స్ట్రే బర్డ్స్..రవీంద్రనాధ్ టాగోర్ ..1

విశ్వ కవి రవీంద్రనాధ్ టాగోర్ వ్రాసినటువంటి స్ట్రే బర్డ్స్ కు తెలుగు అనువాదమిది. ఇవి మొత్తం 326 చరణాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్వేచ్ఛా ఆలోచన వలే ఉండి ఒక గొప్ప పదచిత్రాన్నో, లేక జీవన సత్యాన్నో తెలియచేస్తా ఉంటాయి.

వీటిని అనువదించటంలో కొద్దిగా రూపస్వేచ్ఛ అక్కడక్కడా భావ స్వేచ్ఛ తీసుకొన్నాను.
ఒక్కో చరణమూ, ఒకటి నుంచి నాలుగు వాక్యాలలో బాగా క్లుప్తంగా, లోతైన భావాలను పొదగబడి ఉండటంవల్ల, వాటి అనువాదం కొన్ని చోట్ల ఉత్త వాచ్యంగా అనిపించవచ్చు.

నేను చేసిన ఈ అనువాదం నా శక్తిమేరకు, నాకు అర్ధమయిన కోణాన్ని ఆవిష్కరించటానికి చేసిన ఒక ప్రయత్నం మాత్రమే. ఇదే అంతమము కాదు. నాకు కనిపించని, నేను చెప్పలేక పోయిన భావాలు ఉండవచ్చన్న అవకాశం నేను కాదనను.

పెద్దలు తెలిపినట్లయితే తెలుసుకొని, సవరించగలను అని సవినయంగా మనవిచేసుకొంటున్నాను.....
మీ బొల్లోజు బాబా


1
వేసవిలో దారితప్పిన పక్షులు, నాకిటికీ పై వాలి
పాటలు పాడి ఎగిరిపోయాయి.
పాటలు లేని శిశిర పత్రాలు
తల్లడిల్లి నిట్టూరుస్తో నేలరాలాయి.

2
దేశద్రిమ్మరి పిల్ల మూకల్లారా,
మీపాదముద్రలను నా పదాలపై విడువండి.

3
ప్రపంచం తన విశ్వ రూప వేషాన్ని
తన ప్రియుని కోసం తీసేసింది. అదిప్పుడు ఒక గీతంలా,
ఆద్యంత రహితమైన ఒక చుంబనంలా భాసిల్లుతోంది.

4
వసంతపు దరహాసాలను కావలి కాసేది
మట్టి అశ్రువులే.

5
తలాడించి, నవ్వి, ఎగిరిపోయే
గడ్డిపోచ ప్రేమకై, మహా ఎడారి జ్వలిస్తోంది.

6
సూర్యుని కోల్పోయినందుకు కన్నీరు రాల్చుకొంటే
నక్షత్రాలను కూడా చేజార్చుకోవలసి వస్తుంది.

7
నీ త్రోవలోని మట్టి నీ గానాన్ని, నీ గమనాన్ని,
నీ అమృత జలాల్ని యాచిస్తూ ఉంటుంది.
వాని మొండి భారాన్ని నీవు మోయగలవా?

8
ఆమె వేదన నిండిన మోము
నా కలల లో సంచరిస్తూంది.
రాత్రి ని వాన పెనవేసుకొన్నట్లుగా.

9
మనం అపరిచితులమని
ఒకప్పుడు స్వప్నించుకొన్నాం.
మెలుకువ రాగానే ఒకరికొకరు
ప్రియమైన వారమని కనుగొన్నాం.

10
నిశ్శబ్ధ తరువుల మధ్య
సాయింత్రం ఎలా జోకొట్టబడుతుందో
అలా నా హృదయంలో
విచారం శాంతపరచబడుతుంది.

11
ఏవో అదృశ్య అంగుళులు
సోమరి తెమ్మెరలా నాహృదయంపై
అలల సంగీతాన్ని మీటుతున్నాయి.
12
ఓ సంద్రమా! నీ భాషేమిటి?
ఆద్యంతరహితమైన సంశయమే నా భాష .
ఓ అంబరమా ! నీ సమాధానమేమి?
మరణం లేని మౌనమే నా పలుకు.

