శీతల చలిగాలులు

ఆమె ఎదురయ్యింది  ఓ క్షణం
కంటిలోన ఒదిగిన రూపం
మదిలో పదిల పరచబడింది

అప్పుడప్పుడు
ఆమె నా మది నుండి విడివడి
ఆకాశపు నక్షత్రాలతో ఆడుకొని
హిమశిఖరపు అంచులను తాకుతూ
నది తీరాన సేదతీరి వస్తుంది కాబోలు,.

అందుకే
ఆమె ఎదురైనప్పుడు
నన్ను కొన్ని మెరుపులు
కొన్ని శీతల చలిగాలులు
చుట్టూ ముడతాయి...

కథలా సాగిపోతుంది....
అయినా ఎందుకో నాకు....
ఒకటే అసహనం
నలు దిశలా వెతికా
నా అతను ఎక్కడ అని

అంతలో
ఫక్కున అతని నవ్వు వినిపించింది
ఓయ్ నువ్వు చూస్తున్నది
నా కల లోని ఆమెను అంటూ...

ఇంకేముంది
వద్దన్నా..కోపం వచ్చి చేరింది
నా వైపు అడుగులు యేల అని
వద్దు పొమ్మంటూ తరిమేసాను...

కల చెదిరింది.. తెల్లగా తెల్లారింది
షరా మామూలే ...
వింత వైఖరి .. మొండిఘటపు నా మది
చెబితే వినదు కదా
శీతలగాలియై పరుగులు పెడుతూనే ఉంది
వినిపించని అతని అడుగుల వెచ్చని ఆనవాలు కోసం
వెతుక్కుంటుంది మళ్ళీ.. మళ్లీ


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!