చిట్ట చివరిది

మెయిన్ రోడ్డుమీదే మలుపుదగ్గర ఆటో ఆపి దిగేసరికి మసకచీకట్లు ముసురుకుంటున్నాయి. ఉండుండి చలిగాలి వీస్తూంది. వణుకుతున్నట్టు సందు మొగదల్లోని వీధి దీపం మినుకు మినుకుమంటూంది. మరో వైపు వెలుగులు విరజిమ్ముతూ గాయత్రి ఫ్యాన్సీ స్టోర్స్. పక్కన ముందు బల్లలేసిన టీ కొట్టు. దాని ముందు ఒక పక్కగా ఒక ముసలమ్మ కూచుని బొగ్గుల కుంపటి విసురుతూ మొక్కజొన్న కండెలు కాలుస్తూంది. మలుపు తిరిగేంతలో మళ్ళీ వూగిసలాట. సందులోంచి గట్టిగా హార్న్ మోగిస్తూ రోడ్డు మీదికి మలుపు తిరిగిన మోటార్ సైకిల్‌పై ముందుకు వంగి తోలుతున్నతని చెవిలో ఏదో చెపుతూ నవ్వుతూంది వెనక కూచున్న అమ్మాయి.

రోడ్డు దాటి షాపులోకి అడుగుపెట్టగానే వాకిలి పక్కనే ఏవో సర్దుతున్న కుర్రాడు పలకరింపుగా నవ్వాడు. అరల్లో ఉన్న వస్తువుల్ని గమనిస్తూ నడుస్తుంటే పక్కపక్కనే తిరుగుతున్నాడు “ఏం కావాల్సార్” అని అడుగుతూ. నిన్న అనవసరంగా కొనవలసివచ్చిన రేజర్ గుర్తొచ్చింది. మొన్న కొన్న టూత్‌పేస్ట్. రేపు తిరుగుప్రయాణం కనుక ఇటు రావడం కుదరదు.

కాసేపు అటూ ఇటూ తిరిగి ఇంకో అనవసరమయిందేదో పట్టుకుని కౌంటర్ దగ్గరికి వెళ్ళి ముందున్నతని వెనక నిలబడ్డాడు. వెనక అలికిడి. చూచీ గుర్తుపట్టక తలతిప్పుకుని బిల్ చెల్లిస్తుంటే ఆమే పలకరించింది. పేరు కనుక్కుని నిర్థారించుకుని ఒకటే ఆశ్చర్యపడిపోతూ.

“ఇదేమిటి నువ్విక్కడ? అబ్బ ఎన్నేళ్ళకు!” నవ్వినప్పుడు తెలుస్తుంది అదే నవ్వు మొహం. అప్పుడు లేని సన్నటి ముడతలు చికిలించిన కళ్ల చివర్ల.

“ఏదో నాలుగురోజుల బిజినెస్ పని మీద వచ్చాను! రేపు వెళ్ళిపోవాలి.” కొద్దిగా బొద్దుగా అయింది.

“ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నారు? ఎంతమంది పిల్లలు? ఏం చదువుతున్నారు?” చెప్పకుండా నవ్వుతుంటే ఆమె కూడా నవ్వేసి, “సరే, నెమ్మదిగా చెప్పుకుందాము మా ఇంటికి భోజనానికి పద! ఈ పక్క రోడ్డు మీదే మా ఇల్లు” అంది. హెన్నా పెట్టుకున్న జుట్టు అక్కడక్కడ ఎర్రగా.

“వస్తా కానీ భోజనం కుదరదులే, బిజినెస్ డిన్నర్ ఉంది మళ్ళీ!” తీరుగా దిద్దిన కనుబొమ్మలు, రంగు వేసుకున్న పొడుగు గోళ్ళు, ఎత్తు మడమల్లేని చెప్పులూ.