13
హృదయమా ఆలకించు
ఈ ప్రపంచపు గుసగుసలు,
వేటితో అయితే అది నిన్ను ప్రేమిస్తుందో.

14
సృష్టి రహస్యం రాత్రి చీకటిలా ఒక అద్భుతం.
జ్ఞానం యొక్క మాయలు
ఉదయపు మంచు పొగ వంటివి.

15
నీప్రేమ పర్వతతటము కంటే ఉన్నతమైనది
సముచిత స్థానంలోనే దానిని అధిష్టింపచేయి.

16
నేను నా కిటికీ వద్ద కూర్చుని ఉంటే
ఈ ప్రపంచం ఒక పధికుని వలె ఒక క్షణం నిలచి
తల వూచి సాగిపోయింది.

17
ఈ చిరు ఆలోచనలు ఆకుల గలగలలు
నామదిలో అవి ఆనందపు గుసగుసలు.

18
నీవేమిటనేది నువ్వు దర్శించలేవు
నీవు దర్శించేది నీ ఛాయ.

19
నా కోర్కెలు మూర్ఖులు. వారు నీ పాటలనడుమ
అరుస్తూ గోల చేస్తూంటారు.
నన్ను నీ గానాన్ని మాత్రమే
ఆలకించేలా చేయి, ప్రభూ!

20
శ్రేష్ఠమైన దాన్ని నేనెన్నుకోలేను.
శ్రేష్ఠమైనదే నన్ను ఎన్నుకొంటుంది.

21
మార్గదర్శులు లాంతరును వీపున ధరించి
తమనీడలను తమముందే పడేలా చేసుకొంటారు.

22
నేనున్నాను అనుకోవటం
ఒక నిరంతరమైన అద్భుతం
అదే జీవితం.

23
గలగలలాడే ఆకులమైన మాకు తుఫాన్లకు
సమాధానమీయగల గొంతుక ఉంది.
"ఎవరు నీవు? అలా నిశ్శబ్ధంగా ఉన్నావూ?”
"నేను! ఉత్త కుసుమాన్ని"

24
శ్రమకు విశ్రాంతి
కంటికి రెప్పలా ఉంటుంది.

25
మానవుడు జన్మతా: శిశువు
ఎదుగుదల శక్తే వాని అధికారము.

26
ఈశ్వరుడు తాను పంపిన
కుసుమాల కొరకై జవాబులు
ఎదురుచూస్తాడు తప్ప,
భూమి, సూర్యుల కై కాదు.

27
పచ్చని ఆకుల మధ్య
దిశమొల శిశువులా ఆడుకొనే కాంతికి,
మానవుడు అసత్యమాడగలడన్న
విషయం తెలియదేమో!

28
ఓ సౌందర్యమా!
ఎల్లలెరుగని ప్రేమలో నీ అస్థిత్వముందని తెలుసుకో
దర్పణం పలికే బుజ్జగింపు మాటలలో కాదు.

29
నా హృదయం తన అలలతో
ఈ ప్రపంచపు తీరాన్ని స్పృశిస్తూ
తన సంతకాన్ని కన్నీళ్లతో ఇలా చేసింది
“నేను నిన్ను ప్రేమిస్తున్నాను"

30
చంద్రమా! దేనికై ఎదురుచూస్తున్నావూ?
"సూర్యునికి వందనమిడి ఆయనకు దారివ్వటానికై"

31
ఈ మూగ పుడమి కరుణ స్వరమా అనిపించేలా
చెట్లు నా కిటికీ దాకా ఎదిగాయి.

32
ఈశ్వరుని ఉదయాలు ఈశ్వరునికే
నిత్యం నూతన ఆశ్చర్యాలు!
33
ప్రాపంచిక హక్కులను బట్టి ఐశ్వర్యము
ప్రేమ యోగ్యతను బట్టి శ్రేష్ఠతా
జీవితానికి సిద్దిస్తూంటాయి.
34
ఎండిన నదీ గర్భం
తన గతం పట్ల కృతజ్ఞతను
ఏమీ కలిగి ఉండదు.

35
విహంగం తానొక మేఘాన్నైతే
బాగుణ్ణనుకొంటుంది
మేఘం తానొక విహంగాన్నెందుకు
కాలేదా అనుకొంటుంది.

