అప్పుడప్పుడు
సమయం రాతిగోడయై
నా చుట్టూ దడి కడుతుంది
నేనిక
పూర్తిగా తన సొంతమని
నిశ్శబ్దపు పాటలు పాడుతుంది
కొత్తదారి మల్లకుండ
జ్ఞాపకాల జోలపాట పాడుతుంది
తన నుండి తప్పుకు పోనివ్వకుండా
కాసిన్ని కరకు రంకెలూ వేస్తుంది...
ఒంటరితనమో, నిరాశక్తతో ఇంకేదో
పేరు తెలియని మత్తొకటి బీకరు నిండా ఇస్తుంది
ఇక...
నేను ఎవరికీ అక్కర్లేని మనిషినని
మనసారా నమ్మమని పంతం పడుతుంది
ఎన్నని చెప్పను ... ఏమని చెప్పను
క్షణక్షణం అచ్చంగా నీలానే
వేయి రకాలుగా వేధిస్తుంది...
ఓయ్
కాస్త ఇటుగా వచ్చి
వేధించే సమయానికి మంకుపట్టు వదలమని
బుజ్జగించి వెళ్ళవోయ్ రాజకుమారా...
కుప్పిలి పద్మ గారు అందించిన యీ ‘ఇచ్ఛామతి' సాహిత్య స్వాప్నిక స్రవంతి లో ప్రచురణ