మంచి కథ..కంపనీ లీజ్

ఒక మంచి కథ....శ్రీ విరంచి..మాటల్లో

సుఖసంసారాలన్నీ ఒకే మోస్తరు కథ, చెదిరిన సంసారాల కథలు మటుకు ఒక్కొక్కటే ఒక రకం. వీటికి నమూనాలు, మోస్తరులు వుండవు- అన్నాడు కెంట్ లియో టాల్‌స్టాయ్ ఒక నవల మొదటి అధ్యాయంలోనే. సునీత, రాజేష్‌లది సుఖ సంసారం. ఆమె ఓ పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో మేనేజరు. అతను స్వంతంగా ఒక కంపెనీనే నడుపుతున్నాడు. వారి యింట్లో యజమాయిషీ చేయటానికి ‘హౌస్‌కీపింగ్’ కార్యకలాపాలకు ఒక మనిషి వుంది. ఆమె పేరు ఫతీమా. ఆమెకు అతని కంపెనీనుంచి జీతం, భత్యాలు యిస్తారు. రాజేష్ ఆమెతో ‘వివాహ పరిధులలో చేరని లైంగిక సంబంధం’ పెట్టుకుని పదేళ్లపాటు గుంభనంగానే కథ నడిపాడు. ఆ అక్రమ సంబంధం ఒకరోజున సునీత కంటపడింది. ఆమె నానా యాగీ చేసింది. బంధుమిత్రులను పిలిపించి ‘పంచాయితీ’ నడిపింది. ఫలితంగా ఫతిమా వుద్యోగం ఊడిపోయింది. ఆమె రోడ్డు పాలైన విషయం కూడ సునీతకు నాలుగు నెలల అనంతరం కాని తెలియలేదు. ‘మన యింట్లో పని తీసివేయమన్నానుగాని- అసలు ఉద్యోగానికే ఎసరు పెట్టమనలేదు. అదీగాక భర్త ఆమెను వేధించుకు తింటున్నాడు. వెనకటి అక్రమ సంబంధం తిరగతోడుతూ రోజూ ఆమెను శారీరకంగా- మానసికంగా బాధపెడుతున్నాడు. ఆమెకు మళ్లీ ఉద్యోగం యివ్వు’ అంటుంది సునీత. రాజేష్ ‘అది మాత్రం వీలుకాదు. హెచ్.ఆర్.డి వ్యవహారాల్లో నేను కలుగచేసుకోవడం సరికాదు. అయినా ఫతీమాకు తగిన ‘పారితోషికం’ ఎప్పటికప్పుడు యిచ్చాను. ఇల్లు కూడా కట్టించి పెట్టాను. ఆమె భర్తకు అప్పుడే తెలుసు, యిప్పుడు కొత్తగా తెలుసుకున్నట్లు నటిస్తున్నాడు’ అంటాడు. ఎలాగయినా ఫతీమాకు ఆ పాత కంపెనీ ఉద్యోగంలో ‘రిహాబిలేట్’ చేయాలని సునీత పంతం. భర్త సుముఖంగా లేకపోవడంతో నేరుగా అతని హెచ్.ఆర్.డి. మేనేజర్‌తో మాట్లాడి ఓ కొత్త విషయం తెలుసుకుంటుంది. ‘రాజేష్ తన మేనేజర్ను పిలిచి ‘మరీ’ చెప్పిన తరువాతే ఫతిమాను పనిలోంచి తీసెయ్యడం జరిగింది’ అనేది ఆ విషయం. రాజేష్ ఫతిమా ఉద్యోగం ఊడిపోవడంతో తనకేం సంబంధం లేనట్లు ఆమెను మళ్లీ పనిలో చేర్చుకోవడం తన చేతుల్లో లేనట్లు స్పష్టంగా చెప్పిన మాటలు సునీత ఇంతకుముందు అతని నోటి వెంటనే నమ్మింది గనుక రుూ కొత్త విషయాన్ని జీర్ణం చేసుకోలేకపోయింది. ఫతిమాకు అన్యాయం జరిగిపోయింది. ఆమెకు న్యాయం చేకూర్చడమే తనకు విధాయకం, యిందుకు కారణం అయిన భర్తతో ‘తెగతెంపులు’ చేసుకోవడానికయినా జంకనక్కర్లేదు అనే నిర్ధారణకు వచ్చేసింది.
ఆమెకు తండ్రి బంజారాహిల్స్‌లో యిచ్చిన స్థలంలో పెద్ద భవనం నిర్మాణంచేసి ‘కంపెనీ లీజ్’కు యిద్దామనుకున్న తరుణం. ఈరోజే ఆ ‘లీజ్’ ఖరారు చేయవలసి వుంది. అయితే సునీత ఫతిమాను పనివేళ ఆమె యింటికి వెళ్లి పిలుచుకువచ్చి తనతోపాటు ఆ కొత్త యింట్లో వుండటానికి ఒప్పందం చేసుకుని తీసుకువచ్చింది. ‘ఇల్లు లీజుకు యివ్వడం మానుకున్నాం… నేను ఆ ఇంట్లోకి ఈరోజే మారుతున్నాను… ఇంక మనిద్దరికీ పొత్తు కుదరదు రాజేష్’ అని చాల తాపీగా చెబుతుంది సునీత.
