విలువలు...(ది సీక్రెట్ - వేణు భగవాన్)

నియమ నిష్టలు లేని రాజకీయాలు, మానవత లేని శాస్త్ర విజ్ఞానము, అంతఃకరణ (స్పృహ ) లేని ఆనందం, త్యాగము లేని పూజ, నీతి లేని వ్యాపారం, పని లేని సంపద, శీలము లేని విద్య సామాజిక మహా పాపములు - మహాత్మాగాంధీ.

ప్రముఖ ఫిలాసఫర్  అరిస్టాటిల్ మానవ జీవితాలని పరిశీలించి, మానవులు ఏది చేసినా వారి అంతిమ లక్ష్యం సంతోషంగా ఉండడంకోసమే అని తెలిపాడు. అయితే అరిస్టాటిల్ అంతటితో ఆగకుండా మరో విషయం చెప్పాడు. కేవలం మంచివారు మాత్రమే సంతోషంగా ఉండగలరని, నీతిమంతులు మాత్రమే మంచివారు కాగలరని ఆయన తెలిపాడు. దీనిని బట్టి ఎవరి సంతోషకరమైన జీవితానికైనా వారి విలువలపై ఆధారపడిందని చెప్పవచ్చు. ఎంత ఎక్కువ విలువలు కలిగినవారైతే అంత ఎక్కువ ఆనందంగా జీవిస్తారని ఉన్నత విలువలుగల వ్యక్తులను చూసినవారికి అర్ధమవుతుంది.
 

లక్ష్య సాధనలో విలువల ప్రాధాన్యం

విలువలు అంటే తప్పు ఒప్పుల పట్ల మనం ఏర్పరచుకున్న నమ్మకాలు. ఉదా: మనసు బాగోని సందర్భంలో  ఒకరు గుడికి వెళ్తారు. ఒకరు బార్ కు వెళ్తారు. మరొకరు ధ్యానం చేసుకుంటారు అంటే అది ఆయా వ్యక్తుల విలువలన్నమాట. నమ్మకాలు ఎలా ఉన్నా అసలైన విలువలు మాత్రం తమ విలువను ఎన్నటికి కోల్పోవు. అవి మానవాళి ఉన్నతి కోసం ప్రకృతి ఏర్పరచిన కొన్ని నియమాలు.

విలువలతో బ్రతకడమంటే అంతర్లీనంగా ఉన్నతంగా ఉండడం. చెప్పింది చేయడం మరియు చేసింది చెప్పడం. ఈ రోజు ధనం సంపాదించాలంటే విలువలకు తిలోదకాలివ్వాలనే నమ్మకం ప్రబలుతోంది. ప్రక్కవాడు ఏమైతే నాకేం, నా పని జరిగితే చాలు, అన్న దృక్పధం ఇప్పుడే కాదు ఎప్పటికి కలసిరాదు. మనం చేసే పని ఏదైనా సరే అంతిమంగా ఇతరులకు విలువ చేకూరడం వల్లే మనకు కలిసి వస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియదు.

ప్రత్యేకించి ఎవరి జీవితం వారి విలువలకు అనుగుణంగా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఇంటిలో ఉత్తమ విలువలు కల వ్యక్తి ఒకరు ఉంటే ఆ ప్రభావం ఇతరుల మీద పడుతుంది. అదే ఇంటి యజమాని ఉత్తమ విలువలు కలవాడైతే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుంది. ఉత్తమ విలువలు కలవారు ఏ రంగంలో ఉన్నా ఇట్టే పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరిని ఇతరులు గౌరవిస్తారు. ప్రతీ పనిలో తమదైన ముద్రను సృష్టిస్తారు. నాయకత్వ లక్షణాలు వీరి సొంతం. ఒక లక్ష్యం కలిగి ఉండడం ద్వారా వీరిది సాధారణ విజయం కాదు. అసాధారణ విజయం సొంతం చేసుకుంటారు. వీరు కేవలం బ్రతకరు, జీవిస్తారు.

