కొత్త అడుగులు-43 ఆర్.రమాదేవి

శిలాలోలిత గారు అందించిన అందమైన బహుమతి..

శిలాలోలిత గారు నా పుస్తకం (వెన్నెల దుప్పటి కప్పుకుందాం కవిత సంపుటి) చదివాక ఎప్పుడో ఒకప్పుడు పరిచయం అందించవచ్చు అని అనిపించింది... ఆ విషయాన్ని మేడమ్ కూడా నాతో అన్నారు. ఆ తర్వాత మాత్రం నేను నా పరిచయం వచ్చిందా లేదా అని చూసుకోలేదు.. తను కూడా నాతో ఎప్పుడూ అనలేదు.

నిన్న స్వయంప్రభ తో కలిసి మేడంని కలిసినప్పుడు, అవును నా పరిచయం వచ్చిందో లేదో చూసుకోనే లేదు అని అనిపించింది కానీ ఆ విషయం మేడం తో నేను అనలేదు అడగలేదు. ఆ ప్రసక్తి మా మధ్య రానేలేదు.

ఇంటికి వచ్చాక చూసుకుంటే ఇప్పుడు కాదు జూలై లోనే వచ్చింది.. ఒక్కసారిగా అక్కడ నా పరిచయం చూసుకొని ఎంత ఆశ్చర్యం.. ఎంత ఆనందానికి లోనయ్యానో మాటల్లో చెప్పలేను.

కొత్త అడుగులు - 43 (నెచ్చెలి అంతర్జాల మహిళా మాసపత్రిక) లో శిలాలోలిత గారు నా గురించి అందించిన పరిచయం జూలై నెలలోనే  ప్రచురింపబడింది.

ఈ ఒక్క పరిచయం చాలు.. నా గురించి మరో మాట చెప్పక్కర్లేదు ఇక.. నేను ఎన్నోసార్లు మది అడుగున అనుకునే మాటలన్నీ అలవోకగా అందించేసారు శిలాలోలిత గారు..

ఎప్పుడూ చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నా అద్భుతాలు అయిపోయాయి అనుకున్న వేళ అలలు అలలుగా అందుతూనే ఉంటాయి అనుకోని సమయాన...

Thank you so much madam  Shilalolitha Kavi  for your precious gift

https://www.neccheli.com/2023/07/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%85%e0%b0%a1%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-43-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5/?fbclid=IwAR2hf5xxhYT6FZ6ksXU_jPNp4a3sAKFt_aJrhIk9X5PjxevVjeAGcQxNXtM

 

*******

  ‘ఆర్.రమాదేవి’ భావోద్వేగాల ఊయలలో ఊగే స్పటికం లాంటి కవయిత్రి. ఒక ఉన్మత్త భావావేశం, ప్రేమ నిండిన అక్షరాలే ఆమెను చేరి “వెన్నెల దుప్పటి కప్పు కుందాం “ అంటూ నదిలా ప్రవహించింది.

          ‘ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును’ లాగా ఆమె కవిత్వం నిండా ప్రేమే. ఆ ప్రేమ పక్షుల పలకరింపులే, కన్నుల నిండిన ఉద్విగ్న లక్షణాలే.

          గతంలో ప్రేమ కవిత్వాన్ని చాలామంది రాశారు. రాస్తున్నారు. ఆపై రాస్తారు కూడా.  బాహ్య ప్రపంచానికి వీరికి సంబంధం లేదు. వారి వారి మనో కవాటాలను బద్దలు కొడుతూ ఎగసి పడే ప్రేమోన్మాదులు వీళ్లు. వీరికి ప్రపంచం ఎటు చూసినా, వెళ్లినా వారిదైన కంటి చూపుతోనే కనబడుతుంటుంది. వీరికి ప్రేమ అనేది ఆహారం వలె అవసరం.  భౌతికా వసరం కాదు వీరిది. ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా మదిలో సంకెళ్లు వేసి బంధించా లన్న తీవ్రకాంక్ష.