-శ్రీ సి.రామచంద్రరావు ఇటీవల ప్రచురించిన కథ సంపూర్ణ వివరణ యిది (స్వాతి వారపత్రిక 9.10.09). ఈ కథకుడి పేరు చెప్పగానే తెలుగు కథలు పరిచయం వున్న యే చదువరి అయినా ‘వేలు పిళ్లై’ రామచంద్రరావు కదూ- అనుకుంటాడు. ఆయన రాసిన కథలు బహు తక్కువే అయినా (సంఖ్యలో) కథా సువిధానంలో ఎక్కువ మెలుకువ అయినవి కనుక అందరికీ తప్పనిసరిగా రుూ పేర్లు గుర్తుంటాయి. కథ పేరు ‘కంపెనీ లీజ్’. ఈ కథలో ప్రధాన అంశం భార్యాభర్తల అవగాహనలకు సంబంధించినదే అయినా, యిల్లు కట్టడం- లీజ్‌కు ఇవ్వడం అనే అంశాలతోనే ప్రారంభించి అసలు అంశంకు కావలసిన వాతావరణం కల్పిస్తారు. కంపెనీ డైరెక్టర్లు, ప్రొప్రయిటర్ల నిత్య జీవన విధానం ఎలా వుంటుందో ఆనుషంగితంగా చూపించినందువల్ల ఇది మధ్య తరగతి కథ కాకుండా మనసుకు సంబంధించిన వ్యవహారంగా తయారవుతుంది. దంపతుల అవగాహనలో చర్చనీయాంశం, ఫలితాంశం ఏమిటో చూద్దాం-
సునీత భర్త తాలూకు ‘ఎక్స్‌ట్రా మారిటల్ సెక్స్’ను తేలికగానే తీసుకోగలిగింది. ‘స్పోర్టివ్’గానే వ్యవహరించింది, సంఘటన జరిగిపోయాక, బంధుమిత్రులతో కాకుండా తనే పరిష్కారం చేసుకుంటే బాగుండిపోయేది అన్న అభిప్రాయానికి కూడా వచ్చింది. ఆమె భరించలేకపోయిన అంశం ఏమిటంటే, ‘్భర్త తనతో అబద్ధం చెప్పడం, ఆమె ఉద్యోగాంతానికి తాను ఏమీ చేయలేనని బాహాటంగా చెప్పడం.’
‘రాజేష్, ఎందుకు నాతో అబద్ధం చెప్పావ్?’ అని సునీత అతన్ని నిలదీస్తుంది. అతనికి జవాబు లేదు. ‘నీ పరువు కాపాడుకోవడం కోసం నీకింత చేసిన ఫతిమా ఎలా పోయినా ఫర్వాలేదన్నమాట!’ అంటుంది. వ్యక్తిత్వానికి విలువ యిచ్చే మనిషిగా ‘సునీత’ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. తప్పులు చేయవచ్చు. కాని ఆ తప్పు ‘బాధ్యత’ తీసుకోకపోవడంలో అమానుషత్వం, అమానవీయత వున్నాయి. వీటిని ఎత్తి చూపడం ఎంతో చాకచక్యంగా చేసిన రుూ కథాకథనం ఎంతయినా హర్షించదగినది.
‘స్ర్తి’కి అన్యాయం జరగడం, యిందుకు స్ర్తియే కారణం కావడం భూమికతో మనకు ఎన్నో కథలు వచ్చాయి. అన్యాయాన్ని ముక్కుసూటిగా చూపించి, అలాంటి మనిషితో తెగతెంపులు చేసుకుందుకయినా ‘ధీరోదాత్తత’ కనబరచిన కథ యిది. జీవితంలో అముఖ్యమైనవి, ముఖ్యమైనవీ కొన్ని విషయాలు వుంటాయి. రెంటినీ అనుసంధానం చేసి ‘నిబద్ధత’ చేకూర్చడం  కథలో విశేషాంశం. ‘కంపెనీ లీజ్’ ఎందుకు యివ్వాలనుకున్నారో అది కేంద్ర బిందువు అయితే, అది కరిగిపోయి ‘చెదిరిన కుటుంబం’ కథగా మిగులుతుంది. కంపెనీల వ్యవహార సరళి, ‘పీటర్’ అనే ప్రత్యమ్నాయ నౌకరు విధేయంగా పనిచేసి, పాత నౌకరును గుర్తుకు రాకుండా చేయడం చిన్నప్పటి ఇంజక్షన్ కథనం ఇలాంటి మిశాయింపులు కథను పరిపుష్ఠం చేస్తున్నాయి. అతి అరుదుగా చదువరులకు లభించే మంచి కథలలో ఈ ‘కంపెనీ లీజ్’ తప్పకుండా చేరుతుంది.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!