మీ మనసు వజ్రమే...

ప్రేమ ఆప్యాయత, ఇలాంటి పదాలు వినడానికి చాల బాగుంటాయి..కానీ అందుకొని మన సొంతం చేసుకోవడానికి కొంచెం కష్టం ఎందుకంటే అవి సొంతం కావాలంటే ఎదుటివారిమీద ఇష్టం ఉండాలి, మనలో కొన్ని పట్టు విడుపులు ఉండాలి, మనలో ఎదుటివారికి నచ్చనిదేమితో తెలిసి ఉండాలి.. వారికి నచ్చనిది నీవు వదులుకోలేనపుడు, మార్చుకోలేనిదయినపుడు, అది నీ జీవితానికి ఆలంబన అయినపుడు నీ ఇష్టాన్ని అవతలివారికి అలవాటు చేయడం నీ కర్తవ్యం భావించగలిగి ఉండాలి.

ఒకసారి నీకు ప్రేమంటే తెలిస్తే నువ్వు యివ్వడానికి సిద్దపదతావు. నువ్వు ఎంత ఎక్కువ ఇస్తే నీ దగ్గర అంత ఎక్కువ ఉంటుంది ఇతర్ల మీద నువ్వు కుమ్మరిస్తూ వెళ్ళే కొద్దీ నీ అస్తిత్వం నించీ మరింత ప్రేమ విచ్చుకుంటూ ఉంటుంది. ఎదుటి వ్యక్తికి ప్రేమను అందుకునే అర్హత ఉందా? లేదా? అన్నదాన్ని గురించి ప్రేమ పట్టించుకోడు. అట్లాటి దృష్టి లోభి దృష్టి. కానీ ప్రేమ లోభి కాదు.భూమికి అర్హత ఉందా లేదా ని మేఘం పట్టించుకోదు. అది పర్వాతల పైన రాళ్ళపైన కూడా వర్షిస్తుంది.ఎట్లాంటి నిబంధనలూ లేకుండా, ఎటువంటి అనుబంధాలు అంటుకోకుండా, అది వర్షిస్తుంది,ప్రేమకూడా అలాటిదే అది కేవలం ఇస్తుంది.అది ఇవ్వడాన్ని ఆనందిస్తుంది....ఓషో

ఇపుడు ఎక్కువగా వినిపించే మాట ఎలాగైనా అనుబంధాలు, స్నేహం, అప్యాతలు తగ్గిపోయాయండి  అని..ఒకప్పుడు communication చాల తక్కువ, ఒకరి గురించి ఒకరికి తెలిసే సమాచారం చాల తక్కువ కాబట్టి, ఎపుడో ఒకసారి కలిసినపుడు అపోహలకి అతి తక్కువ ప్రాముఖ్యత నిచ్చి, క్షేమసమాచారాలకి పెద్దపీట వేసి, సంతోషంగా నలుగురు కలసి ఎక్కువ ఆనందం పొందడానికి ప్రయత్నించేవాళ్ళు. ఒక్కోసారి ఏదైనా మాట పట్టింపు వచ్చినా,నలుగురిలో తన గురించి ఏదో అన్నారని తెలిసినా, అప్పటికప్పుడు మన భావోద్వేగాలతో వారిపై విరుచుకుపడే అవకాశం కూడా తక్కువే, ఆ సమయం గడిచిపోయాకా మాట అన్నవారికి మరియు మాట పడిన వారికి కూడా అది ఎంతో పెద్ద విషయంగా తోచేది కాదు.

మరి ఇప్పుడు..మనం అభివృద్ధి సాధిస్తున్నాం అని సంతోషించాలో వాటిచేతిల్లో మనకు తెలియకుండానే కీలుబొమ్మలుగా మారిపోతున్నారని బాధపడాలో తెలియడం లేదు. మనల్ని ఎవరో ఎక్కడో ఏదో అన్నారని తెలిస్తే చాలు, అందులో నిజమెంతా, అక్కడ పరిస్థితి ఏంటి... ఏది ఏమి తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే,మన భావోద్వేగాలకు విశ్రాంతి నివ్వకుండానే అవతలివారిపై విరుచుకుపడిపోతున్నాం. మనకు ఉన్న సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలి, మనకు వీలుండి ఫోన్ చేసినపుడు అవతలివారు ఆనందంగా స్పందించాలి, ఎక్కువగా గుర్తింపబడాలి కానీ తక్కువ డబ్బులు ఖర్చుకావాలి. ఇలా చాల ప్రతిబంధకాలు మనమే కల్పించుకొని ఒకవిధమైన చిక్కుముళ్ళవల లో ఉన్నామన్న సంగతి కూడా అవగాహనకు రానంతగా చిక్కుకుని ఉన్నాం.

మనుషుల్ని కాదు మనసుల్నిగెలుద్దామిలా..ఆర్టికల్లో
నల్లమోతుశ్రీధర్ గారు ఇలా అంటారు....

ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! హ్యూమన్‌ సైకాలజీ, బాడీ లాంగ్వేజ్‌లు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో మనుషుల మనసుల్ని త్వరగా గెలవగలిగే మెళుకువలు అలవర్చుకుంటున్నాం. కానీ అందులో ఎక్కడా చిక్కదనం లేదు. కృత్రిమ హావభావాలతో కూడిన అచ్ఛమైన ప్రొఫెషలిజం! ఇంత సులభంగా మనుషులకు దగ్గరవగలిగే మనం, ఇంత సులభంగా మనల్ని మనం మార్కెట్‌ చేసుకోగలిగే మనం.. గాఢమైన అనుబంధాలను ఎందుకు పెనవేసుకోలేకపోతున్నాం? అందమైన చిరునవ్వులు, పొందికైన మాటలూ, ముచ్చటగొలిపే ముఖకవళికలు, ఆకర్షణీయమైన ఆహార్యం.. అన్నీ స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుని మరీ నేర్చుకుంటున్నాం. ఎందరినో పరిచయం చేసుకుంటున్నాం, సాన్నిహిత్యం పెంచుకుంటున్నాం, అనుబంధపు మాయమాటలతో ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం.. రైలు ప్రయాణంలో స్టేషన్‌ వస్తే దిగిపోయే ప్రయాణీకుల్లా అంతే అవలీలగా తప్పుకుపోతున్నాం. మరో రైలు, మరో మజిలీ, మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది. కొత్త మనుషులు కలుస్తూనే ఉంటారు. అవసరాలు తీర్చేసుకుని ఏదో ఒక సాకుతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని దూరమవుతూనే ఉంటారు. స్నేహంలో అవసరాలు ఒక భాగం మాత్రమే.. అవసరాలు తీర్చుకోవడానికే స్నేహం ముసుగు వేసుకోవలసి వస్తే ఆ అవసరాలు తీరగానే ఆ స్నేహానికి నూకలు చెల్లినట్లే! అందుకే మనుషుల్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, సహకరించుకుందాం.. అంతే తప్ప మనుషుల్ని జీవితంలో పైకెదగడానికి పావులుగా వాడుకునే నైపుణ్యతలు ఎన్ని అలవర్చుకున్నా మనసులో స్వచ్ఛత లేనప్పుడు ఆ అనుబంధాలకు బలమెక్కడ? ....నల్లమోతు శ్రీధర్(ఎడిటర్ అఫ్ కంప్యూటర్ ఏరా మ్యాగిజిన్)

తల్లి ప్రేమలో ఉండే స్వచ్ఛత ఇంకా ఎక్కడా ఉండదు అని చెపుతారు,  తిరిగి ఏమి ఆశించకుండా, పెట్టుబడి ( శ్రమ, సమయం లాంటివి)ఎవరు పెట్టినా అలాంటి ప్రేమే ఉంటుంది. అలాంటివాళ్ళు కనిపిస్తే వారిని కూడా అంతే ఇష్టపడతాం. మనకు అందుకోవడంలో ఉన్న సౌకర్యము,ఇవ్వడం లో ఉండదు కాబట్టి, మనము మాటవరసకు  అవతలివారంటే  ఇష్టం అనగలమే కానీ వారికోసం చేసేది మాత్రం శూన్యం. ప్రేమను డబ్బుతో ముడిపెట్టడం కుదరనిపని,  ప్రేమలోని స్వచ్చతను గుర్తించిన వాళ్లు ప్రేమను నలుగురికి పంచుతూ మనుషుల మనసులకు దగ్గరవుతూ వాళ్లకు తెలియకుండానే వారి మనసులు వజ్రంలా ప్రకాశవంతం చేసుకుంటారు, కానీ ఇపుడు ఇది ఒకటే సరిపోవడం లేదు...ప్రేమను అందించగలిగిన వాళ్ళు , ప్రేమను పంచడం అన్న ప్రక్రియకూడా నేర్పడానికి ప్రయత్నించడం తమ బాధ్యతగా గుర్తించాలి.

సాధారణ ఆర్ధిక విషయాలుపూర్తిగా భిన్నమయినవి. నువ్వు కొంత యిస్తే దాన్ని కోల్పోతావు. నువ్వు దగ్గర ఉంచుకోదలచుకుంటే, దాచుకోదలచుకుంటే యివ్వడం మానుకోవాలి. సంపాదించాలి, లోభిగా మారాలి. ప్రేమకు సంబంధించిన వ్యవహారం దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది.నీకు కావాలంటే లోభిగా ఉండకు.అలా ఉంటె అది నశించిపోతుంది....ఓషో.

ప్రతీ ఒక్కరిలో వజ్రంలా ప్రకాశించే అందమైన మనసు ఉంటుంది,దేవుడు తనలోని స్వచ్చతను మనకు అందించిన వరం మనసు, మనకు తెలియకుండానే అశ్రద్ధతోనో, ఇంత కన్నా గొప్పది ఏదో అందుకోవాలన్న తపనతోనో, రహస్య అరలో దాచి మరచిపోయోరేమో..దయచేసి ఆ మనసుని మీ అరచేతిలోకి తీసుకొని ప్రేమ, ఇష్టం అన్నవాటితో మెరుగు పెట్టి చూడండి...మెరిసే వజ్రం మీ కనులముందు తప్పక కనపడుతుంది...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!