వేకువజామున కలలో - ఆర్. రమాదేవి
***
వేకువజామున కలలో
నువ్వు తప్పిపోయావు
నా మనసు ఎందుకో
బెంగతో తడబడిపోయింది
దూరపు నక్షత్రాలు కొన్ని దిగి వచ్చాయి
రాళ్ల మధ్యన చీకటి నీడగా మారింది
వరద పోటెత్తింది చిత్రంగా
చిరుజల్లులు కురిపిద్దామని
నేను వేసిన గులాబీల పంటలో
ఎనలేని గడ్డిపూలు పూసాయి
ఎందుకో
ఉబుసుపోని మాటలకి
రెక్కలు మొలిచాయి
పొంతన లేని మాటలు
దరిచేరాయి
అవును అన్నీ
అసంపూర్తి వాక్యాలే
ఏం చేయను
పూర్తి చేద్దామంటే
నువ్వు రాలేదింకా
.
మిత్రురాలు ఆర్.రమాదేవి తొలి కవితా సంపుటి ' వెన్నెల దుప్పటి కప్పుకుందాం ' లోని కవిత ఇది. రమాదేవి బోళా మనిషి. మంచి మనసున్న స్నేహితురాలు. తను ఎక్కడున్నా ఆ పరిసరాలను నవ్వులమల్లెలతో పరిమళింపచేస్తుంది. లేత తమలపాకు ఈనెల్లాంటి సున్నితమైన ప్రేమ కవిత్వం తనది. విరహం, ఎదురుచూపు, అనంతమైన నిరీక్షణ మృదువుగా తన కవితల్లో వ్యక్తమవుతాయి. ఒక్కోసారి ప్రేమ కోసం వెతుకుతూ తన్ను తాను కనుక్కుంటుందేమో! అనిపిస్తుంటుంది. సున్నితమైన ప్రేమభావాల్ని ఇష్టపడే వారికి ఈ కవిత్వం తప్పక నచ్చుతుంది....అనిల్ బత్తుల