          గతంలో కవి సంగమంలోనే గీతా వెల్లంకి అద్భుతమైన మహోన్నతమైన ప్రేమ కవిత్వాన్ని రాసింది. అప్పటి వరకు ప్రేమంటే చులకన ఉన్న కొందరికి ప్రేమ స్వచ్ఛత ను అనుభూతించిన తర్వాత ‘డార్క్ ఫాంటసీ’ ని ఆరాధించడం మొదలైంది.

          రమాదేవి రమాదేవి కాదు. మరెవరు? ప్రేమను నింపుకున్న ఊహామూర్తి. యూటోపియా ఆమె నివాస స్థలం. నిర్మలమైన ప్రేమ కోసం ఎండిన మండుతున్న అక్షరాల నడుమ తనదైన సొంత గొంతుకను వినిపించడానికి చేసిన ప్రయత్నమే ‘వెన్నెల దుప్పటి కప్పుకుందాం’ –  కవిత్వ పుస్తకం .       

          సముద్రమే ఆహ్వానించిందో, నదిగా పలకరించిందో తెలీదు కానీ ఆమెలోని అనురాగమూర్తి ‘అతనిని’ ఆవాహన చేసుకుంది. ఆమె చిరునవ్వు వెనక అలల నురుగు ఉంది. ఆమె గుండె చప్పుడు మధ్య వినబడని నిశ్శబ్దముంది. నిరాలంకారంగా, ఏ  తొడుగులు, భాషా పరిజ్ఞానం, వ్యాకరణాల వలయాలు, సిద్ధాంతాల సుడిగుండాలు లేకుండా, స్వేచ్ఛగా రాసింది. దీన్ని కవిత్వమందామా? మనో సంచలనమందామా మరి.  నిజాయితీగా, ధైర్యంగా భావాలను ఉన్నదున్నట్లుగా ప్రకటించినది అనుకోవాలా?  ఏమనుకోవాలి?

          చాలా కాలం నుంచి సముద్రుడంటే పురుషుడని, నది అంటే స్త్రీ అని వారి కలయి కలే సృష్టి స్థితి అని వింటూనే ఉంటున్నాం. ఆమె తీవ్రాన్వేషణలో, కొత్త ధోరణిలో లేలేత పదాలతో కవిత్వీకరించటం విశిష్టత.    

          ఆమె, అతడు ఎవరైనా కావచ్చు. నువ్వు, నేను, అందరం, మరికొందరం కూడా కావచ్చు. ప్రేమ భూమ్మీద నదిలా ప్రవహిస్తున్నంత కాలం, సముద్రుడిలా ఉప్పొంగి నంతకాలం పచ్చగానే ఉంటుంది. ఎవరికి వారు అన్వయించుకునేలా, మనసు లోతుల్లోకి ప్రవహించేలా తన రచనా సామర్థ్యంతో అక్షరాల బొమ్మల్ని చెక్కింది. చిన్నప్పటి తాటాకు బొమ్మలు, నెమలీకలు, వాద సంవాదాలు ఒకటేమిటి ఎన్నింటినో మన ముందుకు తీసుకువచ్చింది.

          ఆమె మాటల్లోనే విందామంటే – “మనసులో లోపలికి ఇంకిపోయి నీదైన వారిని ఎదుట నిలుపుతుంది. ప్రేమింపబడటం కంటే ప్రేమించడం ఒక అద్భుతం అని నమ్మిక కాబోలు ఆకాశమంత ప్రేమిస్తూనే ఉండాలి అనుకుంటా.

          ప్రేమించడం అనేది ఏ బంధంలోనైనా కావచ్చును కానీ అవతలి వైపు అతను అన్న భావన తెలియని మృదుత్వాన్ని దోసిట్లో అందిస్తుంది. అందుకే కవితల్లో “అతను”.

          ఎన్ని వేల సార్లైనా ఇసుమంతైనా విసుగు లేక పదేపదే ప్రేమ ప్రకటన చేస్తూనే ఉంటాను, నేను, నువ్వు అనే అక్షరాలు చెరిగిపోయే వరకు ప్రేమించడం అంటే నన్ను నేను కోల్పోవడం కాదు నాతో అతన్ని కూడా దాచుకోవడం. నేను తనతో లేకపోతే అతను లేనట్టే.

