ఒంటరిని చేసిన.."తపన"

ఏంటి.. తలగడ మెత్తగానే ఉన్న నిదుర రావడం లేదు, చేతినే తలగడ చేసుకోడం అలవాటు ఐనా కూడా ఎందుకు తలగడతో పేచీపడుతున్నా...ఐనా మెత్తటి పరుపును చూడగానే నిదుర వస్తుందా...నిదుర వచ్చినపుడు కటికనేలైన చాలు కాసింత అని అనిపిస్తుందా..ఏమో వీధిలో నిదురవచ్చి సోలి వాలిపోయి ఫుట్ పాత్ పై పడిపోతే ఎలా ఉంటుంది...అలా తాగిపడిపోవడంగానే తెలిసిన మనుషులు చీదరించుకుంటూ తప్పుకొనిపోతారా.. స్త్రీ కదా అలా జరిగుండదులే అని నా చెంత చేరుతారా.. ఏమో తెలియని మగవాడు చేజిక్కించుకుపోతాడేమో,తెలిసిన ఆడమనిషి తెలుసుకొని అమ్మేస్తుందేమో..ఇవన్ని జరక్కుండానే కలలా ఇల్లు చేరుతానేమో..

ఐనా నేను మనుషుల్ని నమ్ముతున్నానా, నమ్ముతున్నానని భ్రమపడుతున్నానా.. అదేంటి నేను మనసు ని నమ్ముతాను అంటూనే మెదడుకు పదును పెడుతున్నాను.. నాకు మనసుకంటే నా ఆలోచనలే ఇష్టమా, అదిగో వీధి వాకిలి చప్పుడయింది..ఎవరు రాని వేళ..ఎవరై ఉంటారు...ఆ ఎవరైనా ఎంత సేపు ఉంటారులే..రాజుగారు పూటకూళ్ళ అవ్వ ఇంట్లో ఉన్నంత సేపు...

తెలిసిన నిజాలు ఎదుటివారికి ఎందుకు చెప్పాలి, అందరు ముసుగు వేసుకొనే ఉంటారు, అందులోనే అందమంతా ఉంది అని అంటూ ఉంటె నేను ఎందుకు ముసుగు వెనుక మనిషి గురించి ఆలోచిస్తున్నా.. అవును నేను ఎందుకు ఇంత మంది మనుషులు నాకు కావాలి అని అనుకుంటున్నా, అందరు వదిలి వెళ్ళిపోతే ఒంటరిని అవుతానని అనిపించదెందుకు, ఒక్కొక్కరు దూరంగా వెళుతున్నా పెదవిపై చిరునవ్వు ఉందెందుకు, మనసులోని బాధ పెదవిపై కనిపిస్తే చులకనై పోతానని భయం కాబోలు.

అదేంటి ఎపుడు వచ్చే కల మళ్ళీ వచ్చింది, ఎవరు దొరక్క  నన్ను వెతుక్కుంటూ వచ్చిందేమో ..నేను ఈ అడవిలో ఉన్నానేంటి, హా..ఇక్కడ నిదుర లేదు, మనషులు లేరు, కలత లేదు కలలు లేవు...అరె! ఎవరులేని చోట నేను ఎలా ఉండగలను ఇది నేను కాదేమో మరి నేను ఎక్కడా..నన్ను నేను వెతుక్కోవాలి...ఎక్కడ వెతుక్కోను..భయం వేస్తుంది నన్ను నేను గుర్తు పడతానా, నేను ఎక్కడ ఉన్నాను...

అమ్మో  కలత నిదుర నుంచి ఉలిక్కి పడి లేచా..నాలో కలిగిన సంచలనం నన్ను భయపెట్టింది...దీనికంత కారణమైన సగం చదివి అలా తెరిచి ఉంచిన 'తపన'..... కాశీభట్ల వేణుగోపాల్ గారి 'తపన'

ఒక మనిషిలో ఎన్ని ఆలోచనలు, ఎన్ని అపోహలు.. అవన్ని ఉన్నాయని తెలిసినా వాటిని అటుకుపై దాచి ఏమి తెలియనట్లే  పలకరింపులు, అందుకేనేమో అందరి చిరునవ్వులు ఆకట్టుకోవు, అందరి బాధ బాధించదు..మనము ఎవరికీ తెలియకున్నా పర్వాలేదేమో కానీ మనకు మనము తెలియదు అని మోసం చేసుకోడం....మనలోని మనిషిని  చూసుకోవాలంటే....అనంతమైన ఆలోచనా పరిధిలో మనసుకి గాయం కాకుండా చూసుకుంటేనే జీవితంలో మాధుర్యం అందుకుంటామేమో...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!