యువత షార్ట్ కట్.. క్రేజీ కెరీర్స్.. క్రేజీ బుక్స్..

జీవితంలో ఏదైనా పెద్ద కష్టమొస్తే భగవద్గీతనో, రామాయణాన్నో, భారతాన్నో చదివి పరిష్కారాన్ని వెతుక్కునేది పాతతరం. కాని, కొత్త తరానికి కష్టమొస్తే ఏం చేస్తోందో తెలుసా? డేల్‌కార్నెగీ, స్టీఫెన్‌కోవే, శివ్‌ఖేరా, రాబిన్‌శర్మ, రశ్మి బన్సాల్.. పుస్తకాల్ని కొని పరిష్కారాలను వెతుక్కుంటోంది. అందుకే, ఈ 'చిట్కా సాహిత్యం' అన్ని భాషల్లోకి అనువాదమై.. కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఆంగ్లంలో పాపులర్ అయిన వ్యక్తిత్వవికాసం, స్ఫూర్తి, ఆరోగ్యం, ఆహారం, ఆధ్యాత్మికం, యోగా వంటి పుస్తకాలన్నీ తెలుగు పాఠకులకు కొత్త రుచులను అందిస్తున్నాయి. అలాంటి పాపులర్ అనువాదాలపైనే మల్లెంపూటి ఆదినారాయణ వ్రాసిన 'యువ' బుక్స్ కవర్ స్టోరీ..

సుధాకర్ ఐఐటీ ఎంట్రన్స్‌లో టాప్ ర్యాంకర్. గణితంలో దిట్ట. అబిడ్స్‌లోని ఓ బుక్‌షాప్‌కొచ్చాడు. జిమ్‌హార్ట్‌నెస్, నీల్ ఎస్కెలిన్ రాసిన 'ద 24 అవర్ టర్న్ అరౌండ్'కి తెలుగు అనువాదం '24 గంటల్లో జీవితాన్ని మార్చుకోండి' పుస్తకాన్ని కొంటూ కనిపించాడు. 'ఇందులో మీకేం నచ్చింది' అనడిగితే- "నేను మెరిట్ స్టూడెంట్‌ను. కాని మా నాన్న చిన్నదానికీ పెద్దదానికీ 'నీకు చదువైతే బాగా అబ్బింది కాని, జీవితమంటేనే బొత్తిగా తెలీదురా! ఇలా కాదు బతకడమంటే?' అంటుంటాడు. అందుకే నేను ఇమ్మీడియట్‌గా ఛేంజ్ అవ్వాలి. జస్ట్, ట్వంటీఫోర్ అవర్స్ చాలదా నేను మారడానికి? ఈ పుస్తకం అదే కదా ప్రామిస్ చేస్తోంది. అందుకే కొంటున్నాను..'' అన్నాడు.
***
సురేఖ అనే అమ్మాయి లండన్‌లో ఎంఎస్ చేసి ఈ మధ్యనే హైదరాబాద్‌కు వచ్చింది. జంక్‌ఫుడ్‌కు బానిస కావడంతో బాగా ఒళ్లు చేసింది. 'తిండి పట్ల నిగ్రహం లేకపోతే కష్టం తల్లీ' అని వాళ్లమ్మ ఎంత చెప్పినా వినదు. అమ్మ మాటలకంటే- ఆంగ్లంలో రుజుతా దివేకర్ రాసిన 'డోంట్ లూస్ యువర్ మైండ్.. లూస్ యువర్ వెయిట్' తెలుగు అనువాదం 'మతి పోగొట్టుకోకండి.. బరువు తగ్గండి' పుస్తకం తెగ నచ్చేసిందా అమ్మాయికి. 'మీ పేరెంట్స్ ఇచ్చే గైడెన్స్ కంటే ఈ పుస్తకమే ఎక్కువ నచ్చిందా?' అనడిగితే- "పేరెంట్స్ చెప్పేవి చాలా రొటీన్‌గా ఉంటాయి. ఒక మ్యాగజైన్‌లో రుజుతా రాసే కాలమ్‌ను నేను ఫాలో అయ్యేదాన్ని. నేనే కాదు, కరీనాకపూర్, కొంకణాసేన్, అమృతా అరోరా కూడా ఆమెకు ఫ్యాన్స్. ఈ పుస్తకంలో ఏం తినాలో ఏం తినకూడదో ఈజీ టిప్స్ ఉన్నాయి.
***
పొద్దున్నే హార్లిక్స్ తాగినట్లు, మధ్యాహ్నం మాగీ తిన్నట్లు- అంతా 'రెడీమేడ్'. ఎవరో దారి చూపితేకాని నడవలేరు. ఇలా చేయమంటే కాని పని చేయలేరు. భావోద్వేగాల అనుభూతులు లేవు. జీవితపు లోతుపాతుల అనుభవం లేదు. చిన్న కష్టమొస్తే చిగురుటాకులా వణికిపోతారు. ఊహించని సంఘటనలు ఎదురైతే ఉప్పెనొచ్చింత ఇబ్బంది పడతారు. చిన్న చిన్న జీవన వ్యవహారాల్నీ నెరపడం చేతకాదు. కొత్తవాళ్లు ఇంటికొస్తున్నారంటే.. రెండ్రోజుల ముందు ట్రైనింగ్ ఇస్తే కాని పలకరించలేరు. స్నేహం చెయ్యాలంటే 'ఫ్రెండ్‌షిప్ ఎలా చెయ్యాలో?'లాంటి పుస్తకాలు తిరగెయ్యాలి. బంధుత్వపు వరుసల్ని 'క్లూస్' ఇస్తే కాని కనిపెట్టలేరు. 'మర్యాద ఇవ్వడం ఎలా?' చదివాకే పెద్దల్ని గౌరవించాలన్న జ్ఞానం వస్తుంది. ఈ తరానికి తిండి, చదువు, జీవితం- అన్నీ స్పూన్ ఫీడింగే. ఈ మార్పు వెనుక కారణాలేమైనా మళ్లీ కుటుంబం దగ్గరికే రావాల్సి వస్తుంది. ఉద్యోగుల్ని ఉత్పత్తి చేసే ఇన్‌స్టిట్యూట్లు ఎన్ని పుట్టుకొస్తున్నాయో.. మనిషిని తీర్చిదిద్దే ఫ్యామిలీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు (కుటుంబాలు) అన్నేసి మూతపడుతుండటమే ఈ పరిస్థితికి అతి పెద్ద కారణం.