36
జలపాతం పాడుకొంటుంది
“నాకు స్వేచ్ఛ దొరికినపుడే
నా గీతం పల్లవిస్తుంది"

37
నా హృదయమెందుకిలా
నిశ్శబ్ధంగా కృశిస్తున్నదో నేను చెప్పలేను.
బహుశా, తాను ఎన్నడూ అర్ధించని,
తనకే తెలియని, జ్ఞప్తి లేని అవసరాలకోసమేనేమో!

38
ఓ మగువా!
ఇంటి పనుల్లో నీవు తిరుగాడుతోంటే
గులక రాళ్ల మధ్య సెలయేరులా
నీ పాదాలు గానం చేస్తున్నాయి.

39
సూర్యుడు తూరుపు కు తుది వందనమిడి
పశ్చిమ సముద్రాన్ని దాటటానికై సాగాడు.

40
నీకు ఆకలి లేని కారణానికి
ఆహారాన్ని నిందించకు.

41
మునివేళ్లపై నుంచొని దేవలోకంలోకి
తొంగిచూసే తరువులు, అవని ఆశలు.

42
నీవు నవ్వి, నాతో ఎమీ మాట్లాడ లేదు.
నేను దీనికోసమే చాలా కాలంగా
ఎదురు చూస్తున్నాననిపించింది.

43
నీటిలో చేపలు నిశ్శబ్ధంగా ఉన్నాయి.
భూమిపై జంతువులు గోల చేస్తూ ఉన్నాయి.
గాలిలో పక్షులు పాటలు పాడుకొంటున్నాయి.
సముద్రపు మౌనం, అవని ఘోష, గాలి సంగీతం అన్నీ
మనిషి లోనే ఉన్నాయి.

44
తామసించే హృదయ తంత్రులపై
ఈ ప్రపంచం నిర్ధయగా పరువులిడి
దిగులు సంగీతాన్ని పలికిస్తుంది.

45
అతను తన ఆయుధాలను
తన దేముళ్లు గా చేసుకొన్నాడు.
అతని ఆయుధాల విజయం, అతని ఓటమే.

46
ఈశ్వరుడు
సృష్టి ద్వారా తనని తాను
తిరిగి పొందుతాడు

47
నీడ తన నమ్రత నిండిన రహస్య ముసుగును ధరించి
నిశ్శబ్ధంగా అడుగులో అడుగు వేసుకొంటో
ప్రేమగా వెంబడిస్తోంది, కాంతిని.

48
మిణుగురులుగా
అగుపించటం పట్ల
తారలు భీతినొందవు.

49
నేనో అధికార రధ చక్రాన్ని కాక
దానిక్రింద పడి నలిగే జీవరాశిలో
ఒకడినైనందుకు నీకు కృతజ్ఞుడను.

50
మనస్సు విశాలంగా కాక నిశితంగా ఉంది.
ప్రతీచోటా అతుక్కొంటుంది, ముందుకు కదలక.

51
నీ విగ్రహం దుమ్ము కొట్టుకు పోయింది.
ఈశ్వరుని ధూళి నీ విగ్రహం కన్నా
గొప్పదని నిరూపించింది.

52
చరిత్రలో మానవుడెక్కడా
తనని తాను బయలుపరచుకోలేదు.
యుద్దాలతోనే గడిపేసాడు.

53
తనను సోదరీ అన్నందుకు
మట్టి కుండను తిట్టిపోసిన గాజు దీపం
ఉదయ చంద్రుని " నా ప్రియాతి ప్రియమైన
సోదరీ" అని సౌమ్యంగా నవ్వుతూ పలుకరించింది54
సముద్రపు కొంగలు, కడలి తరంగాల వలె
మనం కలుసుకొని దగ్గరవుతాం.
కొంగలెగిరి పోతాయి.
కెరటాలు వెనక్కు మరలుతాయి.
మనమూ విడిపోతాం.

55
నా రోజు పూర్తయింది.
ఒడ్డున చేర్చిన పడవ లాగ ఉన్నాను నేను
సాయింకాల ప్రవాహపు నర్తించే సంగీతాన్నివింటూ.

56
జీవితం మనకు ఈయబడినది.
దాన్ని తిరిగి ఇచ్చేయటం ద్వారానే
మరల పొందగలం.

