విరంచి మీటిన మనసు విపంచి -2...నల్లమోతు శ్రీధర్

ఎన్నో చిన్న చిన్న అనుభూతులు, మనలో మెదిలే ఎన్నో ఆలోచనలు,అందులో కొన్నిఎంతో ఉన్నతంగా ఒక సమయంలో అనిపిస్తాయి ..మరికొన్నిమనసు ఒప్పుకోలేనిజీవితసత్యాన్ని స్పురణకు తెస్తాయి...ఇలా ప్రతీ ఒక్కరికి అనుభవంలోకి వచ్చేఉంటుంది....ఇవే కాదు ఇలాంటివి ఎన్నెన్నో...అందరితో ఉన్నామంటూ అరచేతఒంటరితనం ... మనసుని మెలిపెట్టే అలల లాంటి మనసుపొరల్లోనిజ్ఞాపకాలు..ఉన్నతమైన అనుభవాలు..చిన్న పొరపాటుతో జారిపోయిన ఆనందం..ఇలాప్రతీ ఒక్కటి మనలో ఎన్నో ఆలోచనలని, కొన్ని నిస్పృహని,మరికొన్ని అద్భుతమైనస్పందనని కలిగిస్తాయి..అపుడు మనలో కలిగే భావోద్వేగాలకు అక్షర రూపంకలిగిస్తే........కొన్ని కొంతకాలం గడిచాక మనల్నే ప్రశ్నిస్తాయి,కొన్నిమనల్నే విబ్రాంతి పరుస్తాయి, మరికొన్ని కొత్త జీవితసత్యాన్నితెలియచేస్తుంటే ...ఇవన్ని నాలోని ఆలోచనలేనా అని ఆశ్చర్యపోక తప్పదు...ఇవిబ్రహ్మ నా చెవిన చెప్పిన సత్యాలేమో అని అందమైన ఊహ కలగక తప్పదు...అందుకేమదిలోని ఆలోచనలకూ అక్షరరూపలైన నల్లమోతు శ్రీధర్ గారి  ఈ ఆర్టికల్స్....విరంచి మీటిన మనసు విపంచి అయ్యింది....

మనకు మనమేనా?

"మనమొక్కళ్లం పూనుకుంటే సమాజం బాగుపడుతుందా?" అన్న తర్కం మాటున దాక్కుని సగటు వ్యక్తి సమాజం గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాడు. తానూ, తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఇలా తన పరిధికి కొన్ని హద్దులు పెట్టుకుని ఆ పరిధిలోని ఆనందాలూ, దుఃఖాలు, విజయాలూ, విషాదాలకే స్పందించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నదే! కానీ క్రమేపీ ఆ పరిధి కూడా కుంచించుకుపోవడం నిశితంగా గమనిస్తే అందరికీ అర్థమవుతుంది. ఒకప్పటి వరకూ ఎంతో ఆత్మీయంగా మెలిగిన బంధువులు, స్నేహితులు కూడా ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడడం కూడా గగనం అయిపోయిన దుస్థితిలో మనం ఉన్నాం. పోటీ ప్రపంచంలో జీవితం యాంత్రికమే! అలాగని మనమూ యంత్రాల్లా ప్రేమ, ఆప్యాయతలకు స్పందించనంత "ఎత్తుకు ఎదిగిపోవడం" ఎవరి కోసం?