మంచిచెడ్డలు విడమర్చి చెప్పాల్సిన ట్రయినర్స్ (తల్లిదండ్రులు)కు ఇప్పుడంత టైమ్ లేదు. తమంతకు తాము నేర్చుకునే జీవితమూ ఈ కాలం పిల్లలకు దొరకడం లేదు. దాని ఫలితమే రెడీమేడ్ జనరేషన్. అన్నీ ఇన్‌స్టంట్‌గా తెలుసుకోవాలనుకునే తరానికి- 'టిప్స్' చెప్పే పుస్తకాలు టక్కున ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవకు చెందినవే ఆంగ్లంలో పాపులరై తెలుగులోకి వస్తున్న ఈ అనువాదాలన్నీ, పాశ్చాత్య దేశాల్లో మానవ సంబంధాల్ని మెరుగుపరిచేందుకు వచ్చాయవి. దేశమేదైనా, రాష్ట్రమేదైనా.. అవే చదువులు. అదే పోటీతత్వం. అవే ఉద్యోగాలు. హర్రీబర్రీ జీవితం. "ప్రపంచీకరణ పుణ్యమాని ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ పాశ్చాత్య జీవనశైలి మొదలైంది. అందులో కొంత మంచి ఉన్నా, చెడే ఎక్కువుంది. ఉమ్మడిగా జీవించే మన సమాజంలో వ్యక్తికి ప్రాధాన్యం పెరిగింది. అందుకే, ఈ పుస్తకాలకు ప్రాంతీయ భాషల్లోనూ డిమాండ్ వచ్చింది..'' అంటున్నారు సామాజిక విశ్లేషకులు.

అనువాద పుస్తకాల్లో -డేల్‌కార్నెగి, స్టీఫెన్‌కోవే, పాల్ కొయిలో, జోసెఫ్ మర్ఫీ, శివ్‌ఖేరా, రాబర్ట్ కియోసాకి, రాబిన్‌శర్మ, రుజుతా దివేకర్, రశ్మీ బన్సాల్ వంటి పాపులర్ రచయితల పుస్తకాలే ఉంటున్నాయి. ఇలా తెలుగులోకి వచ్చిన వాటిలో.. వ్యక్తిత్వ వికాసం, స్ఫూర్తిగాథలు, జీవిత కథలు, ఆహారం- పోషక విలువలు, ఆధ్యాత్మిక పుస్తకాలకు మంచి గిరాకీ ఉందంటున్నారు పుస్తక విక్రేతలు. అందుకే, ఏ బుక్‌షాప్‌కు వెళ్లినా అవే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ముందు వరుసల్లో ఠీవిగా కనిపించే తెలుగు కథలు, కవితలు, నవలల స్థానంలో.. ఈ పాపులర్ పుస్తకాల తెలుగు అనువాదాలు కనిపిస్తున్నాయి. కథలు, కవితలు, నవలలకు ప్రత్యేక పాఠకవర్గం ఉన్నట్లే.. ఈ పుస్తకాలకూ ఓ ప్రత్యేక పాఠక వర్గం ఏర్పడింది.

