విజయాలకి బాట...'వర్కింగ్ మెమొరీ ' (working memory)

జీవితంలో ప్రతికోణమూ వర్కింగ్ మెమొరీతో ముడిపడి ఉంటుంది. ఆ శక్తి అధికంగా ఉన్నవారు.. దీర్ఘకాలిక లక్ష్యాల మీదా అత్యున్నతమైన విజయాల మీదా దృష్టి పెడితే.. నామమాత్రంగా ఉన్నవారు తక్షణ లాభాలపైనా స్వల్పకాలిక ప్రయోజనాలపైనా మనసుపడుతున్నారని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనాల్లో వెల్లడైంది. బలమైన వర్కింగ్ మెమొరీ బలహీనతల్ని జయించే శక్తినీ ఇస్తుందంటారు. ఆలోచనల్లో స్పష్టత కారణంగా.. ఆ బలహీనతల ప్రభావాలు కళ్లముందు కదలాడతాయి. దీనితో చెడువైపు అడుగులేసే ప్రమాదం తప్పుతుంది.

'వర్కింగ్ మెమొరీ ' (working memory)అంటే..

వర్కింగ్ మెమొరీ చేయితిరిగిన లైబ్రేరియన్ లాంటిది. పనికొస్తుందనిపించే ప్రతి జ్ఞాపకాన్నీ చాలా జాగ్రత్తగా, చాలా ప్రత్యేకంగా భధ్రపరుస్తుంది. అనుభవాలన్నీ కలగాపులగమైపోకుండా ఓ కన్నేసి ఉంచుతుంది. ఎప్పుడు ఎలాంటి సమాచారం అవసరమైనా క్షణాల్లో మనముందు ఉంచుతుంది. దాన్నెంత సమర్థంగా ఉపయోగిస్తాం అన్నది మన చేతుల్లో ఉంటుంది.

మన మెదడులో బోలెడు సమాచారం ఉంటుంది. బోలెడంత విజ్ఞానం ఉంటుంది. కానీ, ఏం లాభం! పాత జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకోవడం తెలియకపొతే ఓటమిని గెలుపు సూత్రంగా మలుచుకొవడం చేతకాదు. అపుడు, అంజనమేసి గాలించినా జీవితాల్లో ఒక్క గెలుపూ కనిపించదు.
మన బుర్రలో ఎన్ని టన్నుల సమాచారం ఉందన్నది ముఖ్యం కాదు -  ఉన్న కొద్దోగొప్పో  సమాచారంనే సమస్యల పరిష్కారంలో, సంక్షోభాల నివారణలో, వృత్తి ఉద్యోగాల నిర్వహణలో ఎంత సమర్థంగా ఉంపయోగించామన్నది ముఖ్యం.ఆ నైపుణ్యమే 'వర్కింగ్ మెమొరీ '.

పరిష్కార మార్గాలకు దారి.. 'వర్కింగ్ మెమొరీ '

ఒక సమస్య ఎదురుకాగానే...గతంలో మనం ఎదుర్కొన్న అలాంటి సమస్యలన్నీ చకచకా కళ్లముందు తిరగాలి, ఒక సంక్షోభం ఢీకొట్టబోతోందన్న అనుమానం రాగానే...మన అనుభవాల పేటికలోంచి రకరకాల పరిష్కార మార్గాలు మనసులో మెదలాలి. మనం చదివిన పుస్తకాలూ మనకు తారసపడిన వ్యక్తులూ పరోక్షంగా గమనించిన సంఘటనలూ - పనికొచ్చే ప్రతి అంశం ఠక్కున గుర్తుకురావాలి. ఆ దిశగా... మెదడుకు శిక్షణ ఇవ్వాలి, కళ్లాలు బిగబట్టి సాధన చేయించాలి, అప్పుడిక.. పరిష్కారం దొరకని సమస్యలుండవు - ఇదో శాస్త్రీయమైన అభ్యాసం. ఉట్టి లోని పెరుగుబువ్వను దించుకుని తిన్నట్టూ కూజాలోని మంచినీళ్లను ఒంపుకొని తాగినట్టూ.. మెదడులోని సమాచారాన్ని సమస్య సందర్భాల్ని బట్టి సత్వరంగా, సమర్థంగా వాడుకోవడమే వర్కింగ్ మెమొరీ.

మెదడుకు అందుబాటులో ఉన్న గుణాంకాల్నీ,జ్ఞాపకాల్నీ చకచకా బేరీజువేసి చక్కని నిర్ణయం తీసుకునే శక్తి వర్కింగ్ మెమొరీతోనే సాధ్యం. 'వర్కింగ్ మెమొరీ ' మట్టిలోని  మాణిక్యం లాంటిది, మెరుగులు పెట్టుకోవాలి.

