ఆషాడం - 2

ఆ..ఎంతవరకూ చెప్పాను ..ఆషాడంలో మా ఆయన్ని కలుసుకోవడానికి మా అమ్మమ్మ ఊరు వెళ్లాను అని చెప్పాను కదా ... అక్కడికి వెళ్ళగానే అనుకున్న కధ మొదలైంది..ఆషాడంలో మొక్కులేమిటే మరీ విచిత్రంగానూ అని కాసేపు మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకుని ఎదురుగా అల్లుడిగారిని(మా నాన్నను) చూసి ఏమనలేక ...అయినా ఈ రోజుల్లో ఇవన్ని మామూలే బాబు ... మీ మావయ్య గారు షాపు వదిలి ఇంటికొచ్చేసరికి రాత్రి ఒంటిగంట అవుతుంది .. ట్రైన్ పది గంటలకు కదా ,వెనుక గుమ్మం దగ్గర నుండి మా చిన్నోడు ( చిన మావయ్య) స్టేషన్కి తీసుకు వేళతాడులే అనేసి నన్ను గట్టున పడేసింది....

నాన్న మా వూరు వెళ్ళేవరకూ ఓపికపట్టిన మా అత్తలు నా చెరో ప్రక్కనా చేరిపోయారు ..."ఆషాడంలో బయటకు వెళుతున్నారా!!! మా తమ్ముడుగారు ఎంత డేరు, ఎంత రోమాన్టిక్కు ... మీ పెద్ద మావయ్యా ఉన్నారు దేనికీ.. పెళ్ళయి పదేళ్ళు అయినా ప్రక్క వీధిలో గుడికి తీసుకువెళ్ళమంటే ప్రక్కింట్లో దొంగతనం చేయమన్నట్లు జడిసిపోతారు అని ఏడుపుమొహం పెట్టి మా పెద్దత్తా.... ఈ నల్లపూసలు అయిదుకాసులు పెట్టి చేయించారా ...పెళ్ళయిన మూడునెలలు కాకుండానే ఇన్ని చేయిస్తే ముందు ముందు ఏడువారాల నగలు చేయిన్చేస్తారేమో ...మీ చిన్న మావయ్యా ఉన్నారు పావుకాసు పెట్టి ఉంగరం చేయించమంటే పందిరి గుంజలా బిగుసుకుపోతారు అని భారంగా నిట్టూరస్తూ చిన్నావిడా గతాన్ని తలుచుకుని తలుచుకుని ,తవ్వుకుని, తవ్వుకుని బాధపడిపోవడం మొదలుపెట్టారు..

వచ్చావా మహా తల్లీ ..నువ్వు ,మీ అక్కా వచ్చారంటే మా కాపూరాల్లో నిప్పులే ... అక్కడేం ఉద్దరిస్తారో తెలియదుకాని ఇక్కడ మాత్రం మీ అత్తలకు మణిరత్నం సినిమా చూపించి వెళ్ళిపోతారు ..తర్వాతా ఓ నెల రోజులు పాటు మాకు " కొత్తబంగారు లోకం మాకు కావాలి సొంతం " అని పాడి వినిపిస్తారు వీళ్ళు అని మా చిన్న మావయ్య విసుక్కుంటుంటే చూడంమమ్మా నీ కొడుకు అని కంప్లైంట్ చేస్తూ భోజనం తింటుంటే ఫోన్ .... పరుగు పరుగున వెళ్లి ఫోన్ తీశాను ...

