నాకు కబుర్లు చెప్పాలని లేదు......


నాకు  మాట్లాడని మనిషిని చూస్తేనే విచిత్రం, ఏమైనా కబుర్లు చెప్పమంటే "ఏమున్నాయి చెప్పడానికి" అనే అవతలి వాళ్ళ జవాబు నాకు ఎంత వింతగా ఉంటుందో!. మాటలు వినపడవా లేక మాటలు రావా అనిపిస్తుంది.కాని  మాటలు రాని వాళ్ళకు కూడా వాళ్ళ భాషలో కబుర్లు ఉంటాయి కదా!

ఏమి మాట్లాడుకోకుండా గంటల తరబడి ఎదురుగా కూర్చుని ఉండే మనిషిని చూసినా నాకు చిత్రంగానే ఉంటుంది. అంత సేపు మాట్లాడకుండా ఉండడానికి ఏమైనా ధ్యానం చేస్తారా! అనిపిస్తుంది. అసలు మాట్లాడాలంటే ఏమి కావాలి. ఒకరికొకరు నచ్చలా! ఒకరికి ఇష్టం ఉంటే సరిపోదా? ఇలాంటి ప్రశ్నలే  తప్ప,జవాబులు మాత్రం తెలియడం లేదు.ఎవరి సంగతి ఏమో కాని నాకు మాట్లాడటం ఒక కళ అని అనిపిస్తుంది.కబుర్లు చెప్పడం అన్నా,కబుర్లు వినడం అన్నా చాలా ఇష్టం. మాట్లాడుతుంటే తెలుగు భాషా పదాలే తక్కువ వస్తాయేమో అనిపిస్తుంది.
 

అనగనగా ఒక రాజుకు ఏడుగురు కొడుకులు అంటూ కథ చెప్పాలని,చెప్పినప్పుడు వినే  పిల్లల జ్ఞాపకాలను పంచాలని ఉంది. ఇది ఒక్కటే కాదు.ఎన్నో పాత జ్ఞాపకాలు, స్నేహితులతో పంచుకున్నసందడి, ఎన్నో కబుర్లు, ఎన్నో వింతలు, ఎన్నో భావాలు,, ఒకటి కాదు రెండు కాదు, వేల వేల కబుర్లు ఉంటాయి.రోజుకి 24 గంటలు చెప్పినా తీరవేమో అనిపించే కబుర్లు, పాతవి అయిపోక ముందే కొత్తవి చేరుతూనే ఉంటాయి. ఇవన్ని ఎవరికీ చెప్పాలి?

అన్ని మాటలూ ఒకరికి చెపితే బాగుండు అని అనుకుంటే కుదరడం లేదు. చదివిన పుస్తకం గురించి మాట్లాడాలంటే ఒకరు, చిన్నప్పటి సంగతులు చెప్పాలంటే వేరొకరు, రాజకీయ చర్చలకు ఇంకొకరు, మనసు బాధను చెప్పుకోవటానికి వేరెవరో ఇలా ముక్కలు ముక్కలుగా కబుర్లు చెప్పాల్సి వస్తుంది. అన్ని ఒకరికే చెపుదాం అని ఆశ, ఎలా కుదురుతుంది. పుస్తకం చదివే అలవాటు లేని వారికి అందులోని అపురూప భావలేలా పంచను...సరే అని ఎవరో ఒకరితో కబుర్లు చెపుతూ పోతే చెప్పిందే చెప్పడం అవుతుంది కాని అవతలి వాళ్లకి అందులో ఆశక్తి ,ఆనందం ఉండదు., ఏం చేయాలి అని అనిపిస్తుంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక సమస్య.. పాత వాళ్ళు వెళ్లిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తారు. మళ్లీ పాత కబుర్లు దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఇలా పాత కబుర్లు నుంచి కొత్త కబుర్లు వరకు వచ్చేసరికి వీళ్ళ స్థానంలో ఇంకొకరు. ఆలా అని కొత్త కబుర్లు దగ్గర నుంచి మొదలు పెడదాం అని  ఎవరి గురించి చెప్పడం మొదలెట్టినా వాళ్ళు ఎవరో మాకు తెలియదుగా అంటారు....అలా కబుర్లు అన్నీ మిగిలిపోతాయి

ఎప్పుడో ఒకప్పుడు  మళ్లీ పాత వాళ్ళు  వస్తారు," ఏంటి కబుర్లు, ఏమైనా చెప్పండి" అంటే ఏమి చెపుతాం.. ఇద్దరి మధ్యా ఉండే ముత్యాల దండలోని దారం తెగిపోయింది..ముత్యాలన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ ముత్యలన్నీ దండగా మార్చాలంటే కావలసినంత సమయం ఉండదుగా .. అందుకే వచ్చిన వాళ్ళని "ఏమైనా పని మీద వచ్చావా" అని అడగడంతోనే కబుర్లు మొదలు.. ఆఖరు కూడా..!

అందుకే ఇవన్నీ ఎందుకని మాట్లాడటం మానేసి - నా నీడనే ఒక మనిషి అయితే బాగుండని ఆశ!, నాతోనే ఉంటుంది, ఎన్ని కబుర్లు, ఎప్పుడయినా చెప్పుకోవచ్చు కదా అనిపిస్తుంది..ఎవరి గురించి చెప్పటం మొదలు పెట్టినా వాళ్ళెవరో నాకు తెలియదుగా అనదుగా...!
అందుకే నా నీడనే నా ఊహల్లో మనిషిగా చేసి కబుర్లు చెప్పుకుంటే సరిపోదా అని అనిపిస్తుంది....
"నీడకు చక్కని తిలకం దిద్దితే చెలి..
మీసకట్టు అద్దితే చెలికాడు అవుతాడు
"

అన్ని కబుర్లు పంచుకోవచ్చు కదా అనుకుంటున్నాను!

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!