నికషం -ఒక శూన్య వలయం గురించి- పతంజలిశాస్త్రి

చీకటి కోణాలు అందర్లోనూ ఉంటాయి. కానీ తెలుగు సాహిత్యంలో దాన్నే ఒక ఇతివృత్తంగా ఇంత రాసినవారు తక్కువ. ఆ చీకటి కోణాల్ని ప్రత్యేకించి తెచ్చి పేజీ మీద పరచాల్సిన అవసరమేంటి?

అవసరం అంటే, నేను ముందు నుంచీ భిన్నంగా ఉండాలనుకున్నాను.

కరెక్టే, అదే రాయాల్సిన అవసరం ఏముంది. ప్రేమ గురించీ, సున్నితత్వం గురించీ, అందం గురించీ రాయచ్చు కదా. వాటి గురించి కూడా నేను రాసినంత బలంగా ఎవరూ రాశానని అనుకోను. నేను పచ్చి సెక్స్ గురించి కూడా చాలా అందమైన పదాల్లో రాశాను. వాటి గురించి కూడా రాస్తూనే ఉంటాన్నేను. “నికషం” చదవండి. అందులో పాత్ర తాను తండ్రి అయ్యే వీల్లేదని సైంటిఫిక్ గా తేలిన తర్వాత, స్టూడియోలో ఏడ్చుకుంటాడు, బట్టలన్నీ విప్పేసి చూసుకుంటాడు, వాడి మర్మాంగాలన్నీ మామూలుగానే ఉంటాయి, వాడి సెక్స్ జీవితం మామూలుగానే ఉంటుంది, కానీ స్పెర్మ్ కౌంట్ లేదు వాడికి, ఇంటికొచ్చిం తర్వాత భార్యకీ అతనికీ మధ్య అనుబంధాన్ని సెక్స్ ద్వారానే చూపించాను. ఒక purgation లాంటి సెక్స్ అది. ఇద్దరు పెళ్లయిన ఆడవాళ్లు, బాగా చదువుకున్న వాళ్లు నాకు ఫోన్ చేశారు. ఇంతకంటే గొప్పగా మగవాడూ ఆడదాని మధ్యలో ఇటువంటి సందర్భంలో దీన్ని గురించి రాసినవాళ్లు మాకింత వరకూ తగల్లేదండీ అన్నారు.... ............కాశీభట్ల వేణుగోపాల్

 

'నికషం' నిరంతర త్రయం - ఒక శూన్య వలయం గురించి - పతంజలిశాస్త్రి

“Books are either well written or badly written” అంతే నన్నాడు Oscarwilde. కవిత్వమైనా వచనమైనా గొప్పగా ఉండడం అంటే ఏమిటి? సమాధానం చెప్పుకోవడం కష్టం కాదు. నాకు కొన్ని నమ్మకాలున్నాయి. మంచి పుస్తకం ఆలోచిప చేస్తుంది. రచయితా చింతనాశీలుడై ఉండాలి. అలా కాని వారు రాయడం వ్యర్ధం. ఆఖరి వాక్యం నిన్ను వ్రుడువుగా ఒక మౌనంలోకి వదిలిపెట్టాలి. సాహిత్యానికే గాదు. ఇది గొప్ప సినిమాలకు కూడా వర్తిస్తుంది. దీన్ని మీరు అంగీకరించి తీరాలనే నియమం లేదు నాకు.