వేటికి ఎంత డిమాండ్..?

వ్యక్తిగత, వృత్తిగత సమస్యలకు విలువైన పరిష్కారాలను సూచించే శివ్‌ఖేరా పుస్తకం 'యు కెన్ విన్' పద్నాలుగేళ్ల కిందట ఆంగ్లంలో వచ్చింది. లక్షల కాపీలు అమ్ముడైంది. అదే సమయంలో తెలుగులో కూడా వ్యక్తిత్వ వికాస పుస్తకాల ప్రభంజనం మొదలైంది. దీంతో 'మీరు విజయాన్ని సాధించగలరు' పేరుతో ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. తెలుగు అనువాదం ఇప్పటికి ఏడు ముద్రణలు పొందిందంటే దానికి ఎంతటి ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చు. "నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు కాలేజ్‌లో శివ్‌ఖేరా వీడియోలు చూసేవాణ్ణి. ఇప్పుడు టాక్స్ కన్సల్టెంట్‌గా చేస్తున్నాను. నాకు రోజుకొక కొత్త సమస్య వస్తుంటుంది. వాటిని ఈజీగా సాల్వ్ చేయాలంటే సెల్ఫ్‌మోటివేషన్ అవసరం. అందుకే మళ్లీ నేను శివ్‌ఖేరా పుస్తకాల్ని ఆశ్రయించాను. ఒకప్పుడు ఇంగ్లీషులో చదివాను. ఇప్పుడు తెలుగులో చదువుతుంటే సంతృప్తిగా ఉంటోంది..'' అన్నారు జింకా సుధీర్‌కుమార్.

డేల్ కార్నెగీ అమెరికాలో తొలితరం వ్యక్తిత్వ వికాస నిపుణులు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, పబ్లిక్ స్పీకింగ్, సేల్స్‌మన్‌షిప్ వగైరాల శిక్షణలో అనుభవజ్ఞుడు. పేద రైతు కుటుంబంలో పుట్టిన ఈయన 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్' అనే పుస్తకాన్ని 1936లో రాశారు. ఇప్పటికీ బెస్ట్‌సెల్లర్‌లలో ఒకటి. అది తెలుగులోకి ఈ మధ్యనే 'అందర్నీ ఆకట్టుకునే కళ' పేరుతో వచ్చింది. "ఒక బుక్‌షాప్‌కు వెళితే.. అక్కడున్న పుస్తకాల్ని బట్టి సమాజం ఎటువైపు వెళుతున్నదో చెప్పవచ్చు. పాఠకులంటే ప్రజలు. వాళ్ల ఆలోచనలకు తగ్గట్టు పుస్తకాలు వస్తుంటాయి. అనువాద పుస్తకాలు మోటివేషన్‌ను ఇవ్వవొచ్చు కాని అవి, జీవితాన్ని వ్యక్తిగతం వైపు తీసుకెళుతున్నాయి. దాన్నే మనం సక్సెస్ అని ముద్దుగా పిలుచుకుంటున్నాం..'' అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు.
డేల్‌కార్నెగీ రాసిన అలాంటిదే మరో పుస్తకం 'హౌ టు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్'. తెలుగులో 'ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు' పేరుతో వచ్చింది. యువతలో, ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువయ్యేకొద్దీ ఇలాంటి పుస్తకాలకు ఆదరణ ఎక్కువవుతోంది.

విన్ ఫార్ములాదే విజయం..


