సాధారణం

ఇది రామ చంద్రమౌళి వ్రాసిన కథ. ఈ కథ 1977 లో ప్రచురింపబడిది. ఇతని కథలు చాలా ఉన్నప్పటికీ, అందులో నుండి ఒక 25 కథలను 2007 లో "25 ఏళ్ళనాటి కథలు" అన్న పేరుతో ప్రచురించారు.అందులో అన్ని కథలు మనసుని సృజించకుండా వదిలిపెట్టవు. అందులో ఒక కథ  సంక్షిప్తంగా మీ కోసం......

మనసు పగిలిన అద్దంలా తయారైపోయింది. పదేపదే ఆ దృశ్యమే కన్నుల్లో కదిలి ఎందుకో సముద్రంలో పడి కొట్టుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు నిజానికి తను ఇంత చిన్న విషయానికి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు.అసలు ఈ ఉపాద్యాయ వృత్తిలో ఉన్న చిత్రమైన గుణమే యింత. తనకు నచ్చిన విద్యార్ధుల్లో ఎవరైనా చెడుదారిలోకి నడిచిపోతూ పతనంలోకి కొట్టుకుపోతున్నడూ అంటే మనసు గిలగిల్లాడి పోతుంది. ఈ విధంగా అందరికి అనిపిస్తుందా  - అంటే ఏమో.. నాకు తెలియదు. నాకు మాత్రం అనిపిస్తుంది. మరి అది నా తత్వమో, బలహినతనో - ఏమిటో అర్ధం కాదు.

నేను సిటీ నుండి మిసిమికొండ హై స్కూలుకు బదిలీ అయ్యి ఓ ఆరునెలలు అయ్యింది. అక్కడ జాయినైన తర్వాత ఓ వారం పదిరోజుల్లోనే స్టూడెంట్స్ లో నాపై మంచి ముద్రపడింది."సార్ బాగా పాఠాలుచెపుతాడు" అన్న పేరొచ్చింది. ఈ ముద్రతో సంక్రమించిన గౌరవం, విద్యార్థులు ప్రేమగా నన్ను అభిమానిస్తూ చూపించే ఆదరణ నన్ను ఎంతో తృప్తిపరిచాయి.ప్రతి ఉపాద్యాయుడికి తను అభిమానించే  విద్యార్ధి  ఒకరు ఉంటారు . తెలివైన ,చురుగ్గా ఉన్న నరసింహులుని అభిమానించేవాన్ని. వాడు తొమ్మిదో తరగతి  నుంచి పదో తరగతికి వచ్చాడు.

నేను పాఠం చెపుతున్నపుడు ప్రతి క్లాసులోనూ వాని దగ్గర ఓ అసాధారణ ప్రజ్ఞ కనిపించేది. ఎంతో మేధాసంపత్తి వాడి దగ్గరుంది. ఏ విషయాన్నయినా ఒకసారి చెబితే అయస్కాంతంలా పట్టేసి అడగ్గానే గడగడా చెప్పేసేవాడు.ఐతే నరసింహులు వచ్చింది మాత్రం ఓ చితికిన కుటుంబం నుండి.వాడిపై అభిమానం కలగడానికి అదీ ఒక కారణం కావొచ్చు .నరసింహులు తల్లిని చూస్తె నాకు ఎప్పుడూ పందిరి బరువునుమోస్తున్న గుంజలు గుర్తొస్తాయి. ఆమె ఎక్కడెక్కడో ఎవరెవరి పోలాల్లోనో కూలి పనిచేసేది. ఆమె ఏది చేసినా నరసింహులు కోసం, ఆమె ఊపిరే నరసింహులు.

"అలాంటి నరసింహులు ఇవ్వాళ..." ఒళ్ళు మండిపోయింది. మళ్లీ మూడురోజులనుండి నరసింహులు బడికి రావడం మానేశాడు. మొదటిరోజు నరసింహులు తల్లి ఆందోళనగా వచ్చింది నా దగ్గరకి. వచ్చి "ప్రొద్దటి నుండి మావాడు కనపడ్డం లేదు పంతులుగారూ, రోజు మాపటేల ఇంటికి రాంగానే నాక్కనిపించేటోడు ఇయ్యాల వానిజాడే లేదు" అంది. ఏదో చెప్పి ఆమెను పంపించి ఆలోచనలో పడ్డాను. ఆ తర్వాత - ఇంకో రెండురోజులు కూడా నరసింహులు బడికి రాలేదు. వాని జాడ కూడా తెలియదు.

