రహస్యపు గోడ (వస్తానన్నాడు)

అతను వస్తానన్నాడు ..
వెతుక్కుంటూ వచ్చి కలుస్తాను అన్నాడు. నిజంగా ఎప్పటికైనా వస్తాడా

ఒక్కసారిగా తల విదిలించి చూస్తున్న ఫైల్ ని పక్కకు పెట్టేశాను. చేయాల్సిన పని చాలా ఉంది అయినా అప్పుడప్పుడు సమయం సందర్భం లేకుండా అతడు గుర్తు వస్తాడు.

'తప్పకుండా వెతుక్కుంటూ వచ్చి కలుస్తాను' అని చెప్పిన మాట మాత్రం నన్ను వీడిపోకుండా అతన్ని సముద్రం లోలోతు జ్ఞాపకాల నుండి వెతికి వెతికి గుర్తుకు తెస్తుంది.

అతనిపైన ప్రేమనో ఇష్టమో కలిగే సమయం కూడా అతనితో లేను కదా అయినా ఎందుకో అకారణంగా గుర్తుకొస్తాడు. నిజంగా అతను ఎదురొస్తే గుర్తుపడతానో లేదో అతని చేతి మీద కనిపించే గుర్తు మాత్రమే అతన్ని పట్టిస్తుందేమో.

పక్కకు పెట్టిన ఫైల్ లోని 'కనిమెట్ట' అనే ఊరి పేరుని మరోసారి చూస్తూ కళ్ళు మూసుకున్నాను. మూసిన కనురెప్పల రహదారి వెంబడి ఆలోచనలన్నీ ఆ ఊరి వైపు పన్నెండు సంవత్సరాల వెనక్కి పరిగెత్తాయి.

ఆరోజు మధ్యాహ్నం మూడు దాటినట్టుంది. రాత్రి 9 వరకు  హైదరాబాద్ చేరవచ్చని, వద్దన్నా వినకుండా స్నేహితురాలు పెళ్లి ఇంటి నుంచి హైదరాబాదుకు బస్సులో బయలుదేరాను. సాఫీగా వెలుతున్న బస్ పెబ్బేర్ దాటాక ఒక జర్క్ తో ఆగింది. హడావిడిగా బస్సు ఎక్కిన అతను ఎక్కడ ఖాళీ లేక కండక్టర్ సీట్లో కూర్చున్నాడు.

కర్నూల్ నుండి హైద్రాబాద్ వెళ్ళే బస్సుల్లో ఎక్కడైనా మధ్యలో ఒకరూ ఇద్దరూ ఎక్కడం పరిపాటే, ఆ చుట్టుపక్కల ఊర్లవాళ్లు బస్టాండ్ కి వెళ్ళి ఎక్కడం తక్కువే. నేను బయలుదేరినప్పుడు ఉన్న ఎండ కాస్త కాస్త తగ్గుముఖం పడుతూ ఉంది. ఇంతలో బస్సు నుంచి వినిపిస్తున్న కరుకు శబ్దం, రాలిపోయే సాయంకాలం, చిక్కబడిపోయే చీకటిని గుర్తుకుతెస్తూ ఎక్కడైనా బస్సు ఆగిపోతే అనే గాబరా పుట్టించింది.

అనుకున్నంత అయ్యింది కీచుమని శబ్దంతో బస్సు ఆగిపోయింది. ఇప్పుడప్పుడే బస్సు కదిలేట్టు అనిపించడం లేదు అయినా కాసేపు అందరూ జ్ఞానాన్ని వదిలేసిన మట్టిముద్దల్లా కదలకుండా కూర్చున్నారు. ఇంతలో డ్రైవరు ఇప్పుడప్పుడే రిపేరు కాదని ఏదైనా బస్సు వస్తే ఎక్కిస్తానని, ఉండే  టైమ్ ఉన్నవాళ్లు  ఉండొచ్చని రిపేర్ మరో రెండు గంటలైనా పడుతుందని చెప్పాడు.

ఏమి చేయాలో తెలియక మెల్లిగా బస్సు దిగాను. రోడ్డు నానుకొని ఏదో ఊరుంది. నాతోపాటు పెబ్బేర్ లో ఎక్కిన అతను కూడా దిగి చుట్టూ చూస్తు అలా కాస్త లోపలికి వెళ్దామా మంచి టీ దొరకొచ్చు అన్నాడు నా వైపు తిరిగి.