'ఎదుటి వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. నిత్యం మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రతి ఒక్కరిలోనూ విజయాన్ని సాధించే స్వభావం ఉంటుంది. అందరితో కలిసి పనిచేసే మనస్తత్వాన్ని అలవర్చుకోండి...' ఇవన్నీ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు స్టీఫెన్ ఆర్. కోవే చెబితేనే తెలిసినవి కావు. తెలుగు నీతి పద్యాలు, శతకాలు, పురాణ, జానపద కథలూ ఇదే నీతిని బోధిస్తాయి. అయితే, మారుతున్న కాలానికి తగ్గట్టు చెబితే ఆసక్తి చూపిస్తారు పాఠకులు. అదే పని చేశారు కోవే. కొన్నేళ్ల కిందట 'ద సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్' అనే పుస్తకం రాశారు. ఇది 38 భాషల్లో ప్రచురితం అయ్యింది.

కోటిన్నర ప్రతులు అమ్ముడై.. వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో ఒక సంచలనం సృష్టించింది. మంజుల్ పబ్లిషింగ్ హౌస్ 'అత్యంత ప్రభావశీలుర 7 అలవాట్లు' పేరుతో దీన్ని తెలుగులోకి తెచ్చింది. ఇప్పటికి నాలుగు ముద్రణలు పూర్తి చేసుకుంది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడల్లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లోని బుక్‌షాప్స్‌లలోనూ ఈ పుస్తకానికి డిమాండ్ ఏర్పడింది. రాజధానిలోని కోఠీ, అబిడ్స్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వంటి రద్దీ కూడళ్లలో కూడా ఈ స్టీఫెన్ కోవే తెలుగు పుస్తకం తప్పక కనిపిస్తుంది. "కుటుంబ పునాదుల మీద వ్యక్తిత్వాన్ని నిర్మించుకోమంటున్న కోవే ఫిలాసఫీ ఇవాళ అన్ని భాషల పాఠకులకు అవసరం. ఆయన రెండొందల మంది విజేతల పుస్తకాలు చదివి దీన్ని రాశారట! అందుకే తెలుగు అనువాదాన్ని ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను..'' అన్నారు ఎమ్మెస్సీ చేస్తున్న ఆర్.కవిత.

తెలుగులో రాబిన్‌శర్మ హిట్..


భారతం, భాగవతం చదవడం కొత్తతరానికి కష్టమే కాని, రాబిన్‌శర్మ పుస్తకాలు చదవడమంటే మాత్రం వాళ్లందరికీ బోల్డంత ఇష్టం. కెనడాకు చెందిన ఈ నిపుణుడు 'శర్మ లీడర్‌షిప్ ఇంటర్నేషనల్ ఇన్‌కార్పొరేషన్' అనే గ్లోబల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు. ప్రపంచంలోని టాప్-5 లీడర్‌షిప్ గురువుల్లో ఒకరు. మెక్రోసాఫ్ట్, జీఈ, నైక్, ఐబీఎం వంటి అగ్రశ్రేణి సంస్థల ఉద్యోగులకు మోటివేషన్ క్లాసులు చెబుతుంటారు. భారతీయాత్మ పునాదుల మీద స్ఫూర్తిని రగిలించే పుస్తకాల్ని రాశారు. ఇప్పటివరకు వచ్చిన ఆయన 11 పుస్తకాలు అరవై దేశాల్లో డెబ్బయి భాషల్లో ప్రచురితం అయ్యాయి. వాటిలో 'ద మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ' శర్మకు ఎక్కడలేని పేరు తెచ్చిపెట్టింది. ఏకంగా పది లక్షల పాఠకుల చేతుల్లోకి వెళ్లగలిగింది. ఇంత ప్రాచుర్యం పొందిన ఈ పుస్తకాన్ని.. 'ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం' పేరుతో తెలుగులోకి తీసుకొచ్చింది జైకో పబ్లిషింగ్ హౌస్.