          ప్రేమ ఏం చేస్తుంది అనేది మదికి అర్ధం అయ్యే మాటలు అని తన కవిత్వాన్ని గురించి చెప్పింది. తనకు మరపురాని జ్ఞాపకం రజా హుస్సేన్ గారు ( కాఫీ విత్ ఆర్. రమాదేవి ) నా కవితా విశ్లేషణ శీర్షికలో ఒకచోట అందించిన విలువైన ప్రశంస ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం అన్నది. “ఆర్.రమాదేవి ఈ మధ్య ఫేస్బుక్లో విస్తృతంగా ప్రేమ కవిత్వం రాస్తున్నారు. తనదైన ఓ ప్రత్యేకమైన డిక్షన్ పట్టుకున్నారు. ప్రేమ కవిత్వం అంటే చులకనగా చూసేవాళ్ళకు రమాదేవి కవిత్వమే సమాధానం. ఓ సున్నితమైన భావాన్ని అంతే సున్నితంగా చెప్పి మెప్పించడం అంత తేలికేం కాదు. చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన బొమ్మలా అందంగా చెప్పగలగాలి. కవి చెప్పింది నేరుగా పాఠకుడు గుండెను తాకాలి. అప్పుడే ప్రేమ కవిత్వం రసస్థితిని పొందుతుంది. రమాదేవి గారి ప్రేమ కవితల్లో ఒక గమ్మత్తైన మత్తు ఉంటుంది. అది పూల తేనె తాగితే కలిగే పరవశం!”  అన్నారు.

          ఈ కవయిత్రి అట్ట వెనక రాసుకున్న మత్తు పూలు కొన్ని

ప్రేమ ఏం చేస్తుందని

ఆశ్చర్యంగా అడిగే మనుషులు

నాకు ఎప్పుడూ వింతేనోయ్

ప్రేమిస్తూ ప్రేమిస్తూ

మనసు మరింత సున్నితత్వం అద్దుకుంటుందని

ఈర్ష్య అసూయ ద్వేషం

ముళ్ళ చిక్కులు విడదీసుకుని

గంధపు లేపనం అద్దుకుంటుందని

ప్రేమ తెలియని వారికి తెలిపేదెలా

ప్రేమకు అలవికాని

రంగులు అద్దుతూ అద్భుతాలు

సృష్టిస్తూనే ఉంటుందని

ప్రేమే తెలియని వారికి వివరించేదెలా

ఒక్కసారి ప్రేమించి చూడు

నీవు నీవుగా ఉండి

ఆకాశమంత ప్రేమించి

కంటి ముందు

రూపు నిలవనంతగా

సముద్రమంత ప్రేమించు

ప్రేమ లోగిలిలో అడుగుపెట్టి చూడు

నీ.. నా రేఖలు చెరిగిపోతాయి

ప్రేమ తప్ప మరొకటి కనిపించదని

ఆత్మసాక్షిగా చెబుతున్నా

అనుసరించి చూడు.

          ఈమె కవిత్వం అక్కడక్కడ వచనంలాగా అనిపించినా వస్తు గాఢత వల్ల దానికి ఝరీ ప్రవాహమబ్బింది. స్వచ్ఛమైన ప్రేమ కవిత్వాన్ని చదివిన రసానుభూతి తప్పక కలుగుతుంది.

          ప్రస్తుతం ఈ కవయిత్రి నివాసం హైదరాబాద్. అయినా ఎందుకో కొందరు ఒప్పుకోరు. అమ్మానాన్నలు రాయలసీమ కదా అంటూ అప్పుడప్పుడు వేరు పరుస్తూ ఉంటారు. ఎందుకో మరి పుట్టిన నాట నుంచి అమ్మ ఊరు ఒకసారి, నాన్న ఊరు ఒకసారి చూసి ఉంటానేమో అత్తగారి ఊరు ఏదైనా నాకు నా సొంత ఊరు మాత్రం హైదరాబాద్.  మా ఊరు ఏది అన్న ప్రతిసారి ఇంత కథ ఎదురవుతూనే ఉంది మరి. అలాంటి రోజునే ఒక కవిత రాసినట్టు గుర్తు.

