ప్రతీ ఒక్కరికి ఇంకొకరికి సహాయం చేయగలిగే వీలు ఉంటుంది అది డబ్బు కావొచ్చు, మంచి మాట కావొచ్చు కానీ అలా చేయడం వల్ల అవతలి వాళ్ళు సంతోషించడం కూడా నచ్చని వ్యక్తులు కూడా ఉంటారు..ఒక అందమైన ముసుగు వేసుకొని... we are enjoying life అంటూ... అలాంటి వాళ్ళను చూసి నపుడు, కొంచెం మారితే ఎంత అద్బుతంగా ఉంటుంది అని మనసున ఆశ కలగడం సహజం....ఆ ఆశల కెరటమే నల్లమోతు శ్రీధర్ ఆర్టికల్.... కాలక్షేపపు జీవితాలు.
ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఐనా ఎపుడో ఒకప్పుడు చిన్న మాట పట్టింపుతో ప్రాణసమానం అనుకున్న వ్యక్తుల్ని వదులుకుంటారు, అందువల్ల ఇద్దరు వ్యక్తులు జీవితం అంతా మనసున నలిగిపోతూనే ఉంటారు, కానీ ఆ విషయాన్నీ నిజమని ఒప్పుకోడానికి ఎవరూ ఒక అడుగు ముందుకు వెయ్యరు...ఎందుకు ....మనసున్న మనం, మంచి వాళ్లమని నమ్మే మనం సరియైన దారి తెలిసి ఎందుకు దారి తప్పుతున్నాము...వీటికి సరియైన సమాధానానికి దారి చూపే నల్లమోతు శ్రీధర్ ఆర్టికల్ ...మనుషుల్ని కాదు మనసుల్ని గెలుద్దామిలా
ఎప్పటినుండో ఇప్పటివరకు ఒక స్త్రీ గురించి విశ్లేషణ ఒక కవి లేదా రచయిత చేయడమే కనిపిస్తుంది,,, అవి చదువుతున్నపుడు అసలు స్త్రీ యొక్క భావాలు పురుషుడు ఎంత అద్బుతంగా చెపుతున్నాడు..నిజంగా ఇంత అద్బుతంగా ఉంటుందా స్త్రీ మనోభావాలు అని మనసు పులకరించక తప్పదు..మనుషుల మనోభావాలు ఒడిసి పట్టుకొని అందులోని తప్పులని సరిచేసుకోవాలని ఆశల కెరటల్లాంటి ఆర్టికల్స్ రాసే నల్లమోతు శ్రీధర్ పెదవిపైని ఏ చిరునవ్వు మనసుని మీటిందో...అందంగా జాలువారింది ఇలా ...ఒక అద్బుతం..నల్లమోతు శ్రీధర్ ఆర్టికల్ ..అద్భుతమైన ప్రేమ కావ్యం
1.కాలక్షేపపు జీవితాలు
ఎందుకు బ్రతుకుతున్నామో తెలీదు.. రోజు గడిపేస్తే చాలు, ఏం చేస్తున్నావని అడిగే వారూ ఉండరు, ఏం చేయాలో చెప్పేవారూ ఉండరు. చనువు కొద్దీ ఎవరైనా “ఏదైనా సాధించొచ్చు కదా” అని చెప్పినా “చెప్పొచ్చార్లెండి కబుర్లూ, పనిచూసుకోండి” వంటి వెక్కిరింతపు ఛేష్టలు! నాకు మనుషుల్నీ, మనసుల్నీ తడిమిచూడడం చాలా ఇష్టం. అలా చూసేటప్పుడు ఇలాంటి మనుషులెందరో దృష్టికి వస్తున్నారు.
నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు బాగా గుర్తున్న, బాగా వంటబట్టించుకున్న ఒకే ఒక్క మాట.. “Underline your Life”. ఎందుకో ఆ వాక్యం నాకు ఎంతో నచ్చింది.. ఫ్యాన్సీగా వాడుకోవడానికి కాదు ప్రాక్టికల్ గా ఆచరించడానికి! ఎందరితోనో ఇంటరాక్ట్ అవుతుంటే వారి వారి చిన్న చిన్న సరదాల్ని, లక్ష్యాల్నీ వింటుంటే ఇంత పెద్ద జీవితంలో ఇంతేనా మనం కోరుకుంటున్నది అన్పిస్తుంటుంది. మనం కొన్నేళ్ల వయస్సు వచ్చాక గాలిలో ధూళిగా మాయమయ్యేది ఖాయమైనా.. అండం నుండి బ్రహ్మాంఢంగా ఎదిగే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం?
మనవల్ల వీసమెత్తయినా ఎవరికీ ఉపయోగం లేని జీవితాల్ని గడపడం వల్ల జీవితాలు తెల్లారిపోతాయేమో గానీ జీవితానికి అర్థమంటూ మాత్రం మిగలదు. “లక్ష్యాలూ, సోషల్ సర్వీస్ లూ, పరమార్థాలూ.. ఇవన్నీ ఏమిటి నాన్సెన్స్.. హాపీగా లైఫ్ ని ఎంజాయ్ చెయ్యక” అనే మాటల్ని నూటికి 90 మందిలో వింటున్నాను. డబ్బూ, కార్లూ, బంగ్లాలూ, పార్టీలూ, ఫ్రెండ్స్, ఉబుసుపోక పిచ్చాపాటీ కబుర్లూ ఇవే జీవితం, ఇవే ఎంజాయ్ మెంట్ అనుకుంటున్న తరానికి ఓ లక్ష్యం, ఓ సేవ ఇంకెంత సంతృప్తిని మిగుల్చుతుందో ఒక్కసారైనా చవిచూడకపోతే ఎలా అర్థమవుతుంది?
టెన్షన్లని లైట్ తీసుకుంటే ఫర్వాలేదు.. జీవితాన్నీ లైట్ తీసుకుంటే ఆ లైట్ కి వెలుగే కరువవుతుంది.
- నల్లమోతు శ్రీధర్ (January 11,2012 Hyderabad)
2. మనుషుల్ని కాదు మనసుల్ని గెలుద్దామిలా
ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నో మనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగా తేడా వస్తే చాలు.. ఎలాంటి సంజాయిషీలూ, క్షమించడాలూ లేకుండా క్షణకాలంలో వారికి దూరమైపోతున్నాం. ఓ మనస్పర్థ వస్తే చాలు.. తప్పయినా ఒప్పయినా మనం అనుసరించే పద్ధతే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతున్నాం. అందుకే మనసుల మధ్య ఏర్పడే అగాధాన్ని పూడ్చుకోవాల్సింది పోయి మొండిపట్టుదలతో బింకంగా హఠమేస్తున్నాం.. ‘మనకేం అవసరం.. వస్తే వాళ్లే వస్తారులే’ అన్న అహం కమ్ముకుపోతుంది. అంతా సక్రమంగా ఉన్నప్పుడు ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎంతో సాయం చేసుకుని ఉంటారు. ఓ చిన్న అపార్థం బుర్రని తొలవడం మొదలు.. ‘వాళ్లు మనకు చేసిందానికన్నా మనం వాళ్లకు ఎంతో సాయం చేశామని.. మనం లేనిదే వాళ్లకు జరుగుబాటు కాదని’ గత జ్ఞాపకాలను ప్రేమతో మానేసి ద్వేషంతో గుర్తుకుతెచ్చుకుంటాం. గతంలో అవతలి వారి చిరునవ్వులకు పులకించిపోయిన మనసు కాస్తా ద్వేషంతో ఆ జ్ఞాపకాలు గుర్తుకువచ్చినప్పుడు ఆ నవ్వులనే గుర్తు చేసుకుని మరీ చిటపటలాడుతుంది.
