మనసు మాట్లాడాలి

సూర్య, విరజా వాళ్ళిద్దరూ  చూడముచ్చటైన జంట, ఎవరైనా కానీ వాళ్ళని " ప్రేమ  వివాహమా మీది" అని అడగకుండా ఉండలేరు. సూర్య ప్రేమ వివాహం అంటే విరజ కాదండీ  అంటుంది. వాళ్ళిద్దరూ మొదటిసారి బస్సు స్టాప్ లో ఎదురుపడ్డారు.  ఆ తరవాత అదే రోజు సాయంత్రం పెళ్లిచూపుల్లో   విరజని చూసి ఓ ఇందుకా అంతహడావిడిగా బస్సు ఎక్కావు అన్న నవ్వు చూసి విరజ సిగ్గుపడిపోయింది. విరజ వాళ్ళ అమ్మ విరజ చెవిలో ఆ అబ్బాయి నీకు ముందే తెలుసా అని అడిగింది .అవును.. కాదు అనకుండా తలవంచేసింది విరజ. అదే ఇద్దరికీ మొదటి పెళ్ళిచూపులు కూడా, మంచిరోజంటూ అదే రోజు తంబులాలు కూడా పుచ్చుకున్నారు. నెల తిరక్కుండానే పెళ్ళయిపోయింది. ఒక వారం లోపే  భర్తతో పాటు హైదరాబాద్ వచ్చేసింది విరజ. ఇప్పటికి పెళ్లి అయ్యి ఆరునెలలు అయ్యింది.


విరజకు సూర్యని చూస్తె కాస్త గర్వంగానూ అబ్బురంగాను ఉంటుంది. పొద్దుట లేవగానే విరజ అన్నపిలుపు, విరజ వెళ్ళడం కాస్త  ఆలస్యం అయిందా కళ్లుమూసుకొని వెతుక్కుంటూ వంట ఇంట్లోకి వచ్చేస్తాడు. విరజ పని అంత సూర్య లేవకముందే, సూర్య లేచాక తను ఆఫీసు కి వెళ్ళేవరకు విరజ సూర్య కంటి ఎదురగా ఉండాల్సిందే. అలాగని సూర్య విరజను ఇబ్బంది పెట్టడు. ఇక్కడ అత్తగారిని అమ్మని అన్ని నేనేనోయ్ చూసుకోవాలిగా అంటాడు. విరజ సూర్య తలపుల్లో, అతని ప్రేమలో ఎంతగా ఉండిపోయింది అంటే నెల తప్పేవరకు పుట్టిల్లే  మరచిపోయింది. ఐదోనెల రాగానే విరజ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. తీసుకెళ్ళడానికి, విరజకు సూర్యని వదిలి వెళ్ళడం అసలు ఇష్టం లేదు తనని చూస్తే బెంగగా ఉంది విరజకు, కానీ తప్పదు, సూర్య కూడా పది రోజుల్లో ట్రైనింగ్ కోసం ఆఫీసు వాళ్ళు 4నెలలు  సింగపూర్ పంపుతున్నారు. అందుకే ఈ అనుకోని ప్రయాణం,ఏదో తెలియని గుబులుతో పుట్టింటికి వెళ్ళింది.

పుట్టింట్లో ఉన్నమాటే కానీ తన మనసంత సూర్య మీదే ఉండేది. తను రాసే లెటర్స్ తోనే తన సమయం గడిపేసేది. విరజకు పాప పుట్టింది. విరజ అమ్మా నాన్న అచ్చంగా నీలా ఉందే అంటూ ఎంతో సంతోషపడిపోయారు. పాప పుట్టిన వారానికి, సూర్య వస్తాడని తెలిసి విరజ మనసు మనసులో లేదు. ఇన్ని నెలల తరవాత వస్తున్నాడు సూర్య, తనను వదిలి క్షణం కూడా ఉండలేని వాడు, ఇపుడు వస్తే తను బాలింత అని కూడా మర్చిపోయి విరజ అంటూ నా వెనుకే ఉంటె చెల్లెళ్ళు ఎలా ఆట పట్టిస్తారో ఏమో, ఇలా ఆలోచిస్తూ సిగ్గుపడిపోతూ ఉంది తనలో తను.

సూర్య వస్తున్నాడని ఇల్లంతా ఒకటే హడావిడి, సూర్య రాగానే అత్తయ్య  పాప ఎలా ఉంది అని అడిగాడు. విరజలాగా ఉంది అన్నమాట పూర్తి కాకముందే గదిలో కొచ్చి పాపకోసం చేతులు చాచాడు. విరజను చూడకు౦డానే పాపని ఎత్తుకొని ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. ఎన్నో ఉహించుకున్న విరజ తల్లడిల్లిపోయింది. తన మనసుకి నచ్చ చెప్పుకోలేక పోయింది. అక్కడ ఉన్నన్ని రోజులు పాపేలోకం అయ్యింది సూర్యకి, తాను ఒక్కడే ఉండలేనంటూ నెల లోపే తీసుకొచ్చాడు  విరజను, పాపని హైదరాబాద్ తనతోపాటు.