తరవాత తేలిన విషయం ఏమిటంటే ఈ మూడురోజుల నుండి నరసింహులుతోపాటు ప్రెసిడెంటు కొడుకు, ఇంకో డబ్బున్న ఆసామికొడుకూ  కూడా బడికి రావటం లేదని...వీళ్ళు ముగ్గురూ ఎటో మాయమైపోయారు అని. ఆ మిగతా ఇద్దరూ నరసింహులు తరగతే, చదువులో పెద్ద మొద్దులు. అందులో ఒకడు కాస్త కురూపి, ఇంకొకడు కాస్త కుంటుతూ నడిచే ఒంటి కాలివాడు. ఐనా వాళ్ళకి డబ్బుంది కాబట్టి భవిష్యత్తుంది  వాళ్ళకు. నరసింహులు నిజంగా ఎంతో అందంగా ఉంటాడు. డబ్బే గనుక వానికుంటే వాడు దొరబిద్దల కనపడేవాడు. వీడు వాళ్ళతో ఎందుకు చేతులుకలుపుతున్నట్లు? తన పరిస్థితి అలోచి౦చకుండా వాళ్ళతో కలిసి వాడు ఆ పాడు అలవాట్ల ప్రవాహంలో కొట్టుకపోవడంలేదు కదా!

ఆ తర్వాత సాయంకాలం బడి అయిపోయిన తర్వాత చెరువుగట్టుపై నుండి ఇంటికి వస్తూ ఉన్నాను. ప్రక్కన ఈత పొదల్లో ఏదో అలికిడి వినిపిస్తే అటు చూశాను. వీళ్ళు ముగ్గురు - నరసింహులు బాగా తాగినట్లున్నాడు అప్పటికే - మిగతా ఇద్దరిలో ప్రెసిడెంటు కొడుకు తాటి ఆకులో కల్లు తాగుతున్నాడు. ముగ్గురి గుడ్డలు మాసి...ముందరన్నీ బీడీ పీకలూ..సిగరెట్టు ముక్కలూ...ఒళ్ళు కంపరమెత్తిపోయింది.

వాని తల్లి నా కన్నుల్లో కదిలింది దీనంగా, గుండెల్లో నుండి పిచ్చి ఆవేశం ముంచుకొచ్చి, నరసింహులుని ఆచెంప ఈచెంప ఇష్టమొచ్చినట్టు వాయించి, నీ సంగతి నువ్వు ఆలోచించుకోకుండా ఎందుకురా ఈ పశువు బ్రతుకు బుద్ది లేదూ అని  నోటికొచ్చినట్టు తిట్టి ఏవేవో అన్నాను. అయితే చివరన వాడన్న మాట  నా మీద ఎంతో ప్రభావం చూపాయి. "నా ఇస్టమోచినట్టు చేసుకుంటాను. మధ్యలో మీకెందుకు సార్" అన్నాడు. నరసింహులు గురించి నాకేమిటి..వాణ్ని యింత ఆదరణగా చూసుకుంటే ఇప్పుడు ఎంత సులభంగా రాయితో కొట్టినట్టు మాటనగలిగాడు. మనస్సు గిలగిలా తన్నుకుంది.

ఆ తరువాత కూడా నరసింహులు సరిగ్గా బడికి రావడం మానేసాడు. ఇంకా ఆ ఇద్దరితో కలసి తిరగడం ఎక్కువైంది. వాణ్ని చూస్తూ చూస్తూ మందలించకుండా ఉండలేకపోయాను. అంటే అన్నాడులే అని వాడు అన్నా మాటలు మరిచిపోయి మళ్లీ వాణ్ని మార్చే ప్రయత్నం చేసాను. కాని ఈ సారి ఇంకాస్త ఘాటైన సమాధానం లభించింది నాకు వాని నుండి "నేనేమైనా మీకనవసరం. మీ సంగతి మీరు చూసుకోండి" అని. ఇక వాడి మీద మనసు విరిగి ఒట్టి బ్రాంతి మాత్రమే మిగిలిపోయింది.

ఇక పదవతరగతి పరిక్షలు ఓ పదిహేనురోజులున్నాయనగా... ఆరోజు ఓ ఏడవతరగతి కుర్రాడు నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి "నరసింహులు కాలు విరిగింది సార్" అని చెప్పాడు. నేను గబగబా  పరిగెత్తాను. నిజంగానే కుడికాలు రెండుచోట్ల విరిగింది. అక్కడ ప్రెసిడెంట్ కొడుకు లేడు. ఇంకో డబ్బున్న మనిషి కొడుకూ లేడు. నరసింహులు ఏడుస్తున్నాడు. "భాస్కర్  తోసేసిండు సార్" అన్నాడు.