తెలుగులోనూ ఇరవై వేల పుస్తకాలు అమ్ముడుపోవడం చెప్పుకోదగ్గ విషయం. ఈ పుస్తకాలకు ఎందుకింత క్రేజ్ వచ్చిందంటే "మా చిన్నప్పుడు పాఠశాలల్లో వారానికి ఒక మోరల్ క్లాస్ పెట్టేవాళ్లు. అందులో కథలు, పద్యాలు, శతకాలు బోధించేవారు. వాటిలో నుంచి నీతిని గ్రహించడం వల్ల క్యారెక్టర్ డెవలప్ అయ్యేది. ఆ తర్వాత తెలుగు సాహిత్యం చదివితే హోలిస్టిక్ ఆటిట్యూడ్ (సమాజాన్ని అన్ని కోణాల నుంచి అర్థం చేసుకోగల వైఖరి) అలవడేది. ఇప్పుడు సక్సెస్, గోల్‌సెట్టింగ్, ప్లానింగ్, టైమ్ మేనేజ్‌మెంట్ అంటున్నాం. ఇవన్నీ వ్యక్తిగత కోణాన్ని పెంచేవి. ప్రపంచీకరణలో వ్యక్తినిష్టే ముఖ్యమైపోయిందనడానికి ఈ మార్పు ఒక్కటి చాలు. అందుకే, ఈ తరహా పుస్తకాలకు ఇప్పుడింత డిమాండ్..'' అంటున్నారు రాబిన్‌శర్మ పుస్తకాలను తెలుగులోకి అనువదించిన డాక్టర్. సి.మృణాళిని. శర్మ రాసిన మరో పుస్తకం 'హూ విల్ క్రయ్ వెన్ యు డై' కూడా తెలుగులో 'మనీషిగా జీవించి మరణాన్ని జయించు' పేరుతో ఆదరణ పొందింది. తెలుగు అనువాదం తొమ్మిది ముద్రణలకు నోచుకుంది.

జీవితంలోని అతి క్లిష్టమైన సమస్యలకు 101 పరిష్కారాలను చెబుతుందీ పుస్తకం. ఇవన్నీ రోజువారీ జీవితానికి సంబంధించినవి. ఆఫీసు ఒత్తిళ్లను అధిగమించడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి భోంచేయడం.. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాయో ఈ పుస్తకం ఆసక్తికరంగా విశ్లేషిస్తుంది. బిజీలైఫ్ గడిపే వారికి ఇవన్నీ చిట్కాల్లా పనికొస్తున్నాయి. ఇదే రచయిత రాసిన 'ఫ్యామిలీ విజ్‌డం' 'కుటుంబ పరిజ్ఞానం' పేరుతో.. 'ద గ్రేట్‌నెస్ గైడ్' 'మహోన్నతికి మార్గదర్శకాలు' పేరుతో.. 'ద లీడర్ హూ హ్యాడ్ నో టైటిల్స్' 'పదవులతో ప్రమేయం లేని నాయకుడు' పేరుతో తెలుగులోకి వచ్చాయి.

క్రేజీ కెరీర్స్.. క్రేజీ బుక్స్..


ఒకప్పుడు ఇంజనీరింగ్, వైద్య వృత్తులకు క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఐఐటీ, ఐఐఎంలు హైజాక్ చేశాయి. అదరగొట్టే శాలరీ ప్యాకేజ్‌లతో కొత్త తరాన్ని ఊరిస్తున్నాయి. క్యాంపస్‌ల నుంచి బయటికొచ్చిన ఎంతోమంది పట్టభద్రులు.. కొత్త ఆలోచనలతో వ్యాపారాల్లోనూ ప్రవేశించి విజయం సాధించారు. భిన్నంగా నడవాలనుకునే యువతకు ఈ కథలంటే ఎంతిష్టమో 'స్టే హంగ్రీ స్టే పూలిష్' అమ్మకాలే చెబుతున్నాయి. 'యూత్ కర్రీ' అనే బ్లాగ్‌లో యువత దృక్పథాలు, కెరీర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ గురించి చర్చించే రశ్మీబన్సాల్ రాశారీ పుస్తకాన్ని. అత్యధిక వేతనాలొచ్చే ఉద్యోగాల్ని వదిలిపెట్టిన పాతికమంది మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు.. కంపెనీలను నెలకొల్పి, ఎలా పేరుతెచ్చుకున్నారో చెబుతుంది స్టే హంగ్రీ స్టే పూలిష్. తెలుగులో 'వారిలా కలగనండి.. వారిలా సాధించండి' పేరుతో వాడ్రేవు చినవీరభద్రుడు అనువదించారు. ఈ పుస్తకం పాఠకుల్ని ఆకట్టుకోవడంతో... రశ్మీ రాసిన మరో పుస్తకం 'కనెక్ట్ డాట్స్'నూ 'విజయాల చుక్కల్ని కలపండి' పేరుతో ప్రచురించారు. గొడవర్తి సత్యమూర్తి దీని అనువాదకులు. ఈ పుస్తకంలో ఎంబీఏ చదవని వ్యాపారవేత్తల విజయాల గురించి రాశారు.

