ఎల్లోరా గుహలు ఎలా నిర్మించారు

మీరు ఎపుడైనా ఎల్లోరా గుహలు చూసారా..ఎంతో అద్బుతమైన రాతి గుహలు, కొండలను తొలచి వాటికి అద్భుతమైన రూపాన్ని ఇచ్చిన ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఈ ఎల్లోరా గుహలు సజీవ సాక్షాలు. అవి ఎవరు ఎపుడూ కట్టారూ అంటే అన్ని ఒక శతాబ్దంలో కట్టబడినవి కాదు. కొన్ని శతాబ్దాల పాటు సాగిన ప్రక్రియనే మనం ఇపుడు చూసే ఎల్లోరా గుహలు. అసలు ఈ రాతి గుహల నిర్మాణం ఎలా జరిగి ఉండొచ్చు. ఒకసారి మీ ఉహకు, ఆలోచనలకూ పదును పెట్టండి

గుహలు ఎలా నిర్మించారు

చిన్నపుడు ఇసుకలో ఆటలు ఆడుకునే ఉంటారుకదా..ఇసుకలో ఆటలాడు కోవడం తడి తడిగా వున్నఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం,ఇసుకను గోపురంగా చేర్చి, లోపల కాలిని గాని, చేతిని గాని లేదా వస్తువునో గాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి,అక్కడి ఇసుకను తొలగించి ద్వార మార్గాలు ఏర్పాటు చేయడం మనకందరికీ తెలిసినవిషయమే.,మీ జ్ఞాపకాలకి ఆలోచనని జోడిస్తే కొండలను తొలచిన విధానం మీ ఉహకు అందుతుంది. మేము అలా కట్టిన వాటిని పిచిక గూళ్ళు అని అనేవాళ్ళం. సరిగ్గా అలాగే కొండలను తొలిచి మన శిల్పులు గుహాలయాలను నిర్మించారు.మన దేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమయింది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారు. ఆ తరవాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు.

ఎల్లోరా గుహల వివరణ

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలు దాదాపు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన 34 గుహలు హిందూ, జైన, బౌద్ద మత సంస్కృతులకు చిహ్నాలుగా నిర్మింపబడ్డాయి.

మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటిని ఐదో శతాబ్ధం నుండి ఎనిమిదో శతాబ్దం మధ్య కాలంలో చెక్కారు. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక థల ను తెలుపుతాయి. ఇవి ఆరవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దంలో చెక్కినవి. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటిని ఎనిమిది - పది శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి.

ప్రసిద్దమైన గుహలు.. సంక్షిప్తవివరణ
ఎల్లోరా గుహలన్నింటి లో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళ తో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభా లపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాధీసుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది

10వ గుహ.. విశ్వకర్మ చైతన్యం
ఎల్లోరాలో చైత్యశాల ఇది ఒకటే, దీనిని విశ్వకర్మ చైతన్యమని అంటారు. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నింటికీ మకుటాయ మానంగా వెలుగొందుతోంది. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలు స్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్కరాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతారు. ఆయన ఒక్కరాత్రిలో నిర్మించా రో లేదో అనే మీమాంసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది.ఇక్కడ బుద్ధుని మూర్తి చాలా శాంతంగా, ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది.
అలాగే ఈగుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతి ధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరలు మళ్లీ మనకే విన్పిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమై న ధ్వని సొంపుతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్లీ మళ్లీ మనం ధ్వని చేయాలన్పిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని విన్పిస్తుంది. నిజంగా ఈ విశ్వకర్మ గృహాలయం చాలా వింత గొలుపుతుంది.

14వ గుహ..15వ గుహ

.వీటిలో 14వ గుహ రావణ పరా భావ శిల్పం అత్యద్భుతం. 15వ గుహలో నట రాజ శిల్పం, లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు, ఆయనను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ, విష్ణువుల శిల్పాలు అమోఘం


16వ గుహ కైలాస దేవాలయం

పదహారవ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టగానే కన్పించే ద్వజస్థభం చూపరులను కట్టిపడేస్తుంది. ఈ ద్వజస్థంభ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందట. దీని నిర్మాణానికి సుమారు ఏడు వేలమంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు. దాదాపు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయానికి రెండువైపులా రెండంతస్థుల నిర్మాణాలు ఉన్నాయి. వీటి నిర్మాణం సైతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయంలో హిందూమత ఇతిహాసాలైన రామాయణ, మహాభారత గాధలను చెక్కడం విశేషం.ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది.

21వ గుహ..22వ గుహ
21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారు. 22వ గుహ నీలకంఠగుహ అంటారు. ఈ గుహలో సప్త మాతృకలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలున్నాయి.21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిని పోలివుంది. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరా ణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.25వ గుహ..29వ గుహ

25వ గుహలో సూర్యుడు ఏడు గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూ స్తాం.30 గుహ నుండి 34 గుహ

ఈ ఐదు గుహలు జైనులకు సంబంధించినవి.32వ గుహలో గోమటేశ్వరుడి శిల్పం చాలా అద్భుతం గా ఉంటుంది.. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కినట్లున్నాయి. ఈ గుహల్లో జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పా లున్నాయి.

ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతి ర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడి కొలువై ఉన్న స్వామిని ఘృష్ణేశ్వరుడు అంటారు. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఎల్లోరా సంద ర్శనకు వచ్చిన యాత్రికులు ఘృష్ణేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.


Comments

Post New Comment


lakshminaresh 27th May 2011 14:04:PM

నిజంగా చాలా బాగుంది . ఇది రాయడం వెనుక మీ హోం వర్క్ ,ఫోటోలు, మీరు చెప్పుకుంటూ వెళ్ళిన తీరు. నిజంగా ఇది మన వారసత్వ సంపదే.