ఇక దర్యాప్తు అనవసరం. కావలసింది చికిత్స, ఎవర్నో పట్టుకొని , వాణ్ణి వరంగల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయించాను. నాలుగోరోజు కాలుకు సిమెంట్ పట్టీ వేసి, బరువులు వ్రేలాడదీసి ఓ రెండు నెలలు అక్కడే ఉండిపొమ్మన్నారు.ఆ తర్వాత నేను బడికి వెళ్తుండగా ప్రెసిడెంట్ కొడుకు, ఇంకొకడితో ఓ మాట అంటుండగావిన్నాను.

"వాడు నాకంటే అందంగా ఉంటాడా, నా కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటడా, ఎవరన్నా నాకంటే మంచిగుంటే నేనుర్కుంటానురా....ఇప్పుడు ఏమైపోయిందో చూడు ఎప్పటికి కుంటోడై..."నవ్వుతున్నాడు భయంకరంగా. యింత చిన్నపిల్లల్లో యింత ద్వేషమూ, పగా, ఈర్ష్య యింత బలంగా ఉంటాయా అనిపించింది. మనసంతా వికలమైపోయింది. మౌనంగా, నిస్సహాయంగా వెళ్ళిపోయాను. ఆ తర్వాత అక్కడినుండి బదిలీపై మళ్లీ కొత్త జీవితంలోకి, కొత్త మనుషుల నడుమకు వెళ్ళిపోయాను.

ఇది జరిగి పదిసంవత్సరాల తర్వాత - ఏదో పనిమీద హైదరాబాద్ వెళ్ళాను. "బాబూ కుంటోన్ని..పది పైసలు దానం చెయ్యండి." ఆ కంఠం... ఆ మాట.. తలెత్తాను చటుక్కున వాడు నరసింహులు. మనసు రెక్క తెగిన పావురంలా తన్నుకుంటుంది. "నువ్వు నరసింహులు" ఏదో అనబోయాను. వాడు భయంగా, సిగ్గుగా, బాధగా చూసి కళ్ళనిండా నీళ్ళు నింపుకుని గిరుక్కున వెనక్కి తిరిగి పరిగెత్తుతున్నాడు భయంకరంగా కుంటుతూ...

"ఇలా ఎందుకు జరిగింది" చూస్తున్నాను అచేతనంగా.
"సార్" ఉలిక్కిపడ్డాను.
ప్రక్కన భాస్కర్, వాని ప్రక్కన కారు .
"నేను గుర్తున్నానా సార్... భాస్కర్ ను ...ఎప్పుడొచ్చారు? కరేక్కండి డ్రాప్ చేస్తాను. ఇలా పోతుంటే చటుక్కున కనపడ్డారు మీరు." అంటున్నాడు.
"ఏం చేస్తున్నావు నువ్విపుడు"
"బిజినెస్"
డోర్ తెరిచాడు. కారెక్కాను.
మనసు గంజిలో పడ్డ ఈగలా గింజుకుంటుంది.

రామా చంద్రమౌళి (rama chandramouli)రచయిత పరిచయం:

రామా కనకయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు 8-7-1950లో జన్మించిన రామా చంద్రమౌళి ఎం.ఎస్‌(మెకానికల్‌) ఎఫ్‌.ఐ.ఇ, పిజిడిసిఎ చదివారు.
వీరు ప్రొఫెసర్‌గా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా వరంగల్‌ గణపతి ఇంజినీరింగ్‌ కాలేజీలో పనిచేస్తున్నారు.

రచనలు:
ఇప్పటి వరకు 192 కథలు, 18 నవలలు, ఎనిమిది కవిత్వ సంపుటాలు, ఎన్నో సాహిత్య విమర్శా వ్యాసాలు, శాస్త్రీయ విద్యా విషయక వ్యాసాలు, ఇంజినీరింగ్‌ పాఠ్యగ్రంథాలు రాశారు.

వీరి నవలలు : శాపగ్రస్తులు, చారునీళ్లు, ప్రవాహం, శాంతివనం, తెలిసిచేసిన తప్పు, అమృతం తాగిన రాక్షసులు, వక్రరేఖలు చదరంగంలోని మనుషులు, పిచ్చిగీతలు, రాగధార, నిన్ను నువ్వు తెలుసుకో, పొగమంచు, మజిలీ, దారితప్పిన మనుషులు, ఎడారిలో చంద్రుడు, ఎక్కడనుండి ఎక్కడికి? మొదలగునవి రాసారు.

