దెయ్యమా ....పిచ్చా??

ఇది నా సొంతం కాదు...పరిమళం అనే బ్లాగ్ లో ఉంటె చదివి నచ్చి ఇక్కడ ఇస్తున్నాను. రచయిత అనుమతి లేకుండా పోస్ట్ చేసినందుకు క్షంతవ్యుడిని.

ప్రసన్నకి దెయ్యం పట్టిందట! కాదంట....పిచ్చని అంటున్నారు. ఆనోటా ఆనోటా వింటున్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఏంటీ వీళ్ళంతా....నిన్న మొన్నటి వరకు ప్రసన్నదేవత...సంసారాన్ని చక్కగా దిద్దుకుంది...అందరికీ తలలో నాలుకలా ఉంటుంది...ఎవరికి ఏ సహాయం కావాలన్నాసొంత మనిషిలా చేస్తుంది అన్న బంధువులే ఇప్పుడిలా అంటున్నారంటే ఏం జరిగిందో...ఆలోచిస్తూ ఉండగానే సుబ్బక్క వచ్చింది .బుజ్జీ! ప్రసన్నని చూడటానికి వెళ్తున్నా...నువ్వు వస్తావా? ఒక్కనిముషం ఉండక్కా...కొంచెం మొహం కడుక్కొని వచ్చేస్తాను. ఇంతకూ ఏమైంది...దెయ్యం పట్టిందని అంటున్నారు...చేతికొచ్చినవన్నీ విసిరేస్తుందట! తల గోడకి కొట్టుకుంటుందట...తనలో తనే ఏడుస్తుందట లేకపోతే మౌనంగా ఉండిపోవడం చేస్తుందట! వింటూనే రెడీఅయి తాళంవేసి బయలుదేరాను.

ప్రసన్నక్క...తనతో నాకు మంచి అనుబంధమే ఉంది. బంధుత్వం కన్నా స్నేహంగా ఉంటుంది. తనకి ఏదైనా మానసిక సమస్యా ? వీళ్ళంతా మూర్ఖంగా దెయ్యం ..భూతం అంటూ భూతవైద్యం చేయిస్తున్నారా ? ఐనా మానసిక సమస్యలు ఏం ఉంటాయి తనకి ? మంచి భర్త, చక్కటి పిల్లలు దాదాపు సెటిలైపోయినట్టే ...ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు. ఇంట్లో కూడా తను ఎంతంటే అంతే! ఆలోచనలు సాగుతూ ఉండగానే ఇంట్లోకి అడుగు పెట్టాం.

ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అంతకు ముందే ఏదో సాంబ్రాణి లాంటిది వేసినట్టు వాసన వస్తోంది. ప్రసన్నక్క దివాన్ మీద
పడుకొని ఉంది.అంతకు ముందు ఎప్పుడు ఇంటికొచ్చినా ఎదురొచ్చి గలగలా పలకరించేది. ఇప్పుడు మేమెవరో తెలీనట్టు శూన్యంలోకి చూస్తూమౌనంగా ఉండిపోయింది. ఎంతలో ఎంత మార్పు! పసిమిఛాయ వన్నెతరిగి కళ్ళకింద నల్లటి వలయాలు...మెడలోనూ, చేతికీ ఏవో రక్షలు కట్టారనుకుంటా. లోపలినుండి వాళ్ళమ్మగారు ఏదో విభూతి నీళ్ళలో కలిపి పట్టుకొచ్చారు. మాట్లాడకుండా తాగేసి అటు తిరిగి పడుకుంది. పెద్దావిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే బాధనిపించింది. కాసేపటి తర్వాత ఇద్దరం లేచి వెళ్ళొస్తామని చెప్పి...దివాన్ దగ్గరగా వెళ్లి వంగి వెళ్తానక్కా అని
చెప్పి వెనక్కి తిరుగుతుంటే నా చేయి పట్టుకుంది. ఆశ్చర్యంగా అనిపించింది. సరే సుబ్బక్కా ...నేను కాస్సేపు ఆగి వస్తాలే నువ్వెళ్ళు అంటూ దివాన్ మీద పక్కనే కూర్చుండిపోయాను.


బుజ్జీ...నువ్వు అక్కదగ్గర ఉంటావుకదా...నేను పదినిముషాలలో పాల పేకెట్లు తెచ్చుకుంటాను అని ప్రసన్నక్క వాళ్ళమ్మ కూడా బైటకి వెళ్లారు. అప్పటివరకు మౌనంగా ఉన్నతను బుజ్జీ ...నువ్వుకూడా నాకు పిచ్చో ....దెయ్యం పట్టిందో అనుకుంటున్నావా..అని అడిగే సరికి షాకయ్యాను. అసలేం జరిగిందక్కా ...