మీకు తెలియని ప్రదేశంలో ఉన్నప్పుడు, ఉత్తర దిక్కు ఎటు ఉందో చెప్పమని టక్కున మిమ్మల్ని అడిగితే మీకు తెలియకపోవచ్చు లేదా ఉహించవచ్చు. కానీ దిక్సూచి ఉంటే అది కరెక్టుగా చూపిస్తుంది. అల్లాగే మన అంతర్వాణి కూడా ఎప్పుడూ మనకు సరైన దారినే చూపిస్తూ ఉంటుంది కానీ అంతిమంగా జీవితంలో ఏం కావాలో స్పష్టత  లేనప్పుడు, వ్యక్తి విలువల విషయంలో రాజి పడతాడు.

ప్రకృతిలో శిక్షలు, బహుమతులు ఉండవు. కేవలం పర్యవసానాలు మాత్రమే ఉంటాయి. పూర్వం కర్మ ఫలం కొన్ని జన్మలకు వస్తే, కొంత మందిని చూస్తుంటే ప్రస్తుత కాలమో ఎక్కడి కక్కడే ఎకౌంటు సెటిలైపోతున్నట్లు కనపడుతుంది. ఈ మాట అన్నప్పుడు ఒకావిడ "లేదండి ఏ సంవత్సరం ఎకౌంటు ఆ సంవత్సరమే సెటిలైపోతుంది" అన్నారు. ప్రస్తుత స్పీడ్  యుగంలో ఏమైనా సాధ్యమే.

తన సామర్ధ్యం సాయంతో మనిషి జీవితంలో అత్యుత్తమ శిఖరాలని చేరుకోవచ్చు.అయితే, అక్కడనుంచి పడిపోకుండా ఉండాలంటే మాత్రం మచ్చలేని నడవడిక ముఖ్యం.

మారుతున్న విలువలు


ఈ రోజు అన్నిటికన్నా విలువైనది ధనం. ఇది చాలా ఆహ్వానించ దగ్గ మార్పు అయినా ధనంకోసం మరింత విలువైన విలువలకు తిలోదకాలివ్వడమే శీలాన్ని కోల్పోవడం, ఏ రకంగా అయినా ధనం సంపాదించాలనే దృక్పధం ధనవంతులను చేసినా  ఐశ్వర్యవంతులను చేయదు. వీరు ఆ తరువాత ధనం ఖర్చుపెడుతూ అందరి మన్నన పొందడానికి ప్రయత్నిస్తారు. దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజంలో ఇలాంటి వారు కూడా అందలమెక్కుతున్నారు. కానీ ఈ డమ్మీ హీరోలు పైకి విజేతలుగా కనపడినా లోపల ఎన్నో భయాలు, అసంతృప్తి, ఆత్మన్యూనత భావన, మరిన్ని మానసిక సమస్యలతో అత్యంత దారుణమైన అంతర్ జీవితాన్ని గడుపుతూ కేవలం ఇంద్రియసుఖాలే జీవితమనుకుని వాటికి బానిస అవుతారు. ఈ విలువలు లేని వారికి ఇంతా బయటా నిజవైన విలువ ఉండదు.

ఈ రోజు మన విద్యార్థులకు స్కూళ్ళు, కాలేజీలలో విద్యాభ్యాసం జరుగుతుందని  అనుకుంటున్నారా? లేదు. ఇప్పుడు సినిమా హాళ్ళలో జరుగుతోంది. ఎలా ప్రవర్తించాలి?  ఎలా మాట్లాడాలి అని ఎవరు నేర్పుతున్నారో తెలుసా? మన సినీ కథా, మాటల రచయితలు. డబ్బు సంపాదించడానికి అతి సులభమైన దారి, మనిషి ఇంద్రియాలనే బలహీనత మీద వ్యాపారం చేయడమే. ఏది మంచో ఏది చెడో తెలియని వయసు వారికి "యూత్" సినిమాల పేరిట పనికిరాని ప్రేమ కథలు తీయడం వ్యాపారం పేరిట మనసుల్ని కలుషితం చేయడమే అవుతుంది. ఈ రోజు ప్రేమ పేరుతొ జరుగుతున్నా విపరీతపోకడలు చూసినా సెన్సారు బోర్డువారు సినిమాల్లో పోకిరీ వేషాలను హిరోయిజంగా చూపించి పసిమనసులను ప్రభావితం చేసే సన్నివేశాలను లేదా అలాంటి రెండు మూడు సినిమాలను బ్యాన్ చేస్తే కొత్తవారు అలాంటి సినిమా నిర్మాణాల జోలికి పోరు. కేరక్టర్ నిర్మాణం జరగాల్సిన టీనేజ్ వయసులో కొన్ని సినిమాల ప్రభావం వల్ల యువత ఎంతో మారినట్లు పైకి కనిపిస్తున్నా చిన్న చిన్న ప్రకంపనాలకే కూలిపోయే, పునాది సరిగా లేని భవనం లాగా చిన్న పయసులోనే ఎన్నో శారీరక, మానసిక వత్తిడులకు లోనవుతున్నారు.

