మనసులోని మర్మం

నేను ఈ ఊరు వచ్చి సుమారు ఐదు ఏళ్ళు అవుతుంది, మా ఊరు చూడగానే అనసూయమ్మ మనసులో మెదిలింది. ఇల్లు చేరానో లేదో అమ్మా! అనసూయమ్మ ను  చూసి వస్తా..నంటూ కదిలాను.. అమ్మ కాఫీ అనే మాట కూడా వినిపించుకోకుండా..

నాకు ఆవిడకు 20 ఏళ్ల తేడా ఐన నాకు ఆవిడని పేరు పెట్టి పిలిచే  అలవాటు ఎలా మొదలైందో  మాత్రం గుర్తులేదు. అనసూయమ్మా.. అంటూ గబా గబా వెళ్లాను లోపలికి, పెరట్లో ఎప్పటిలాగానే బియ్యం ఏరుతూ, పిట్టలకు కొంచెం చల్లుతూ  సందడిగానే కనిపించింది.

ఏంటి.. పిల్లల తల్లివయ్యావు..ఇంకా పిల్ల చేష్టలేంటే  కవిత అంటూ.. నా బుగ్గలు పుణికి పుచ్చుతూ..కాఫీ ఐనా తాగావా లేదా! అంటూ లోనికి నడిచింది.అన్నీ మాములుగానే కనిపిస్తున్న ఎందుకో అనసూయమ్మా లో నాకు ఏదో వెలితి కనిపిస్తుంది..నేనే పొరపాటు పడుతున్ననేమో ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం తరిగి అని నాకు నేను సర్దిచెప్పుకున్నా..ఆ ఊరి కబుర్లు మా ఊరి కబుర్లు అయ్యాక.. ఒక కథ చెప్పు అనసూయమ్మా.. నువ్వు కథ చెప్పే వరకు వెళ్ళనే వెళ్ళాను..అన్నీ తెలిసిన కథలే కదా అనకు.. నువ్వు చెప్పే ఏ పిట్ట కథో, కోడి కథో ఐన పర్లేదు కాని...ఇపుడు కాదు మళ్లీ చెపుతా అని మాత్రం అనకు అని టిఫన్ ప్లేట్లు తీసుకొని పెరట్లోకి నడిచా.. మరి అదే కదా మా కథల చావిడి..తను ఏ కథ చెప్పినా  అదీ జరిగిన కథలా  చెప్పేది, మా చిన్నపుడు మా ఇంట్లో ఒక కోడి ఉండేది అంటూనో.. నేను నా ఫ్రెండ్ ఈత కొట్టడానికి వెళితే ఒక రంగుల చేప కనిపించిది అంటూనో కథ మొదలెట్టేది..అవన్నీ నాకు కథల్లా కాకుండా నిజంగానే జరిగిందేమో అని అనిపించేది..

ఏమి కథ చెప్పనే కవితా.. మా బంగారు పిచుక కథ చెప్పలేదు కదా... మా ఇంట్లో ఆ పక్క చింత చెట్టు వేపచెట్టు బాగా పెరిగి పోయాయి, అపుడు మొదలైంది  ఈ పిచుకల గోల..పెరడంతా శుబ్రంగా పెడితే ఒక్క పిట్ట నా దగ్గరకు వచ్చేది కాదు..ఇదిగో పెరుడు అంతా అడవిలా ఉంచితేనే అవి నా చుట్టూ చేరేవి.. అలా ఆ పక్క స్థలమంతా అవి ఖబ్జా చేసుకున్నాయి, అందులో చాల ఉండేవి నల్ల తోక పిట్ట, చిన్న రెక్కల పిట్ట, ఎర్రకన్ను పిట్ట అని, అవి కాస్త చేరికయ్యి నేను దానిని గుర్తించే లోపే  అవి గూడు విడిచి వెళ్ళిపోయేవి.  అందులో ఒక చిన్న పిట్ట ఉండేది..అబ్బో భలే తెలివైనదిలే. నేను వంట చేసినంత సేపు కబుర్లు చెప్పేది, నేను కబుర్లు చెప్పనా, నీకు సాయం చేయనా అని నా వెనకే తిరిగేది. నా వంట అయ్యాక కాని అదీ దాని తిండీ కోసం వెళ్ళేది కాదు.కొన్నాళ్ళకు మగపిచుకతో వెళ్ళిపోయింది అనుకో, ఒకరోజు ఓ బంగారు రెక్కల పిచుక చేరింది, దాని రెక్కలు భలే బంగారమే అనుకోవే  తల్లి..

