ఆమె లేచిపోయింది

ఓ రోజు కళ్ళు తెరిచిన ప్రపంచం ఉలిక్కిపడింది.

ఇంటి ముందు ఉండాల్సిన ఒక్క చెట్టు లేదు. వేళ్ళతో సహా పెకిలించినట్టు ఓ పెద్ద గుంత. అందరి ఇళ్ళ ముందు అదే పరిస్థితి. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అడవులు కూడా మాయం అయ్యాయి. పచ్చదనం మచ్చుకు కనిపించడం లేదు.  ప్రపంచం మొత్తం ఇంతే జరిగింది.


అదొక్కటే కాదు ఒక్క జంతువు లేదు. ఒక పక్షి లేదు. చెరువుల్లో,కుంటల్లో నీళ్ళు లేవు. సముద్రాలలో నీరు కూడా మాయం అయి అందులోని లోయలు, పర్వతాలు బయట పడ్డాయి. నీళ్ళలో ఉండే చేపలు కూడా కనిపించకుండా వెళ్ళిపోయాయి.  ఎవరెస్ట్ శిఖరం కన్నా పెద్ద దైన పర్వతం బయటపడింది ఓ చోట.



మనుషులు, యంత్రాలు మాత్రమే మిగిలిపోయాయి. అంతా  నిశ్శబ్దం, కాదు శూన్యం . ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. మనుషులు చచ్చిపోతూ ఉన్నారు ఒక్కొక్కరిగా.


ఎప్పుడు పెద్దగా పట్టించుకోని, ఇష్టానికి కలుషితం చేసే గాలి ఇప్పుడు కావాలినిపించింది. ఆ గాలిని ఇచ్చే పచ్చటి చెట్లు కావాలనిపించింది. పక్షుల కిల కిలలుకరువయ్యాయి. అంతా శూన్యం. సూర్యుడు వేడిగా నిప్పులు చెరుగుతున్నాడు. పెద్ద పెద్ద భవంతులు, వందల మీటర్లు ఎత్తున్న అపార్ట్ మెంట్ లు, కోట్ల విలువచేసే కార్లు,నగలు, డబ్బు, కంప్యూటర్ లు,సెల్ ఫోన్లు, అంతా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు వెక్కిరిస్తూ ఉన్నాయి.


దాహంతో నోరుఎండి పోతూ  ఉంది. తినడానికి కళ్ళ ముందు ఎన్ని ఉన్నా, తిరగడానికి పెద్ద పెద్ద కార్లు ఉన్నా, ఇంటి నిండా  బ్లాక్  మనీ, వేల కోట్ల ఆస్తులు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. ఇపుడు అందరు ఒకటే, అందరి ఆశా ఒకటే. ప్రకృతి మళ్ళీ వెనక్కి రావాలి. పచ్చని చెట్లు కావాలి, స్వచ్చమైన గాలి కావాలి, నీళ్ళు కావాలి ఇంకేం వద్దు.


పెద్దన్న గా చెప్పుకునే దేశంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేరే దేశాల్లోను పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. మనిషి ఎంతో విలువైనవి గా భావించే వన్నీ అల్పంగా కనపడుతున్నాయి. కళ్ళ ముందే కుటుంబసభ్యులు, ఆప్తులు, స్నేహితులు చచ్చిపోతున్నారు. చావు దగ్గరకి చేరిన కళ్ళలో తప్పు చేశామన్న భావన నీడలా కదులుతూ ఉంది. అంత స్మశానం, యుగాంతం.


తల్లి లాటి ప్రకృతిని తార్చిన బిడ్డలని వదిలి ఆ తల్లి తన దారి తను చూసుకుంది.. అవును ఆమె లేచిపోయింది.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!