బుజ్జీ....మా పెళ్ళయ్యి ఇరవై ఏడేళ్ళు...ఈ ఇరవైఏడేళ్ళూ...ఇల్లాలిగా, కోడలిగా, తల్లిగా ...అన్ని బాధ్యతలూ సక్రమంగా నిర్వహించాను. ఎప్పుడూ పిల్లలకోసం, ఆయనకోసం తాపత్రయపడ్డాను. పిల్లల్ని పెంచడంలో, చదివించడంలో, పెళ్లి చేసినపుడు అన్ని విషయాల్లోనూ.... ఇన్నేళ్ళలో వాళ్ళకు ఏలోటూ రాకుండా.. ఎవరిచేతా ఒక్క మాట అనిపించుకోకుండా...నెట్టుకు రావడం మాటలేంకాదు దానికోసం నా ఆరోగ్యం, ఆనందం అని ఎప్పుడూ చూసుకోలేదు. అలాగే అందరూ నన్నూ అలాగే ప్రేమగా చూసుకున్నారు. కాని ఇప్పుడు నా మనసుని అర్ధం చేసుకొనే తీరిక ఓపిక ఎవరికీ లేవు. ఒకవిషయం చెప్తాను మనమధ్యే ఉండనివ్వు. నువ్వూ నమ్మకపోతే నవ్వుకో...దాదాపు పదిహేనేళ్ళ క్రితం ఓ జ్యోతిష్యుడు మీ బావగారిజాతకం చెప్పాడు. నమ్మాలో వద్దో తెలీదు నేనూ మూధనమ్మకాలకు దూరమే..కాని కొన్ని సంఘటనలు మా జీవితంలో ఆయన చెప్పినట్టూ జరిగాయి. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ సంవత్సరం భార్యకు ప్రాణగండం అని! ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు. కాని నాలో అంతర్గతంగా ఉన్న భయాన్ని చెప్పినపుడు ఎంత తేలిగ్గా తీసి పడేశారంటే ...పైగా ఆయనా, పిల్లలూ ఎగతాళి చేశారు. మూర్ఖత్వం అన్నారు. అసలు పట్టించుకోకుండానే ..ఎవరి పనుల్లో వారు కాలం గడిపేస్తున్నారు. నా భయాన్నిగాని...నా ఫీలింగ్స్ కాని వాళ్లకి అక్కర్లేదు అర్ధం చేసుకోరు. అది నిజం అవునో కాదో ...ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుందాం.నిజం ఐతే నాకోసం నేను బ్రతకకుండానే నా జీవితం అయిపోతుంది. ఒకవేళ నాది మూర్ఖత్వమే ఐనా ఇరవై ఏడేళ్ళు వాళ్ళకోసం బ్రతికాను...ఒక్క సంవత్సరం నాకోసం వాళ్ళేమీ చెయ్యకూడదా..సరదాగా కనీసం అప్పుడప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లటం...అసలు నాకూ చిన్న చిన్న కోరికలు ఉంటాయని...నాకూ మనసుంటుందని నా భయాన్నిఎగతాళి చేసే బదులు అర్ధం చేసుకొని ధైర్యాన్నివ్వాలని అనిపించదేం వీళ్ళకి....ఎందుకు నన్నర్ధం చేసుకోరు? విపరీతమైన కోపం వస్తుంది ...అందరిపైనా ప్రేమ స్థానంలో ద్వేషం పెరుగుతుంది చచ్చిపోవాలనిపిస్తోంది చచ్చి వీళ్ళందర్నీ ఎడిపించాలనిపిస్తోంది...అందరిపైనా ఉక్రోషం.....కన్నీళ్లు జలజలా రాలుతూండగా.....సడన్ గా ఆపేసి అటు తిరిగిపోయింది. గుమ్మంవైపు చూస్తె పెద్దమ్మ వచ్చేసింది.

అంతా అయోమయంగా అనిపించింది. ఏం మాట్లాడాలో తెలీలేదు. సరే పెద్దమ్మా...ఇక నేను వెళ్తాను అంటూ .....బయటికి నడిచాను. ప్రసన్నక్కకి దెయ్యం పట్టిందా ...లేక పిచ్చా అని ఆలోచిస్తూ కళ్ళనిండా నీళ్ళతో భారమైన మనసుతో ఇంటి దారి పట్టాను.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!