లక్ష్యం అంటే !....(ది సీక్రెట్ ....వేణు భగవాన్..)

ఒక పనిని నిర్ణీత కాలంలో పూర్తి చేయాలనే సంకల్పమే లక్ష్యం.  లక్ష్యం అంటే ఖచ్చితంగా ఒక కోటి రూపాయలు సంపాదించడం లేదా ప్రధానమంత్రి అయిపోవడమే కానక్కరలేదు. అది చిన్న ఇల్లు కట్టుకోవడం దగ్గరనుంచి మీ చిన్నారి పాపతో పార్కుకు వెళ్ళడం, ఒక కొత్త అలవాటు, కోరుకున్న వ్యక్తితో వివాహం కూడా లక్ష్యం కావొచ్చు.

అయితే జీవితాన్ని, విలువైన జీవితంగా మార్చుకోవాలంటే ఒక ఉన్నతమైన ఆశయం కావాలి. ఆ ఆశయం తనకూ, ఇతరులకూ, సమాజానికి ఎంత ప్రయోజనకారిగా ఉంటే అంత ఉన్నతంగా ఆ వ్యక్తీ జీవనం ఉంటుంది.

మీరు సాధించదలచుకున్న ఏ పనైనా అది మీ లక్ష్యం అని చెప్పవచ్చు. ఒక జీవిత కాలంలో సాధించదలచింది ఆశయం అనవచ్చు. ఆశయమనే జీవిత గమ్యాన్ని చేరుకునే మార్గమే (విలువలే) ఆదర్శం.

ఏ ఒక్కరు లక్ష్యాలు లేకుండా లేరు. ఉదయం లేచిన నుండి, ఆఫీసు కి వెళ్ళడం, ఫలానా బిల్లు కట్టడం, ఫలానా వారిని కలవడం, పరీక్ష పాసుకావడం , ఓ ఉద్యోగం సంపాదించడం, ఏదైనా వ్యాపారం చేయడం ఇవన్నీ లక్ష్యాలే కదా! కాకపొతే అంతిమ గమ్యం అంటూ లేని లక్ష్యాలు. దీని వల్ల జీవితం ఎటు తీసుకెళ్తుంటే అటు వెళ్తుంటారు. అధిక శాతం మంది ఇలాంటి జీవనం సాగించేస్తుంటారు. అయితే వీరికి కలల్లేవా అని మీరనుకోవచ్చు. లేకేం. బోల్డు ఉంటాయి. కాని వాటిని ఎలా నిజం చేసుకోవాలో తెలియదు. కనుక అవి కేవలం కలలు గానే మిగిల్చేసుకుంటారు. కళలను లక్ష్యాలుగా మారిస్తే అవి నిజాలవుతాయి.నిజాలను అలక్ష్యం చేస్తే అవి కలలవుతాయి అన్నమాట అక్షర సత్యం. ఎందుకంటే ఏ పని చేయకపోతే చూస్తూ చూస్తూనే జీవితం కళ్ళ ముందే కలలా కరిగిపోతుంది కదా!

ఈ రోజు అమెరికాలో ఆర్ధిక సంక్షోభానికి కారణం అక్కడ మధ్యతరగతి వారు లేకపోవడమే. అంటే అక్కడ ఉన్నవారు, పేదవారు ఇద్దరే ఉన్నారు. అదే పరిస్థితి మన దేశంలో కూడా విస్తరిస్తుంది. ఒకప్పటి మధ్యతరగతి వారు.. పెరిగిన అవసరాలు, వాటికి అనుగుణంగా పెరగని ఆదాయాలావలన, వెనుకబడిన వర్గంలో కలిసిపోతున్నారు. జరిగిన ఈ అనూహ్య మార్పును చూసి తిట్టుకోకుండా భవిష్యత్ కు నేటి నుండే ప్రణాళికలు వేసుకుని జీవించడం ఉత్తమం. చివరి వరకూ తలెత్తుకుని తిరగాలంటే మనిషికి ఆరోగ్యం, ఆర్ధిక స్వాతంత్ర్యం అవసరం.

చాలా కొద్ది మంది మాత్రమే తమ కలలకు ఒక ప్రణాళిక వేసుకుని ఎప్పటి లోగా నిజం చేసుకోవాలో ఒక గడువు విధించుకుని ఆ ప్రయత్నంలో నిమగ్నమౌతారు. వీరికి అంతిమంగా ఎక్కడకు చేరాలో తెలుసుకనుక, ప్రయాణంలో వచ్చే ఇబ్బందులని అధిగమించి గమ్యం చేరుతారు. వీరు పెద్ద లక్ష్యాలనే కాక చిన్నలక్ష్యాలను కూడా నిర్లక్ష్యం చేయరు. చిన్న చిన్న విషయాలే పెద్ద ఆశయ సాధనకు ఎంతో మూలం అని వీరికి తెలుసు. ఈ కొద్దిమందిలో మీరూ ఒకరౌతున్నందుకు మీకు మా అభినందనలు.

1.3...లక్ష్యం  అవసరమా ?