అతని పలకరింపు వల్ల బెరుకు, కొత్తదనం అనేవి నాకు తగలకపోవడంతో అతనితో కలిసి అడుగులు వేయడం మొదలెట్టాను. రోడ్డుమీద చిన్న చిన్న డాబాలు, హోటల్లు ఉన్నాయి. అవి కాదని ఊరి వైపు ఉన్న రోడ్డు పట్టాడు. అలా ఒక 1/2 కిలో మీటర్ కంటే తక్కువగానే వెళ్ళామో లేదో రోడ్డు పక్కన ఒక చిన్న గుడి, ఆ పక్కనే టీ కొట్టు ఉంది. అక్కడ చుట్టూ పెద్దగా మనుషులు లేరు. చుట్టూ పొలాలు కనిపిస్తున్నాయి ఇంకో రెండు కిలో మీటర్ల నడిస్తే కనిమెట్ట ఊరు తగలొచ్చు. ఇంకొన్ని సంవత్సరాలు తరువాత బహుశా ఈ ఊరు పెరిగి పెరిగి మా బస్సు ఆగిపోయిన రోడ్డును తాకొచ్చు అనిపించింది.

అతని సంభాషణ మాత్రం అందరిలా మొదలు కాలేదు మీ పేరేమిటి, ఏ ఊరు? ఎందుకు వచ్చారు ఇలాంటి ప్రశ్న ఒకటి కూడా అడగలేదు. అతను ఏ మాటతో సంభాషణ మొదలెట్టాడో గుర్తులేదు కానీ పుస్తకాల గురించి, సంగీతం గురించి, ఎక్కడెక్కడో తిరిగే ప్రదేశాల గురించి, యాగంటి గుహల్లో వింతల గురించి ఒకటి కాదు ఎన్నో మాట్లాడాడు.
అతని మాటలన్నీ విడివడిన నా ఆలోచనలు ఒక పురికోసతో గట్టిగా పెనవేస్తున్నాట్టు ఉన్నాయి. నేను చెప్పాల్సిన అద్భుతాల్లా అనిపించాయి.

అతని మాటలకు ‘ఊ’ కొడుతూ, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు అని అందరిలాంటి సామాన్యమైన ప్రశ్నే వేశాను. అతని మాటల్లో అతను ఎవరో అంతుపట్టక, తెలుసుకుందామన్న ఆశతో....

ఏమి చేయాలో ఇంకా అనుకోలేదు. బహుశా ఉద్యోగం ..పెళ్లి ..ఇద్దరు పిల్లలు ..ఒక చిన్న ఇల్లు ఇలాంటి జీవితమే గడుపుతాను అనుకుంటున్నాను అన్నాడు.

సరే ! అయితే అలాంటి జీవితంలో మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా నిరాశ, నిస్సృహ అనిపించినప్పుడు తప్పకుండా నా కోసం రండి.

ఇదిగో ఇలా చూడని ప్రదేశం... ఎప్పుడూ కలవని ఇలాంటి చోట మళ్లీ కబుర్లు చెప్పుకుందాం అన్నాను నవ్వుతూ...
తప్పకుండా వస్తాను అన్నట్టుగా తల పంకించాడు అతను.

సమయం నాలుగు టీలతో నాలుగు వందల కబుర్లతో చాలానే గడిచినట్టు ఉంది. ఇంతకూ బస్సు రిపేర్ ఎక్కడ దాకా వచ్చిందో అని తిరిగి బయలుదేరాము, కాసేపటికి బస్సులో ఎవరి చోట్ల వాళ్ళు కూర్చొన్నాము అనామకుల్లా. బస్సు బయలుదేరింది చీకటి దుప్పటి కప్పుకుంటూ.

*****


బస్సు దిగుతున్నప్పుడు అతను అన్నాడు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాను ఎప్పుడో ఒకసారి మీకోసం నిజంగా, ఒట్టు పెడుతున్నట్టుగా తన తలపై చేయి వేసుకుని...

నేను నా అడ్రస్, ఫోన్ నెంబరు కాగితము, అతని చేతిలో పెట్టాను. అతను ఈ విషయం తెలుసు అన్నట్టుగా అందుకుని జేబులో పెట్టుకున్నాడు. అప్పుడు చూశాను అతని కుడి చేతి మణికట్టు పైన ‘ W ‘ అన్న అక్షరం.