'వర్కింగ్ మెమొరీ ' మజ్జిగలోని వెన్న లాంటిది, మథనం చేయాలి. సాధన లేకుండానే కొద్దిమందికి ఒంటబట్టవచ్చు. సాధనతో అందరూ సొంతం చేసుకోవచ్చు. ఏ పజిలో చకచకా పూరించడం, చదరంగంలో అద్భుతమైన ఎత్తులు వేయడం.. ఇలా వర్కింగ్ మెమొరీతో ముడిపడిన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసినప్పుడు మెదడులోని వివిధ కేంద్రాలు చైతన్యవంతం అయినట్టు అధ్యయనాల్లో తేలింది.

సాధనతో సాధ్యం.. 'వర్కింగ్ మెమొరీ ' (working memory)

కొన్నేళ్ల క్రితం దాకా.. వర్కింగ్ వెమొరీ అనేది జన్మతః వచ్చేదనీ, చచ్చేదాకా  స్థిరంగా ఉంటుందనీ భావించేవారు. అదంతా అబద్ధమని తాజాగా తేలింది. పరిశోధకులు దాన్ని రబ్బరు బ్యాండుతో పోల్చారు. ఒకరి దగ్గర పెద్ద రబ్బరు బ్యాండు ఉండవచ్చు, మరొకరి దగ్గర చిన్న రబ్బరు బ్యాండు ఉందొచ్చు. కానీ, దేన్నయినా ఓ స్థాయి వరకూ సాగదీయడం సాధ్యమే - వర్కింగ్ మెమొరీ కూడా అంతే.. వర్కింగ్ మెమొరీ పెంచుకునే మార్గాలెన్నో.. పిల్లల నుంచి వయోధికుల దాకా.. ఎవరైనా ఆ దిశగా ప్రయత్నాలు సాగించవచ్చు. ఫలితాలు సాధించవచ్చు.

ప్రత్యేకంగా ఎవరో వచ్చి ప్రశ్నపత్రం ఇవ్వరు. వర్కింగ్ మెమొరీకి సంబంధించి ప్రశ్నలు మీరే తయారు చేసుకోండి. జవాబులు మీరే రాసుకోండి.. మార్కులూ మీరే ఇచ్చుకోండి ..ఫెయిలు అవ్వడం ఉండదు ఇందులో...మెరుగుపడుతూ ముందుకెళ్లడమే...

కొన్ని మీ కోసం చేసి చూడండి..

ఏదైనా కథల పుస్తకాన్ని తిరగేయండి. అందులో మీరు చూసిన బొమ్మల పేర్లు ఓ చోట రాయండి..
ఏదో సినిమాకు వెళ్లొస్తారు. ఒకటి రెండు రోజుల తర్వాత.. ఆ సినిమాలోని పాత్రలూ పాత్రధారుల పేర్లు ఓ చోట రాయండి..
బీరువాలోని చొక్కలో, చీరలో.. ఏ ఏ రంగుల్లో ఉన్నాయో గుర్తుతెచ్చుకుని రాయండి..
ఎప్పుడో చదివిన పుస్తకాన్ని గుర్తుతెచ్చుకొని సారాంశం రాయండి..
చదరంగం, సుడోకు, కొత్త వంటలు చేయడం, తెన్నిస్, ఫుట్ బాల్ వంటి క్రీడలు,పుస్తక పఠనం , ధ్యానం, కొత్త భాషలు నేర్చుకోవడం.. ఇవన్ని కూడా 'వర్కింగ్ మెమొరీ'ని మెరుగుపరుస్తాయి.

'వర్కింగ్ మెమొరీ ' తో సాధ్యమైన అసాధ్యం..
చిలీలోని ఓ బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. పాతికమంది దాకా భూగర్భంలో చిక్కుకుపోయారు.ప్రభుత్వం వారిని రక్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. మొత్తం అరవై తొమ్మిది రోజులు చిమ్మచీకటి తిండిలేదు. అడుగు ముందుకేసే ధైర్యం లేదు.నరకమంటే అదే! ఎలాగోలా ఆ గనికార్మికుల్ని బయటికి తీసుకొచ్చారు. అంతా చావుకు దగ్గర్లో ఉన్నారు. ఒకరు తప్ప. అతని పేరు మారుయో. అంత ఆతోగ్యంగా, అంత ధైర్యంగా ఎలా ఉన్నాడన్నది వైద్యులకూ అంతుచిక్కలేదు. 'పిచ్చిపిచ్చి ఆలోచనలతో బాధపడటం, తోటివారిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. హాయిగా జోకులేస్తూ గడిపాను. బయటపడ్డాక చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి ఆలోచించాను. చిన్నప్పుడు నేను పడకగదిలో నిద్రపోతూఉంటే, అమ్మానాన్నలు తాళమేసుకుని ఊరెళ్లిపొయారు. వచ్చేదాకా చీకటింట్లో గడిపాను. ఇదీ అలాంటి అనుభవమే అనుకున్నాను ' అని తాపీగా చెప్పాడు. అంతర్జాతీయ పత్రికలు అతన్ని 'సూపర్ మారియో' అని కీర్తించాయి. ఆ సూపర్ మారియో వెనుక సూపర్ 'వర్కింగ్ మెమొరీ' ఉందని చాలామందికి తెలియదు.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!