మీ ఊరు వెళ్లి పోరాదు 

నాకు గుర్తున్న పేరు చెప్తే

అమ్మమ్మ ఊరు అనిరి

ఇంకో పేరు చెప్తే

మీ అమ్మొల్ల ఊరే కాదే

అని కిసుక్కున నవ్విరి

ఇంకోటి అత్తోల్ల  ఊరాయె

ఇప్పుడు ఉన్నది పిల్లల ఊరాయే

ఇంతకూ.. 

నా ఊరు ఏదో ఏడదో

యాదికొస్తలేదు..

          ఎంత ప్రేమను మనసు నిండా నింపుకున్న అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అందుకు కలిగే బాధ అప్పుడు అల్లుకునే కథ లాంటి కవితలు కూడా అక్షరమే. ఆ అక్షరాలన్నీ కవి సంగమంలో మాత్రమే ఉంటాయి. ఎందుకో అక్కడ బాధ నాకు నాలుగు గోడల మధ్య దాచినట్లుగా అనిపిస్తుంది. 

          ఎప్పటి నుంచి రాస్తున్నాను అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నుంచి కావచ్చు. కానీ ఏదీ దాచుకునే అలవాటు లేక ఆనవాలు లేదు. అప్పుడు రాసింది కవిత్వం కాకపోవచ్చు. కానీ నాలోని భావాలు ఇష్టాలు అని మాత్రం చెప్పగలను.

          పుస్తకం చదవడం అలవాటు. చదివిన విషయాన్ని నలుగురికి చెప్పడం అలవాటు. మనసులో కలిగే ఆలోచనలు కాగితం మీద అక్షరంగా మారితే ఎంత తృప్తిగా ఉంటుందో.

          ప్రేమ కవితలు రాయడానికి ఒకప్పుడు ఒక విధమైన జంకు ఉండేది. ‘అతను’  అంటే ఎవరూ అంటూ నన్ను ఎద్దేవా చేస్తారేమో అని. ఫేస్బుక్లో మాత్రం చాలా తక్కువ పోస్ట్ చేసేదాన్ని. అది కూడా మనసులో భావాన్ని ఒక చిన్న కవితగా కాదు నాలుగు వాక్యాలుగా మార్చి. గత రెండేళ్లుగా ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాను.

          చూసిన ప్రతిచోట, చూసిన ప్రతి మనిషితో నాకు ఇష్టమే కనిపిస్తుంది వాళ్లలో కనిపించే ఒక క్వాలిటీ నాకు అద్భుతాన్ని అందిస్తుంది. నాకు ఎవరినీ తప్పుపట్టాలి అనిపించదు. ఒక్కోసారి అనిపిస్తుంది నాలోని ఇష్టం ఎవరిలోనూ చెడుని చూడనివ్వడం లేదేమో అని. అయినా సరే తెలియని తనం, తెలివి తక్కువ తనం అనిపించినా కూడా ఇష్టపడటంలో కూడా నాకు అందే ఆనందం. ఏ తూకానికి  అందడం లేదు.     

          ప్రేమ కవితలు కాకుండా కథలు, ఆర్టికల్స్ కూడా రాస్తాను. కానీ అవి చాలా తక్కువ స్థాయిలో. కథలో, ఆర్టికల్స్ లో కొన్ని లాజిక్స్ ఉంటాయి. కొన్ని ఆలోచనలు ఉంటాయి.  కొన్ని ఊహలు కల్పించబడి ఉంటాయి. ఏవీ  కూడా ఎక్కువగా ఏ సంచికలోనూ ప్రింట్ కాలేదు. నేను పంపించలేదు కూడా. నాకు ఒక వెబ్సైట్ ఉంది. అందులో ఉండిపోతాయి అన్ని. (www. bedior. com)

          అన్నిటికంటే ప్రేమ కవితలు రాసినప్పుడు నా మనసు నిండుగా ఎన్ని వేల రంగులు అల్లుకుంటాయో చెప్పలేను. వెళ్ళిన చోట నచ్చుతుంది. అక్కడ నాకు తెలియని లోకమేదో నా కంటికి కనిపించినట్లుగా ఉంటుంది. మనసు మాత్రమే పలుకుతున్నట్టుగా ఉంటుంది. రాస్తున్నప్పుడు నా పెదవి పై ఒక చిరునవ్వు ఉంటుంది.  కవితలోని అతను నా ఎదురుగా ఉన్నట్టు ఉంటుందేమో మరి. ఎదురైన మనసులో నాకు నచ్చిన ఇష్టం వెతుకుతాను కాబోలు. అందుకనే కవితలోని భాగంలో అందరూ ఉన్న అతనే అవుతాడు.