మీరు వస్తే నేను గుర్తుపడతానా అడిగాను కళ్ళు విప్పార్చుకుని కాస్తంత సంశయంతో.. తప్పకుండా నా జ్ఞాపకాన్ని మీరు బంధించారుగా అంటూ, మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు

అతను అప్పుడప్పుడు  గుర్తొస్తునే ఉన్నాడు. మూడు సంవత్సరాల క్రితం ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అతని జ్ఞాపకం మరీ మరీ గుర్తొచ్చేది.

నాకోసం వెతుక్కుంటూ వస్తే కనబడకపోతే ఏమైపోతాడో అనే దిగులు వచ్చేది. అతని జ్ఞాపకం ఒక నీడలా నన్ను వెన్నంటే ఉండిపోవడం. నాకు కొంచెం వింతగా ఆశ్చర్యంగా కూడా ఉండేది. ఆ జ్ఞాపకానికి అతని రూపు అద్దాలని చాలా ప్రయత్నాలు చేసేదాన్ని.

అతని జ్ఞాపకం నా పోరాటానికి ఊపిరి పోసింది. నా అనారోగ్యం నుంచి బయటపడడానికి నేను చేసే ప్రయత్నాలు చూసి డాక్టర్లు ఎంతగానో ఆశ్చర్యపోయేవాళ్లు.

నా భర్త నన్ను ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు చూసేవాడు. నా ఏడేళ్ల కూతురు మాత్రం నువ్వు టీచర్ జాబ్ మానేసి,  డాక్టర్ జాబ్ చేస్తున్నావా అని అడిగేది.  తను ఎప్పుడూ నేను బెడ్ మీద నీరసంగా పడుకోవడం చూడలేదు మరి. నన్ను చూసే ఆశ్చర్యపోయే వీళ్ళందరికీ కనిపించని రహస్య గోడ అతని జ్ఞాపకం.

*****

మరోసారి జీవితం U టర్న్ తీసుకొని చక్కటి రహదారి బాట పట్టింది. నేను టూర్స్ చేయాలన్న ఆలోచన హాస్పిటల్లో మొదలైంది. కొత్త కొత్త ప్రదేశాలు చూసేదాన్ని. ఆ తర్వాత కాస్తంత మలుపులు తిరిగి మరో రెండు సంవత్సరాలకి అతని జ్ఞాపకానికి నడకలు నేర్పాలని పెట్టిందే ' Waves tours' విత్ బుక్స్ అండ్ కాఫీ అనే ప్రత్యేకమైన అడ్వర్టైజ్మెంట్ తో..

అతన్ని కలిసి ఇప్పటికి కచ్చితంగా 12 సంవత్సరాలు. చీకటి తోపుల వెంబడి అతని జ్ఞాపకాన్ని వెతుకుతూ నడిచే కళ్ళను వెనక్కు తీసుకువచ్చాను. కాస్తంత స్థిమితబడ్డ మనసుతో పక్కన పెట్టిన ఫైలు చేతిలోకి తీసుకొని ,' కనిమెట్ట ' దగ్గర కొత్త బ్రాంచి తెరవడానికి ఒప్పుకుంటూ సంతకం పెట్టాను.

ఇపుడు మనసంతా మరింత ప్రశాంతంగా ఉంది. పేరు తెలియని అతను జ్ఞాపకమై నా వెంట ఉండడానికి కారణమేమిటో ఎప్పుడు లెక్కలు వేయలేదు. బహుశా ఆ క్షణంలో అతడు మాట్లాడిన ఎన్నో మాటలు నా  ఆలోచనలకు క్రమపద్ధతిని, ఒక తెలియని అపురూపతను అందించి వెళ్ళిందేమో. అతను ఉన్నక్షణాలు లేదా అక్కడి స్థలము ఏది దేనితో పెనవేసుకుని జ్ఞాపకం అయ్యిందో...

ఇప్పుడో కాసేపటికో, మరో రోజుకో సంవత్సరానికో అతను మాత్రం వస్తాడు వెతుక్కుంటూ... .
నా జ్ఞాపకం నీ దగ్గర ఉందిగా అని చెప్పి, తప్పక వస్తానని ఒట్టు పెట్టుకుని వెళ్లిన అతను కచ్చితంగా వస్తాడు.. వస్తాడు కదూ....


note:
కథావేదిక 2024 .. అజు - ఛాయ వరుసగా రెండేళ్ళ పాటు అజు - ఛాయలు నిర్వహించిన కథావేదిక ఔట్ కమ్ ఈ 12 కథల వొరుసతో వచ్చిన కథావేదిక 2024 లోవచ్చిన కథ


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!