అనువాదాల్లో.. చేతన్‌భగత్ నవలలు కూడా తెలుగు యువపాఠకుల్ని కట్టిపడేస్తున్నాయి. 'ఫైవ్ పాయింట్ సమ్‌వన్' పుస్తకాన్ని 'ఐఐటీలో అత్తెసరుగాళ్లు' పేరుతో రీమ్ పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది. ఇప్పటికే రెండు ముద్రణలు పూర్తి చేసుకుని.. మూడో ముద్రణగా మార్కెట్‌లో ఉంది. 'వన్ నైట్ అట్ ద కాల్ సెంటర్'ను అదే పేరుతో తెలుగులోకి తీసుకుచ్చారు. 'ద త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్' తెలుగులో 'నా జీవితంలో మూడు పొరపాట్లు' పేరుతో ప్రచురితం అయ్యింది. ఈ పుస్తకాలను ఆర్.శాంతసుందరి అనువదించారు. "చేతన్ కొత్త తరం రచయిత. ఐఐటీ, ఐఐఎంల నుంచి వచ్చినవాడు. యువత అంతరంగం తెలిసిన వాడు. వాళ్ల ఆకాంక్షలు, ఆలోచనలకు ఆయన నవలలు అద్దం పడతాయి. చేతన్ నవలలతో కొత్త పాఠకులు తయారయ్యారు'' అంటున్నారు అనువాదకులు. పాల్ కొయిలో రాసిన 'అల్‌కెమిస్ట్' తెలుగులో 'పరుసవేది'గా పాఠకుల ముందుకొచ్చింది. "ఈ పుస్తకాన్ని కొత్తతరం ఇష్టపడి చదువుతోంది. కొందరు పిల్లలైతే వాళ్ల తల్లిదండ్రులకు దీన్ని రెకమెండ్ చేస్తున్నారు..'' అన్నారు తెలుగులోకి అనువాదం చేసిన 'మంచి పుస్తకం' ప్రచురణ సంస్థ అధినేత కె.సురేష్. ఇప్పటివరకు ఈ పుస్తకం ఆరువేల కాపీలు అమ్ముడైంది.

ప్రచురణ సంస్థలూ దిగుమతి..


ఈ తరహా అనువాద పుస్తకాల్లో మరో చెప్పుకోదగ్గ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్'. రాబర్ట్ కియోసాకి రాసిన ఈ నవల ఆంగ్లంలో వచ్చే పదేళ్లకు పైన అవుతోంది. కియోసాకి ఓ అమెరికన్ ఇన్వెస్టర్. వ్యాపారవేత్త. ఫైనాన్షియల్ లిటరసీ ఆక్టివిస్ట్. ఆయన రాసిన పదిహేను పుస్తకాలు 26 మిలియన్ల కాపీలు అమ్ముడుపోవడం ఒక రికార్డు. రిచ్‌డాడ్‌లో 'సంపాదన కూడా ఒక సెలబ్రేషన్'గా చెప్పడం యువతను ఆలోచింపజేసింది. ఈ తరం స్వభావాల్లో ఎర్నింగ్ అన్నది ప్రాధాన్యమున్న అంశం కాబట్టి.. ఈ పుస్తకం చాలా భాషల్లో వచ్చినట్లే తెలుగులోనూ వచ్చింది. ఈయనే రాసిన 'బిజినెస్ స్కూల్'కి కూడా తెలుగు అనువాదమొచ్చింది. అనువాదాల్లో బాగా అమ్ముడుపోయిన మరో పుస్తకం అబ్దుల్‌కలాం జీవిత చరిత్ర.. 'ఒక విజేత ఆత్మకథ'. ఆంగ్లంలో 'వింగ్స్ ఆఫ్ ఫైర్'. అనువాదాల్లో 'విజయం-స్ఫూర్తి' పుస్తకాల తర్వాత ఆధ్యాత్మికం, యోగా, న్యూట్రిషన్, కుక్‌బుక్స్, జీవిత చరిత్రలకు ఎక్కువ గిరాకీ ఉందంటున్నారు పుస్తక దుకాణదారులు.

"ఒక్కోసారి తాజా సంఘటనలను ఆధారం చేసుకుని వచ్చే అనువాదాలు కూడా బాగానే అమ్ముడవుతున్నాయి. సోనియాగాంధీ విదేశీయత, అయోధ్య గొడవలు చర్చనీయాంశాలు అయ్యాక వచ్చిన పుస్తకాల్ని తెలుగులోకి తీసుకొచ్చాం. పాఠకుల నుంచి మంచి స్పందనే వచ్చింది..'' అన్నారు అలకనంద ప్రచురణ సంస్థ నిర్వాహకులు అశోక్‌కుమార్. ఇదే సంస్థ - సుధామూర్తి రాసిన 'హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్' పుస్తకాన్ని 'అమ్మమ్మ చదువు' పేరుతో తెలుగు అనువాదాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ పుస్తకం యువతరాన్ని ఆకట్టుకుంది.