కృషితో మనుషులు ఋషులౌతారు అని విన్నాం. కానీ ఒక లక్ష్యం లేని కృషి వల్ల మనిషి కష్టజీవి క్రింద మిగిలిపోతాడు. అదే ఒక లక్ష్యంతో కూడిన మనిషి తానూ అనుకున్నా రంగంలో ఋషి కావొచ్చు. ప్రతి ఒక్కరికి ఏవో లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా అవి దైనందిన జీవితానికి సంబంధించినవి అయివుంటాయి. అయితే ఈ లక్ష్యాలు అంతిమ గమ్యం  వైపు సాగుతుంటే మంచిదే. కాకపొతే నూటికి 97 శాతం మంది ఒక అంతిమ గురి లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఉహించండి! చాలా ఉత్సుకతతో జరుగుతున్నా ఒక ఫుట్ బాల్  ఆటలో గోల్ పోస్ట్ లు లేకపోతే ఆ ఆట ఎలా ఉంటుంది ?చాలా మంది ఇలాంటి బిజిలోనే ఉంటారు, ఇలాంటి బిజివల్ల ప్రయోజనం లేదు. అభివృద్ధి చెందడం ఒక్కటే సరిపోదు. సరైన దిశగా పయనిస్తున్నామా అని గమనించాలి.

ఈ పరిస్థితికి కారణం ప్రతీ వారూ సాధారణంగా బ్రతుకుతెరువు కోసమో, వారసత్వం వల్ల వచ్చినది ఏదో ఒక ఉద్యోగం/వ్యాపారం మొదలుపెడతారు. అది తనకు నచ్చిన వృత్తి అయితే మంచిదే. నచ్చనిదైతేనే ఇబ్బంది అంతా. కొంతమంది ఎలాగూ దిగాం కదా అనిదానితో కుస్తిపడతారు. కొంతమంది యిక వేరే దారి లేదని రాజి పడతారు. కొంతమంది చేసే పని ఆశక్తి లేనిడైతే ఆ పనిలో శ్రద్ద లోపించి నైతిక విలువల్ని ఒక్కొక్కటి వదిలేస్తారు. కొన్నాళ్ళకు వీరి మనసు, శరీరం జీవ కళ తప్పుతుంది. యిక ఇలాంటి వారి ఇంటిలో బాంధవ్యాలు ఎలా ఉంటాయి? పిల్లలకు మంచి విలువలు ఎలా నేర్పగలరు?

జీవితమంటే బిజీగా ఉండడమే కాదని, ఈజీగా ఉంటూకూడా బిజీగా డబ్బు సంపాదించవచ్చని చాలా మందికి తెలియదు.

1.4..లక్ష్యం తప్పనిసరి


"నిదానంగా ఎదురుచూసేవారికి కూడా కొన్ని విజయాలు లభించవచ్చు.
అయితే అవి సకాలంలో సత్వరంగా ప్రయత్నాలు చేసినవారికి
దక్కిన తరువాత మిగిలినవే అయిఉంటాయి"
- -అబ్రహం లింకన్


రోజువారి పనుల్లో తలమునకలై బిజీగా ఉండేవారికి జీవితం గురించి ప్లాన్ చేసుకుందాం మనుకుంటే సమయమే కుదరదు. చాలా మంది బ్రతుకు అనే నావలో ప్రయాణం సాగించేస్తుంటారు. నీటి వడికి ఎటో అటు సాగుతూనే ఉంటుంది. ఎంత గొప్ప కెమెరా ఉన్నా లెన్స్ సరి చేయనిదే గొప్ప చిత్రం సాధ్యం కానట్టే, ఎంత మేధావి అయినా తన కర్త్వ్యంపై సృష్టత  లేనిదే ఉన్నత శిఖరాలు చేరలేడు.

జీవితం అనే నావకు, చుక్కాని ద్వారా దిశా నిర్దేశం చేయడమే లక్ష్యం. మన మనస్సు నిజంగా కోరుకునేదేమిటి తెలుసుకుని లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. దీనికి సమయం, ప్రశాంత వాతావరణం కావాలి, చిన్న చిన్న పార్టీలకే ఎంతో సమయం కేటాయించే చాలామంది, జీవితం అనే పెద్ద పార్టీ కోసం సమయం కేటాయించకపోవడం దురదృష్టకరం. భవిష్యత్ దున్నిన నేల వంటిది, ఏ విత్తనం నాటాలో మన ఇష్టం. ఏ విత్తనం నాటకపోతే కలుపుమొక్కలు, అదృష్టం బావుంటే ఒక మంచి మొక్క కూడా రావొచ్చు. కానీ జీవితం అదృష్టానికి వదిలేయడంకన్నా విలువైనది.

రైలులో సహా ప్రయాణికులు ఏ ఊరు వెళ్తున్నారు అని అడిగితే, 'ఇంకా నిర్ణయించుకొలేదండి' అని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? మీరు ఆయన వంక ఎలా చూస్తారు? అలాగే మనం జీవితం అనే ప్రయాణం మొదలుపెట్టి చాలా సంవత్సరాలై ఉంటుంది. గమ్యం తెలియకపోతే ఎక్కడో అక్కడికి చేరతాం, మనకు నచ్చినా, నచ్చకపోయినా. ఈ రోజు 9 వ తరగతి పరీక్షలో మీ లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారు.ఎంత త్వరగా అర్ధవంతమైన లక్ష్యాలు నిర్దేశించుకుంటే అంత త్వరగా విజయం సాధిస్తారు మరియు అంత ఎక్కువ విజయాన్ని ఆస్వాదిస్తారు.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!