“సరే పద!” తను తీసుకున్నవాటికి డబ్బు చెల్లించి బయటికి వస్తున్నప్పుడు అడిగింది మళ్ళీ “ఏం చేస్తున్నావు?” మెళ్ళో సన్నటి గొలుసూ, నల్లపూసలూ, సిటిజెన్ వాచీ, రెండు గాజులూ.

“ఒక చిన్న మాన్యుఫాక్చరింగ్ కంపేనీకి సేల్స్ డైరెక్టర్ని. మీ ఆయనేం చేస్తారు?”

“నేనేం చేస్తున్నానని గదా అడగాల్సింది?” చిరునవ్వూ, చిరుకోపమూ కలిపి తలతిప్పి అతడివైపు చూసి చెప్పింది “కొన్నాళ్ళు ఇంజనీర్‌గా పని చేసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. పనిమీద సింగపూర్ వెళ్ళారు. నేను ఇక్కడికి దగ్గర్లోనే ఒక కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేస్తున్నాను”. రెండడుగులు వేశాక ఆగి చెప్పింది “ఇల్లు ఇక్కడికి దగ్గరే, నడిచిపోవచ్చు. కొద్దిగానయినా ఎక్సర్‌సైజు అవుతుందనే నేను నడుచుకుంటూ వచ్చాను. పద! ఎక్కడ మీరిప్పుడు ఉండేది?”

చెప్పాడు. మలుపు తిరిగి సందులో నడుస్తూ చలికి కొంగు భుజాల చుట్టూ కప్పుకుంటూ అడిగింది “ఇంతకూ మీ ఆవిడ గురించి చెప్పలేదు!” గాలికి ఏదో చందనం కలిసిన సెంటువాసన వస్తూంది.

“ఏముంది… సుమ బ్యాంక్ లో పనిచేస్తుంది. పిల్లల్ని చదివించడంతో బిజీ. నేనిట్లా వూళ్ళు తిరుగుతూ ఉంటాను.” ఎప్పటి సాయంత్రాలో గుర్తొస్తున్నాయి ఇట్లాంటి నడకల్లో భుజం తగిలిన మెత్తదనాన్ని అపురూపంగా దాచుకున్నవి.

“వేణు పెద్దగా ప్రయాణాలూ అవీ చేయరు. ఎప్పుడూ ఫోను మీదే. పిల్లలెంతమంది?” ప్రశ్నలూ, జవాబులూ. పిల్లలూ, వాళ్ళ చదువులూ అయ్యేసరికి ఇల్లు వచ్చింది.

రెండంతస్థుల భవంతి. గేటు తీసి లోపలికి రమ్మంటూ చెప్పింది “కట్టి పదేళ్ళవుతూంది. ఈయనే దగ్గరుండి కట్టించారు.” వరండాలో వేసిన లైటు వెలుతుర్లో ఒక పక్కగా నల్లటి ఇండిగో కారు, పచ్చగా, నల్లగా ఏవేవో పూల మొక్కలూ, తీగలూ, చెట్లూ.

“ఇల్లు కొన్నారా మీరు?” కింద పాలరాయి. తోలు సోఫాలు.

“అక్కడ ఇల్లంటే మాటలా! రెండు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఒకటి అద్దెకి ఇచ్చాము.” షోకేసులో ఫొటోలు భర్తతో, భర్తా పిల్లలతో. కోల మొహం, బొద్దు మీసం, కళ్లజోడు.
ఆల్బమ్స్ రెండు తీసి ఇచ్చింది కింది అరలో నుండి. “ఇవి చూస్తూండు ఇప్పుడే వస్తా” అని లోపలికి వెళ్ళింది. రకరకాల సందర్భాల్లో కుటుంబం ఫొటోలు. ఏ ఆల్బం లోనయినా మొహాల మార్పుతో ఇవేకదా! ఈ కోలమొహం బదులు తన గుండ్రటి మొహం ఉండవలసింది. తిరగేస్తుంటే పదేళ్ల పనిపిల్ల టీ పట్టుకువచ్చింది రెండు కప్పుల్లో. ఆ వెనకే ఆమె.