కాశీభట్ల వేణుగోపాల్ నా కిష్టమైన రచయితల్లో ఒకడు. సంగీతం తెలిసినవాడు, సంస్కృతం ఎరిగినవాడు, చేదు మాత్రలు మింగినవాడు అయినా నోరు చేదు చేసుకోనివాడు. నాకతని మీద అభిమానానిక్కారణం నిజానికివి కాదు. లేదా వీటితోపాటుగా This man has an insatiable zest for life. So do I.  ఇదతని గురించి తెలిస్తే ఇతని సాహిత్యం మరింతగా రుచిస్తుంది. ఆతను తెలియకపోయినా అతని కథలు అతన్ని పట్టిస్తాయి. స్థూలంగా అతనికి రెండు రకాల మనుషులు తెలుసు. ఏమి పోగొట్టుకున్నారో తెలిసి అన్వేషించేవాళ్ళు, ఏమి పోగొట్టుకున్నారో తెలియక వెతుక్కునేవాళ్ళు అంటే ఈ రెండు జాతుల మనుషులు తరుచుగా కనిపించే వాళ్ళు కాదు.. ఎందుకనిట? దానికి ఒకరకమైన ఎరుక కావాలి. ముందస్తుగా నీ బతుకేమిటో నీవెందుకిలా ఏడుస్తున్నావో నీకు తెలియాలి. అది తెలియాలంటే రెండు చెవుల మధ్య నుండి ఛాతీ ఎడమ భాగానికి ఒక రక్తపుజీర స్పందిస్తూ ఉండాలి. అప్పుడు నీ నుంచి విడువడి నిన్ను చూసుకోవడం మొదలవుతుంది. నువ్వు మామూలుగా ఎఫ్.డి. ల మీద వడ్డీ, పిల్లల్ని ఫ్రిజిడీర్ లో జాగ్రత్తగా భావి అమెరికన్ పౌరులుగా పెంచుకుంటున్నావనుకో  -  ఏ గొడవా లేదు. అట్లా కానివాళ్ళుంటారు .(పంచదార, బెల్లపు ఊబిలో పీకలదాకా కూరుకుపోయిన వాళ్ళు కాకుండా) వాళ్ళు నిశ్శబ్ధంగా ఉంటారు. అట్లాగే మరో రెండు వర్గాలున్నాయి. ఒకటి జీవితం నడిపిస్తుంటే వేలు పట్టుకుని నడిచేవాళ్ళు. రెండు, జీవితాన్ని వేలు పట్టుకుని నడిపించాలనుకునేవారు. అందువల్ల ఒక  చట్రంలో ఇమిడి, ఒక పద్ధతిలో ఒదిగి, ఒక నిర్వచనానికి లొంగని వాళ్ళు. వీళ్ళు వేణుగోపాల్ ప్రపంచంలో తారట్లాడుతుంటారు. అంటే లోపలివాళ్ళు కారు. వెలుపల నుంచీ లోపలి వెళ్ళినవారే. వీళ్ళెవరికీ గమ్యం ప్రధానం కాదు; ప్రయాణం ముఖ్యం. ఆదర్శాలు అసలుండవు. సహజంగా బతుకుతారు. ఏది, ఎక్కడ ఈ నికషం అని వెదుకుతుంటారు.

తాత్త్వికదృక్పథం అనే పదం వాడడం ప్రమాదకరం. తెలుగులో తాత్త్విక కథ, నవల అంటే చిత్రమైన అభిప్రాయాలున్నాయి. పైగా పెద్దగా చదువుకోడానికి పనికిరావనే రూడ్యార్ధం ఏర్పడింది, ‘నికషం’ అనే చిన్న నవల వేణుగోపాల్ చేసిన ఒక కొనసాగింపు. అతను చేస్తూ వస్తున్నదానికి ఒక కొనసాగింపు. “నీతి, నియమం, మంచీ, చెడూ , ఒక మనోహర భ్రమ...” అన్న వాక్యంతో నవల మొదలవుతుంది. దరిదాపు చివరికి...” మహాశూన్యం లోకి, yes, into that somthing called Nothing “ అన్న వాక్యం కనిపిస్తుంది. ఈ రెంటి మధ్యా మూడు జీవితాలు చేసిన ప్రయాణం, అన్వేషణ ఈ నవల.

రామసూరి అనే అలెక్స్, దుర్గ, కథకుడు స్నేహితులు. కళాశాల రోజుల్నుంచీ, నిరంతర త్రయం. ముగ్గురూ మానసికంగా ఒకటే. లేదా మనసు మూడు కోణాలు. లేదా మూడు ముఖాలు. ఈ త్రయానికి కేంద్రం రామసూరి అనే అలెక్స్. ఆటను “ముండలఖానా వెనక రొచ్చు మోరీ చివరి గట్టున మొదటిసారి తనన్తాను ప్రకటించుకున్నవాడు” అనాధ. ఒక కుష్టు బిచ్చగాడి బండి నుంచీ రామసూరి అనే పోలీసు ఆశ్రయం నుంచి ఒక క్రైస్తవ దంపతులు పెంచగా ‘అలెక్స్’ అయి, చివరికి వాళ్ళను కూడా పోగొట్టుకుని ఒంటివాడయిపోయాడు. అతనికి ఒళ్ళంతా బొల్లి మచ్చలు. మిగతా యిద్దరి canscience keeper  అలెక్స్. గొప్ప చిత్రకారుడతను. అతని జీవితంలో, లోకంలో, శరీరంలో అలెక్స్ కి నిత్యయుద్ధం. ఒక రకంగా అతను, తన మృతదేహాన్ని మోస్తూంటాడు. అతను గొప్ప భావుకుడు. మరొకరు మన  కథకుడు, అతను ఫోటోగ్రాఫర్. అతని భార్య కావేరి బ్యాంకు ఉద్యోగిని. కథకుడి సహాద్యాయుడు దుర్గ .. ఇంజనీరు. కానీ ఇతను ఊరవతల తోట పెంచుకుని దానికి ‘ఆలాపన’ అని పేరు పెట్టుకుని జీవితాన్ని ఆస్వాదిస్తున్న వాడు. వీళ్ళు ముగ్గురూ ఒక ‘మొత్తంలో’ మూడు భాగాలు. బతుకు తీయదనం తెలిసినవారు. అంటే జీవనం, జీవితం వేరని తెలుసుకున్న వారు.

