నా ఇష్టం నాకిష్టం

నా ఇష్టం నాకిష్టం

ఎవరినైనా నీకు ఏం చేయడం ఇష్ఠం అంటే వానలో బజ్జీలు తినడం, వానలో తడవడం ఇలా చెప్తారు కదా. మీరు చెప్పండి మీకేం ఇష్టమో. అనుకుంటూ ఉండండి మనసులో ఈ లోగా నా ఇష్టాలు  చెప్తా. చెప్పనా?

తెలీదు పట్నం లో పెరిగిన వాళ్ళ కి ఏ ప్రపంచం తెలుసో. నాకు మాత్రం పల్లెటూరే ప్రపంచం. అక్కడ ప్రతి దానికి ప్రాణం ఉన్నట్టు తోస్తుంది. ప్రతిదీ నాతో ఊసులడుతున్నట్టుంటుంది. మా ఇల్లు, ఇంటి ముంది ఉన్న చెక్క బండి, దానికి కట్టేసిన బర్రె దూడ, మా చింత చెట్లు, నా పాత సైకిలు, మా పెరట్లో మందారం పూలు ఇలా చెప్తూ ఉంటే ఎన్ని పేజీలు రాసిన చాలవు.

మా ఇల్లు చాలా పెద్దది. వెనుక ఆకు కూరలు ముందు పూల మొక్కలు నాటడానికి చోటు. వెనుకేమో బెండ లు, పొట్ల కాయలు, గోంగూర, పెద్ద చిక్కుడు, సొర కాయ ఇంకా కొన్ని ఆకు కూరలు వేసేది అమ్మ. అదే బుజ్జి (నా చెల్లి ) ఆడుకునే చోటు. ఇంటి ముందు తాటి ఆకుల పందిరి. ఎండాకాలం వస్తే చాలా చల్లగా ఉండేది. ఇంకా చాలా పూల మొక్కలు. ఎవరికి దొరికినవి వాళ్ళు తెచ్చి నాటేసే వాళ్ళం. నేనైతే నాచు పూలు ఇంకా ఏవో ఆకుల చెట్లు ఉండేవి అవి స్కూల్ లో ఉంటే తెచ్చే వాడిని. అమ్మ ఏమో బంతి, చామంతి పూలు తెచ్చి నాటేదీ. నాన్న వంతు గా రెండు కొబ్బరి చెట్లు నాటాడు. సాయంత్రం అయే సరికి అన్నం తింటూ ఆరు బయట కూర్చునే వాళ్ళం. చీకట్లు మూసిరే వేళకి ఆకాశమంతా మినుకు మంటు చుక్కలు వాలిపోయేవి. నులక మంచాల మీద పడుకొని పైకి చూస్తూ చాలా కథలు చెప్పుకునే వాళ్ళం. చాలా చుక్కలు కనిపించేవి, ఎన్ని అంటే అలా చేత్తో తుడిచి ఒడిలో పోసుకోవాలనిపించేన్ని. అపుడపుడు తెగ తిరిగే చుక్కలు కనిపించేవి, ఒకటి కనిపించగానే ఇంకో దానికోసం వెతికే వాళ్ళం. తప్పకుండా దానికి ఎదురుగా వెళ్లే చుక్క ఉండేది. అలా వెతకడం లో ఏదో ఆనందం ఉండేది. ఇక వెన్నెల రోజులు. మా ఇంటి ఎదురుగా ఉన్న బడి లో ఓ నాలుగు జామయిల్ చెట్లు ఉండేవి. అవి నాకు హంస ఆకారం లో కన్పించేవి. అందులోంచి చంద్రుడు వచ్చేసే వాడు. అలా వచ్చి మా కొబ్బరాకుల్లో దాక్కుని వెన్నేలని అందులోంచి జార విడిచే వాడు. కొబ్బారాకుల గలగలల లోంచి వెండి వెన్నెల జాలు వారెది. అలా చూస్తూ నిద్రాపోయే వాళ్ళం. ఆ మొక్కలకి పాదులు తవ్వడం, నీళ్ళు పెట్టడం నాకు బుజ్జికి అప్ప చెప్పే వాళ్ళు. మా అమ్మ చేత మంచి అనిపించుకోవాలని తెగ కష్టపడి చేసే వాళ్ళం. నా చెట్టు బాగా కాసిందోచ్ అనుకుంటూ పడే మురిపేం భలే ఉండేది.

ఇంకా ఉంది........

 


Comments

Post New Comment


Nemali Kunche 04th May 2011 03:55:AM

లక్ష్మీ నరేష్ గారు మీరు రాసి౦ది కధలా లేదు, మీ యొక్క, మీకనిపి౦చె తీపి జ్ఞాపకాలు లా ఉన్నాయి. భావుకతను బాగా జోడి౦చారు మీ వర్ణన లో...