“టీ తీసుకో, ఈలోగా పకోడీలు తీసుకొస్తుంది.” అని కప్పు తీసుకుని “ఎన్నేళ్ళయింది, పాతికేళ్ల పైమాట!” అంది.

“అవును, నిన్నో మొన్నో మనం కలిసి టీ తాగినట్లే ఉంది.” చల్లబడ్డ చేతులకు కప్పు వెచ్చగా తగిలింది. ఎప్పుడూ తాకాలనుకునే ఆమె చేతి వేళ్లూ, తను ముచ్చటగా చూస్తుండిపోయే ఆమె పెదాల మధ్య కప్పు.

“నువ్వేం మారలేదు!” తేరిపార చూస్తూ అంది.

“మారకపోవడమేమిటి? బయట తినడం, తిరగడం ఎక్కువై బొజ్జా…” మధ్యలోనే అందుకుంది నవ్వుతూ “ఆ మాత్రం బొజ్జల్లేనిది ఇప్పుడు ఎవరికిలే!”

అతనూ నవ్వేశాడు. “మన క్లాస్‌మేట్లెవరైనా టచ్‌లో ఉన్నారా?” అడిగింది.

“మొదట్లో ఉండే వాళ్లు నారాయణా, సుబ్బూ, శర్మా, కోటీ. ఇప్పుడెవరెక్కడున్నారో కూడా సరిగ్గా తెలియదు. నువ్వు మరీ అన్యాయం. మా వూరెళ్ళి వచ్చేలోగా మాయమై పోయావు. ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.”

“నీనుంచి దాక్కుందామని!” నవ్వింది. “నాన్నగారికి అకస్మాత్తుగా ట్రాన్స్‌ఫర్ అయింది. అయినా ఎవరికీ చెప్పకపోవడమేమిటి? ఊళ్ళో ఉన్న ఫ్రండ్సందరికీ తెలుసు.”

“ఏం తెలుసు, రాయపూర్‌కి ట్రాన్స్‌ఫరయిందని మాత్రం తెలుసు. అక్కడ ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియదు. అప్పటికీ మీ అడ్రస్ కోసం ఎంత ప్రయత్నించానో! నెలరోజులు పిచ్చి పట్టినట్టు తిరిగాను.”

“ఈ మొబైల్ ఫోన్లు అప్పుడు ఉంటే నీకా తిప్పలు తప్పేవి కదా!” మళ్ళీ నవ్వు.

పనిపిల్ల రెండు ప్లేట్ల నిండా పకోడీలు పట్టుకుని వచ్చి టీపాయ్ మీద పెట్టి టీ కప్పులు తీసుకు వెళ్ళింది. “తీసుకో” అంటూ ఒక ప్లేటు ముందుకు జరిపింది.

“అయినా నువు సేల్స్ ఏమిటి? పెద్ద రచయితవై పోతావనుకున్నాను. కాలేజ్ లో ఉన్నప్పుడు బాగా రాసేవాడివి కదా! రాసినవాటికి మంచిపేరు కూడా వచ్చింది. పత్రికల్లో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేదాన్ని. వచ్చినప్పుడు పార్టీ ఇచ్చేవాడివి కదా అందుకనిలే!” నవ్వి ఆగి మళ్ళీ అంది “చాలా రోజులు చూచేదాన్ని తెలుగు పత్రికలు కనిపిస్తే నీ పేరు కనపడుతుందేమోనని. ఎప్పుడో టీవీ రచయితగానో, సినిమా రచయితగానో నీ పేరు కనిపిస్తుందని కూడా అనుకునేదాన్ని!”

“నేను రాసింది అదే చివరిది!”

“ఏది?”

“నీకిచ్చిన ఉత్తరం! నాలుగయిదు సార్లు అడిగితే చదవలేదన్నావు. చదివికూడా చదవలేదని చెప్పావు కదూ?”

“నేను చదవలేదు. ఏం రాశావు?”

“ఏం రాశానో నీకు తెలియదా?”