ఈ రోజు చానల్లు పెరిగిపోయి, తమ మనుగడకోసం ఎలాంటి వార్తలు/కార్యక్రమాలను ప్రసారం చేస్తుందో, మనోరంజకమే జీవితంగా, మనసులను ఏ రకంగా ప్రభావం చేస్తుందో అనుకుంటూనే, అదే పనిగా అటువంటి కార్యక్రమాలను చూడడం, ఊరిలో ఉన్న చెత్తంతా మనసులో వేసుకోవడమే అవుతుంది.

మనిషి అభివృద్ధి చేడడానికి సెల్ ఫోన్, టెలివిజన్, సినిమాలు గొప్ప సాధనాలు. వాటిని మన నియంత్రణలో ఉంచుకోవాలిగాని మనం వాటి నియంత్రణలోకి వెళ్ళకూడదు. టీ.వి లో వచ్చే గొప్ప వారి ఇంటర్వ్యూలు, చర్చలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మనం ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళినా దొరకవు. ఈ మధ్య వచ్చిన గమ్యం, కిక్, వేదం, 3 ఇడియట్స్ లాంటి సినిమాలు చాలా అర్ధవంతంగా, స్పూర్తినిచ్చేవిగా ఉంటున్నాయి. సినిమాలు ఎలా ఉన్నా, మన లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు, ఎందులో అయినా ఉన్న 'మంచిని' మాత్రమే గ్రహించే తత్వం అలవోకగా అలవడుతుంది.

పాశ్చ్యాత్య విలువలు


విలువల విషయంలో కొంతమంది తర్క వాదం చేసే వారు ఉన్నారు. ఈ రోజు ఎంజాయ్ చెయ్యాలి అనే భావన ప్రబలింది. ఆనందంగా ఉండాలి అనుకోవడం తప్పుకాదు. కానీ ఇంద్రియ సుఖాలనే ఎంజాయ్ చెయ్యడం అనుకోవడం అజ్ఞానమే. ఇక్కడ తప్పా ఒప్పా అన్నది కాదు, వివేకమా, అవివేకమా అన్నది ముఖ్యం. బహుశా ఇది పాశ్చ్యాత్య సంస్కృతి దిగుమతి వల్ల వచ్చిన ముప్పు అయి ఉంటుంది. కానీ అక్కడ జరుగుతున్నా పరిస్థితి గమనించినా మన యువత కళ్ళు తెరిస్తే బావుండును.. అమెరికాలో బాల నేరస్తుల సంఖ్యా ఎక్కువ, సరైన విలువలు లేకపోవడంతో విడాకులు తీసుకున్న దంపతులు ఎక్కువ. విడాకులకు మూల కారణం ఒకరిపై ఒకరికి నమ్మకం లేక పోవడం వివాహంతో వచ్చే శారీరిక, మానసిక అవసరాలకు విలువ లేకపోవడానికి, అవి అంగడిలో దొరికే వస్తువంత  సులభం అయిపోవడం. అమెరికా విషయంలో ఒక నానుడి ఉంది, అక్కడ ఆఫీసుకి వెళ్ళేటప్పటికి ఉద్యోగం ఉంటుందని గ్యారంటి లేదు, ఇంటికి వచ్చే సరికి భార్య ఉంటుందని గ్యారంటి లేదు. ఒక్క శారీరక అభివృద్దే కాక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక అభివృద్ధి జరగనప్పుడు, కేవలం ర్యాంకులు, ఉద్యోగాల కోసమే చదువులైనప్పుడు, బ్రతకడం కోసమే జీవితాలైనప్పుడు మనిషి పక్క దారి కాదు 'తప్పు' దారిన పడినట్లే.