బుజ్జీ ! వచ్చేసావా అటునుండి మా ఆయన.. ఆ వచ్చేసాను కానీ అదేంటది ఈ పాటికి ట్రైన్లో ఉండాలి కదా మీరు..ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు అయోమయంగా అడిగాను..... ట్రైన్ ఓ గంట లేటే ..అందుకని ఇంకా బయలుదేరలేదు అన్నారు బాంబ్ పేలుస్తూ .....అమ్మ బాబోయ్ గంట లేటా!!!రాత్రి పదిన్నర అంటేనే మా నాన్న ,అమ్మమ్మ వందసార్లు ఆలోచించారు ... ఇప్పుడు గంట లేటంటే పదకుండున్నర అవుతుంది ఇంకేమన్నా ఉందా అన్నాను భయంగా ... మీ అమ్మమ్మకు ,నాన్నకు పనేముంది ప్రతిదానికి భయపడటమే గాని ఇంకేదన్నా చెప్పు అన్నారు తాపీగా.... మీకేం బాబు మిమ్మల్ని ఎవరేమంటారు ,అక్షింతలు పడేది నాకే కదా విసుక్కున్నాను.... అబ్బా నీతో ఇదే చిక్కు ...ఎప్పుడూ ఎలా టెన్షన్ పడదామా అని ఆలోచిస్తావ్... నాకైతే బోలెడు ప్లాన్స్ ఉన్నాయి..నువ్వు ఎప్పుడన్నా ట్రైన్ డోర్ దగ్గర నిన్చున్నావా ... మనం ఎంచక్కా డోర్ దగ్గరకు వెళ్లి కూర్చుని తెల్లవార్లు కబుర్లు చెప్పుకుందామేం....అన్నారు పరవశంగా.. ఏంటీ డోర్ దగ్గరకా !! మా నాన్నకు తెలిస్తే అప్పుడు చేస్తారు నాకు అసలు పెళ్లి అన్నాను విసుగ్గా.. అవును మరి ప్రతీది వెళ్లి మీ నాన్నకు చెప్పు ... అయినా పెళ్ళయ్యాకా నా ఇష్టం .. ... నా పెళ్లానివి... తండ్రి కంటే భర్తే గొప్ప,పతియే ప్రత్యక్ష దైవం తెలుసా నీకా విషయం అన్నారు కచ్చగా( ఈ మాట అరిగిపోయిన రికార్డులా ఇప్పటికీ అంటారులెండి) ... తోక్కేం కాదు నాకు మా నాన్నే గొప్ప అంటుంటే ఇంకేవరివో మాటలు ,గుసగుసలు వినిపించి ప్రక్క రూం లో తొంగి చూస్తే మా అత్తలు ప్రక్క రూం లో ఉన్న మరో ఫోన్ పట్టుకుని మా మాటలువింటూ తోసుకుంటూ దెబ్బకి ఫోన్ పెట్టేసి ఆ రూంలోకి పరుగెత్తాను ....

ఏం పనిలేదా ,మేనర్స్ లేదా కోపం గా అడిగాను.... అస్సలు లేదు .. అయినా ఇది మా ఇల్లు.. మా ఫోను ... మా ఇష్టం ... కొత్తగా పెళ్ళయిన వాళ్ళను మా ఊర్లో ఇంతకన్నా ఎక్కువ ఏడిపిస్తాం తెలుసా అన్నారు ఇద్దరూ కోరస్ గా ... ఖర్మరా బాబు అనుకుని 11 ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టాను ... మధ్యలో ఫోన్ చేయాలని ఉన్నా మా అత్తలతో భయం ... పది అవుతుండగా నాన్న నుండి ఫోన్ ఇంకా బయలుదేరలేదా? రాత్రి పూట ప్రయాణాలు కాస్త ముందుగానే వెళ్లాలని తెలియదా.. మావయ్యను పిలు నేను మాట్లాడుతాను అని ఒక్క కసురు కసిరారు.... అసలే మాంచి కోపం మీద ఒకటి ఉన్నారు... ఇప్పుడు ట్రైన్ లేటంటే ఏమంటారో అని సైలెంట్గా మా మావయ్యకు ఇచ్చేసాను ఫోన్.. పాపం విషయం వినగానే నాన్న కోపానికి మావయ్య బలి..