హ్యూమన్ సైకాలజీ, బాడీ లాంగ్వేజ్‌లు, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో మనుషుల మనసుల్ని త్వరగా గెలవగలిగే మెళుకువలు అలవర్చుకుంటున్నాం. కానీ అందులో ఎక్కడా చిక్కదనం లేదు. ఫైవ్‌స్టార్ హోటల్‌లో రిసెప్షనిస్ట్ నవ్వుకీ మన నవ్వుకీ తేడానే లేదు. రెండు నవ్వులూ అరక్షణమే విచ్చుకుంటాయి. అంతలోనే మూసుకుపోతాయి. కృత్రిమ హావభావాలతో కూడిన అచ్ఛమైన ప్రొఫెషలిజం! ఇంత సులభంగా మనుషులకు దగ్గరవగలిగే మనం, ఇంత సులభంగా మనల్ని మనం మార్కెట్ చేసుకోగలిగే మనం.. గాఢమైన అనుబంధాలను ఎందుకు పెనవేసుకోలేకపోతున్నాం? అందమైన చిరునవ్వులు, పొందికైన మాటలూ, ముచ్చటగొలిపే ముఖకవళికలు, ఆకర్షణీయమైన ఆహార్యం.. అన్నీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని మరీ నేర్చుకుంటున్నాం. ఎందరినో పరిచయం చేసుకుంటున్నాం, సాన్నిహిత్యం పెంచుకుంటున్నాం, అనుబంధపు మాయమాటలతో ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం.. రైలు ప్రయాణంలో స్టేషన్ వస్తే దిగిపోయే ప్రయాణీకుల్లా అంతే అవలీలగా తప్పుకుపోతున్నాం. మరో రైలు, మరో మజిలీ, మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది. కొత్త మనుషులు కలుస్తూనే ఉంటారు. అవసరాలు తీర్చేసుకుని ఏదో ఒక సాకుతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని దూరమవుతూనే ఉంటారు. స్నేహంలో అవసరాలు ఒక భాగం మాత్రమే.. అవసరాలు తీర్చుకోవడానికే స్నేహం ముసుగు వేసుకోవలసి వస్తే ఆ అవసరాలు తీరగానే ఆ స్నేహానికి నూకలు చెల్లినట్లే! అందుకే మనుషుల్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, సహకరించుకుందాం.. అంతే తప్ప మనుషుల్ని జీవితంలో పైకెదగడానికి పావులుగా వాడుకునే నైపుణ్యతలు ఎన్ని అలవర్చుకున్నా మనసులో స్వచ్ఛత లేనప్పుడు ఆ అనుబంధాలకు బలమెక్కడ?
- నల్లమోతు శ్రీధర్, కంప్యూటర్ ఎరా,ఎడిటర్ (January 15,3012 Hyderabad)
3. అద్భుతమైన ప్రేమ కావ్యం
ముందుగా చిన్న గమనిక: నాకు మానవ సంబంధాలన్నా, మనసుల మధ్య దోబూచులాడే చిన్న ఎమోషన్లన్నా చాలా ఇష్టం. ఆ నేపధ్యంలో కొందరు వ్యక్తుల్నీ, కొన్ని బంధాల్నీ గమనించిన తర్వాత రాసిన ఓ చిన్ని విశ్లేషణే ఇది. నా అభిప్రాయాల్లో తప్పొప్పులు ఉండొచ్చు. కానీ ఏదో ఒక క్షణం అన్పించిన ఆలోచన ఇలా రాసుకున్నాను. ఈ విషయంలో ఎలాంటి వాదోపవాదాలకూ నేను సిద్ధంగా లేను. ఇక విషయానికి వస్తే:
ఆడవాళ్ల మోములో కదలాడే కొన్ని ఎక్స్ ప్రెషన్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి.. ఓరచూపు, కొంటె నవ్వు, కనీకన్పించక మోముపై విరబూసే చిరు దరహాసం, అదిమిపెట్టుకున్నా బయటపడే సిగ్గు, పెదాల బిగింపులో బంధీ అయ్యే గడుసుదనం, క్షణకాలంలో ప్రత్యక్షమై మరుక్షణమే మాయమయ్యే నిర్లక్ష్యం, చెలికాడి హృదయాన్ని తడిమి చూడడానికి ఎక్కుపెట్టే లోతైన భావాతీతమైన కనుచూపు, కదలికలో మార్పులేకుండానే ఉన్న చోట నుండి నలుదిక్కులూ చుట్టివచ్చే సిక్త్ సెన్స్.. నిజంగా సృష్టికర్త అద్భుత సృష్టి ఆడవాళ్లు నిజమైన ఆనవాళ్లే. మగువ పలికించినన్ని భావాలు మగవాడు వ్యక్తపరచడానికి మాటలు కూడా చాలవు.
