాశం. పరువు మర్యాదా, మనసు మమత, ఇవన్ని వదిలేసి కావాల్సింది అందుకోడం కోసం ఏమైనా చేయగలిగే ఇలాంటి ప్రకాశం లు ఇపుడు మాత్రం లేరంటారా... సంఘటనలు మారవచ్చు కాని అలాంటి మనుషులు మనకంటికి ఆమడ దూరం లోనే ఉండవచ్చు  పరికించి చూస్తె..

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!