నేను....శ్రీనివాసుడు

నాకు తనని సహాయం అడగడం అసలు ఇష్టం ఉండదు కాని ఏంచేయను? మా వాడు చెపితే వినడం లేదన్న కోపంతో,తొందరపాటుతో అనుకోని ప్రయాణం పెట్టుకొని వెళ్లాను. అక్కడ ఏదో మా వారికి  తెలిసినవాళ్ల పుణ్యమా అని, అర్దరాత్రి దాటాక వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాము. తనను తనివి తీర చూడనే లేదు, ఆక్కడ మాకోసం తీసిన గదికి చేరిపోయాము.

ఎంతో అలసటగా ఉంది ఏదో వెలితిగా ఉంది, నిదురరాక అక్కడి నుండి కనిపించే ఆలయ గోపురం చూద్దామని బయటికి వచ్చాను. అంతలో అలికిడి ...ఇప్పటికి వచ్చావా అన్నమాట  ..ఉలిక్కి పడి చూసి...కంగారుగా... ఏంటి ఈ సమయంలో యిలా..ఇక్కడ.. నాకోసమా..అన్నాను.ఆనందం ఆవేదన కలసి మాటలు తడబడుతున్నాయ్..తను నిశ్సబ్దంగా కాసేపు మాట్లాడక ఆలా ఉండిపోయి..మెల్లిగా నిన్నొక మాట అడగాలి అని వచ్చాను అన్నాడు.నిజమా ఐతే ఆలస్యం ఎందుకు  చెప్పు మరీ అన్నాను చిరున్నవ్వుతో...

నువ్వు చెప్పినట్టు 'ఎపుడో నా చిన్నపుడు అనాలేమో'..అపుడు ఐతే ఇదిగో ఇలా పొద్దు వాలంగానే భోజనం కానించి అలా స్నేహితుడితో పాచికలు..ఒక భక్తుడి పాటలు విని, దేవేరితో ముచట్లు ఆడి, తరవాత హాయిగా నిద్రించి, బాలభానుడి వెలుగురేకలు విచ్చుకునే వేళ లేచేవాడిని. ఆ ఆనందం మళ్లీ అనుభవించాలని ఉంది..అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రింద "మా ఇంటికి రా" అన్నావు! మళ్లీ ఇపుడు కనిపించావు.. నేను వస్తా నీ వెంటా అని మొదలెట్టాడు అతగాడు..

ఇపుడు నిన్ను ఎలా తీసుకెళ్ళను.. నీవు ఇంటి గడప దాటేలోపే మేలుకొలుపు అంటూ వచ్చేస్తారు..ఐనా ఇక్కడా నీకేం లోటు..నిన్ను చూడడానికి వచ్చేవాళ్ళు..నీకోసం ఎదురుచూసేవాళ్ళు..నేతి వంటలు,పూల పాన్పు.. అబ్బో..అన్నాను..ఎలానో ఉరడించి వెళ్ళిపోదామని..

తనని అక్కడినుంచి తీసుకెళ్ళాలని నాకు ఉంది కాని ఏం చేయను..ఎలా సాద్యం..తను ఒక్కడే రాలేదు..ఊరికి దూరంగా ఎక్కడో కొండపైన ఉన్నవాడు..మారిన లోకం తెలియనివాడు.. తను వెళ్ళాలి అని అనుకునేలోపే ఆ మాటకూడా పసికట్టెంత ఉన్నతికి ఎదిగిపోయిన వాళ్ళు చుట్టూ ఉన్నారని తెలియనివాడు..వడలిన మోము చూసి వదిలి రావాలని లేదు..ఉన్న కాసేపు పేచి ఎందుకనీ.. నీ నవ్వు చూడకుండా వెళ్ళలేను..నేను ఏమి చేయాలో చెప్పు "స్వామి" అని అడిగా తనని..