మొత్తానికి పదకుండు అయింది మావయ్య ఇంకా రాలేదు.... నాకు కంగారు.... నీ కొడుకు ఎప్పుడు ఇంతే అమ్మమ్మ ..ఏం ఒక్క రోజు షాప్ నుండి తొందరగా వస్తే ఏం కొంపలు మునిగిపోయాయట ,ఆ ట్రైన్ వెళ్లి పోయిందంటే ఇంక అంతే ఏడుపు మొహం వేసి అన్నాను .... పదకొండున్నర అవుతుండగా మావయ్య ఇంటికి వచ్చాడు ...ఈ లోపల చిన్న అత్తకు, అమ్మమ్మ కు నాలుగో విడత క్లాస్ పీకేసాను.. రాగానే తాండవం చేసేయబోతుంటే ఇక ఆపు అక్కడ ట్రైన్ గంట కాదు ... రెండు గంటల లేట్ అంట రాత్రి పన్నెండున్నరకు వస్తుంది అట... ఫోన్ చేసి కనుక్కున్నాను అన్నాడు.. నాకు నీరసం వచ్చేసింది అమ్మ బాబోయ్ పన్నెండున్నరకు వస్తుందా ...నాన్నక్కు తెలిస్తే ఇంకేమన్నా ఉందా నీరసంగా జారబడ్డాను.. నీకేం నువ్వు బాగానే ఉంటావ్ నాకు కదా మీ నాన్న క్లాస్ పీకేది అని మావయ్య అంటుండగానే మళ్ళీ ఫోన్..ఇంకెవరూ మీ నాన్నే వెళ్లి ఎత్తు అన్నాడు మావయ్య నవ్వుతూ...మావయ్యా మావయ్యా ప్లీజ్ మావయ్య నువ్వు మాట్లాడి ఏదోఒకటి చెప్పవా బ్రతిమాలే పొజిషన్ కొచ్చేసాను ...

అంటే బావగారు పర్వాలేదండి ..నేను ఉంటాను కదా ...పన్నెండుకి కూడా జనాలు తిరుగుతూనే ఉంటారండి ఏం పర్లేదు ...మావయ్య మాటలు మెల్లగా వినబడుతున్నాయి ... అటునుండి నాన్న కొంచెం గట్టిగానే తిడుతున్నట్లు ఉన్నారు..ఫోన్ పెట్టగానే అమ్మమ్మ మొదలు పెట్టింది .. ఏంటి అర్ధరాత్రి పూటా ఆడపిల్లను తీసుకువెళతావా ..అందునా నాన్న ఇంటికొచ్చే టైమయ్యింది చూసారంటే ఇంకేమయినా ఉందా అంటూ... అబ్బా ,నాన్న ఒంటిగంటకు కదమ్మా వచ్చేది నేను తీసుకు వెళ్తానుగా మావయ్య సరిపెట్టేసాడు.. హూం గట్టిగా నిట్టూర్చి నిమిషాలు లెక్క పెట్టడం మళ్ళీ మొదలు పెట్టాను..

పన్నెండు అవుతుండగా మావయ్య మళ్ళీ కాల్ చేసాడు రైట్ టైం ఎన్ని గంటలకో కనుక్కుందామని ..దేవుడా దేవుడా ప్లీజ్ ప్లీజ్ అనుకుంటూ ఉండగానే అటునుండి వాడు చెప్పాడు.. ఈ రోజు ఆ ట్రైన్ లేటండి రాత్రి 2 కి రావచ్చు అని ... అయిపొయింది ఇంక వెళ్ళినట్లే నిరాశ వచ్చేసింది ...మళ్ళీ నాన్న ఫోన్ ... నువ్వే తీయవే ..ఇందాక నిన్ను అడిగినా ఏదో మేనేజ్ చేసాను మావయ్య తనవల్లకాదని చెప్పేసాడు.. ఇక తప్పక హలో అన్నాను.. ఏమైంది ఇంకా బయలు దేరలేదా అన్నారు.. లేదు నాన్నా రెండుగంటలకట అన్నాను మెల్లిగా.. సరేలేగాని నువ్వు పడుకో ఇంక ...అంతగా అయితే రేపు నేను వచ్చి వైజాగ్ తీసుకెళతాలే అన్నారు.. కానీ నాన్న... మరీ ఆయన ఎదురుచూస్తారేమో అన్నాను గునుస్తూ ... చూడనీ.. ఇలా అర్ధం పర్ధం లేకుండా అర్ధరాత్రి ప్రయాణాలు పెడితే అలాగే అవుతుంది.. ఆడపిల్ల అనుకున్నాడా ఇంకేమన్నాన.. ప్రొద్దున్న కాల్ చేస్తాడులే అప్పుడు చెప్దాం నువ్వు పడుకో ఇక.. నేను రేపు వస్తున్నా అని పెట్టేసారు...