ఈ రోజు పిల్లలను నిందించే బదులు మన విద్యా వ్యవస్థను NCERT వారు ప్రతిపాదించిన విధంగా యుద్ధ ప్రాతిపదికన అమలు చేయగలిగితే, ఉపాధ్యాయులకు కొత్త విద్యా విధానంలో శిక్షణ  ఇచ్చి, తల్లి తండ్రులకు అవగాహన కల్పించగలిగితే  మన దేశం " ప్రపంచానికి అవసరమైన" మేధావులతో నిండిపోవడానికి పదేళ్ళు కూడా పట్టాడు. ప్రభుత్వం నిద్రలేచి ఆ అభివృద్ధి మనదాకా వచ్చేవరకూ వేచి చూసేకన్నా, తల్లి తండ్రులే అవగాహన పెంచుకొని తమ పిల్లలలో ఉన్న సహజమైన మేధోవనరులను  గుర్తించి, ప్రోత్సహించిననాడు ప్రభుత్వమే పద్మశ్రీ  అవార్డులిచ్చి గౌరవిస్తుంది. పిల్లలలో ఉన్న సహజమైన మేధస్సు గురించి మరింత అవగాహనకోసమై నేను వ్రాసిన " ది ఫైర్" , అమ్మ నాన్న ఓ జీనియస్ పుస్తకం చదవండి

ఆరోగ్యపు విలువలు


ఈ రోజు తినే ఆహారం చూడండి. పిల్లలైతే చాక్లెట్లు , చిప్స్, బేకరీ ఆహార పదార్ధాలు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్ లు లాంటివి ముఖ్యాహారం. కబాడీ, ఫుట్ బాల్ లాంటి శారీరక ఆరోగ్యం ఇచ్చే ఆటలు బదులు ఈ రోజు కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నారు. ఎక్కువ టెలివిజన్ చూడడం వల్ల, కంప్యూటర్ గేమ్స్ లాంటి ఆటలవల్ల మెదడు మొద్దుబారుతుందని శా స్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇక పెద్దవారు సంపాదన పెరిగే కొద్ది ఆయిల్ తో కూడిన వంటకాలు, నాన్ వెజిటేరియన్ ఆహారం లాంటివి నిత్యకృత్యం. 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒలింపిక్స్ లో ఒకే ఒక పతకం రావడానికి కారణమేమిటా అని1600 మంది స్కూల్ పిల్లలను సర్వే చేస్తే కేవలం నలుగురు మాత్రమే శారీరక ఫిట్నెస్ కలిగి ఉన్నారట. ఒలింపిక్స్ లో మనకి ఒక్క బంగారు పతకం రావడానికి వందేళ్ళు పట్టింది. స్చూల్స్ , కాలేజిలు మార్కెట్ సెంటర్ లోకి వచ్చేసాక ఇక ఆటస్థలం ఏది? పోటి పరీక్షల ఎక్స్ ట్రా క్లాసులకే సమయం సరిపోకపోతే ఇక ఆటలకి సమయం ఎక్కడా?

ఈ రోజు ఆరోగ్యం గురించి ఆలోచన తగ్గడానికి కారణం, అన్నిటికి మందులు ఉన్నాయిలే అనుకోవడం ఒక కారణం. సరియైన వ్యాయామం, సమతుల ఆహారం తీసుకున్న వారికి ఏ మందులతో పనిలేదు. ఆరోగ్యం పాడయితే ఏ మందులూ పూర్తిగా నయం చేయలేవు. అందరూ ఎయిడ్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికి కేన్సర్ ఎక్కువగా ప్రబలుతున్నది. దీనికి ఎక్కువ శాతం సరైన పౌషిక ఆహారము తీసుకోకపోవడమే ప్రధాన కారణం.

