మనిషి..మనస్తత్వం..చిన్న కథలు..

చాలా చిన్న చిన్న సంఘటనలు, మన కంటి ముందర జరుగుతూనే ఉంటాయి..అందులో మనం సహాయపడే విషయాలు ఉంటాయి అది మాట సహాయం  లేదా ధన సహాయం  ఏదైనా కావొచ్చు.. కానీ చాలా మంది అపుడు అసలు దాని గురించి పట్టించుకోకుండా కొంచెం సమయం గడిచాక అయ్యో నేను ఇలా అనవలసింది..నేను యిలా సహాయం చేయవలసింది అని మనసులో అనుకుంటారు...కానీ ఆ సమయంలో ఎందుకు స్పందించలేదు ఆంటే మాత్రం సరైన జవాబు ఉండదు.. మనిషిలో ఉండే ఒక అలసత్వం.. ఈ సారి చూద్దాంలే అనే మనిషి మనస్తత్వం.. ఒక అడుగు వెనకనే నిలపెడుతుంది.

మనిషి మనస్తత్వం విషయంలో చిన్న పెద్ద అని కానీ, గొప్ప బీద అని కానీ ఉండదు.. ఎంతటి వారైన మనిషిలో తరవాత చూద్దాం అనే అలసత్వం ఉంటుంది.. అందుకు ఈ  చిన్ని కథ ఒక మంచి ఉదాహరణ..

మంచిపనికి ఆలస్యం ఎందుకు....

ఒకసారి ధర్మరాజు కొలువుదీరి ఉండగా ఒక పేదవాడు వచ్చి తనకు ఉండడానికి ఇల్లు లేదని ప్రార్థిస్తాడు. అప్పుడు ఏదో అవసరమైన చర్చలలో ఉన్న ధర్మరాజు “రేపు రమ్మని” తప్పక సహాయం చేస్తానని అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఒక మూల నుండి ధర్మరాజు తో “ఓ మహానుభావా! సర్వజ్ఞా, సర్వాత్మస్వరూపా” అంటూ సంభోదిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఇది విన్న ధర్మరాజు నిర్ఘాంతపోయి “బావా! ఏంటి అలా సంభోదించావు?” అని బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “మీరు అతన్ని రేపు రమ్మన్నారు. మరుక్షణం ఏమవుతుందో తెలియదు. అలాంటిది మీరు అతన్ని రేపు రమ్మన్నారంటే మీరు రేపటి వరకు బ్రతికి ఉంటారన్న విషయం మీకు తెలిసి ఉండాలి. అలాగే ఆ పేదవాడు కూడా రేపటివరకు బ్రతికి ఉంటాడని మీకు తెలిసి ఉండాలి. ఒక సర్వజ్ఞునికి మాత్రమే కదా ఇలాంటి విషయాలు తెలిసేది. అందుకే మిమ్ములను అలా సంభోదించాను” అన్నాడు. ఇది విని తన తప్పు తెలుసుకున్న ధర్మరాజు ఆ పేదవాడికి వెంటనే అతను కోరుకున్నది ఇచ్చి పంపాడు.

సహాయం మాట అటు ఉంచుదాం  మనం సహాయంపొందడం అంటూ జరిగితే.. దానికి కూడా మనం సరైన కృతజ్ఞత తెలుపాలనుకోము.. ఆ సమయంలో వీళ్ళు కాకుంటే ఇంకొకరు చేసేవాళ్ళు.. వాళ్ళు చేయకున్నా నేను ఇపుడు ఉన్న స్థితిలో ఉండేవాడిని అని తనను తానూ ఊరడించుకొనే మనస్తత్వం ఉండడమే ఒక కారణం కావొచ్చు.. మనం సహాయం అందుకున్నాక తిరిగి దానికి తగిన మూల్యం ఇంకో రూపంగా ఐనా చెల్లించాలి అన్న ఊహ కూడా కలగక పోవడంలో వింత ఏమి లేదు.. అందుకోవడంలో ఆనందం  ఇవ్వడంలో నొప్పి ఉన్నంతసేపు ఇలాగే జరుగుతుంది. సహాయం పొందకుండా మనిషి మనుగడ కష్టం ..సహాయ సహకారాలు అన్నవి  మానవ సంబంధాలకు పెట్టుబడిలాంటివి.. సహాయం అందుకోవడంలో చిన్న గొప్ప.. వీరుడు.. రాజు ఎవరైనా కావొచ్చు.. కానీ తిరిగి మూల్యం చెల్లించే వాడు మాత్రం గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న రారాజు అని  ఒప్పుకోవొచ్చు.. అలాంటి వ్యక్తిని ఈ చిన్ని కథలో చదవండి....

సమయానికి మూల్యం చెల్లించగలమా....

శ్రీకృష్ణుడు భారతయుద్ద ఆరంభానికి ముందు ఒకరోజు కర్ణుడిని కలిసి "కర్ణా నీవు పాండవ తనయుడవు.. నీ సహోదరులు ఈ పాండవులు".. నీవు నిజము తెలియక దుర్యోధనుడితో స్నేహం చేసితివి ఇంతకాలం.. ఇప్పటివరకు అతనికి చేసిన సహాయం చాలు ఇక నీవు నీ తమ్ములతో కలసి నీ శత్రువులను ఓడించు అని పలికెను  అపుడు కర్ణుడు స్వామీ! నీకు తెలియని సత్యము కాదు.. ఒంటరినై నించుని ఉన్నవేళ నా భుజము తట్టి నన్ను స్నేహితుడిగా గౌరవించి, నన్ను నలుగురిలో ఒకనిగా గౌరవము పొందుటకు అర్హుని కావించిన వాడు దుర్యోధనుడు.. ఆతను నాకు ఇచ్చిన రాజ్యం కంటే రెండింతలు రాజ్యం అతనికి ధారపోయడం వల్ల.. లేదా అతనితో కూడి స్నేహధర్మం పాటించి అతని విజయానికి తోడ్పాటు అందించడం వల్లనో నాకు చేసిన సహాయానికి ఋణం తీరిపోతుందని అనుకుందాము.. కానీ ఎప్పుడైతే నా మనసుకు ఊరడింపు కలిగించిన సమయం ఉందో.. నా మనసుని స్వాంతన పరచిన పలుకులు ఉన్నాయో  వాటికి నేను ఎప్పటికి విలువ కట్టలేను.. నాలో ప్రాణం ఉన్నంత వరకు ధర్మ, అధర్మ అన్న వాటికంటే కూడా తగిన సమయంలో నన్ను స్వాంత పరచిన దుర్యోధనుడి  పలుకులకే ఋణపడి ఉంటాను.. నేను సహాయం పొందిన ఆ క్షణమందే నన్ను నేను అతనికి సమర్పించుకున్నాను.." నన్ను క్షమించుము నేను నా సహోదరులతో స్నేహం నెరపలేను" అని శ్రీకృష్ణుడితో పలికెను.. సహాయం  అందుకున్న సమయానికి మూల్యం చెల్లించిన నీ వ్యక్తిత్వానికి సాటి  ఎవరు లేరు... నీ విలక్షణమైన వ్యక్తిత్వం ముందు నేను తలవంచుతున్నాను అని మనసున కర్ణుని కొనియాడాడు శ్రీకృష్ణుడు...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!