అలెక్స్ బొల్లిమచ్చలు అతనివి కావు. లోకానివి. అతని స్నేహితురాలు గాయత్రి మంచి గాయని. ఆర్.టి.సి. లో కండక్టరు. కచేరీలు చేస్తుంటుంది. ఆమె అతని భౌతిక ప్రపంచం. లోకం అలెక్స్ మచ్చలని సహించలేదు. ముగ్గురు మిత్రుల దృష్టీ ఒకటే. జీవితంలోంచీ, మనసులోంచీ తీక్షణంగా ప్రసారం అయే సౌందర్యదృష్టి. They are not lotus eaters. బతకడం తెలుసుకున్నవారే. ఎటొచ్చీ వాళ్ళ బతుకులు వాళ్ళు, వాళ్ళ విలువల్ కొలమానంలో బతుకుతారు. అయితే ఇద్దరు లోకంలో సమాంతరంగా, ఒకడు లోకంతో సంబధం లేని ఒంటరిగా, ఈ ఒంటరి బహిష్క్రతుడు అలెక్స్ ఒక రకంగా మిగతా ఇద్దరికీ నికషం.

గాయిత్రి కూతురు ప్రియ. హైస్కూలు వయసు. ఆమెకి అలెక్స్ అంటే ప్రాణం. అలెక్స్ కి ఆమే జీవితం. తను రాసిన కవిత్వం ఆమెకి వినిపిస్తాడు. ఆమెని మోడల్ చేసుకొని బొమ్మలు గీస్తాడు. ఇద్దరూ లోకానికి అవసరం లేదు. పియకి లుకేమియా, ఇద్దరు రెండు రకాలుగా వ్యాధిగ్రస్థులు. వలయంలో ఒక చిన్న వలయం వీళ్ళిద్దరి రహస్య బాంధవ్యం. ఆమె లోకం అలెక్స్. స్వచ్చమైన, తనకే సొంతమైన, ఎవరికీ చెందని, అక్కర్లేని అలెక్స్. అతనికీ ఆమె అంతే. అతని శరీరం మీద లోకం వికృత చర్మం. అలెక్స్ కి Mother Fixation  ఒకసారి ఆటను తగలెయ్యగా మిగిలిన డైరీలు దొరుకుతాయి. వాటినిండా అతని మనసు పెట్టిన గావుకేకలు, బూతులు, ఏడుపులు -  అన్నీ తనని “ముండఖానా” వెనక పురుగును ఒదిలినట్టు విడిచి వెళ్ళిపోయిన తల్లిమీదే. అంటే ఆమె లేదని, He hates and grieves for her.  అతని శరీరక మానసిక అవసరాల గురించి రెండు సంఘటనలు చెబుతాడు రచయిత.