ఈ రోజు చాలా మంది లైఫ్ స్టైల్ అంటూ లైఫ్ ను వదిలేసి స్టైల్ కోసమే జీవించడం వల్ల "లైఫ్ స్టైల్" వ్యాధులు అనే కొత్తరకం జబ్బులను ఆహ్వానిస్తున్నారు. మనిషికి రెండూ ఉండాలంటే తన అసలు ధర్మాన్ని గుర్తించి ఆ పనిని ఒక కర్మ యోగిలా నిర్వర్తించినప్పుడు, ఆనందం వస్తుంది., అర్ధం వస్తుంది, ఆర్ధిక స్వాతంత్రమూ వస్తుంది. అలాంటి ఆదాయంతో విలాసాలకు వెచ్చించినా ఒత్తిడి చెంత చేరదు.

మంచి విలువలు ఎందుకు?

ఉదాహరణకు ఒక సేల్స్ మెన్  ఏదేని వస్తువు అమ్మవలసి వచ్చినప్పడు తన వస్తువు అమ్మడమే ముఖ్యం అనుకొని తన టేలెంట్ అంతా  ఉపయోగించి ఆ వస్తువు అవసరం లేనివానికి అమ్మడం తప్పుడు విలువ. నాసిరకం వస్తువుని అమ్మడం మరింత తప్పుడు విలువని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అసలు సేల్సు లో రెండు విలువలు ఏ సేల్స్ మెన్ అయినా పాటించాలి. మొదటిది కొనుక్కొనే వారికి ఆ వస్తువు అవసరమా అని, రెండవది అమ్మే వస్తువు మంచిదా అని. ఇటువంటి విలవలు కలవారు మాటిమాటికి కస్టమర్లను వెతుక్కోనవసరం లేదు.

ఎవరి శీలాన్నైనా పరిక్షించాలంటే వారికి అధికారమిచ్చి చూడండి అన్నారు అబ్రహం లింకన్. ప్రస్తుతం చెడు విలువలు లేనంత మాత్రాన, మీకు మంచి విలువలు ఉన్నట్లు కాదు, మంచి విలువలు మనసులో పాతుకు పోయి ఉండాలి, అవి అవసరాన్నిబట్టి మారేవి కాదు. మన పంచేంద్రియాలు ప్రతీ నిముషం మంచి విలువలకు వ్యతిరేకంగానే ప్రోత్సహిస్తాయి. నిజానికి ఐహిక సుఖాలకు లొంగిపోయే ప్రలోభాలు వచ్చినప్పుడే అసలు విలువలు బయట పడతాయి.

ధనం పోగొట్టుకున్నారా? ఏమి పోగొట్టుకోలేదు.
ఆరోగ్యం పోగొట్టుకున్నారా? ఏదో కొంత పోగొట్టుకున్నారు,
కేరెక్టర్ పోగొట్టుకున్నారా? అంతా పోగొట్టుకున్నారు. - స్వామీ వివేకానంద

మీ విలువలను పరిశీలించండి...


ఈ మధ్య కాలంలో ఏ విలువలూ తప్పు కాదు, ఒప్పు కాదు అని వింటున్నాం. అసలైన విలువలు అవసరాలని బట్టి మారవు. మీరు ఆవు అబద్దం ఆడడం ఎప్పుడైనా చూసారా, లేదు, ఎందుకంటే అది మనిషి కాదు కాబట్టి, అలాగే తప్పులు చేయడం తప్పు కాదు. అది తప్పు అని తెలుసుకోకపోవడం చాలా తప్పు, ఈ రోజు దొరికితే దొంగ లేకపోతే దొరలా ఉండేవారు ఎక్కువ ఉన్నారు. దొరికిన వారు పట్టుబడినందుకు బాధపడుతున్నారు కానీ తప్పు చేసినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేకపోవడం దురదృష్టకరం. విలువల విషయంలో ఇది మంచి, ఇది చెడు అని మనస్సాక్షి ప్రతీ ఒక్కరి మనసులో ఎల్లవేళలా చెబుతూనే ఉంటుంది. ఇది విన్న వాళ్లకు అర్ధమవుతుంది, వినని వాళ్లకు కొన్నాళ్ళకు మొద్దుబారి పోతుంది. ఏదైనా వాడుతుంటేనే కదా ఆరోగ్యంగా ఉండేది.

