అంతర్వాణి..(venubhagavan..the fire)

నేనేం చేసినా ఇది ప్రపంచాన్నేం మార్చలేదు. కానీ నా అంతర్వాణిని వినిపించడం ద్వారా బహుశా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప విషయాలకు, మనుషుల మధ్య సామరస్యానికి, ప్రపంచ శాంతికి నేను సహాయపడగలనేమో..ఆల్బర్ట్ ఐన్స్టీన్


ప్రస్తుతం ఏం పని చేస్తూ జీవిస్తున్నారో.. అది మీ శరీరాన్ని, మనస్సుని, హృదయాన్ని, ఆత్మని... సంతృప్తిని కలుగజేస్తుందో లేదో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి!


మొదటిది: మీ పని మీ శారీరక అవసరాలను తీరుస్తుందా: మీరు మంచి జీవితం జీవించడానికి అవకాశమిస్తుందా? మీరు, మీ కుటుంబ సభ్యులు మంచి దుస్తులతో, మంచి ఇంటిలో ఉండడానికి అవకాశమిస్తోందా?
రెండవది:మీ మానసిక అవసరాలు తీరుతున్నాయా? మీ పని మీ మేధస్సుకు నిజమైన పని కలిగిస్తుందా? సవాళ్లను స్వీకరించి ఎదుర్కొనే శక్తిని అందిస్తూ కొత్త విషయాలను నేర్చుకొనే అవకాశం మీకు ఇస్తు౦దా?
మూడవది: మీ భావోద్వేగ (emotional) అవసరాలను అది తీరుస్తుందా? మీ పనిని మీరు మనఃస్పూర్తిగా ఇష్టపడుతున్నారా, ఆ పని పట్ల ప్రేమను కలిగి ఉన్నారా? ఒక తపనతో, తపస్సులా ఆ పని చేయాలనిపిస్తుందా?
చివరిగా అది మీ ఆద్యాత్మిక అవసరాలను తీరుస్తుందా? మీ జీవిత కార్యం అదేనని మీరు నమ్ముతున్నారా?

శరీరం, మనస్సు, హృదయం,ఆత్మలకు సంబంధించిన పై ప్రశ్నలకు మీరు బిగ్గరగా, "అవును" అని చెప్పగలిగితే మీరు మీ "అంతరంగ పిలుపును" కనుగొన్నట్లే!!


డబ్బు కోసమే కొందరు పనిచేస్తారు. తమ శారీరక అవసరాలు తీరుతాయి కానీ వారి సృజనాత్మకత, మేధస్సు, టాలెంట్ మొదలైనవి వారి పనిలో ప్రవేశపెట్టే అవకాసం ఉండదు. అటువంటి అనుభవానికి ప్రపంచం నీరాజనం పలకదు. కేవలం బ్రతకగలుగుతారు.


మరొకరకమైన వృత్తిలో శారీరక శ్రమ మాత్రమే కాదు. ఎంతో మేధస్సు పెట్టి పని చేయాల్సి ఉంటుంది. తెలివితేటలకు గుర్తింపు వస్తుంది. శారీరక అవసరాలకన్నా ఎక్కువ డబ్బు వస్తుంది. కానీ ఒక లాటరీ కనుక దొరికిందంటే ఈ పని చేయడానికి ఇష్టపడకపోవచ్చు. అంత డబ్బు ఉంటే ఈ పని ఎందుకు చేస్తాను అంటున్నారంటే మరి మీరు ఇష్టపడే పని మరొకటి ఉన్నట్లే కదా! కానీ మూడోరకం వృత్తి ఉంటుంది. అది మీ శారీరక అవసరాలకు సరిపడా డబ్బు సంపాదిస్తుంది. మానసికంగా మీ మేధస్సుకు పదును పెడుతుంది, ఆ పని మీకు ఉత్సాహాన్నీ,ఉత్తేజాన్ని కలుగచేస్తుంది. కానీ అది మీ పని కాకపోవొచ్చు. మీకు ఆ పనిలో తపన ఉండొచ్చు, కానీ ఆ పని మీ జీవిత కార్యం లేదా మీ కోర్ కాంపిటెన్స్ కు సంబంధం లేనిది ఉండవచ్చు.


