కల..వరమాయే

 

ఏడుస్తూ మెట్లు దిగుతుంది ... తివాచీ మీద ఊగుతున్న పెద్ద కుర్చీ చూసి భయంతో నోరు తడారిపోయింది...కిందగదిలో నుంచి ఎవరో పిలుస్తున్న పిలుపు .. మెల్లిగా అటు వైపు అడుగులు వేసింది.. గదిలో ఎవరూ లేరు... ఎదురుగా పెద్ద అమ్మవారి విగ్రహం... చుట్టూ నూనె మరకలుతో ఉన్న గోడలు, దూరంగా వినిపిస్తున్న ఘంటారావం మెల్లిగా దగ్గరవుతుంది..మరింత దగ్గరగా విగ్రహం వైపు జరిగి కాళ్ల దగ్గర కూర్చొని వెతుకుతుంది తన చిన్ని చేతులతో.. అంతలో కిర్రు మంటూ ఓ శబ్దం వినిపించింది...

ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొంది అనూ..

సమయం చూస్తే నాలుగు అవుతుంది.

మెల్లిగా తలనొప్పి మొదలైంది. 

అదే కల చిన్నప్పటినుంచి తరచు వచ్చి ఎంతగానో భయపెట్టేది. తరుచు అన్న పదానికి నిడివి పెరిగినట్టు ఈ మధ్య అప్పుడప్పుడు ఆత్మబంధువులా వచ్చి  పలకరిస్తూ ఉంది, ఈ కల వచ్చిన రోజు నా మనసు శరీరం రెండూ అలసి పోయి నా జీవితంలో రోజులు వ్యర్థమై పోతున్నాయి. ఈ కల నన్ను చంపే దాకా వదలదేమో అనుకుంది నిస్పృహగా..

అమ్మా!  అంటూ దూకుడుగా వంట రూమ్ లోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అనూని చూసి,  ఏమ్మా ఒంట్లో బాగోలేదా అంటూనే... మళ్లీ అదే కల వచ్చింది అని మాత్రం అనకు అన్నట్టుగా చూసింది. 

నిశ్శబ్దంగా కూర్చున్న కూతుర్ని చూసి గాయిత్రి మనసు తరుక్కుపోయింది, కాఫీ చేతికిస్తూ ఒక విషయం చెప్తాను ఒకసారి ఆలోచించురా.. అంది మార్దవంగా.. ఏమిటన్నట్టుగా కళ్ళు పైకెత్తింది అనూ..

నా ఫ్రెండ్ సుజనా ఉంది కదా వాళ్ళ అమ్మాయికి కూడా, తరచుగా కలత నిద్రలో పిచ్చి పిచ్చి కలలు వచ్చి కేకలు వేసేదట... సైకియాటిస్ట్ కౌన్సెలింగ్ కి తీసుకెళ్తే ఒక ఆరునెలలకి మామూలు మనిషి అయింది అని చెప్పింది. ఎందుకో ఆమె తన కూతురి విషయం చెప్పిన అప్పటినుంచి నాకు నువ్వే గుర్తొస్తున్నావ్, ఒకసారి వెళ్లి కలవకూడదా అంటూ డాక్టర్ వివరాలు చెప్పింది.

అమ్మ అంత త్వరగా ఏ విషయం చెప్పదు, ఇంతగా చెప్పిందంటే అమ్మ కూడా తన గురించి కలవర పడుతూనే ఉండి ఉంటుంది.  తన ఆలోచనలు కట్టిపెట్టి, వచ్చేవారం వెళతాను అమ్మా.. అని లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది.

***

తర్వాత వారం సైక్రియాటిస్ట్ డాక్టర్ శరత్ దగ్గరకు వెళ్ళింది. అతనికి తనకు వచ్చే కల గురించి చిన్నప్పటి నుంచి దానివల్ల ఎంత బాధ పడింది. ఇప్పుడు కూడా కల వచ్చిన తర్వాత తన స్థితి ఎలా ఉంటుంది వివరంగా చెప్పింది. ఆమె చెప్పింది అంతా విన్నాక శరత్ కూడా ప్రతి విషయాన్ని తరచి తరచి అడిగి తెలుసుకున్నాడు.

అనూ గారు.. మీకు గత కాలపు జన్మ జ్ఞాపకాలేమో అన్నఆలోచనలు ఉంటే అవన్నీ అపోహలు మాత్రమే.  మీకు నిజంగా జరిగినట్టు అనిపించదానికి, మీ చిన్నప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన కారణం అయివుండవచ్చు.  

చిన్నప్పుడు ఒక ఎత్తైన అరుగు మీద నుంచి పడిన సంఘటన కలగా మారినప్పుడు ఒక చిన్న కొండ మీద నుంచి జారి నట్టుగా రావచ్చు, అదే కల పదే పదే రావడంతో మన ఊహలు కూడా జోడించి పెద్దయ్యాక హిమాలయాల కొండ ఎక్కుతూ జారినట్లుగా కూడా మారవచ్చు. 

నిజమైన సంఘటనకి, కలలోని సంఘటనకి ఒక చిన్న ఆధారం ఉండడం మాత్రమే నిజం, అలానే మీ కలను అతి స్పష్టంగా రంగులు,స్పర్శతో సహా వర్ణించి చెబుతున్నారంటే, మీరు దీని గురించి ఆలోచించిన ప్రతిసారి ఇంకో వివరణ కూడా  కలుపుతున్నట్టే.

కలలోని సంఘటనకు ఓ అర్థం ఉంది అని నమ్మడం మానేసి ఇది ఒక జరిగి పోయిన సంఘటనగా మీరు గుర్తిస్తే కల ఆగకపోయినా, మీ కల చుట్టూ అల్లుకునే ఆలోచనలు ఆగితే చాలు. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను ఒక రెండు నెలలు వాడండి. ఆ తర్వాత కూడా ఆ కల ఇబ్బంది పెడితే నన్ను కలవండి అంటూ చెప్పాడు శరత్.