ఏది మంచి, ఏది చెడు అని సందేహం వచ్చినప్పుడు, ఈ విధంగా ప్రశ్నించుకోవడం ద్వారా మీకు సమాధానం లభించవచ్చు. ఎవరైనా మీ వ్యక్తిగత జీవితం మీద పరిశోధనలు చేసి పత్రికలలో మీ అంతర్గత విషయాలను యథాతదంగా ప్రచురిస్తే, మీ ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మిమ్మల్ని చూసి గర్వపడతారా? లేక ఇబ్బంది పడతారా? అనే విషయాన్ని గమనించండి.

మీ విలువలను గుర్తిచండి


ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేసి మనుషులందరూ అందిమంగా కోరుకునే అత్యంత విలువైన విలువలు ఈ విధంగా ఉన్నాయి. 1.మనశ్శాంతి. 2. ఆరోగ్యం. 3.ప్రేమ  4.ఆర్ధిక స్వాతంత్ర్యం  5. అర్ధవంతమైన లక్ష్యాలు  6.ఆత్మ సంతృప్తి.

ఊహించండి, మనశ్శాంతి మన విలువైతే, నిర్ణయాల సమయంలో ఈ విలువ మనపై ప్రభావం చూపి మనలను సరైన దారివైపు మళ్ళిస్తుంది. అదే ధనమే ప్రధాన విలువగా తీసుకున్న నిర్ణయాల వల్ల పైన చెప్పిన 6. విలువలు కోల్పోవచ్చు.

విలువలు అంత అవసరమా అనుకుంటే, తలెత్తుకుని తిరగాలి అనుకుంటే అవసరమే, ఈ ప్రపంచంలో ఇద్దరు ఇతరుల గురించి భయపడరు, మూర్ఖులు మరియు జ్ఞానులు. సరైనది అయితే భయపడాల్సిన పనిలేదు సరైనది కానప్పుడు భయం ఉండడమే మంచిది.  కీడెంచి మేలెంచమని మన పెద్దలు ఊరకనే చెప్పలేదు కదా!

మీరు అత్యంత విలువనిచ్చే విషయాలు మీకు తెలిస్తే మీరు ఎల్లవేళలా ముఖ్యంగా ముఖ్యమైన సమయాల్లో సరయిన నిర్ణయాలు తీసుకోగలిగి విజయం వైపు పయనించడమే కాక మీ వ్యక్తిత్వానికి శోభనిస్తుంది. ఇవి ఈ క్రింద ఇచ్చినవి కావచ్చు లేదా మరేదైనా కావచ్చు.

ఉదాహరణకు కొన్ని విలువలు: ధైర్యం, నిబద్ధత, నాణ్యత, ఎక్స్ లెన్స్, ఉత్తమనైనది. పరిపూర్ణత, విశిష్టత, అంతర్గతంగా ఉన్నతంగా ఉండడం. పరుల శ్రేయస్సు, ఆరోగ్యం, స్వేఛ్చ, ఐశ్వర్యం, ఆర్దికభాద్రత, సమాజంలో పలుకుబడి, మనస్సుకు నచ్చింది చేయడం, జీవిత ప్రయోజనం, కుటుంబం, భార్య/భర్త, పిల్లల్లు, స్నేహం, స్నేహితులు, సంతృప్తి, నాలెడ్జ్, ఇంటి నుండి పని చేయడం. ఆత్మజ్ఞానం, ఆనందం, ప్రేమ, న్యాయం, ధర్మం, స్ఫూర్తి, నిజాయితీ, అహింస, గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి, మాట మీద నిలబడడం, ఉల్లాసంగా ఉండడం, క్రమశిక్షణ, కృతజ్ఞత, అధికారము, ఇతరులకు ఆనందాన్ని కలుగచేయడం, సృజనాత్మకత, గౌరవము, సాహసం, సరదా, సంభాషణా చాతుర్యం, మౌనము, ఆధ్యాత్మికత, పని, సహాయపడడం, కొత్త ప్రదేశాలు చూడడం, ప్రశాంత జీవనం, డబ్బు, విలాసవంతమయిన జీవితం, ఆత్మ సంతృప్తి, మనస్సాక్షి, సొగసైన జీవన విధానం, భద్రతా, స్థిరత్వము, సమాజ సేవ ఇంకా ఎన్నో.

