గాలిపొరల అంచున

నీకోసం
ఎంత వెతుక్కుంటానో
గాలిపొరల అంచున
నీటిబుడగల మధ్యన

అయినా
మధ్యాహ్నపు నీడలాగా
నీ ఆనవాళ్ళ అంతు చిక్కదు...

నేను
ఎక్కడికోయ్ అంటే...జవాబు చెప్పకు
ఎలా ఉన్నావంటే ...మాట పట్టించుకోకు
నాకోసం రారాదు అంటాను...వినిపించుకోకు

అడిగిన వాటికి జవాబులు
ఊహలకు వదిలేసి బెంగటిల్లడం..
మనసు గుబులు పడడం
నాకు అలవాటే కదా...

అప్పుడప్పుడు .. ఎందుకో
నాతో ఒక్కమాట మాట్లాడమని అడగాలనిపించదు
నిన్ను ఒక్కసారి చూడాలని కోరాలనిపించదు
నాతో వుండిపోరాదంటూ ఆశపడాలనిపించదు...

నేను చెప్పేవన్నీ నిజంగా నిజమని
నీతో చెప్పాలనిపించదు
చెప్పి ఒప్పించాలనిపించదు.....

ఒక్కోసారి ......
నీ ఆలోచనల్లో
ఆవగింజంత కూడా
నేను ఉండడం
నాకు ఇష్టం లేదు మరి....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!