విభిన్నమైన అంశాల పట్ల మగువలకు చాలా నిగూఢమైన అభిప్రాయాలు, ముద్రలు మనోఫలకంపై ముద్రించబడి ఉంటాయి. సందర్భానుసారం అవి కొద్దోగొప్పో వారి హావభావాల ద్వారా వ్యక్తమవుతుంటాయి.. బయటకు వ్యక్తపడని మరెన్నో భావాలు.. అలా అంతర్లీనంగా ఎవరూ స్పృశించడానికి అంతుచిక్కని అద్భుతమైన పార్శ్యాలుగా ఆవిష్కృతం కాకుండా మిగిలిపోతూనే ఉంటాయి. పాపం మగవాడు బయటకు వ్యక్తమయ్యే ఆ కొద్దిపాటి భావాలతోనే మగువ మనసు లోతుని అంచనా వెయ్యాలని ఆపసోపాలు పడతాడు.
కొందరైతే సముద్రం లాంటి మగువ మనసు నుండి బయటకు తొంగిచూసే ఆ కొద్దిపాటి భావాలను సైతం ఒడిసిపట్టే నైపుణ్యత లేక.. అద్భుతమైన మగువ మనసు యొక్క మొదటి పుటనే చదవలేక మొండిగా జీవిస్తుంటారు. తనని గెలుచుకున్న మగవాడికి బంధీ అయి అతని రక్షణలో సేదదీరాలని మగువ మనసు ఉవ్విళ్లూరుతుంటుంది.. కానీ మగవాడు తాను గెలుచుకున్న వనితని కట్టు బానిసని చెయ్యాలని చూస్తుంటాడు. నిలువెల్లా ప్రేమతో తనను తాను అర్పించుకున్న మగువ మనసు లోతులను తడిమిచూసే నైపుణ్యత లేక.. మగువ తనని తాను మరిచిపోయి మగవాడి సాన్నిహిత్యంలో సేదదీరే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఆమె మనసులో ప్రేమను పాదుకొల్పవలసింది పోయి భౌతికంగా ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తాడు మగవాడు. దీంతో రెండు మనసుల మధ్య పెనవేసుకుపోవలసిన అలౌకికమైన అనుబంధం బిగిసీ బిగియకముందే సన్నగిల్లడం మొదలవుతుంది.
తమ భాగస్వామి మనసు పుటలను చదివి ఒకరికొకరు తన్మయత్వంతో మునిగితేలే అదృష్టం ప్రపంచంలో ఏ కొద్ది జంటలకో ఉంటుంది. మిగిలిన వారంతా ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ అది మనసు పై పొరల్లో సున్నితమైన కుటుంబ సంబంధాల కోసం, దాంపత్య సౌఖ్యం కోసం, సామాజిక అవసరాల కోసం ఒక నిర్థిష్టమైన ప్రమాణం వద్ద తమ భావాలను స్థిరీకరించుకుని ఇరువురు భాగస్వాములూ సమన్వయంతో సాగించే ప్రయాణమే. మగువల మనసుల్లో అంతర్లీనంగా ప్రవహించే భావాల ప్రవాహంలో తానూ మునిగితేలుతూ అంతటి అపూర్వమైన ప్రేమని మనసారా ఆస్వాదిస్తూ ఆ మగువ మనసులో మగవాడూ మమేకం అయినప్పుడే జీవితం అద్భుతమైన ప్రణయకావ్యం అవుతుంది.
- నల్లమోతు శ్రీధర్, కంప్యూటర్ ఎరా,ఎడిటర్ (January 24,2012, Hyderabad)