వచ్చినప్పటినుండి సూర్యని చూస్తూ ఉంటె మనసు కలతగా ఉంది. ఆఫీసు నుంచి రాగానే పాప ఏది అన్న మాటతో వస్తాడు. ప్రొద్దుట లేవగానే పాప ముఖం చూడాలనుకుంటాడు. సూర్య వచ్చేప్పటికి పాప ఏడుస్తూ కనిపిస్తే చాలు విరజ మీద కోపంతో ఏంచేస్తున్నావ్ పాపను ఏడిపిస్తూ పనులు చేయల్సినంతగా ఏమున్నాయ్ అని, ప్రొద్దుట లేస్తే పాపతో మొదలు పడుకుంటే పాపతో ఆఖరిమాట. ఇలా సాగుతుంది... పాప పాకుతూ కాస్త సందడి మొదలెట్టింది. ఆఫీసుకి వెళ్ళాక ఒక ఫోన్ కాల్ పాప ఏం చేస్తుంది అని, ఒకరోజు వచ్చేసరికి పాపకి ఇంకా స్నానం చేయించలేదు పాప ఆడుకుంటుంది. అంతే సూర్య విరజను ఎంతో విసుక్కున్నాడు ఏంటి పాపని అలానేన ఉంచేది అని తనే స్నానం చేయించుకుని  బయటికి తీసుకెళ్ళాడు. ఒక గంట తరవాత పాపతో కబుర్లు చెపుతూ ఇంటికి వచ్చాడు. ఎక్కడా అలికిడి లేదు. ఎంచక్కా ముస్తాబయ్యి పడుకుని కనిపించింది విరజ. ఎంతో చిరాకుగా "ఏంటి విరజా పాపకోసం అన్నం రెడీ చేయకుండా పడుకున్నావు" అని లేపడానికి వెళ్ళాడు. తన ప్రక్కన లెటర్ కనిపించింది ఏమిటా అని, విరజ తనకు రాసిన లెటర్ అని తెలిసి ఆర్చర్యపోతూ చదవడం మొదలెట్టాడు.

సూర్య ఇలా నిన్ను పిలిచి యుగాలైనట్టు ఉంది నాకు. నువ్వు ఎపుడూ ప్రేమ పెళ్లి మాది అని అందరితో అంటూ ఉంటె అబద్దం ఎందుకు చెపుతావ్ అనేదాన్ని కదా! నిజంగా అబద్దమే చెప్పావా సూర్య, పాప వచ్చినప్పటి నుంచి  నేను నీకు శత్రువుని అయిపోయానా? నా ముఖం కనిపిస్తే పాపం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు. నాకు మాత్రం కూతురు కాదా! నన్ను తప్పు పట్టడానికే నాతో మాట్లాడుతున్నావ్. విరజ అన్న పేరు నీ నోటి వెంట వస్తుందంటేనే భయం వేస్తుంది, దేనికి తప్పుపడతావో అని. ఒకరికే ఇలా ఉంది, ఇంకొకరు పుడితే, ఆ ఊహకే నా గుండె ఆగిపోతుంది. ఆలా జరిగితే నాకు ఇంట్లోకూడా స్థానం ఇవ్వవేమో అన్నంత భయం. నేను లేకున్నా పాపను చూసుకోగలరు. మిమ్మల్ని అందుకొనే దూరంలో నేను లేను. ఇలా ఉండలేక నేను వెళ్ళిపోతున్నాను.

ఇట్లు,
మీ ప్రేమ కోల్పోయిన  విరజ

విరజా.....! అంటూ కెవ్వున అరిచాడు సూర్య, నీలా ఉన్న పాప, తను నీ పాప అన్నందుకే అంత ఇష్టం. నిన్ను ఎంత అల్లారుముద్దుగా పెంచారో అంతబాగా నీ పాపను చూసుకోవాలన్న ఆరాటం, నీ చిన్నతనం రూపే ఆ పాప..  ఈ నిజం ఎలా చెప్పను నీకు. నిన్ను నొప్పిస్తున్నానని నాకు ఎందుకు తెలుపలేదు, నువ్వులేని పాప నాకెందుకు అని పసిపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు సూర్య, ఆక్కడ బోసినవ్వుల పాప గుక్కపెట్టి ఏడుస్తుంది.........
అన్ని చూసుకోవాల్సిన విరజ ఎవరికీ అందనంత దూరంలో ఉంది.

 


మనసు  మాట్లాడాలి ఈ కథ నా సొంతం కాదు. ఎపుడో 20 సంవత్సరాల  కింద చదివిన కథ, నాకు కథ పేరు కానీ వ్రాసిన వారు కానీ గుర్తులేదు. మనసులోని మాట చెప్పకపోతే జరిగింది ఈ కథలో చదివాక మనసుని మాట్లాడనివ్వాలి అని అనుకున్నాను. ఈ కథ ఒకరికి చెపితే (ఎప్పుడో లెండి) ఏమన్నారో తెలుసా  దీనివల్ల నాకు తెలిసింది ఒక్కటే పిల్లలని బయటకు విసిరేసి భార్యచుట్టు తిరగాలి అని... నిజంగా ఆ జవాబు నేను ఉహించలేదు. కథలో తప్పుందా నేను చెప్పడంలో తప్పుందా అనుకున్న మళ్లీ ఈ కథ ఎవరికీ చెప్పాకూడదనుకున్న అయినా అలవాటు మానుకోలేక మరోసారి ఇంకొకరికి చెప్పా, కథ విని మనసు చదవడం అందరికి రాదండి మాటల్లో చెప్పాలి అది ఎపుడు అనుకున్నది అపుడే అన్నాడు... అంతే మళ్లీ ఇదిగో కథ మంచిదే ఎవరి ఆలోచనని బట్టి వాళ్ళు అర్ధం చేసుకుంటారు అని నమ్మి మీ ముందుకు మీకోసం....

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!