కథాసంపుటాలు: 'తెగిన చుక్కలు', 25 ఏళ్లనాటి 25 కథలు, జననబీభత్సం- మరణ సౌందర్యం అనే 3 కథా సంపుటాలు ప్రచురించారు.
కవితా సంపుటాలు: దీపగ్ని (1971), శిలలు వికసిస్తున్నాయి (1979), స్మృతిధార (1984) ఎటు? (2004) కిటికీ తెరిచిన తర్వాత (2006) ద్విభాషా సంకలనం (ఇంగ్లిష్‌, తెలుగు) (ఆటా సభల్లో అమెరికాలో 2006లో ఆవిష్కరించబడింది)
అంతర్ధహనం, ఒకే దేహం... అనేక మరణాలు, మూడు స్వప్నాలు ఒక మెలకువ (సంయుక్తంగా) వంటి విశిష్టమైన కవితా సంపుటాలను వెలువరించి ఎందరికో మార్గదర్శకులుగా నిలిచారు.
ఇంజినీరింగ్‌ పాఠ్యపుస్తకాలు: 1. ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, 2. డిజైన్‌ ఆఫ్‌ మెకానిక్‌ ఎలక్ట్రానిక్స్‌ 3. ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, 4. ఇంజినీరింగ్‌ మెటాలజీ, 5. సాలిడ్‌ మెకానిక్స్‌ తదితర పుస్తకాలు రచించారు

పొందిన పురస్కారాలు:

రాష్ర్టపతి చే, రాష్ర్ట ప్రభుత్వంచే ఉత్తమ ఇంజనీరింగ్‌ టీచర్‌ స్వర్ణపతక పురస్కారాలు పొందారు.
సరోజినీనాయిడు జాతీయ పురస్కారం (కులాల కురుక్షేత్రం సినిమాకు), ఉమ్మెత్తల సాహితీ పురస్కారం(1986) నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం (1986) ఏపి పాలిటెక్నిక్‌ అధ్యాపక అవార్డు (2000),భాగ్య అవార్డు (2005), ఆంధ్రసారస్వత సమితి పురస్కారం(2006), అలాగే అనేక పోటీలతో వీరు అవార్డులు పొందడం జరిగింది.
‘యాజ్‌ ది విండో ఓపెన్స్‌’గా వెలువడ్డ మాతృక ‘కిటికీ తెరిచిన తర్వాత’ కవిత్వ సంపుటి ‘2007- తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం’ పొందింది. స్వాతి శ్రీపాద అనువదించిన ‘ఇన్‌ఫెర్నో’ మూలగ్రంథం ‘అరతర్ధహనం’ కవిత్వం ‘2008-సినారె కవిత్వ పురస్కారం’ సాధించింది.  జి.ఎం.ఆర్‌. రావి కృష్ణమూర్తి కథా పురస్కారం (2008),

ముఖ్యమైన ఘట్టాలు:

వీరి సాహిత్యంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య కె.యాదగిరి నేతృత్వంలో రామాచంద్రమౌళి - సమగ్ర సాహిత్యం పరిశోధన అంశంపై జ్వలితచే పి.హెచ్‌.డి చేస్తున్నారు.
అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్‌లో ఆచార్య కాత్యాయినీ విద్మహే నేతృత్వంలో రామాచంద్రమౌళి - కథలు అంశంపై ఎంఫిల్‌ పరిశోధన జరుగుతున్నది. వీరి నవలలపై ఆచార్య జ్యోతి నేతృత్వంలో ''రామాచంద్రమౌళి - నవలలు'' అంశంపై ఎంఫిల్‌ పరిశోధన జరుగుతున్నది.

ఇతర భాష లోకి  అనువాదమైన కథలు

'ఎడారిలో చంద్రుడు' (నవల), 'చదరంగంలో మనుషులు' కన్నడంలోకి అనువదించబడ్డాయి. 8 కథలు కన్నడంలో టెలీ కథలుగా ప్రసారం చేయబడ్డాయి. దాదాపు 20 కథలు ఇంగ్లిష్‌, కన్నడ, తమిళ, పంజాబీ భాషల్లోకి అనువదించబడ్డాయి.