చిన్న ఉదాహరణలే మనసుని కదిలిస్తాయి. శుభకార్యాలప్పుడు అందరూ కలుస్తుంటారు. అందులో మనం ముసలీ, ముతకాగా భావించే వయోవృద్ధులూ ఉంటారు. ఏ మూలనో కూర్చుని, దృష్టిని ఎక్కడో నిలిపి జ్ఞాపకాల దొంతరల్లో మునిగితేలి ఉంటారు. ఒక్కసారి మనం వెళ్లి మాటవరుసకి పలకరిస్తే.. అప్పటివరకూ నిర్జీవంగా ఉన్న వారి కళ్లల్లో ఎంత వెలుగు మెరుస్తుందో ఎప్పుడైనా గమనించారా?  ఏళ్ల తరబడి ఎవరూ సరిగా పలకరించని నేపధ్యమేమో.. ఇంకెవరూ తమని పట్టించుకోరనే నిర్లిప్తత ఏమో.. ఒక్కసారిగా మనలాంటి వాళ్లం వెళ్లి పలకరించేసరికి ఉబ్బితబ్బిబై "బాగున్నావా నాయనా" అంటూ వాళ్ల మాటల్లో ప్రవహించే ప్రేమని ఆస్వాదించగలిగే సున్నితత్వం మనకెక్కడ మిగిలుందీ? అందుకే "ఆ ముసలావిడ అంతేలే మనుషులు పలకరిస్తే చాలు" అంటూ పక్కన వెటకారమాడే బంధువుల వైపూ, ఆ ముసలవ్వ వైపూ ఒక నవ్వు విసిరేసి ముందుకు సాగిపోతాం. ఒక్క పదినిముషాల ఆవిడతో చెంతన కూర్చుంటే మరో పదేళ్లు సంతోషంగా బ్రతికేటంత ఆనందం ఆవిడకు లభిస్తున్నందన్న స్పృహ కూడా మనకు కలగదు. ఎంతైనా మనం చాలా బిజీ కదా!
ప్రతీ క్షణమూ అమూల్యమైనదే. ఒక్కసారి భవిష్యత్ ని ఊహించుకోండి.. ఇంత కష్టపడీ, సంపాదించీ ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఆత్మీయులు కరువైనప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకూ.. మిగిలిన ప్రపంచానికీ మధ్య పూడ్చుకోలేనంత అగాధం ఏర్పడి ఉంటుంది. మనమే ఇంత సామాజిక ఒంటరితనానికి లోనవుతున్నామే తర్వాతి తరాలు సంతోషాల్ని పంచుకోవడానికీ, విచార సమయంలో ఓదార్చడానికీ ఎవరూ దొరక్క ఎలా జీవశ్చవాల్లా బ్రతుకుతారో  ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనం గడించాలని తాపత్రయపడుతున్న కోట్ల రూపాయల్లో ఎవరికీ నయాపైసా అయినా సాయం చెయ్యనవసరం లేదు. "మన పట్ల, మన ఆత్మీయుల పట్ల, సమాజం పట్ల" చేతనైనంతలో ప్రేమాభిమానాలు పంచితే చాలు.
- నల్లమోతు శ్రీధర్ , January 15, 2011