మావయ్యా ఇంకోక్కసారి ఫోన్ చేయవా ఆశ చావకా అడిగాను ...కాల్ చేయగానే ట్రైన్ రాత్రి రెండు మూడు మధ్యలో రావచ్చండీ వాడు ఇంకొంచెం టైం పెంచేసరికి ఇక మాట్లాడకుండా పడుకున్నాను..నా కళ్ళ ముందు ప్లాట్ఫాం మీద నాకోసం వెదుకుతున్న మా ఆయన కనిపించసాగారు... జాలి ,బాధ ,భయం కలగలిపి వస్తున్నాయి ...అసలే ముక్కు మీద కోపం అయ్యగారికి ...ఎన్ని అలకలు పెట్టి సాధిస్తారో అని.. ఎప్పుడు నిద్ర పట్టేసిందో ..బుజ్జీ ,బుజ్జీ అని ఎవరో పిలుస్తుంటే కళ్ళు తెరిచాను ...ఎదురుగా చిన్న మావయ్య .... ష్ ... ట్రైన్ కరెక్ట్ టైం నాలుగున్నర కట.. నాలుగయ్యింది వెళదామా అన్నాడు ... మరి నాన్న,అమ్మమ్మ .... అంటూ ఇంకేదో చెప్పబోతుంటే .... అబ్బా అవన్నీ నేను చూసుకుంటాలే ... నేను సందు గుమ్మం వైపు బండి తీసుకొస్తాను నువ్వు మెల్లగా వచ్చేసేయి... తాతయ్య ఇంట్లోనే ఉన్నారు జాగ్రత్త అన్నాడు ...

తల కూడా దువ్వుకోలేదు ....అలాగే నా బ్యాగ్ పట్టుకుని చీకట్లో దొంగలా తడుముకుంటూ మెల్లిగా బయటకు వచ్చేసాను .... దారంతా మావయ్యా,నేను ప్లాన్స్ వాళ్లకు ఏం చెప్పాలి అని .... అక్కడ చేరుకున్నాకా ఇంకో అరగంట లేట్ చేసి అయిదుగంటలకు వచ్చింది ట్రైన్ .... మావయ్య కు టాటా చెప్పేసి ట్రైన్ లో కూర్చున్నాను ... మా ఆయన ఫ్రెండ్, వాళ్ళ ఆవిడ పలకరించారు ... ఆ సరికే కొంపలు మునిగిపోయినట్లు జనాలు పొలోమని లేచి అటు ఇటు తిరగడం మొదలు పెట్టారు ...నేను, మా ఆయన ట్రైన్ డోర్ వైపు,మొహా మొహాలు చూసుకుని గాడం గా నిట్టూర్చాం ...