ఇంగ్లీషులోకి అనువాదమైన కవితా సంపుటాలు:

‘ఎటు..?’ అన్న కవితా సంపుటిని ప్రొ కె. పురుషోత్తం, ప్రొ ఎస్‌. లక్ష్మణమూర్తి, డా వి.వి.బి. రామారావు, రామతీర్థ, డా కేశవరావు, డా కె. దామోదర్‌ రావు కలిసి ‘విథర్‌ అండ్‌ అందర్‌ పోయయ్స్‌’గా ఒక సంపుటి వెలువరించారు. ‘కిటికీ తెరిచిన తర్వాత’ సంపుటిని డా కె. పురుషోత్తం, డాఎస్‌. లక్ష్మణమూర్తి, డా లంకా శివరామ ప్రసాద్‌, రామతీర్థ ఇత్యాదులు ‘యాజ్‌ ది విండో ఓపెన్స్‌’ పేరుతో వెలువరిస్తే, అది అమెరికాలో ‘ఆటా’ పక్షాన నిర్వహించిన ‘ప్రపంచ తెలుగు మహాసభ’ల్లో కాలిఫోర్నియా వేదికపై ఆవిష్కరించారు. ‘అంతర్దహనం’ కవిత్వ సంపుటిని స్వాతి శ్రీపాద ‘ఇన్‌ఫెర్నో’ పేరుతో మొత్తం పుస్తకాన్ని అనువదించి వెలువరించారు. లంకా శివరామప్రసాద్‌ ‘ఫైర్‌ అండ్‌ స్నో’గా వెలువరిస్తున్నది నాల్గవ సంపుటి.
‘ఒక దేహం-అనేక మరణాలు’ అక్టోబర్‌ 2009న వెలువడ్డ  ఏడవ కవిత్వ సంపుటి, దీంట్లో 54 కవితలున్నాయి.దీంట్లోని కవితలన్నీ ప్రముఖ తెలుగు పత్రికల్లో వెలువడినవే. వీటిలో ఇరవైకి పైగా కవితలు ఇంగ్లీష్‌తో సహా ఇతర భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. ఇప్పుడు వీటిలోనుండి ముప్పయ్యేడు కవితలను ఎంపిక చేసి ఇంగ్లీష్‌లో ఒక సంపుటిగా ‘ఫైర్‌ అండ్‌ స్నో’ పేర డా లంకా శివరామ ప్రసాద్‌ అనువదించారు.


నిర్వహించిన  పదవులు

2004 నుండి 'సృజనలోకం' తరపున ప్రధాన సంపాదకత్వంలో కవితా వార్షిక 2004, 2005, 2006, 2007 సంచికలు వెలువడ్డాయి.

ఇండియా టుడేకు ప్యానల్‌ రివ్యూవర్‌గా వున్నారు. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ, న్యూఢిల్లిdచే 2007 సం. కోసం వరంగల్‌లో నిర్వహించిన 'కవిత సంధి' కార్యక్రమానికి 1996 నుండి ఎంపిక చేయబడ్డ 3వ కవిగా 29.06.2007న పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 2007న అగ్రాలో 3వ ఇంటర్నేషనల్‌ రైటర్స్‌ పెస్టివల్‌కు అధ్యక్షత వహించారు.

ఎం.ఎస్‌ చేస్తున్నప్పుడు 'స్పెషల్‌ అప్లికేషన్‌ బ్యూరియన్స్‌ ఇన్‌ రాకెట్‌ సిస్టమ్‌' అంశంపై డిఆర్‌డిఎల్‌, హైద్రాబాద్‌లో డాక్టర్‌ అబ్దుల్‌ కలాంతో కలిసి పనిచేశారు.

ఆచార్య ఆత్రేయ వద్ద స్క్రిప్ట్‌, లిరిక్‌ రైటింగ్‌ నేర్చుకున్నారు. కాంచన సీత సినిమాకు జాతీయ దర్శకుడు 'అరవిందవ్‌' వద్ద పనిచేశారు. బొమ్మరిల్లు, డబ్బు డబ్బు డబ్బు, గూటిలో రామచిలుక, జేగంటలు, కులాల కురుక్షేత్రం వంటి సినిమాలకు పనిచేశారు.


మనసుని సృజించే మరో రచయిత కథ:

Comments

Post New Comment


Nemali Kunche 04th May 2011 04:08:AM

రమా దేవి గారు మీరు అసలు కధను(రామ చంద్రమౌళి గారు రాసిన కధను) చాలా తక్కువ మాటలతో మా హృదయాన్ని హత్తుకునే విధ౦గా మాకు అందించారు. నిజ౦గా మిమ్మలను మెచ్చుకోకుండా ఉండలేము. కధలో నరసి౦హులు లా చాలా మంది మనకు తారస పడుతూనే ఉంటారు. అనుభవ౦ తో చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి వాళ్లకు నచ్చినట్లు తోచింది చేసి ఫలితాన్ని అనుభవిస్తుంటే మన మనసు మాత్రం ఇంకా వాళ్ళకు ఏదో చేయాలనే అనిపిస్తుంది. కాని గడచిన సమయం తిరిగి రాదు కదా..