అప్పుడప్పుడు
అతను మారం చేస్తాడు
నా వైపుకు ఒక అడుగు వేస్తానని...
కరుకు మనసును అరువు తెచ్చుకొని
ఈ వైపుకు అడిగేస్తే ఏ వైపున కనపడనంటూ
చురుకైన మాటలతో వారిస్తాను
అతడు
మారు మాట్లాడడు... మంకుపట్టు పట్టడు
వీడి వెళతానంటూ మాట వరసకైనా అనడు
నిశ్శబ్దపు వలలో
తనను తాను బంధించుకొని
అనంత ప్రేమరాగాలు ఆలపిస్తాడు...
సమయమప్పుడు అతనివైపే...
నా మనసు చివికి పోతుంది... చీలిపోతుంది
రవ్వలు రవ్వలుగా రాలిపోతుంది..
ఎగిసి పడే జలపాతమై
వేల సుగంధాలు అద్దుకుని
అతనికై ఊపిరి బిగబట్టి
ఏడేడు లోకాలు ఏకం చేస్తోంది...
ఓయ్
అలికిడి చేయక...అల్లరి పెట్టక
నిలకడగా...నిశ్శబ్దంగా బంధించే విద్య
కొత్తగా ఎక్కడ నేర్చుకున్నావోయ్...