          నాకు నేనుగా ఒక బొమ్మ గీసుకున్న.  అలా అని నాకు ఏదీ చిత్రకళ రాదు. నేను గీసుకుంది జీవితం అనే కాన్వాస్ మీద ఫ్యూచర్లో నేను ఊహకు ఒక ప్రాణం పోసినప్పుడు నాకు వేరే ఏమీ గుర్తుకొచ్చేది కాదు. ఆ బొమ్మ చెరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అని ఒక్కటే ఉండేది. రాను, రాను నేను గీసుకున్న బొమ్మ అని కూడా మర్చిపోయా నేమో. ఆ చిత్రానికి నేను బానిసగా మారాను. ఆ బొమ్మ నా యజమాని. ఎట్టి పరిస్థితుల్లో కూడా యజమానిని వదలకూడదు. అందుకు ఎన్ని మానసిక వేదనలు, ఇష్టాలు వదులు కున్నా సరే ఇలా ఉండిపోయాను. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలు అందుకు. నేను ఏమి కోల్పోయానో , కన్నీళ్ళే ఉన్నాయో కలలే కోల్పోయానో ఏమీ గుర్తులేదు ఇప్పుడు. చాలాకాలం తర్వాత నన్ను చూసినవాళ్లు మీరు బాగుంటారు అని అన్నప్పుడు గుర్తొచ్చింది నేను గీసుకున్న బొమ్మ. ఒక్కసారిగా దానిని చూసా. నిజంగా చాలా అందంగా ఉంది. అప్పటి వరకు యజమాని అయిన బొమ్మ ఎప్పుడు నా నేస్తం అయిందో తెలుసుకోలేకపోయా. ఆ బొమ్మ నాదే, అది నా చిత్రం అని అనుకున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసేది.

          ఆ తర్వాత నాకు నీడ ఉంది. అద్దంలో ప్రతిబింబం ఉంది. రెండూ ఒకరివే అని తెలుసు. ఐనా అది నేనే అని తెలుసు ఐనా అలా రెండుగా చూడటం ఎంతో బాగుంటుంది. ఆ నీడ ఇంకో నేను అనుకొని ఎన్నో ఊహలు, ఎన్నో కవితలు అన్నింటిలో నేనే. ఆ కల్పిత వ్యక్తి  నేనే అని ఎవరితో చెప్పాలి. అందర్నీ చూసే కొద్ది నాలాంటి నేను ఇంకొకరు ఉంటే అంత బాగుండు అని ఎంత ఆశగా ఉండేదో. నన్ను నేను బొమ్మ గీసుకున్న ఎపుడో, ఇపుడు నా నీడకు, నా ప్రతిబింబానికి కూడా ఒక ఊహాచిత్రం గీయాలని నా మనసుకి ఎంత ఆశనో. కానీ ఆ ఊహా చిత్రం ఒకరి జీవన చిత్రం అవుతుందనే నిజం నా మనసును ఎంతో నొప్పిస్తుంది. మనసు నొచ్చుకునే పని ఎలా చేయను, ఎలా ఉండను అన్నీ ప్రశ్నలే.

          ఇలా తన అంతరంగపు చినుకుల్ని అక్షరాలతో కలిపి ఒక వెన్నెల దుప్పటిని  మోసుకొచ్చింది. స్వచ్ఛమైన పాలనురుగు లాంటి  కవితాక్షరాలన్నీ మన ముందు సముద్ర తీరాన గుమ్మరించింది. ఈ ఉన్నత, భావోద్వేగ రసానుభూతిని కలిగించే ఈ ప్రేమమయ వాక్యాల్ని మీరూ  చదవండి.

*****


 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!