ఉదాహరణకు, నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తున్నప్పుడు ఆ పనిని నేను చాలా ఇష్టంతో చేసేవాడిని, కానీ ఆ జీతం నాకు సరిపోయేది కాదు. ముద్రణా రంగంలో ఉన్నప్పుడు, ఒక కొత్త డిజైను చేసి ప్రింటు చేసినప్పుడు ఆనందం వచ్చేది, డబ్బూ వచ్చేది. అయినా అది నా జీవిత కార్యం కాదు. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణలో భాగంగా చేసిన పలు ట్రేడ్ ఫేయిర్స్ లో డబ్బూ వచ్చేది, కానీ టెన్షన్ కూడా వచ్చేది. ఎప్పుడూ అనిపిస్తుండేది , నా అసలు పని ఇవి ఏవీ కావని, స్ఫూర్తి నిచ్చే ఉపన్యాసం ఇచ్చినపుడు మాత్రం చెప్పలేని ఆనందం మనసులో సంక్రమించేది. నేను వ్రాసిన మొదటి పుస్తకం 'ది సీక్రెట్' 2002 లో వ్రాసినా ఈనాటికీ 11 ముద్రణలతో ఎన్నో వేల మంది జీవితాలను ప్రభావితం చేయడానికి కారణం,ఆ వ్రాసే సమయంలో నేను చేరిన ఒక భావాతీత స్థితిని ఇప్పటికీ మరువలేను. నేను నా అసలు పని గుర్తించి, ఆ పనినే జీవిత కార్యంగా మలచుకోవడానికి నాకు పట్టిన సమయం సుమారు 10 సంవత్సరాలు. ఎందుకంటే విద్యార్థిగా ఉన్న స్వాతంత్య్రం, వివాహమయ్యాకా, పిల్లలు కలిగాక ఆర్ధిక స్వాతంత్ర్యం సాధిస్తేనే కానీ మనిషికి మళ్ళీ స్వాతంత్ర్యం రాదు. ఈ సమయాన్నంతా భవిష్యత్తుకు పునాది వేసుకోవడంలోనే గడిపాను, వందలాది ఉపన్యాసాలు ఇచ్చాను. వందలాది వ్యక్తిత్వ, మేనేజ్మెంట్,ఆధ్యాత్మిక కోర్సులు చేసాను. సమాజంలో కొంత పేరు సంపాదించాక, ఇక పూర్తిగా నాదైన ప్రపంచంలోకి దూకాను, కానీ ఈ నా ప్రయాణం చాలా సులభంగా జరిగిపోయిందని మీకు చెప్పలేను, కానీ ఇది తప్ప మరో పని చేసి జీవితాన్ని వృధా చేసుకునే ఆలోచనా నాకు లేదు.


కానీ మారుతున్న పరిస్థితులలో, పెరుగుతున్న మానసిక పరిణతితో, వికసిస్తున్న చైతన్యంతో ఉన్న ప్రస్తుత సమాజంలో తలెత్తుకుని తిరిగేవారంటే కేవలం ధనార్జనే ద్యేయంగా పనిచేసేవారా లేదా ప్రేమ, కరుణ నిండిన హృదయాలతో పనిచేసే వారా అన్నది ఒక్క క్షణంలో పసిగట్టే కాలంలో ఉన్నాం మనం. మరి, మీరు ఎలా జీవించాలో మీరే నిర్ణయించుకోవాలి

.
ఇతరులు మిమ్మల్ని ఏ విధంగానూ మభ్య పెట్టకుండా చూసుకోండి. మీరో 'విభిన్నమైన టాలెంట్' కలిగి ఉన్నారు. అదేమిటో కనుగొనవలసిందే!


మీ అంతరంగ పిలుపు ఏమిటో కనుగొనాలంటే, ముందు మీ సహజమైన టాలెంట్ ఏమిటో తెలుసుకోవాలి, ఏ విషయంలో మీరు సంపూర్ణులో, సమర్దులో అర్ధం చేసుకోవాలి. ప్రాచీన రోమన్ కవి వర్గిల్ చెప్పినట్లు మీ వృత్తి అంటే మీరు జీతాన్ని ఇ౦టికి తెచ్చుకునేది కాదు. మీరు ఈ భూమిపై నిర్వర్తించవలసిన కర్తవ్యం. అటువంటి తపనతో,తీవ్రతతో పనిచేస్తే అది ఆధ్యాత్మిక అంతరాత్మ పిలుపవుతుంది.


మనం ఏ పని బాగా చేయగలమనేది ప్రతిభ. మనం ఏ పనిని చేయడాన్ని అత్యంత ఇష్టపడతాము అన్నది తపన (పాషన్). మనం చేసే ఏ పని ప్రపంచానికి అవసరమయి మనకు ధర చెల్లిస్తుందో అదే అవసరం. ఏది చేయాలని మనసు చెప్తుందో అది అంతరాత్మ.


ఆత్యాత్మిక, మానసిక, శారీరక, సామాజిక అవసరాలు అన్నీ కలగలిపిన ఒక పనిని కనుగొనడం అంటే మూలకాలన్నీ కలిసిన ఒక రసాయనిక చర్య ఏర్పడడానికి సంసిద్ధం కావడం అన్నమాట. ఎప్పుడైతే ఆ పాళ్ళు తారాస్థాయికి చేరతాయో, మనలో ఒక అకస్మిక జ్వాల ఉత్పన్నమవడాన్నిఅనుభవంలోకి తెచ్చుకుంటాము - ఆ అంతర్గత శక్తుల కలయిక వల్ల వచ్చే ఒక విస్పోటనం మనలోని అగ్నిని రాజేసి మనకు ఒక దిశ,దృక్పథం (విజన్), తపన మరియు ఒక స్పూర్తివంతమైన సాహసోపేత జీవితాన్ని అందిస్తుంది. -స్టీఫెన్ ఆర్ కోవే.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!