ఒకసారి ముగ్గురు మిత్రులూ వేశ్యల కొంపకి వెళతారు. అందులో ఏ ఒక్కరూ అలెక్స్ ని దగ్గిరికి రానివ్వరు. లోకంతో అలెక్స్ భౌతిక సంబంధం ఆ తిరస్కారంతో పూర్తిగా తెగిపోయింది. ప్రియ అతనికి సగం తల్లి. సగం కాదు. చివరలో అతను అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత అతని బొమ్మలు ఇంట్లో దొరుకుతాయి. అందులో ఒక వొమ్మ ప్రియ నగ్న చిత్రం. బొమ్మలో ఆమె వక్షస్థలం మీద అతని మచ్చల చెయ్యి చాపి ఉంటుంది. అది చూసిన మిత్రులిద్దరికీ బొమ్మ అర్ధం కాదు. అది Mother Foxation కి ప్రతీక. గాయిత్రి అవసరార్ధం అలెక్స్ కి దూరం అవుతుంది. ఎవరితోనో ఉంది ఇల్లు కట్టుకుంటుంది. ఊహించని పరిస్థితుల్లో అలెక్స్ మళ్ళీ ఒంటరివాడయిపోతాడు. ఈసారి అతనే లోకాన్ని తిరస్కరించి దేశం వదలి వెళ్ళిపోతాడు. ప్రియకీ అతనికీ శారీరక సంబంధం ఉండేదని అప్పుడే తెలుస్తుంది. ప్రియ వ్యాధి ముదిరి మరణిస్తుంది. నిజానికి ఆమే అతని ఆఖరి బంధం. స్నేహితులిద్దరికీ అలెక్స్ రహస్య లైంగిక జీవితం ఏవగింపు కలిగిస్తుంది. అతన్ని చిన్నపిల్లలతో లైంగికానందం పొందే వ్యక్తిగా భావిస్తారు. కానీ అలెక్స్ లైంగిక సంబంధం మిత్రులిద్దరికీ పూర్తిగా అర్ధమైనట్టు కథలో కనిపించదు. నమ్మలేని వాస్తవాన్ని చూసినప్పుడు కలిగే ఆశ్చర్యం తాత్కాలికం. అతని అస్తిత్వవేదన తెలిసినవాళ్ళు ఈ విషయంలో అతని చిత్తవృత్తిని ఎట్లా అపార్ధం చేసుకుంటారు? కానీ అలెక్స్ ని ద్వేషించరు. నిరంతరం త్రయం మానసికస్థాయిలో సజీవంగా మిగుల్తుంది. అలెక్స్ రెండు సార్లు విడుదల అవుతాడు. మొదటిసారి వేశ్య తిరస్కారం వల్ల. రెండోసారి ప్రియ మరణం వల్ల. ఆమెని ఆస్పత్రిలో చివరి సారి చూసి అతను వెళ్ళిపోతాడు. అదే నిజమైన విడుదల. లోకంతో, ప్రేమతో, ద్వేషంతో అన్నింటి నుంచీ అతను విడుదల అవుతాడు. ప్రియ మరణం అతన్ని విముక్తుణ్ణి చేసింది. అతని అస్తిత్వ సందిగ్దం ఆమెలో అంతమైపోయింది.

‘నికషం’ అలెక్స్ కథ. అతను ప్రధాన పాత్ర కావడం విశేషం కాదు. మంచి రచయితకి రెండు సమస్యల వంటివి ఎదురవుతాయి. మంచి రచయిత కాబట్టి నిర్మాణం కధన పద్దతీ వాటంతట అవే ఒదిగిపోతాయి. అది రచయితకి సహజంగా జరిగిపోతుంది. కానీ, ఒక క్లిష్టమైన ఇతివృత్తాన్ని కథగా చెప్పడం కాకుండా ఒక ప్రాపంచిక దృక్పథం వస్తువైనపుడు నిర్మాణ సంబంధమైన ప్రణాళిక అవసరం అవుతుంది. మరోమాటలో చెప్పాలంటే బహుముఖీనమైన జీవితానికి సంబంధించిన ఒక భాగాన్ని దృశ్యమానం చెయ్యదలచినప్పుడు, కథ అప్రధానం అయినప్పుడు, కేవలం ఒక చట్రంగా ఉపయోగించినపుడు రచయిత రెండు ఉపకరణాలను ఎంచుకోవలసి వస్తుంది. ఒకటి టోన్, రెండు వాయిస్, భూమి బద్ధలైపోయే గొప్ప విశేషం కాదిది. నిజానికి రెండూ ఏదో ఒక రకంగా అన్ని కథనాల్లోనూ ఉంటుంది. నేననడం ఆ రెంటినీ సృజనాత్మకంగా సమర్ధవంతంగా ఉపయోగించే రచయితల గురించి, ఒక ఉదాహరణ ఇస్తాను. ఈ వాక్యం రాస్తున్నప్పుడే స్ఫురించింది. ‘పిజియన్’ (pigeon) అని ఒక నవలిక చదివాను. అందులో ఒక పెద్ద బేంకు దర్వానుగా పనిచేస్తూ జీవితాన్ని ఒక ఖచ్చితమైన యంత్రంలా ఉద్వేగరహితంగా జీవిస్తున్న ఒంటరికి ఒక ఉదయం తలుపు తెరవగానే కారిడార్ లో పిజియన్, పావురం కనిపిస్తుంది. అది ఉదయమే కనిపించడం, దాని రెట్ట చూడ్డం అశుభం అనే నమ్మకం ఉంది. ఇక అతను రాబోయే అనర్ధాలను ఊహించుకుని, నానా క్షోభపడి, పారిపోలేక జీవితాన్ని నరకం చేసుకుంటాడు. ఒక అల్పమైన కారణం వల్ల నిర్హేతుకంగా పదిలమైన జీవితాన్ని ముక్కచెక్కలు చేసుకోవడం ఆ కథ. ప్రధానపాత్ర ఆ దర్వాను. అంటే కథ అతని వాయిస్ లో రావాలి. కానీ కథనం అంటా రచయిత టోన్. దీని గురించి ఇంతకంటే చెప్పడం, అప్రస్తుతం. వేణుగోపాల్ ఎంచుకున్న వాయిస్ కథకుడిది (Narrator)  టోన్ అప్రధానం అయిపొయింది. ‘నికషం’ వంటి వస్తువుని అతి సున్నితంగా, అత్యంత కౌశలంతో, Understantement గానో, ‘ధ్వని’తోనో చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే రచయిత ‘చెప్పడాన్ని’ ఎంచుకున్నాడు. ఉత్తమ పురుష ఉపయోగించడం అందుకు కారణం. లేదా ఉత్తమ పురుష ఎంచుకోవడం వల్ల ‘చెప్పడం’ అయింది. దీని గురించి ఈ కాసిని వాక్యాలు రాయడానిక్కారణం రచయిత సృజనాత్మక శక్తికి ఇది పరీక్ష. అందరు రచయితలూ పైన చెప్పిన వాయిస్ నుంచి విడిపోలేరు. వేణుగోపాల్ చాకచక్యంగా అట్లా విడిపోయాడు. విడిపోయానని చివరి రెండు మూడు సందర్భాలలో మర్చిపోయాడు. I found a bit of imbalance in voice  నాకు understatement  అంటే ఇష్టం. తెలుగువాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. రచయిత దీని జోలికి వెళ్ళలేదు.