నాలుగు రోజులు  అది నా దగ్గరకు రానేలేదు..  ఆ తరవాత నెమ్మదిగా నా పక్కన చేరింది.. నాకు పెట్టు గింజలు అంది.. అన్నిటికి వేసినట్టే గింజలు కింద చల్లాను.. అబ్బో దానికి ఎంత టెక్కనుకున్నావ్! ఒక్క గింజ ముట్టుకోలేదు..నా చేతిలోగింజలు అందిస్తే మహారాజులా ఆరగించింది. నేను నాలుగు గింజలు అందిస్తే అవే తినేది. మళ్లీ అడిగేది కాదు.. నేను చూసుకొని అందివ్వాలన్నమాట  .. నాకు పంతం వచ్చి ఏంటి నేను ఏమైనా నీకు సేవకురాలినా.. వెళ్ళిపో అంటే నీ లేక్కేంటి అన్నట్టు అక్కడే ఉండేది.. ఇంకా గట్టిగ అరిస్తే వెళ్ళి అదిగో అక్కడ కూర్చొని ఇది నా స్థలం అని అరిచేది. నిజంగానే నాకు కోపం తెప్పించేది. మళ్లీ మామూలే పొద్దుటే గింజలకోసం వచ్చేది. చేతినిండా తీసుకుంటే కాళ్ళతో ఎక్కువున్న గింజలన్నీ తోసేసి, తనకు సరిపడా ఉంటేనే తినేది.. ఎక్కువైతే తిసేసేది  కాని తక్కువైతే మాత్రం అడిగేది కాదు..

అదీ నాతో పాటే ఇల్లంతా తిరుగుతూ కబుర్లు చెప్పేది, చెప్పింది చాల్లే అంటే వినేది కాదు. అలా అని పొద్దున్న గింజలు తప్ప మళ్లీ ఏమి తినేది కాదు. మధ్యాన్నం నేను అన్నం తిన్నాక, అపుడు వెళ్ళేది దాని తిండీ కోసం.. కొత్తగా గూడు కట్టడం మొదలెట్టింది, ఒక్కోసారి రాత్రి పొద్దుపోయాక వచ్చేది, వస్తూ ఏదో ఒకటి తెచ్చేది  గూడు అలంకరణ కోసం, అబ్బో దాని రెక్కలంతా అందంగా కట్టింది.. ఒకరోజు చాలా పొద్దు పోయినా, వచ్చిన జాడ కనిపించలేదు ఎందుకో.. నేను ఏమైందో అని తల్లడిల్లా .. పొద్దుటే వచ్చింది ఏమి తెలియని దానిలా.. ఎక్కడి కెల్లావ్? ఎందుకేల్లావ్ అని కోపంగా అడుగుతుంటే, నీకు కానుక ఇవ్వాలనిపించి అంటూ ఒక ఈక తీసి ఇచ్చింది,  నిజంగానే అన్ని రంగులున్న అలాంటి ఈక  ఎపుడూ చూడలేదు, నా కోసం తెచ్చిందన్న ఆనందం, అంత అవసరం లేదు కదా అనే ఆలోచనా, రెండు కలసి నువ్వు ఇలాంటివి ఎపుడూ నాకోసం అంటూ చేయకు, ఇలాంటి కారణాలవల్ల నిన్ను తరిమేయాల్సి వస్తది అని అన్నాను.

రోజు ఆలస్యంగా వెళ్ళేది, ఆలస్యంగా వచ్చేది, నీకోసం వింతలూ చూసొచ్చా అని ఒకసారి, ఇదిగో ఈ రంగు రాయి నీకోసం అని ఒకసారి తేవడం మాత్రం మానలేదు. ఒకరోజు ఎక్కడినుండో నాలుగు గింజలు తెచ్చింది అవి వడ్లకన్న కాస్త పెద్దగా ఉన్నాయ్, ఇవి చల్లమని పేచి పెట్టింది, ఇన్నాళ్ళలో అదీ ఎంత మొండిదో బాగా తెలిసిపోయింది నాకు,  అవి చల్లడం,మొలకెత్తడం....అవి  ఏమి మొలకలో కాని నాలుగు కాదు అవి వేర్లు ఉన్నంత వరకు పిలకలు వేసాయి,4 అడుగుల నేల అంత అవి పెరిగాయి, రెండు  నెలలకే అవి ఏపుగా పెరిగి కంకులు కాచాయి, ఇంక అదీ ఆ కంకులు తినడం  నాతో కబుర్లు చెప్పడం, అపుడపుడు  నాకోసం అందమైనవి అంటూ ఏవో తీసుకొని  రావడం.