పాపులర్ బుక్స్‌కు ప్రాంతీయ భాషల్లో డిమాండ్ ఏర్పడటంతో.. పేరున్న పబ్లిషింగ్ హౌస్‌లన్నీ ఈ రంగంలోకి వస్తున్నాయి. జైౖకో, మంజుల్, రీమ్స్, పియర్సన్, మాక్‌మిలన్, డైమండ్, పారగాన్ వంటి సంస్థలు ఈ తరహా పాపులర్ బుక్స్‌ను తెలుగులో ప్రచురించాయి. వీటి మధ్య పోటీ కూడా పెరిగింది. తెలుగు ముద్రణ సంస్థలు ఎప్పటి నుంచో అనువాదాల్ని వేస్తున్నా.. అవి ప్రధానంగా సాహిత్య సంబంధమైనవి. పాపులర్ పుస్తకాల్ని తెలుగులోకి తీసుకురావడం వాళ్లకు కష్టమవుతోంది. ఎందుకంటే ఉత్తరాది పుస్తక ప్రచురణ సంస్థలకు ఒక సౌలభ్యం ఉంది. ఒకేసారి నాలుగైదు ప్రాంతీయ భాషల్లో ప్రచురణ హక్కుల్ని తీసుకుని, అనువాద పుస్తకాలను వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పలు భాషల్లో ఎక్కువ పుస్తకాల్ని అమ్ముకునే వీలుంది. ఉత్తరాది సంస్థలొచ్చాక.. అనువాదకులకు రెగ్యులర్ పేమెంట్ అందుతోంది. తర్జుమా చేసినందుకు పుస్తకంలోని ఒక్కో పేజీకి.. డెబ్భై నుంచి వంద రూపాయలను ఇస్తున్నారు.

అనువాద పుస్తకాలన్నీ పాఠకుల ఆదరణ పొందడం లేదు. "ఏ పుస్తకమైనా ఆ పుస్తకానికి ఉండగల పాఠకులలో ఎనభై శాతం మంది చదివితే అది పాపులర్ అయినట్లు'' అంటారు ఎమెస్కో నిర్వాహకులు విజయకుమార్. "ఆ లెక్కన తీసుకుంటే ఆంగ్లంలో పాపులరై తెలుగులోకి వస్తున్న పుస్తకాల పరిధి చాలా తక్కువ. ఈ మధ్యనే ఇవి హడావిడి చేస్తున్నాయి. ఇలాంటి పుస్తకాల్లో వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక పుస్తకాలే కొంతవరకు అమ్ముడవుతున్నాయి..'' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే, ఆంగ్లంలో ఏ పుస్తకానికి పేరొచ్చినా "తెలుగు అనువాద హక్కుల్ని తీసుకున్నాం. మీరు అనువాదం మొదలుపెడితే తెలుగులో ముద్రిస్తాం...'' అంటూ అనువాదకులకు ఫోన్లు చేస్తున్న ముద్రణసంస్థలూ పెరిగిపోతున్నాయి. మొత్తానికి పుస్తకదుకాణాల్లో పరిశీలిస్తే.. ఈ పుస్తకాల్ని కొంటున్న వారంతా యువతరమే అని అర్థమవుతుంది. సామాజిక మార్పును బట్టే ఏ ట్రెండ్ అయినా కొంత కాలం నడుస్తుంది. పాపులర్ అనువాదాలు కూడా ఎంత కాలం సందడి చేస్తాయో చూడాలి మరి!