57
గొప్ప వినయాన్ని కలిగిఉన్నపుడు
శ్రేష్టత్వానికి దగ్గరయినట్లే!

58
పింఛపుభారాన్ని మోస్తోన్నందుకు నెమలిని చూసి
పిచ్చుక జాలి పడుతోంది.

59
క్షణాల పట్ల భీతి చెందకు -
అనాది స్వరం గానం చేస్తోంది.

60
గాలివాన మార్గంకాని మార్గంలో దగ్గర దాన్ని ఎన్నుకొని
గమ్యం కాని గమ్యంలో తన అన్వేషణను ముగిస్తుంది.

61
నా ద్రాక్ష రసాన్ని నా పాత్రలోనే స్వీకరించు మిత్రమా!
ఇతరుల పాత్రలలోకి వంపినట్లయితే అది తన
నురగ మాలికను కోల్పోతుంది.

62
అఖిలము అందంగా అలంకరించుకొంది.
అపూర్ణ ప్రేమను పొందటానికై.

63
నిన్ను స్వస్థ పరుస్తాను కనుక బాధ పెడుతున్నాను
"ప్రేమిస్తున్నాను కనుక శిక్షిస్తున్నాను" అన్నాడు
నరునితో ఈశ్వరుడు.

64
కాంతినిస్తుంన్నందుకు దీపానికి వందనమిడు.
చాయ లో స్థిరమైన ఓరిమితో నిలుచొని ఉన్న
దీపధారిని మాత్రం మరువబోకు.

65
చిన్నారి గడ్డి పోచా!
నీ పాదం చిన్నదే కావొచ్చు కానీ
పుడమి మొత్తం నీ అడుగుల క్రిందే ఉంది.

66
శిశు కుసుమం
తన మొగ్గ విచ్చి ఇలా మొరపెట్టింది.
“ప్రియ లోకమా దయచేసి వాడిపోకు"

67
ఈశ్వరుడు గొప్ప గొప్ప రాజ్యాల వల్ల
విసుగునొందునేమో కానీ
చిన్న చిన్న కుసుమాల వల్ల కాదు.

68
తప్పు ఓటమిని నిభాయించుకోలేదు.
ఒప్పు తట్టుకోగలదు.

69
జలపాతం పాడుకొంటూంది
"దాహార్తికి వాటిలో కొంచెమే చాలని తెలిసినా "
"నా జలాలన న్నీ ఆనందంగా ఇస్తున్నాను"

70
ఈ సుమాలను ఎడ తెగని
పారవశ్యపు విస్ఫోటనం లోకి
ఎగరేసిన జలసూత్రం ఎక్కడుంది?

71
చెట్లు నరికే వాని గొడ్డలి
తనకు పిడి కావాలని చెట్టునడిగింది.
చెట్టు ఇచ్చింది.

72
పొగమంచు వానతో కప్పబడ్డ
ఈ అనాధ సాయింత్రపు నిట్టూర్పును
నా హృదయ ఏకాంతం లో స్పర్శిస్తున్నాను.

73
ముంచెత్తే ప్రేమలో
లభించే ఐశ్వర్యం- సౌశీల్యం.

74
పొగమంచు, పర్వతాల హృదయంపై ఆడుకొంటో
సౌందర్యాద్భుతాలను వెలికి తీస్తుంది - ప్రేమలానే!

75
మనం ప్రపంచాన్ని తప్పుగా చదువుకొని
అది మనలను వంచిస్తుందని అంటాం.


76
తన స్వీయ గళాన్ని వెతుక్కొంటో కవి పవనం,
సముద్రాలపైనా, వనాలలోనా సంచరిస్తోంది.

77
ఈశ్వరుడు మానవునిపై ఇంకా
నిరాశ చెందలేదన్న వార్తను
పుట్టే ప్రతి శిశువూ తీసుకొస్తుంది.

78
పచ్చిక తన సమూహాన్ని మట్టిలో వెతుక్కొంటుంది
చెట్టు తన ఏకాంతాన్ని ఆకాశంలో చూసుకొంటుంది.

79
మానవుడు తనకు తానే అడ్డు నిలుస్తాడు.

80
శ్రద్దగా ఆలకించే సరుగుడు చెట్లమధ్య సముద్రఘోషలా
నీ కంఠ ధ్వని నా హృదయంలో సంచరిస్తోంది, మిత్రమా!

