కనబడని నగరపు రాజకుమారుడు
అతనికి నాకు ఏ లడాయి లేదు కానీ...
అప్పుడప్పుడు
అతనికి నాకు మధ్య ఉన్న తెరలేవో
గిడస బారిపోయాయని
ఉబుసుపోక బెంబేలెత్తుతాను...
అతని ప్రేమను సోలతో కొలిచి
నా ప్రేమను కుంచంతో తూకం వేసుకొని
ప్రేమ కొలతలు సరితూగలేదంటూ
బెదిరి బెంగటిల్లుతాను...
మాటైనా పలకని అతన్ని చూసి
నా సమయాన్ని మాయతో దోచి
గంపెడు మాటల మూటలతో
ఎవరికో అరువిచ్చాడని అనుమానిస్తాను...
అడుగైనా ఇటువైపు లేదంటూ
నా ఆనవాళ్లు పనిగట్టుకొని
పెంకిగా మరింత ఆవలకు జరిపి
దారి మరిచాడంటూ అపవాదులేస్తాను..
తప్పులు ఎన్నైనా చేస్తాను
అబద్దాలకోరుగా నిలుస్తాను
నా వైపు ఉన్నావనే నమ్మకం చిక్కినా
పంతంగా నమ్మలేదంటూ వాదులాడతాను...
ఓయ్
ఆకాశమంత ప్రేమిస్తున్నాననే నాకు
నీ అనుమతి ఎందుకోయ్
ఆరడి పెట్టడానికైనా ... అపవాదు వేయడానికైనా
అనుమానించడానికైనా.. ఆరాధించడానికైనా
అయినా
నీకు తెలియని ఆట కాదు కదోయ్
మాయా జూదం తెలిసిందే కదా
పాచికలు వేయనా...... మరి