అనువాదకులకూ అభిమానులు


నా డేల్‌కార్నెగీ తెలుగు అనువాదాల్ని చదివిన పాఠకులు ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తుంటారు. అనువాదకులకు కూడా అభిమానులు ఏర్పడటం సంతోషించే విషయం. ఇన్ని పుస్తకాల్ని నేను అనువాదం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి మానాన్న కొడవటిగంటి కుటుంబరావుతో కలిసి ఢిల్లీ వెళ్లాను. అక్కడ హరివంశరాయ్ బచ్చన్ (అమితాబ్ తండ్రి)ని కలిసే అవకాశం వచ్చింది. బచ్చన్ సాహిత్య అభిమానిని నేను. మా ఇద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు కూడా నడిచేవి. హిందీలో నా శైలిని గమనించిన ఆయన... 'మీరు అనువాదాలను ఎందుకు చేయకూడదు?' అన్నారొకరోజున. అలా హిందీ అనువాదాల్ని మొదలు పెట్టాను. ఆ తర్వాత కొందరు పబ్లిషర్స్ నన్ను సంప్రదించడంతో.. అప్పటి నుంచి ఆంగ్ల పుస్తకాల్ని తెలుగు చేస్తున్నాను. ఇప్పటికే జోసఫ్ మర్ఫీ, బ్రియాన్ ట్రేసీ, రుజుతా దివేకర్, రోండా బర్న్, రాబర్ట్ కియోసాకి పుస్తకాల్ని తెలుగులోకి అనువాదం చేశాను.
- శాంతసుందరి, హైదరాబాద్

మందుగోలీల్లాంటివి...


జనం ఎవరూ సాహిత్యం చదవటం లేదు కాబట్టే.. ఈ పుస్తకాలకు డిమాండ్ వచ్చింది. వ్యక్తి వికాసానికి పాఠశాల, కుటుంబం రెండూ కీలకమైనవి. అవి ఇప్పుడు పిల్లల్ని కేవలం మార్కులు ఉత్పత్తి చేసే యంత్రాలుగా మార్చేశాయి. అందుకే ఈ తరానికి ఏది మంచి ఏది చెడు అనేది అర్థం కావడం లేదు. అన్నీ సంక్లిష్టంగానే అనిపిస్తున్నాయి. సమస్యల నుంచి బయట పడాలంటే.. ట్యాబ్‌లెట్స్‌లాంటి పాపులర్ పుస్తకాల్ని ఆశ్రయిస్తున్నారు. వీటివల్ల వ్యక్తి కెరీర్‌లో 'సెటిల్' అవుతాడేమో కాని, సమాజానికి అవసరమైన వ్యక్తిగా ఎదగలేడు. అయితే, అడ్డంకుల్ని దాటుకొని ముందుకెళ్లే సామర్థ్యం వస్తుంది. దీన్నే మనం సక్సెస్ అంటున్నాం. నా దృష్టిలో 'సక్సెస్ ఫార్ములా'ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేకంటే, మన తెలుగు సాహిత్యం, పురాణాలు, ఇతిహాసాల్లోని పాత్రల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని.. స్ఫూర్తినింపే సాహిత్యం విడిగా వస్తే బావుంటుంది.
- సి.మృణాళిని, తెలుగు విశ్వవిద్యాలయం

అమ్మకాలు పెరిగాయ్...!


జీవితంలో పైకి రావాలి. ఎలా రావాలి? చుట్టూ ఉన్న వాళ్లని ప్రభావితం చెయ్యాలి. సామాజిక సంబంధాల్ని ఏర్పరుచుకోవాలి. సంపాదన మార్గాల్ని అన్వేషించాలి. కెరీర్‌లో దూసుకెళ్లాలి. ఇవే నేటి యువత దృక్పథాలు. దాన్ని మార్కెట్ చేసుకోవడానికి వస్తున్నాయి పాపులర్ పుస్తకాలు. యువతకు ఎంతోకొంత ఉపయోగపడుతున్నాయి కాని ఈ మార్పుకు దారితీసిన సామాజిక కారణాలను పరిశీలిస్తే బాధ కలుగుతుంది. 'నాకేంటి ప్రయోజనం' చుట్టూ తిరిగే పుస్తకాలే ఇవన్నీ. మన భాష, చరిత్ర, సంస్కృతి తెలుసుకొని, జీవితాన్ని మలుచుకోవడానికి ఎంతవరకు పనికొస్తాయంటే.. సమాధానం చెప్పలేము. పాఠకులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో పుస్తక విక్రేతలకు ఈ ట్రెండ్ కొంతవరకు కలిసివస్తోంది. గత ఏడాది హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్‌లో మేము అన్ని రకాలవీ కలిపి రూ.5 లక్షల విలువ చేసే పుస్తకాల్ని విక్రయిస్తే, ఈ ఏడాది రూ.16 లక్షలు విలువ చేసే పుస్తకాల్ని అమ్మగలిగాం.
- ఈశ్వర్‌రెడ్డి, మేనేజర్, విశాలాంధ్ర బుక్ హౌస్


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!