 

అభిప్రాయాల విషయంలో ఆలోచిద్దాం

మనుషులు, కధలు, కవితలు, పుస్తకాలు, సినిమాలు.. దేని గురించైనా చిటికెలో మన అభిప్రాయాన్ని చెప్పేయగలం. ఎక్కడో విన్నవీ, చూఛాయగా తెలుసుకున్నవీ, కొండొకచో తీరికగా గమనించి ఆకళింపు చేసుకున్నవీ కలిపేసి ఒక అంశంపై మన మెదడు పొరల్లో వేగంగా ఓ ఇధమిద్ధమైన అభిప్రాయం నిర్మితమైపోతుంది. ఒక అంశంపై ఒక అభిప్రాయం ఏర్పడింది మొదలు దాన్ని బయటి ప్రపంచానికి వ్యక్తం చేయడం కోసం మనసు  సందర్భం కోసం వేచిచూస్తూనే ఉంటుంది. కారణం మనకు ఏర్పడిన అభిప్రాయంతో పాటే దాని చుట్టూ మనదైన స్పందన మనకు తెలియకుండానే అల్లుకుంటుంది. ఆ స్పందన ఎక్కడోచోట వెల్లడైతే తప్ప మనసుకు స్థిమితం లభించదన్నమాట. అందుకే సమయం, సందర్భం లేకుండా ఎవరి గురించైనా, దేని గురించైనా మనలో నుండి అపరిమితమైన అభిప్రాయాలు వెల్లడవడానికి ఆరాటపడుతుంటాయి. మన మనసులో అభిప్రాయం నిర్మితమయ్యే దశలోనే ఎంతో అస్పష్టత నెలకొని ఉంటే దాన్ని వ్యక్తపరిచే దశలో మన బుద్ధి మరింత దాన్ని పేలవం చేస్తుంది. పేలవమైన అభిప్రాయాలకు విలువ ఉండదు. మనకు ఇవేమీ అక్కరలేదు. మన అభిప్రాయాలను అందరూ గౌరవించాల్సిందే. అడ్డంగా వాదించైనా మనం ఏర్పరుచుకున్న అభిప్రాయమే లోకసమ్మతమని జనాల్ని వత్తిడితో అంగీకరింపజేసుకుని మనల్ని మనం వంచించుకుంటాం.
ఎంత లోతుగా గమనించినా తలకెక్కని విషయాలపై ఎందుకంత వేగంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటున్నామన్నది ఎప్పుడైనా ఆలోచించామా? మన లోపాన్ని గ్రహించలేక అసమగ్ర అభిప్రాయాలతో ప్రపంచాన్నీ, మనుషుల్నీ ప్రభావితం చెయ్యాలని కోరుకుంటున్నామంటే అది మనం సిగ్గుపడవలసిన విషయం కాదా? ఎవర్నీ లోతుగా చదవకుండానే మన వంతు మంచో, చెడ్డో ఒక మాట అనేసి దులపరించుకుంటే మనం ఎటువంటి సామాజిక బాధ్యత వహిస్తున్నట్లవుతుంది? అలాంటి తాలు అభిప్రాయాలే మన గురించి ఇతరుల నుండి వస్తే స్వీకరించగలమా? మనకు తెలియని విషయాలు, మనుషులపై, అర్థం కాని అంశాల గురించి "ఫలానా విధంగా కాబోలు" అని అస్పష్టతని మరింత వ్యాపింపజేయాలనుకోవడం విజ్ఞతతో కూడుకున్న పనేనా? దేని గురించైనా అభిప్రాయం కలిగి ఉండడం తప్పు కాదు. ఆ అభిప్రాయం సరైనదో కాదో నిర్థారించుకోవడంలో శ్రద్ధ చూపకపోతేనే తప్పు చేసిన వాళ్లం అవుతాం. అభిప్రాయాలను ఆత్మీయులతో చర్చించి సరిచేసుకోవచ్చు. కాకపోతే ఇదంతా ఎవర్నీ మానసికంగానూ, ఇతరత్రానూ మన అభిప్రాయాలతో గాయపరచకముందే స్పష్టపరుచుకోవలసిన తతంగం. మన అభిప్రాయాలకున్న శక్తి ఏపాటిదంటే.. ఒక వ్యక్తి పట్ల మనం ఎంత తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే అది మనకు తెలియకుండానే అవతలి వ్యక్తిని అంతగా గాయపరుస్తుంది. వ్యక్తి స్థాయిలోనే అంత హాని చేసేదై ఉంటే.. ఏకంగా సమాజం పట్లే మనం తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకుంటే అది మనల్నీ, మనల్ని అంటిపెట్టుకుని ఉన్న సమాజాన్నీ ప్రశాంతంగా ఉండనివ్వదు.
మనం ఏర్పరుచుకునే అభిప్రాయాలని నిశితంగా విశ్లేషించుకునేటంత సూక్ష్మమైన ఆలోచనలను మనం ఎప్పుడూ చేయం. ఆ క్షణానికి అన్పించినది అనాలోచితంగా వెళ్లగక్కేసి మనకేం పట్టనట్లు.. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసిన బాపతుగా చలామణి అవుతుంటాం. ఈ తొందరపాటుని నిగ్రహించుకపోతే మనం సంధించిన అభిప్రాయాలు ఎంత శక్తివంతమైనవో మనకు మనం స్వీయఅనుభవంతో తెలుసుకోవలసిన పరిస్థితులూ జీవితంలో తటస్థిస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గతంలో మనం పాటించలేకపోయిన నిగ్రహాన్ని గుర్తుచేసుకుని చింతిస్తాం. కానీ ప్రయోజనమేముంది?
- నల్లమోతు శ్రీధర్ , January 17, 2011

రాజులూ లేరు.. రాజ్యాలూ లేవూ.. శత్రువులు తప్ప!