***

డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల కావచ్చు అతడు చెప్పిన వివరణ వల్ల కావచ్చు,  కల రావడం ఆగిపోకపోయినా దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడలేదు అనూ. అంతా సవ్యంగా నడిచిపోతుంది మంచి జాబ్ లో చేరింది ఆమె కాలేజీలో ఇష్టపడిన అబ్బాయితోనే నిశ్చయ తాంబూలాలు జరిపించారు.

వివాహ తేదీని,పెళ్లి పనులు మొదలు పెట్టడానికి ముహూర్తం తేదీలు చెప్పి పంతులుగారు వెళ్లారు. అప్పుడే హాల్లో ఉన్న ల్యాండ్ లైన్ లో  మ్రోగింది.  ల్యాండ్ నెంబర్ చాలా ముఖ్యమైన వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది అందుకే గాయిత్రి ఆదుర్దాగా ఎవరా అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఫోన్ మాట్లాడి వెంకటాపురం నుండి బామ్మ ఫోన్ అంది.  ఎవరూ.. అని ప్రశ్నార్థకంగా చూస్తున్న అనూతో..

ఆ ఊరి పేరు కూడా ఎప్పుడూ విన్నట్టు గుర్తు లేదు అక్కడ ఎవరు ఉంటారు అమ్మా ఆశ్చర్యంగా అడిగింది అనూ...

మీ నాన్న వాళ్ళ తాతగారి ఊరు అదేనమ్మా. మనకు ఎప్పుడు అక్కడ వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఇంటి ఆడపిల్ల పెళ్లికి, అక్కడ అమ్మవారికి అభిషేకం చేసి వచ్చాకే పెళ్లి పనులు మొదలు పెట్టాలి.  పెద్దబామ్మ  మొన్న ఫోన్ చేసి చెప్పింది  ఆ విషయమే అంది గాయిత్రి ఊరికి తీసుకు వెళ్లాల్సిన సామాన్ల లిస్టు రాస్తూ...

వెంకటాపురంలో తాతగారి ఇల్లు చూడగానే ఆశ్చర్యపోయింది అనూ, ఆ చిన్న ఊర్లో అంత పెద్ద భవంతి ఉంటుందని ఆమె ఊహకు అందలేదు, తన కలలో కనిపించే చోటు ఇదేనేమో అన్న ఆలోచన కూడా వెనువెంటనే కలిగింది.

అమ్మ నాకు ఇక్కడికి వచ్చినట్టు, ఆడుకున్నట్టు.. తాతగారితో మాట్లాడినట్టు కూడా గుర్తుంది అంది ఉత్సాహంతో అనూ.

అనూ! నువ్వు కథలు అల్లకు, ఎప్పుడో మూడేళ్లు ఉన్నప్పుడు వచ్చావు. ఏం గుర్తుంటుంది  అంటూ నవ్వేసింది గాయిత్రి.

అక్కడ ఉన్న రెండు రోజులు గుడిలో అమ్మవారి అభిషేకంతో, ఊర్లో వాళ్ళ పలకరింపులుతో గడిచిపోయాయి.

ఇప్పుడు కాస్త తీరిక దొరకడంతో ఇంట్లో ప్రతిగది చూస్తూ బామ్మ గదిలోకి రాగానే తన కలలో కనిపించిన కుర్చీని గుర్తు పట్టింది. వెంటనే దేవుడి పాదాలు దగ్గర కూర్చున్న విషయం గుర్తొచ్చి వెతుక్కుంటూ, పూజగది లోకి వెళ్ళింది. నిజంగానే అది ఒక చిన్నగది.

"చిన్నగదిలో  ఒక్కతే నిలుచుంది దేవుడిని చూస్తూ, కలలో కనిపించినట్టు మరీ పెద్ద విగ్రహం కాదు, గోడలకు నూనె మరకలు కూడా లేవు. మెల్లిగా పాదాల దగ్గర కూర్చుంది. ఎవరి మాటలో లీలగా గుర్తొస్తున్నాయి.

"అమ్ములు నువ్వు పెద్దయ్యాక చాలా నగలు ఉంటాయి కదా నీ దగ్గర వాటిని దాచాలంటే ఇదిగో ఇక్కడ దాచుకో! ఎవరు దాచుకుంటే వాళ్ళకే దొరుకుతాయి అని అన్న పెద్దతాత గారి మాటలు పక్కనే నిల్చుని చెబుతున్నట్టుగా అనిపించాయి.

పాదాల దగ్గర తామర పువ్వు ఉన్న పలకని తోసింది. అది కొంచెం వెనక్కి జరిగి చిన్నఅర కనిపించింది. ఒక పక్క ఆశ్చర్యం మరోపక్క ఆనందం, అరలో ఏముందో తన ఊహకు కూడా అందలేదు మెల్లిగా తన చేతిని లోపల పెట్టి, చిన్న మూట లాంటిది బయటకు తీసింది.

అంతలో చిరుమువ్వల సవ్వడితో అడుగుల శబ్దం..,  బయలుదేరాలి అనూ... అంటూ పిలుస్తూ గాయిత్రి తలుపు నెట్టగానే ...

వచ్చిన కిర్రుమన్న చప్పుడుకి ఉలిక్కిపడింది అనూ......కానీ భయపడలేదు..

ఈసారి కల కాదని చెప్పడానికి చేతిమూటలో రంగురంగుల గోలికాయలు..... వజ్రాల కంటే అపురూపంగా అనిపించాయి.

*****


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!