81
నక్షత్రాల రవ్వలను వెదచిమ్మే
ఈ కనిపించని నిశి జ్వాల ఏమిటి?

82
ఈ జీవితాన్ని అందమైన వేసవి కుసుమాల్లా
మృత్యువుని శిశిర పత్రాల్లాను కరుణించు ప్రభూ!

88
మేలు కోరు వాడు తలుపు తడతాడు.
ప్రేమించే వానికి తలుపు తెరుచుకొనే ఉంటుంది.

84
మృత్యువులో అనేకులు ఒకటవుతారు.
జీవితంలో ఒకరే అనేకులు.
దేముడు మృతినొందిన నాడే
మతములన్నీ ఏకమౌతాయి.

85
కళాకారుడు ప్రకృతి ప్రేమికుడు. అంటే
ఆమెకు బానిస మరియు యజమాని.

86
"ఓ ఫలమా, నీవు నాకెంత దూరంలో ఉన్నావు?”
“ఓ కుసుమమా, నేను నీ హృదయంలోనే దాగొని ఉన్నాను"

87
చీకటిలో తెలుస్తూ, పగలు కనపడని
వానికోసమే ఈ నిరీక్షణంతా!88
“నీవు ఈ తామరాకు క్రింద ఉన్న పెద్ద మంచుబిందువువి.
నేను పైన ఉన్న చిన్నదాన్ని"
కొలనుతో మంచుబిందువు అన్నది.

89
కత్తి పదునును రక్షిస్తున్నంత సేపూ
ఖడ్గ కోశం తాను కాంతి విహీనంగా ఉన్నా
సంతుష్టిగానే ఉంటుంది.

90
అజ్ఞానంలో ఒక్కడు ఒకే రూపంలో అగుపిస్తాడు
కాంతిలో ఆ ఒక్కడే పరి పరి విధముల దర్శనమిస్తాడు.

91
పచ్చిక సహాయంతో
పుడమి గొప్ప అతిధేయిలా భాసిల్లుతుంది.

92
ఆకుల జనన మరణాలు వడివడిగా తిరిగే సుడులు
వాటి విశాల వలయాలు తారలనడుమ తారాడుతూంటాయి!

93
“నువ్వు నా దానవు" అని లోకంతో అన్నది అధికారం
లోకం దానిని తన సింహాసనం పై బంధీని చేసింది.
“ నేను నీ దానిని" అని లోకంతో అన్నది ప్రేమ.
లోకం దానిని తన ఇంటికి రాజ్ఞిని చేసింది.

94
అవని వాంఛలా ఉంది పొగమంచు.
తా మొరలిడు సూర్యుని అగుపించకుండా చేస్తోంది.

95
సడి సేయకుమా మనమా!
ఈ తరువులన్నీ ప్రార్ధనలే.

96
త్రుటి శబ్ధాలు
ఆద్యంత రహితుని సంగీతాన్ని
పరిహసిస్తున్నాయి.

97
ప్రేమ, మృత్యు , జీవన వాహినులపై తేలుతూ సాగిన
గతించిన కాలాలను స్మరించుకొంటే
నా మహాప్రస్థానపు స్వేఛ్చ నాకు తెలుస్తోంది.

98
నా హృదయ విషాదం
పెండ్లి కుమార్తె మోము తెరవంటిది.
రాత్రి అది తొలగింపబడేందుకై
ఎదురుచూస్తోంది.

99
మృత్యువనే ముద్ర జీవితం అనే నాణానికి
యోగ్యతనిస్తుంది.
అపుడు మాత్రమే దానితో
ప్రియమైన వాటిని కొనగలం.

100
ఆకాశంలో ఒక మూల
ఆ మేఘం వినమ్రంగా నిలుచుంది.
ఉదయసంధ్య
దానికి తేజో కిరీటాన్ని కట్టపెట్టింది.

 

FOR AN ENGLISH VERSION..

http://www.beditor.com/poetry/361-stray-birdstagore1

మొత్తం అనువాదాన్ని డవున్లోడ్ చేసుకునేందుకు వీలుగా పి.డి.ఎఫ్ ఫైలు కొరకై ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.scribd.com/doc/9674265/Tagore-Stray-Birds-Telugu-Translation


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!