మంచికథ ఎప్పుడూ భిన్నస్థాయిల్లో అవగతం కావాలి. (అన్నింటికీ ఒకే మంత్రం కాదు) వేణుగోపాల్ కి జీవితం బాగా తెలుసు. అది అతని రచనలతో పరిచయం వల్ల తెలుస్తుంది. విస్తృతమైన అర్ధంలో జీవితం తెలుసు. మానవ సంబంధాలు, అలెక్స్ లూ, మధ్యతరగతి సందిగ్ధం, ప్రేమ, ఉద్వేగాల ఉధృతి – నిశితమైన దృష్టి అతనిది. His empathy with the underdog is unmistakable. ‘నికషం’ ప్రపంచం అక్కర్లేని ముగ్గురు సౌందర్యారాధకుల అసంబద్ధ జీవితం అనే అపోహ కలిగించే అవకాశం ఉంది. దీనికి రెండు పోరాలున్నాయి. (ఈస్థటిక్ సెన్స్ ఘోరమైన మానసిక వైకల్యం అనే అభిప్రాయం ఉంది) నువ్వు దర్శించి అంగీకరించిన జీవితం, నీ మీద నీ నిమిత్తం లేకుండా రుద్దబడిన జీవితం. విలువలంటే ఎవరివి? నీ విలువలలో నీ సౌకర్యం కోసం, సంతృప్తి కోసం, ఆమోదం కోసం ఇతరుల జీవితాన్ని కొలవడం ఏం న్యాయం? అని అడుగుతున్నాడు. విలువలకి కూడా Face value, Intrinsic value ఉంటుంది. మనకి ఫేస్ వాల్యూ ముఖ్యం.

చాలామంది ఆలోచించడానికి ఇబ్బంది పడే విషయాల గురించి రాస్తాడు వేణుగోపాల్. చాలామంది చూడ్డానికి ఇష్టపడని నిజం గురించి గూడా రాస్తాడతను. వెరసి వేణుగోపాల్ జీవితానికి సంబంధించిన అన్ని రకాల ఎత్తుపల్లాలను,క్రీనీడలను చూసి చెప్తున్నాడు. చాలా ఆరోగ్యకరమైన పని చేస్తున్నాడు. అందుచేత ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకమైన పని కొనసాగించమని కోరుకుంటున్నాను.

------తల్లావజ్జల పతంజలిశాస్త్రి (9440703440)


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!