“నువ్వు ఇవ్వడం మాత్రం నాకు బాగా గుర్తుంది. అది ప్రేమలేఖ అని తెలుస్తూనే ఉంది. ఆ ఉత్తరం నలిగిపోతుందన్నట్టూ, దాన్ని వదులుకోలేక ఇస్తున్నట్టూ ఎంత జాగ్రత్తగా ఇచ్చావో… అసలు నువు ఆ ఉత్తరాన్నే ఎక్కువ ప్రేమిస్తున్నట్టు అనిపించింది.”

“ఎంత కష్టపడ్డాను ఆ ఉత్తరం రాయడానికి? అరిగిపోయిన పదాలు వాడకుండా, మూస భావాలు లేకుండా రాయడం అంత తేలిగ్గా సాధ్యపడలేదు. ఎవరెవరు రాసిన ప్రేమలేఖలో చదివాను ఇంతకుముందు ఎవరూ రాసినట్టు అది ఉండకూడదని. గుర్తుందా నీకు ఒక నెలరోజులు కనపడకుండా పోయాను? ఆ నెలంతా క్లాసులూ, తిండీ తిప్పలూ కూడా మాని అదే నేను చేసిన పని. నా జీవితంలో ఒకే ఒక్క రచన చేస్తే అది ఎలా ఉండాలనుకుంటానో అంతకంటే గొప్పగా ఉండాలని తపించాను. ఆ ఉత్తరం చదివివాక ఎవరయినా సరే గుండె కరిగి ప్రేమించక తప్పదన్న నమ్మకం కుదిరాకే నీకు ఇచ్చాను. ఎందుకని చదవలేదు?”

“తెలియదు. చదివితే ఏం జవాబివ్వాలో నిర్ణయించుకోలేకపోవడం వల్లనేమో! నాకంటే ఉత్తరమే నీకెక్కువలా ఉందన్న కోపం కూడా ఉండేదేమో!”

“అదేమిటి? ఇద్దరమే కూచుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. రాత్రి పూట ఫ్రండ్స్ అంతా కలిసి సెంటర్ దాకా నడుచుకుంటూ పోయి బజ్జీలు కొనుక్కుని తినేవాళ్ళం. నీకు కారంగా అనిపించింది నాకిచ్చి నా చేతిలోది లాక్కునేదానివి. సినిమాకి వెళితే నా పక్కనే కూచునేదానివి. గుర్తుందా ఒకసారి వానలో ముద్దముద్దగా తడిసి వస్తుంటే “రిం ఝిం గిరె సావన్” పాట పాడుతూనే ఉన్నావు దారంతా? నేను అడగ్గానే ఏ పాటయినా పాడేదానివి!”

“మరి నువ్వొక్కడివే వోపిగ్గా వినేవాడివి దొరికింది. నీకు ‘పదహారేళ్ళకూ’ పాట బాగా ఇష్టం,కదూ!”

“అవును. ఒకసారి నువ్వెక్కడికో రమ్మన్నా కాదని భారతికి సాయం చేస్తూ కూర్చున్నానని వారం రోజులు అలిగి నాతో మాట్లాడలేదు.”

“నువ్వు మాత్రం అలగలేదా నీకు చెప్పకుండా స్వాతి ముత్యం సినిమాకి మేమంతా వెళ్ళామని? ఒకసారి వానలో ఒక కాకా హోటల్లో చిక్కుకుని టీల మీద టీలు తాగుతూ కూచున్నాము.” ఆమె ఏమీ మర్చిపోలేదు.

“అవును, చెరి ఆరు టీలు. అక్కడ పనిచేసే కుర్రాడిని చూచి దిగులు పడి పోయావు చదువుకోకుండా పనిచేస్తున్నాడని. అలాంటి వాళ్ళకోసం ఏదన్నా చేయాలని ఆ తర్వాత తరచూ అనేదానివి.”

“అప్పుడు నీ జేబులో డబ్బులు లేక నేనే కట్టవలసివచ్చింది అది గుర్తు లేదా? అంతా నిన్నో మొన్నో జరిగినట్టుగా ఉంది.”

