ఆనందానికి ఆది గురువు

ఇష్టం చాలా చిన్న పదం, కానీ ఆ పదం వెనుకు ఉన్న భావాలు అనంతం. ప్రతీ మనిషికి తనకు నచ్చింది చెప్పడానికి  వాడే పదం 'ఇష్టం'. మనలో చదువు సంస్కారం, అభివృద్ధి, ఆలోచనా పరిధి పెరిగే కొద్ది .. అభిమానము ఆప్యాయత,అనురాగం, ప్రేమ యిలా మనము వాడేపదాలు చాలా ఉంటాయి. పుట్టకతో వచ్చే చిరునవ్వులా ప్రతీ వారికి అనుభవంలోకి వచ్చే పదం 'ఇష్టం...'

ప్రతీవారికి ఇష్టాలు మారిపోతూ ఉంటాయి కాలంతోపాటు....కొన్ని ఇష్టాలు కాలం ఒడిలో కరిగిపోతాయి, మరికొన్ని తీపిగుర్తుగా మిగిలిపోతాయి, కొన్ని బాల్యంలోని మధురిమలై నిలచిపోతాయి మరి కొన్ని కాలానికి ఎదురీది మనతో పాటు సాగుతూ మనవ్యక్తిత్వం లో భాగంగా మిగిలిపోతాయి..

చిన్నపుడు ఏమీ ఇష్టం అని ఒక చిన్న ప్రశ్న వేస్తె చాలు చేంతాడు అంత పెద్ద జవాబు ఉండేది.. బిస్కెట్, కారప్పూస, బందరులడ్డు, చందమామ పుస్తకం, చిన్నాన్న, పెదమామయ్య, ఎదురింటి అమ్మాయి, పోట్లాడే అబ్బాయి, ఇసుకలో పిచుక గూళ్ళు, రంగు రాళ్ళు, అబ్బో అవి ఇవి అని కాదు ఎన్నో ఎన్నెన్నో..వీటిలో ఏది వదులుకోవాలనిపించదు. ఇవి ఏవి జీవితమంతా మనతో ఉండవేమో అన్న బెంగా కూడా ఉండదు ఎందుకంటే మనం ఇష్టపడేవి మననుంచి  వీడిపోతాయి అన్న ఆలోచన అణుమాత్రం కూడా ఉండదు కాబట్టి.

చిన్నపుడు నెమలిఈక  ఆంటే ఇష్టపడనివాళ్ళు ఉండరు .. దాన్ని చూసినప్పుడల్లా చెప్పలేని ఆనందం, దాన్ని ఒక నలగని పుస్తకంలో దాయడం, దానికి ఆహారం అని ఏదో క్రోటన్ మొక్క ఆకులు వెతుక్కొచ్చి మరీ వేయడం, ఒక విధంగా చెప్పాలంటే ఇష్టానికి మనం పెట్టిన పెట్టుబడి, అందుకే నెమలి ఈక చిన్నప్పటి ఇష్టం ఎందరికో.. ఇసుకలో పిచ్చుకగూళ్ళు పెద్ద ప్రహాసనం, స్నేహితులనందరిని పోగుచేయడం, ఎవరు పెద్ద గూడు కడతారో అని పందెం, ఇంటికెళ్ళాక తలనిండా ఇసుకపోసుకున్నందుకు అమ్మతో తిట్లు..ఇంకా పెదమామయ్య తెచ్చె చెరుకుగడల కోసం, అమ్మమ్మ చెప్పే కథల కోసం వేసవిసేలవులకై ఎదురుచూపు.. ఇవ్వన్ని కాలం వొడిలో బాల్యస్మృతులుగా మిగిలిపోతాయి..వీటన్నిటిమద్య  కొన్ని మనతో ఇంకొంతకాలం మనుగడ సాగిస్తాయి. కొందరికి బందరు లడ్డు కావోచ్చు, వేరొకరికి చందమామ పుస్తకం అవ్వొచ్చు, ఇంకొందరికి స్నేహితులు కావొచ్చు..

ఇష్టం అన్న పదానికి నీ మనసుకి తగిన వివరణ ఇచ్చే నిఘంటువు ఏది లేదు, పొద్దుటే కాఫీ తాగడం ఇష్టం కానీ పొద్దుటే ఎక్కడ  అంత తీరికా అంటారు, పాటలు వినడం ఇష్టం ఐనా మా ఇంట్లో ఎవరికీ ఇష్టం ఉండదండి అంటారు, మార్నింగ్ వాక్ చాలా బాగుంటుంద౦డి లేవడం కుదరడంలేదు అంటారు.. ఇలా బద్దకంతో కొన్ని, మన ఇష్టం కన్నా అవతలివారి అవసరాలు మిన్నగా అనిపించి కొన్ని వదులుకుంటూనే ఉంటాము జీవితమంతా...

అన్ని ఇష్టాలకు మనము మాత్రమే ఇష్టపడితే సరిపోదు. కొన్నిటికి మన అనుకున్నవాళ్ళ ఇష్టం కూడా తోడూ కావాలి.. మొక్కలు పెంచడం ఇష్టం అంటూ నువ్వు అనుకుంటే సరిపోదు నీతో ఉండేవారిలో ఒక్కరికైనా అందులో ఆశక్తి అయినా ఉండాలి, లేకుంటే నువ్వు నాలుగురోజులు జ్వరం అంటూ పడక వేస్తె ఆ మొక్కలు నిలువునా ఎండిపోయి దర్శనమిస్తాయి..అలాంటప్పుడు నీ ఇష్టం నీ కళ్ళముందే కరిగిపోక తప్పదు.

కొన్ని ఇష్టాలకి పెట్టుబడి పెట్టకుండా జారవిడుస్తాం, కొన్ని ఇష్టాలను వేరెవరికోసమో వదులుకుంటాము, కొన్ని ఇష్టాలు మనకు తెలియకుండానే మనని వదిలి వెళతాయి. చాలా ఇష్టాలను..మనమే మరచిపోతాం జీవితపు పరుగుపందెంలో...ఎన్ని వదులుకుంటున్న, ఎవరిని కదిపినా ఇష్టాలనేవి నాకు మాత్రం ఏమి లేవు ..  అని చెప్పే మనిషి మాత్రం ఎక్కడ ఉండరు.

మీ జ్ఞాపకాల అరల్లో ఒకసారి సున్నితంగా మీ అరచేత్తో వెతికి చూడండి. మీ ఇష్టాలన్ని ఒక్కసారి గుర్తుకుతెచ్చుకొని..మీరు అందుకోగలవన్ని అందుకోడం మొదలెట్టండి, పంచగలిగినన్ని అందరికి పంచండి, రెండు నెలలు తిరక్కుండానే మిమ్మల్ని ఏమి ఇష్టం అని అడిగితే చేంతాడంత లిస్టు రాకపోతే చూడండి.

'ఇష్టం' అన్నది అద్బుతమైన మీ అంతరంగ సహచరుడు, మీ ఆనందానికి తొలి గురువు అన్నది మర్చిపోకండి..

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!