హోటల్ మేఘాలయ... అప్పటివరకూ తిరపతిలో రూమ్స్ తప్ప ఇలా హోటల్స్ లో డీలక్స్ రూమ్స్ అవి చూడలేదేమో ...నాకు అదేదో భలే బాగా నచ్చేసింది ...పరుపెక్కి గెంతులే గెంతులు..అప్పడే నాకు ఎసి అనే పరికరం గురించి తెలిసింది.... కావాలంటే మీరందరూ బయటకు పొండి ...నేను రానంటే రాను అని భీష్మించుకు కూర్చున్నా లాక్కునిపోయారు ....ఆ తరువాత మహా మహా హోటల్స్కి వెళ్ళినా ఆ సరదా అస్సలు రావడం లేదు :(... అనుకుంటాం గాని మన ప్రక్కన ఉన్న చిన్న చిన్న ఊర్లే బోలెడు బాగుంటాయి... నాకు వైజాగ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది.. ఉడా పార్క్ ,కనక మహా లక్ష్మి గుడి ..అక్కడ ఒక వినాయకుడి గుడి ఉంటుంది ...చిన్న గుడే కాని చాలా ఫేమస్ ..పేరు గుర్తురావడం లేదబ్బా.. ఆ గుడి ..ఇంకా సింహా చలం ..కైలాస గిరి ..చాలా చూసాం ...రామ కృష్ణా బీచ్ లో అలలు చూడగానే నేను రాను బాబోయ్ అన్నా వాటి మధ్యలోకి వెళ్లి నిన్చోపెట్టేసారు మా ఆయన..టీవిలో చూడటమే అలా మధ్యలోకి వెళ్లి చూడటం భలే బాగుంది.. ( ఇక్కడ ఆరెంజ్ సినిమాలో జేనిలియాలా నేను సింహాన్ని చూసాను అన్న రేంజ్లో ఎక్స్ ప్రెషన్ ఇచ్చాను అప్పట్లో ) నిజం చెప్పాలంటే ఆ రోజు ఎంత హేపీ ఫీల్ అయ్యానంటే ఇప్పటికీ ప్రతి నిమిషం గుర్తుంది :)

ఆ తరువాత అన్నవరం వచ్చేసాం.. ఆషాడం కదా జనాలు అస్సలు లేరు ..( గమనిక :ఆషాడం లో అన్నవరం వెళితే మీకు దర్సనం తొందరగా అవుతుంది ) వ్రతం అది అవ్వగానే మావారి ఫ్రెండ్ని వాళ్ళ ఊరు వెళ్ళిపొమ్మని చెప్పి , మా ఊరి స్టేషన్ లో నన్ను దిగబెట్టేసి నెక్స్ట్ ట్రైన్కి తను వెళ్లి పోయేట్లుగా ప్లాన్ .... నాన్నను స్టేషన్ కి రమ్మని ఫోన్ చేసి ట్రైన్ ఎక్కేసాం..కాసేపట్లో తను వాళ్ళ ఊరు వేల్లిపోతున్నారంటే మళ్ళీ దిగులు... ఏవో మాట్లాడుతూ మధ్యలో మొన్నో సారి మా బావ ఏం చేసారో తెలుసా.. అక్కను తీసుకుని తెలియక ఒక ట్రైన్ ఎక్కబోయి మరొక ట్రైన్ ఎక్కేసారట ... మధ్యలో గమనించి దిగిపోయారట ...కాని పర్స్ తేవడం మర్చిపోయారట ... లక్కీగా మా నాన్న ఫ్రెండ్ అక్కడ కనబడితే ఆయన్ని అడిగి ఊరు వెళ్ళారు ...ఇప్పటికీ నాన్న తలుచుకుని తలుచుకుని తిడతారు అన్నాను.. అయినా మీ బావ అలా ఎలా చేసారు బుజ్జీ ..ఏ ట్రైన్ ఏదో తెలుసుకోకపోతే చాలా చిక్కుకదా..ఒంటరిగా అయితే ఎలా అయినా పర్వాలేదు.. ఆడవాళ్ళు ఉండగా చాల కష్టం తెలుసా అన్నారు ....

