జెన్ అంటే.. జెన్ వివరణ...

జెన్ అంటే..
జెన్ అనేది క్షణ క్షణానికీ మధ్య జరిగే నిరంతర ప్రక్రియ. ప్రకృతితో మనకున్నటివంటి విడదీయలేని ఓ రహస్యమైన క్రియ.
ఇది ఎలాంటిదంటే ఈ ఉపనిషత్ కథలో చెప్పినట్లుగా ' కరవాలాన్ని చేతబట్టి నరుణ్ణి చంపుతావో లేదా నరమేధాన్ని ఆపుతావో ' అన్నది ఓ సమస్యే కాదు. ' ప్రాణం పోయడమా... ప్రాణం తీయడమా...' అన్నది  పాపం ఆ కరవాలానికి తెలియదు... జెన్ ' అలాంటి ఓ కరవాలమే '. దాన్ని ఎలా ఉపయోగిస్తాం, ఎలా వాడతాం అన్నది మన చేతుల్లోనే వుంది.
జెన్ వివరణ...
క్రీ.శ ఆరవ శతాబ్ధంలో కాంచీపురం నుండి చైనాకు వెళ్ళిన బోధిధర్ముడు బౌద్ధ సారాంశంగా జెన్ మార్గాన్ని ఆరంభించినట్లు చెబుతారు.
'జెన్ ' అనేది జపాన్ లోని ఒక బౌద్ధమత శాఖ. భారతదేశం నుండి ధ్యాన మార్గం మొదట చైనా చేరింది. 'ధ్యాన ' అన్న సంస్కృత పదం చైనాలో 'ఛాన్ 'గా మారింది, జపాన్ చేరేసరికి 'జెన్ ' అయ్యింది. ఎనిమిదవ శతాబ్ధంలో హ్యయీ-నెంగ్ అన్న బౌద్ధగురువు ద్వారా చైనాలో జెన్ స్థిరపడింది.
బౌద్ధం చైనా పరిస్థితులకు అనుగుణంగా రూపొందుతున్న క్రమంలో బౌద్ధంలోని ధ్యాన మార్గం విలక్షణతని రూపొందించుకుంది. క్రీ.శ. 5వ శతాబ్ధం నుంచే జపాన్ లో బౌద్ధమతమున్నా జెన్ శాఖ క్రీ.శ. 12వ శతాబ్ధంలో జపాన్ లో ఏర్పడింది. అది బౌద్ధమతంలోని ధ్యాన మార్గం. చైనాలోని తావోయిజంతో.జపాన్ లోని షింటో మతంతో ప్రభావితమై బలంగా తయారై ' జెన్ ' రూపొందింది.
ఆ 'జెన్ ' మార్గానికి చెందిన బౌద్ధ సన్యాసులు కఠిన స్వీయ క్రమశిక్షణ, దృఢత్వం, ప్రాపంచిక విషయాల పట్ల అలీనత జెన్ కథల్లో, బోధనల్లో మనల్ని ఆకర్షిస్తాయి.
జెన్ కథలన్నీ కథలు కావు. అనుదిన జీవితాన్ని అమర జీవితం చేసే రసగుళికలు. వీటన్నిటినీ రకరకాల వైవిధ్యాలతో ఎందరో జెన్ గురువులు తమ జీవితాల్లో ఆచరించారు. ఆ పరిణామంలో వాళ్ళ జీవితాల్లోని ఘటనలు, సంఘటనలు, కథలు, సన్నివేశాలు, అనుభూతుల సంకలనాలు ఈ జెన్ కథలు.
జెన్ లో ఎన్నో శాఖలు వున్నాయి. వాటిలో ప్రధానమైనవి రింజాయ్, సోటో  శాఖలు. జపాన్ స్థానిక సామాజిక, రాజకీయ, సాహిత్య కళా రంగాలపై జెన్ ప్రభావం అపారం. ఆధునిక కాలంలో యూరప్, అమెరికాల్లో ఎన్నో జెన్ అధ్యయన కేంద్రాలు ఏర్పడ్డాయి.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!