రాజులూ లేరూ.. రాజ్యాలూ లేవూ.. శత్రువులు అంతకన్నా లేనే లేరు. ఉన్నదల్లా దేనికది అకారణంగా వగిచే అసంతృప్త హృదయాలే. ప్రతీ హృదయంలోనూ తడమలేనంత అభద్రతాభావం! మనం రాజులం కాకపోయినా, మనకెలాంటి రాజ్యాలూ లేకపోయినా మనల్ని తప్పించి యావత్ ప్రపంచం వైపూ మన చూపులు అనుమానాస్పదపూరితాలే. ప్రతీ పరిచయంలోనూ తొలుత మనం నిర్థారించుకోవడానికి ప్రయత్నించుకునేది "శత్రువు కాదు కదా" అన్న భావననే!  మనకెలాంటీ ఆపదా, మన మార్గానికెలాంటి అవాంతరమూ కలగకపోతేనే.. తదనంతరమే ఎంత బలమైన అనుబంధమైనా! మన జీవితాలని కమ్మేసిన అభద్రత అసలైన మనల్ని చంపేస్తోంది.
ఓ ఇనుప ఛట్రంలోకి మనల్ని మనం కుదేసుకుని.. ఆ ఛట్రాన్ని శత్రుదుర్బేధ్యంగా మలుచుకోవడానికి తపిస్తూ.. మొత్తం ప్రపంచాన్ని శత్రువుని చేసేసి… మనమొక్కళ్లం లోపల ఒరుసుకుపోతూ పళ్ల బిగువున సంతోషాన్ని అనుభవిస్తున్నాం. మనకు తెలిసిందొక్కటే.. "ఈ ప్రపంచం మనకు తీవ్రంగా అన్యాయం చేస్తోంది. ఈ ప్రపంచంలోని మనుషులు మనల్ని దోచుకోవడానికి గుంటనక్కల్లా కాచుక్కూర్చున్నారు.. అవకాశం ఉన్న వాడల్లా మోసగించే ప్రయత్నాల్లో ఉన్నాడు… కొందరు మన అవకాశాలను తన్నుకుపోయే రాబందులుగా తయారయ్యారు". అందుకే అందరూ మన కళ్లకు శత్రువులే.
అంతటి శత్రుత్వాన్ని తట్టుకోవాలంటే ఎంతటి అభద్రతకి లోనవ్వాలీ? ఆ అభద్రతలో ఎన్ని తప్పిదాలు చేయాలీ.. ఎందరి మనసుల్ని గాయపరచాలీ..? శత్రుత్వాన్ని మెదడులో మోస్తూ అపర శకునిలా ఎన్ని కుటిల యత్నాలకు మంత్రాగాలు పన్నాలీ?
స్వచ్ఛమైన మనసుల్లోకి చేజేతులా గునపాలు గుచ్చుతున్నాం.. మన మాటలూ, చేష్టలతో!  కన్పించిన ప్రతీ మార్గంలోనూ విషం జల్లుతూ.. సున్నితమైన మనసుల్ని తట్టుకోలేనంతగా చిదిమేస్తున్నాం. ఎక్కడెక్కడో  ప్రోగేసుకొచ్చిన మన అసంతృప్తి తో సమాజాన్ని శత్రువుగా చూస్తూ ఇరుక్కుపోయి కాలం గడుపుతున్నాం. దర్జాగా, స్వేచ్ఛగా, సంతోషంగా జీవితాన్ని గడపలేనివ్వని అభద్రతతో అటు మనమూ శాంతిగా ఉండలేకా ఇటు ప్రపంచాన్నీ అశాంతితో నింపుతూ బ్రతకడం అవసరమా?
సమాజంలో ఎక్కడ చూసినా ఎవరికి వారి అభద్రతతో కొనితెచ్చుకునే ఉపద్రవాలే. ఏ మనిషికీ సాటి మనిషి పట్ల భరోసా లేకపోవడమంత దౌర్భాగ్యమైన స్థితి మరేదీ లేదేమో. నమ్మకం లేని స్థితితో మనుషులతో కలిసి జీవిస్తూ ఆ గరళాన్ని వెల్లగక్కడం కోసం విమర్శల పేరుతో, లోపాల పేరుతో, కొండకచో సూచనల పేరుతో ద్వేషాన్ని వెదజల్లుతూ మనల్ని మనం నాజూగ్గా ప్రదర్శించుకోవడం దిగజారుడుతనానికి పరాకాష్ట అని మనకెప్పుడు అర్థమవుతుందో!
మనం ఎవరికీ సూటిగా ఎలాంటి హానీ చెయ్యం. కానీ మన ఉద్దేశాలూ, మన చర్యల్లోని పరమార్థాలూ, మన మాటల్లోని ద్వందార్థాలూ, మనం కోరుకునే లక్ష్యాలూ మనం అభద్రతతో శత్రువుగా భావించే వ్యక్తి పతనంవైపే. ఇంత లౌక్యాన్ని వంటబట్టించుకున్న తర్వాత మనం సమాజానికి దోషులుగా ఎప్పటికి కన్పిస్తాం.. ఏతావాతా మన మనఃసాక్షికి తప్ప, అదీ ఈపాటికే దాని పీక నొక్కేయకపోయి ఉండుంటే! శత్రుత్వపు భావనతో జీవితం గడపడం ఎంత నరకమో చవిచూస్తూనే ఉన్నాం. కనీసం ప్రేమతో మనషుల్ని గెలిచే ప్రయత్నమెందుకు చేయం?
- నల్లమోతు శ్రీధర్ ,  Feb 25, 2011


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!