“ఆ రోజుల్లో మనం కలిసి గడిపిన కొన్ని క్షణాలు అద్భుతంగా అనిపించేవి. కరెంటు పోయి వెన్నెల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడో, డాబామీద కూచున్నప్పుడు కొబ్బరాకులూ, నీ ముంగురులు గాలికి ఊగినప్పుడో, వాన పడుతున్నప్పుడొకసారి జారిపడబోయి నా చేతిని పట్టుకున్నప్పుడో ఆ క్షణాన్ని జీవితాంతం భద్రంగా గుర్తు పెట్టుకోవాలి అనుకునేవాణ్ణి. తర్వాత తర్వాత అట్లా అనుకోవడం మాత్రమే గుర్తుండేది. ఎంత ప్రయత్నించినా ఆ అనుభూతి మాత్రం గుర్తు వచ్చేది కాదు.” ఆగి అన్నాడు “మనిద్దరి మధ్యా ఉన్నది ప్రేమే అనుకున్నాను.”

“అవన్నీ చిన్నపిల్లల చేష్టలు. ఆ వయసులో అట్లాగే అనిపిస్తుంది. అనిపించకపోతేనే ఆశ్చర్యపడాలి”

“అప్పటికయితే అది నిజమేనని గట్టిగా నమ్ముతాము కదా! నీ ఆచూకీ దొరక్క తిరిగి మామూలు మనిషిని కావడానికి చాలా రోజులు పట్టింది.”

“అవునా?”

“నీకేం అనిపించలేదా? ఇంతకీ ఉత్తరం ఏం చేశావు?”

“ఏమో గుర్తు లేదు. ఏం రాశావేమిటి అందులో?”

“చెప్తే నవ్వుతావు.”

“అంత నవ్వొచ్చేవి ఏం రాశావు?”

“ఛ ఛ! ఉత్తరం చాలా సీరియస్. చెప్పాగా ఎంత శ్రమపడి రాశానో! అయితే ఏం రాశానో ఇప్పుడేం గుర్తు లేదు. గుర్తుంది అప్పుడు పడ్డ కష్టమే. ఎక్కడెక్కడి పుస్తకాలో చదవడం, నిఘంటువులు ముందేసుకుని వెతకడం, రాసినవి బాలేదని చించివేయడం. అదే గుర్తు. అయినా చదవకపోతే పోయావు, దాచి అయినా పెట్టలేదా?”

“ఏం తీసుకెళ్ళి ఏ పత్రికకో పంపుతావా ఏమిటి? బాధగా ఉందా నేను చదవలేదని?”

“అది ఇంకెవరూ చదవడానికి కాదు. నీకోసమే రాసింది. చదివినా, పోగొట్టుకున్నా అది నీదే!”

“అయితే రాయడం మానేయడం ఎందుకు? నిజంగా నీకు మంచి టాలెంట్ ఉంది. రాస్తూ ఉంటే ఈ పాటికి ఎంత పేరు వచ్చి ఉండేదో!”

“ముందేవో భ్రమలు ఉండేవి. మాట శక్తివంతమయిందనీ, నా రచనలు ఏవో మార్పు సాధించగలవనీ నమ్మేవాణ్ణి. నేను అంత కష్టపడి రాసింది ఒక్క వ్యక్తి మనసునే కదిలించకపోతే ఇక రాసీ ప్రయోజనమేమిటనిపించింది. అయినా అంత అద్భుతంగా రాశాక ఇక మరేదీ రాయలేననిపించింది. రాయవలసిందీ, నేను రాయగలిగిందీ ఏమీ మిగల్లేదు.”

పనిపిల్ల వచ్చి ప్లేట్లు పట్టుకుపోయింది.