అప్పటి వరకూ మమ్మల్ని గమనిస్తున్న మా ప్రక్కనున్నాయన అమ్మా మీరు ఎక్కడి వరకూ వెళ్ళాలి అన్నాడు ... నేను చెప్పాను.. ఈ ట్రైన్ వైజాగ్ వెళుతుంది మీరు ఎక్కినది కరెక్ట్ ట్రైన్ కాని చివరి రెండు బోగీలు వేరే బండికి కలుపుతాడు అన్నాడు.. దెబ్బకి నాకు,మా ఆయనకు నో సౌండ్ ... తరువాతి స్టాప్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరే ... వెంటనే దిగిపోయాం ...దూరం నుండి టీసి మావైపు చూస్తున్నాడు..అమ్మో రాంగ్ టిక్కెట్ ..పెనాల్టి అంటాడేమో అన్నారు మా ఆయన ... ఏం చేస్తాం తప్పదుగా కట్టండి అన్నాను విసుగ్గా .. బుజ్జీ ఒక విషయం చెప్తే తిట్టవు కదా కొంచెం నసుగుతూ అన్నారు మా ఆయన ... ఏంటీ అన్నాను కోపంగా .... నాకొక్కడికే కదా టిక్కెట్టు కావలసింది అని నిన్న మొత్తం ఖర్చు పెట్టేసాను అన్నారు మెల్లగా....ఓరి దేవుడా ఏం చేద్దాం.. అనుకుంటుండగానే టీసి మా వైపు వచ్చాడు..ఏంటి తప్పు ట్రైన్ ఎక్కి వచ్చేసారా .. చాలా మంది అలా పొరపాటు పడతారులెండి ...చీకటి పడుతుంది బస్ స్టాప్కి వెళ్లి మీ వూరు వెళ్ళిపొండి అని పంపేశాడు.. బ్రతుకు జీవుడా అనుకుని బయటకు వచ్చేసాం..

ఇప్పుడేం చేద్దాం నాన్న ఎదురు చూస్తారేమో ముందు నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పండి స్టేషన్ కి బయలుదేరి ఉంటారు అన్నాను .. అమ్మో మీ నాన్నకా నీకు పుణ్యం ఉంటుందే బాబు మీ బావని నాలుగేళ్లే తిట్టారు..నన్ను వదులుతారా .. అసలే వద్దంటే తీసుకువచ్చా అని కచ్చ మీద ఉండి ఉంటారు పరువుపోతుంది చెప్పకు ప్లీజ్ అన్నారు .. ఇప్పుడెలా మరి అన్నాను విసుగ్గా .... అంటే ఇది మీ అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా ..మొన్న చెప్పకుండా వచ్చేసావ్ కదా ... అందుకని మీ అమ్మమ్మ మీద బెంగ పెట్టుకుని నువ్వు ఏడుస్తుంటే నిన్ను ఇక్కడకు తీసుకు వచ్చేసా అని చెప్తాను ఏమంటావ్ అన్నారు.. ఏడ్చినట్లు ఉంది అస్సలు నమ్మరు అన్నాను.. నమ్మకపోయినా అదే చెప్పాలి పదా అని మా అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్ళిపోయారు...

ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మను చూడగానే అమ్మమ్మా అని చెప్పబోతుండగా లోపల భోజనం చేస్తూ తాతయ్య ఉన్నారు...దెబ్బకు నూటొకటి ఏం చెయ్యాలి.. వెంటనే అమ్మమ్మా మొన్న తాతయ్యను చూడకుండా వెళ్లి పోయానుగా బెంగ వచ్చేసింది .... కలలో కూడా తాతయ్యే ... అని మా తాతయ్య ప్రక్కకు చేరిపోయాను వెక్కేస్తూ ... అప్పుడు పడిపోయిన మా తాతయ్య ఇప్పటికీ అలాగే నన్ను తలుచుకుంటారు.. మా బుజ్జోడికి నేనంటే ఎంత ప్రాణమో ...సింగపూర్ వెళ్ళినా నన్నే కలవరిస్తుంది అని.. నేను అంటే చాలా ప్రాణం పెట్టేస్తారు (అమ్మో ఇప్పుడు మా తాతయ్య మీద బెంగోచ్చేస్తుంది నాకు :(......) అలా అనేకానేక సాహసాలు చేసుకుంటూ మా ఇంటికి చేరాను ఆషాడంలో

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!