ప్రియమైన నీకు....

ప్రియమైన నీకు....

నీవు నాకు తెలుసో తెలియదో ఇతిమిత్తంగా చెప్పలేను.. నీ మనసు సున్నితపు గోడను తాకినట్టుగా గుర్తు.. అయినా నేను ఎప్పుడూ నీ మనసు సముద్రపు లోతుల్లోకి ఈదులాడిన ఆనవాలు చిక్కలేదు..

పలుమార్లు నిన్ను చూసినట్టు గుర్తు..అయినా ఎందుకో నీ రూపం మబ్బులాగా జారిపోతుంది... పంతంపట్టి  వర్ణచిత్రం వేద్దామని అనుకున్న సమయాన కానీ తెలియలేదు ..నీ మాట తప్ప రూపమేది మనుసున విలువ లేదని.. బహుశా ఇరువురి మధ్య ఓ దళసరి దడి అడ్డంగా ఉంది కాబోలు అస్పష్టమైన రూపాన్నే చూసానేమో ఇంతకాలం..

నానుంచి నేను వేరుపడి ఎదురైతే అది నీవు తప్ప  మరొకరు కాజాలరేమో....అందుకే కాబోలు నా అనుకునే వారు నీ చెంత నీటి అలలా తళుక్కున మెరుపై తాకుతారు..

నీవు తెలియదు అంటూనే నీ భావాలలో చిక్కుకున్నాను... నీ మాటలతో జ్ఞాపకాల పొదరిల్లు అల్లుకున్నాను.. నీ ఊహలతో ఎన్నో రంగులు గదినిండా వెదజల్లబడ్డాయి...అందుకే నా అస్పష్టమైన భావాలకు మూలకథగా నీ పేరు రాయాలనుకుంటా..

ఇంతకూ....ఏమీ తెలియని నీతో నన్ను కట్టిపడేసింది ఏమిటి.. .ప్రశ్న మళ్లీ మొదటి వరసలో నిల్చుంది.......
ప్రశ్న నను చేరకముందే..ఎప్పుడో నా జవాబు  పూలపుప్పొడిలో కలిపి పయనమయింది...

ఇక ఇపుడు నీతో..... నేను ఎందుకు బంధింపబడ్డానో మూలాన్వేషణ చేయడం కాలానికే సాధ్యం


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!