నీ ప్రేమలో.. నిన్న, నేడు!

ప్రేమిస్తున్నపుడు మరణిస్తున్నట్టుగా

ఎందుకు అనిపిస్తుంది

..........ఓషో (osho)

 

నేను నిన్ను ప్రేమించాను. నీలోని అణువణువునీ ఎంతో ఇష్టంగా ప్రేమించాను. నా ప్రాణ సమానంగా ప్రేమించాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయేంత పిచ్చిగా ప్రేమించాను.

నీ మాటా, నవ్వూ, నడకా, చూపూ, అలక, బెట్టు, పొగరు, కోపం, చిరాకు, విసుగు, తిట్లూ, బుజ్జగింపులూ, మెచ్చుకోలు... ఇలా నీ నుంచి నా వైపు వచ్చే ప్రతీదీ అపురూపంగానే కనిపించేది నా కళ్ళకీ మనసుకీ కూడా!

నీ ఇష్టాలూ, అభిరుచులూ, కోరికలూ.. నువ్వేదంటే అదే నాక్కూడా నచ్చేది. నీకు నచ్చే రంగులూ, నీకు నచ్చే సినిమాలూ, నీకు నచ్చే మనుషులూ.. ఇలా ప్రతీదీ నీ ఇష్టంలోనే నా సంతోషం ఉండేది. "తీపిని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా.. ఒకసారి తిని చూడు.. తియ్యగా ఎంత బాగుంటుందో.." అన్న నీ ఒక్క మాటకి ఎప్పుడూ లేనిది అమాంతంగా మిఠాయిల మీద ఇష్టం వచ్చేసింది నాకు. నిజంగా అవెంత అందమైన రోజులు!

ప్రతీ క్షణం నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానన్న ఆలోచన తప్ప అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాను అన్న ప్రశ్నే ఎప్పుడూ తోచలేదు. నువ్వంటే ఇష్టం.. నీతోనే నా లోకం.. అంతే! నీతో ప్రేమలో ఉన్నానన్న భావన జీవితాన్ని ప్రతీ క్షణం జీవిస్తున్నానన్న సంతృప్తిని కలిగించేది. నీ ప్రేమలో నాకు నేను పరిపూర్ణత్వాన్ని పొందినట్టు అనిపించేది.

కాలం రెప్పపాటులో కరిగిపోయింది..

నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఇంకోలా ఎందుకు లేవు, నిన్నలా మొన్నలా ఈ రోజెందుకు లేవని నిన్ను నిలదీశాను. అలా ఎందుకు లేవని నాలో నేనే బెంగ పెట్టుకుని క్రుంగిపోయాను. నేను నిన్ను ఎందుకు ప్రేమించాను, అసలు నిన్నెందుకు నేను ప్రేమించాలి, నువ్వు నాకునచ్చినట్టు ఎందుకు ఉండట్లేదు, ఇప్పుడు నువ్విలా ఉంటే నాకు నచ్చట్లేదు.. అంటూ నిన్ను పదే పదే విసిగించాను, నొప్పించాను.

నాకు తెలీకుండానే నాలో నీ మీద ప్రేమ స్థానంలో కోపాలూ, పంతాలూ, సందేహాలూ వచ్చి చేరిపోయాయి. ఒకప్పుడు నాలో మొత్తంగా నిండిపోయిన నీ మీద ప్రేమ ఎక్కడికి పోయింది? ఎంతగా వెతికి చూసినా రవ్వంతైనా కనిపించడం లేదే? అద్దం ముందు నించుని చూసుకుంటే నా బదులు నువ్వే కనిపించే రోజుల నుంచి.. నాకు నేను కూడా కనిపించకుండా శూన్యంలా మిగిలిపోయిన పరిస్థితుల్లోకి వచ్చి పడ్డాను.

కాలం కదలనని మొండికేసింది..

"నువ్వు మారిపోయావు" అని పదే పదే గొంతు చించుకుని అరుస్తున్న నన్ను నా మనస్సాక్షి నిలదీసి అడుగుతోంది. ఇంతకీ మారింది కేవలం నువ్వేనా.. నేనేం మారనేలేదా? నీలో మార్పుని ప్రశ్నించే ముందు నాలోకి ఒకసారి తొంగి చూడమంటోంది. నిజంగా నేను నిన్ను ప్రేమించడం నిజమైతే నీలో వచ్చిన మార్పుని మాత్రం నేను ప్రేమించనా.. ప్రేమించలేనా?

సరే.. ఒక వేళ కాదు కూడదు అనుకుంటే నిన్ను పూర్తిగా వద్దనుకుని దూరం చేసుకోగలనా? నిజంగా నాక్కావలసింది అదేనా? ఉహూ.. కాదు.. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నేనెప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉండాలి. నువ్వు అనే ఆలోచన లేని నేను లేనే లేను. నువ్వు లేని నేను నాకే నచ్చను.
మరి అలాంటప్పుడు నాకెందుకింత పంతం.. నా ఆలోచనలకి అనుగుణంగానే నువ్వుండాలని స్వార్ధమా? అసలు నిజమైన ప్రేమున్న చోట స్వార్ధానికి చోటు ఉంటుందా?

నా ప్రేమతో నిన్ను బంధించాలనుకోను. నీ స్వేచ్ఛని గౌరవిస్తాను. నిన్ను నిన్నుగా ప్రేమిస్తాను. నీలోని మార్పునీ, నీ ఇష్టాల్నీ, అయిష్టాల్నీప్రేమిస్తాను. నీలో ఉన్న లోపాల్ని, బలహీనతల్ని కూడా ఇష్టంగా ప్రేమిస్తాను.

నేను నిన్ను ప్రేమిస్తాను. నీలోని అణువణువునీ ఎంతో ఇష్టంగా ప్రేమిస్తాను. నా ప్రాణ సమానంగా ప్రేమిస్తాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయేంత పిచ్చిగా ప్రేమిస్తాను.

నా కళ్ళల్లో నువ్వొచ్చి చేరిపోయావు.. నా మనసు తేలికైపోయి కేరింతలు కొడుతూ మబ్బుల దాకా ఎగురుతోంది.. నా చుట్టూ ఉన్న చెట్టూ పుట్టా, పక్షీ, నింగీ, నేలా నాతో కలిసి నవ్వుతున్నాయి.

అంతదాకా ఆగిపోయిన కాలం మెల్లగా కదలసాగింది.

అవును.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీలోని అణువణువునీ ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాను. నా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయేంత పిచ్చిగా ప్రేమిస్తున్నాను.

నాకు తెలుస్తోంది..
కాలం నా చేతికి చిక్కనంత వేగంగా పరుగులు తీస్తోంది..!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!