ఒకరోజు మా మామయ్య వచ్చారు, నన్ను నా వెనక తిరిగే పిచుకను చూసి చాలా ఆశ్చర్యపోయాడు, బంగారు రెక్కల పిచుక బాగుందే అన్నాడు, ఒక వారం ఉండి, వెళ్ళేపుడు నువ్వు మరీ కట్టిపడేస్తున్నావు దాన్ని, అదేమో  మగత గింజలు తింటూ తిరుగుతుంది, ముందు ఆ చెట్లు తీసెయ్యి,  పిచుకలో చురుకుదనమే అందం, బంగారు రెక్కలు కాదు అని కొంచెం  గట్టిగానే చెప్పి వెళ్ళాడు, ఎంతైనా మరీ ఆతను వెటర్నరి డాక్టర్ కదా!

నేను ఆలోచనలో పడిపోయా, మామయ్యకు కనిపించిన లోపాలేవి నాకు కనిపించడం లేదా, లేక చూడడానికి నేనే ఇష్టపడడం లేదా అని, ఒకరోజు మళ్లీ ఎక్కడికో వెళ్ళింది, మనిషిని పెట్టి ఆ మొక్కలన్నీ కుదురల దగ్గరనుండి తీసేయించాను, మొక్కలు తీసేసినతను ఇంకొ వంద ఎక్కువ ఇమ్మన్నాడు. అవి ఏమి రాకాసి మొక్కలో అమ్మా! నా ఒళ్ళంతా  ఒకటే దురదా, మంటగా ఉంది అని, తన,  ఒంటిపైన దద్దులు చూపించాడు, నేను మారు మాటాడకుండా డబ్బు  ఇచ్చి పంపించాను.

ఆ మొక్కలు ఎందుకు తీసేయిన్చావు  అని  రావడంతోనే పేచి పెట్టింది, నా ఇల్లు నా ఇష్టం, నాకు నచ్చలేదు తీసేయించాను  అని అన్నాను, అదీ నా స్థలం అంది, ఇక్కడ నీదంటు ఏమి లేదు, అక్కడ కట్టుకున్న గూడు తప్ప అని నేను కోపంగానే అన్నాను,  నేను వెళ్ళిపోతాను నువ్వు ఆ మొక్కలు వేయకుంటే అన్నది, నేను నా ఇంట్లో వేయను అన్నాను, సరే ఐతే వెళ్ళు , సంపాదించుకొని తినడం కష్టమై మళ్లీ నువ్వే వస్తావు అన్నాను, అంతే మారు మాటాడకుండా వెళ్ళిపోయింది బంగారు పిచుక. మొక్కలు తిసేయించిన చోటా మళ్లీ గడ్డి కూడా మొలవలేదు.

ఇదిగో అప్పటినుండి యిలా ఎదురుచూస్తున్నా, తన చురుకుతనం వెంట తీసుకొని,నా ఇష్టం నేను వస్తా, నా ఇల్లు అంటూ మొండిది  ఎపుడైనా వచ్చేయకపోతుండా అని, మళ్లీ అక్కడ గడ్డి ఐనా మొలవక పోతుందా అని,  ఇదుగో యిలా నువ్వోచ్చినట్టే  ఎపుడో అదీ వచ్చి కథ అడిగితే నీ కథ దానికి చెపుతా అంటూ నవ్వేసింది అనసూయమ్మ!

కథలోలా అక్కడ గడ్డి కూడా మొలవని నాలుగు అడుగుల స్థలం చూసి ఏంటి అనసూయమ్మ చెప్పింది కథ కాదేమో అనిపించింది, వెళుతూ ఇంట్లోని అరలో రంగురాళ్ళు చూసి ముచ్చటపడి, ఇవేం రాళ్ళు అనసూయమ్మ అని అడిగాను, కథలో బంగారు పిచుక ఇచ్చిందమ్మా! అని పక పక నవ్వింది....

కథలోని నిజమెంతో తెలుసుకోవాలని లేదు నాకు.. కానీ అనసూయమ్మ మదిలోని తడి నా మనసుని తాకింది అన్నది  మాత్రం నిజం, ఏమో ఈ సారి వచ్చేసరికి నిజంగానే నా కథ బంగారు పిచుకకు చెపుతూ కనిపిస్తుందేమో అనసూయమ్మ....మనసులోని మర్మం అందుకోడం చాలా కష్టం అనుకుంటూ మెల్లిగా ఇంటికేసి బయలుదేరా....
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!