మనసులోని మౌనం...

మౌనం నా నెచ్చెలి ఐతే...మాటలు నా చెలికాడు..
కాలం ఒడిలో కలిసిసాగాలి ఇరువురితో.....కడదాక...

చెలికాడు వచ్చి చెంతచేరి నీవే నాలోకం అంటూ..నీ ప్రేమే నా ప్రాణం అంటూ చేతిలో చెయ్యివేస్తె మౌనంగా ఉన్నా...నీవు చెప్పిన మాటల్లో నిజమెంత,నాలో నీకు నచ్చిన దేమిటో నీకైనా తెలుసా అన్న ప్రశ్నలు దాగున్నాయని చెపితే వాదనలు అలకలు అనుమానాలు తప్ప మరేమి ఉండదని తెలిసి మౌనంగానే ఉన్నా....మీ మౌనంలోని భాష నాకు తెలుసు అంటూ చిరునవ్వు నవ్వితే ...అది నిజమని నా మనసు ఒప్పుకోవడంలేదని చెప్పి నొప్పించలేక మౌనమే సమాధానం అయింది....తమచుట్టూ లతలా అల్లుకుంటున్న నాతో నీకు నాపై ప్రేమే లేదు .....అంటూ దూరం వెళుతున్న మౌనంగానే ఉన్నా..నీవు లేక క్షణమైన ఉండలేదు అని, నా ఆలోచనల్లో నా ఊహల్లో అన్నిటిలో నిన్నే దాచుకున్నా నంటూ చెప్పి, తను నిర్దేశించుకున్న జీవిత గమ్యాన్ని మార్చడం ఇష్టంలేక...మౌనం వెనుక మాటలు ఎన్నో..కొన్ని చెప్పలేక కొన్ని చెప్పాలని లేక ........

అదిగో నలుగురు అమ్మాయిలు చేరి ఒకటే మాటలు, వాదనలు, ఎక్కువ తక్కువ లేంటి అమ్మాయిలు ఎందులో తక్కువ, అబ్బాయిలు ఇంటి ముందు ముగ్గేస్తే తప్పేంటి..మేము అబ్బాయిల్లా  సంపాదించినపుడు..అపుడు మౌనమే ...ఒప్పించాల్సిన అవసరం లేని చోట వాదన ఎందుకని...అలాంటప్పుడు ఎక్కడో చదివిన కథలోని చమత్కారం గుర్తొచ్చింది.. భార్య భర్తతో సనగడం మొదలెట్టింది...మీ రూపాయి నా రూపాయి కలిస్తేనే ఈ సంసారం నడుస్తుంది , నేను ఎందులోనూ నీకంటే తక్కువ కాదు, మీరు చేసే ప్రతీది మేము చేయగలం మీకేమి కొమ్ములు లేవు అంటూ...భర్త ఏమి మాట్లాడకుండా అవును నిజమే కాదని ఎవరన్నారు అంటూ వేసుకున్న బనియను విప్పి కండువాతో వీధి వాకిట్లోకి సర్రున వెళ్ళాడట,అదే కథకి ముగింపు ....నా మౌనం  వెనుక కథ చెప్పి నొప్పించలేను ఒప్పించలేను....ఎవరి ప్రత్యేకత వారిదే వాదనలు చేసి నిరూపించుకోవాలా...

మౌనం వెనుక ఎన్నో కలలు ఉంటాయి,ఊహలూ, ఆలోచనలు, గతములోని జ్ఞాపకాలు, చెడు అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు .....అందుకే ఎన్నో మాటలు మానం వెనుక ఓడిగిపోతాయి, కొన్ని సంస్కారం వలన, కొన్ని అవతలివారిపై మనకున్న ఇష్టం వాళ్ళ, మరికొన్ని వాదనల అవసరం లేదని తలచి....మౌనం వెనుక మాటలు అలా కరిగిపోవలసిందేనా....ఎవరకి అందించకుండా మనసు అడుగున దాచేయాలా...

మౌనం వెనుక మాటలు ఎందుకు పంచడంలేదు అంటే ఏమని చెప్పను....నాకు చెప్పాలని ఉంది మౌనం వెనుకు ఉన్న ప్రతీ మాట, ప్రతీ ఆలోచన చెప్పాలని.... చెప్పాలని ఉంది అని ఎదురైనా ప్రతీ వారికి చెప్పలేము కదా...చెప్పాలనుకుంటే మౌనం తెలిసిన మనసుకే చెప్పుకుంటా...అలాంటి మనసు ఉన్న మనిషి జీవితంలో ఎదురుపడినపుడు తప్పక మౌనం మౌనంగానే తప్పుకుంటుంది.

మౌనం లోని మాటలు చెప్పడం కోసం మన మనసుకి నచ్చే మనిషి కోసం ఎదురు చూస్తూ మాటలను అలా పోగు చేస్తూ....కాలం ఒడిలో కరిగించే కంటే నీలో భావాలు కథగా, కవితగా మార్చు..నీ మౌనానికి మాటలు నేర్పు.....అలా నలుగురికి పంచు...మౌనం అర్ధం చేసుకునే వారిని సృష్టిస్తాయేమో  నీ మాటలు ...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!