అందరు వచ్చి వెళ్ళేవాళ్ళే కాని, ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు లేరు..నా పాదాలు కనిపించడం లేదని ఈ మధ్య ఏదో గొడవ చేస్తున్నారు కాని, నడకలేని నా పాదాలు కందిపోయాయి...నిడురలేని నా కళ్ళు ఎరుపెక్కి పోయాయి అదిగో వాటిని దాచేందుకు అక్కడ నామాలు ఇక్కడ బంగారు తొడుగు ఏమి చేయను..నేతి వంటకాలు ఉంటాయి ఆరగింపుకు కానీ ఏం లాభం..నిదురలేక ఆకలి మందగింపు..కాసేపు ఆగి తిందాం అనడానికి లేదు..తెచ్చినంత సేపు  పట్టదు  తీసుకెళ్ళదానికి, నిజం చెపుతున్నా...గుక్కెడు నీళ్ళు, గుప్పెడు తిండీ అలసట తీర్చే నిద్ర కావాలి..ఇవ్వవా అన్నాడు అలసటగా..

శ్రీనివాసా ....నేనేమి చేయను..నువ్వు నా స్నేహితుడివి అన్నది నిజమే..నా బాధ్యతలు అయిపోగానే నీతో కబుర్లు చెప్పుకోడానికి వస్తా అన్నది నిజమే, మధ్యలో కావాలంటే నువ్వు ఎపుడూ పిలిచినా వస్తానన్నది నిజమే, కానీ యిలా సహాయం అడుగుతే ఏమి చేయాలో మాత్రం నాకు తెలియలేదు అన్నాను నేను నిస్పృహగా...

ఇవన్నీ మనసులో పెట్టుకోకు..పెళ్లి కోసం అప్పు చేశాగా..వడ్డీ తీర్చడం కోసం ఆ మాత్రం కష్టాలు తప్పవేమోలె.. ఆ చెప్పలేదనకు..నీకు నేను ఎపుడూ శ్రీనివాసునే... నీకు అవసమైనపుడు నన్ను అడగడం మర్చిపోకు.. వీలైతే వడ్డిలేని అప్పు చూడు నాకోసం అని నవ్వేసాడు గట్టిగా..నేను అడిగిన నవ్వు ఇచ్చేసాడు ..వెళ్ళమని నేను అడగకుండానే చెప్పేసాడు.

నేను తనతో ఉండనూ లేను...తనను నాతో తెసుకెళ్ళనూ లేను.నిశ్సబ్దంగా వెనుదిరిగి వెళుతున్న తనని చూస్తూ అలా ఉండిపోయా! తన కళ్ళ నిండా నీరు కనిపించలేదు కాని, బుగ్గపై జాలువారిన కన్నీరు మటుకు నా నుంచి తప్పించుకోలేక పోయింది..నేను వెళ్ళలేదు ఆ తరవాత ఎప్పుడు తనని చూడడానికి..నాకు తన మీద బెంగగా ఉంది...చూసి చాలా కాలం అయింది..మీరు వెళితే ఒక్కసారి చూడరా తన బుగ్గపై కన్నీటి తడి ఆరిందో లేదో...

 


Comments

Post New Comment


lakshminaresh 17th May 2011 15:50:PM

కన్నీటి తడి ఆరలేదు..ఎదురు చూపు ఆగలేదు..సుగంధాల ఉక్కిరిబిక్కిరి , గర్భ గుడి చీకటి...వళ్ళంతా కప్పేసిన అలంకరణ ...అన్ని వదిలి వచ్చి మీ ఇంటి ముందు నిలబడి ..నేనే శ్రీనివసుడిని అంటే మీరు నమ్ముతారా? ఎవోయీ నీ శంఖు చక్రాలు, నామాలు ,అభయ హస్తం అని అడగరా..చిరు నవ్వు చూసి గుర్తు పడతారా? వచ్చావా అని , ముందు కాఫీ పెట్టివ్వమంటార?