“నాలుగేళ్ళ క్రితం నుంచీ ఉన్నట్టుండి కీళ్ళ నొప్పులు రావడం మొదలయ్యింది. పుస్తకం కూడా పట్టుకుని ఎత్తలేనంత బలహీనమయ్యాయి చేతులు. వేణూయే వాళ్ళ వూర్నుంచి ఈ పిల్లను తీసుకొచ్చి పనికి పెట్టారు. ఇప్పుడు కాస్త నయంలే!”

“నాకు బీపీ. మన జబ్బుల చిట్టాలు విప్పుకోవడమెందుకులే ఇప్పుడు!” నవ్వాడు. కాలం మారుతుంది. మనుషులూ మారతారు. తనూ, ఆమే, అందరూ.

“ఇక వెళతాను.” అంటూ పైకి లేచాడు. ఆమెతోటే వీలయినంత ఎక్కువసేపు గడపాలాన్న తపన ఉండేది. ఆ ఉద్వేగమేదీ లేదిప్పుడు.

“ఇల్లు చూదువుగాని రా!” అంటూ ఇల్లంతా తిప్పి చూపించింది వివరాలు చెప్తూ. “బావుంది” చెప్పాడు. ఆమె హాయిగానే జీవిస్తూంది. తనలాగే. కోలమొహం, బొద్దుమీసాల వేణు ఫొటోలోంచి నవ్వుతున్నాడు. అక్కడ గుండ్రటి తన మొహం ఉన్నా పెద్ద తేడా ఉండదేమో! ఆమె బదులు సుమ ఉన్నా.

“నేను డ్రాప్ చేస్తాను మీ హోటల్ దగ్గర. ఏ హోటల్లో ఉంటున్నావు?”

“వద్దొద్దు నీకు అనవసరంగా శ్రమ ఎందుకు! రోడ్డెక్కితే బోలెడు ఆటోలు.” ఆమె అభ్యంతరం చెపుతూ పక్కన నడుస్తుండగానే బయటికి నడిచాడు. గేటుదాకా వచ్చాక ఆగిపోయి అంది. “డాంకే షేన్!”

“ఏమిటీ?” వెనక్కి తిరిగి అడిగాడు.

“డాంకే షేన్! జర్మన్ భాషలో థేంక్స్‌లే! తిట్టాననుకున్నావా?” దూరంగా ఉన్న వీధిదీపం వెలుగులో ఆమె నవ్వు మెరిసింది. “ఏదో ఇంగ్లీష్ సినిమాలో పాట మొదట్లో వస్తుందిలే!”

“థేంక్స్ ఎందుకు?”

“ఆ రోజులకీ, ఆ జ్ఞాపకాలకీ, నీ ఉత్తరానికీ!”

“చదవలేదన్నావుగా? చదివావా?”

అదే నవ్వుమొహంతో తల చిన్నగా అడ్డంగా ఊపుతూ అంది “నీకు నామీద కంటే ఉత్తరం మీదే శ్రద్ధ ఎక్కువ!”

అతనూ నవ్వి “సరే! బై!” అని వెనక్కి తిరిగాడు. ఆమె వెనకనుంచి “బై” అని చెప్పి గేటు వేసుకుంటున్న చప్పుడు.

నడుస్తుంటే చలి కొద్దిగా పెరిగినట్లనిపించింది. వెచ్చబడేందుకు జేబుల్లో చేతులు పెట్టుకుంటే మడతలు పెట్టిన కాగితం తగిలింది. తీసి చూస్తే నెలరోజుల క్రితం భారతి ఇచ్చిన ఆమె అడ్రస్. ఉండ చుట్టి విసిరేస్తే అది గాలికి కొట్టుకుపోయింది. రోడ్డెక్కి ఆటో కోసం అటూ ఇటూ చూశాడు. టీ కొట్టు ముందు ఆపిన మోటర్ సైకిల్‌పై ఆనుకుని కాలేజ్ స్టూడెంట్స్‌లా ఉన్న అబ్బాయీ, అమ్మాయీ నవ్వుకుంటూ, ఒకర్నొకరు తోసుకుంటూ కనబడితే ఒక క్షణం వాళ్ళనే చూస్తూ నిలబడిపోయాడు.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!