నేను దేనికి విలువ ఇస్తానంటే... అని మీరు అత్యంత విలువనిచ్చే విలువలను పెన్ను/పెన్సిలు తీసుకొని మీకు నచ్చిన విలువ క్రింద గీత గీయండి.
మీ అత్యంత విలువనిచ్చే ముఖ్యమైన 5 విలువలను ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయడం ద్వారా ఎన్నుకోండి.


1. ఏ విలువలను నేను (ఇతరులలో లేదా నాలో) ఎంతో ముఖ్యమైన విలువలుగా పరిగనిస్తాను?__________________

2.వీటిలో ఏ విలువలకూ నా జీవిత ఆశయానికి అవినాభావ సంబంధం ఉంది?_________________

3.ఒకవేళ నేను, ఒక్క విలువ తప్ప మిగతా అన్నిటిని వదిలివేయవలసి వస్తే ఏ విలువలను ఎంచుకుంటాను?_________________

మీరు ఆ మొదటి విలువను ఎన్నుకున్న తరువాత, రెండు, మూడు, నాలుగు, ఐదవ విలువలకోసం ఇదే 3 వ ప్రశ్నని ఉపయోగించి జవాబు పొందండి. అలా మీ జీవితంలో అత్యంత 5 విలువలను కనుగొనండి. వ్రాసారా, లేకపోతే చదవడం ఆపి వ్రాయండి. చర్య వల్ల ప్రతిచర్య వస్తుంది గాని చదవడం వల్ల కాదు.

ఈ 5 విలువలు, మీ ఇతర అన్ని విలువలకన్నా అగ్రస్థానంలో ఉన్నాయన్నమాట.మీ వ్యక్తిగత లక్ష్యాన్ని నిర్దేశించడానికి ఈ విలువలు చాలా ముఖ్యం. మీరు ఎన్నుకునే వృత్తికి ఈ విలువలు సరిపోతున్నాయా? లేక వ్యతిరేకిస్తున్నయా? చూడండి. మీ విలువలతో మీ వృత్తి లేదా ఎన్నుకోబోయే లక్ష్యం సరిపోతుంటే జీవితం ఆనందంగా సాగుతుంది. మీ విలువలు మీ జీవిత ఆశయం లో కూడా ప్రతిబింబిస్తే అంతిమ లక్ష్యమైన ఆనందం మీ సొంతమవుతుంది.

మీలో ఎవరైనా అనవచ్చు, ఈ రోజుల్లో ఈ విలువలు ఎక్కడా ఉన్నాయి అని, అందుకే విలువలు కలవారు గుర్తింపు పొందడం అత్యంత సులభం. యిక విజయం సాధించడం ఎంత ఈజీ అంటే పరుగు పందెంలో మీరు ఒక్కరే ఉంటే, ఖచ్చితంగా విజేత మీరే కదా!
విద్య అంటే కేవలం కొంత సమాచారాన్ని బుర్రలో కుక్కితే,
అక్కడది గందరగోళం చేస్తూ, జీర్ణం కాకుండా ఉంది పోయేది కాదు;
మనిషిని సంస్కరించి, శీలవంతున్ని చేసి, జీవితాన్ని చైతన్యవంతం చేసే
భావపరంపరయే సరైన విద్య.
నాలుగైదు ఉత్తమ భావాలను ఒంటబట్టించుకొని,
జీవితాన్ని మలుచుకున్నవారు యావత్తు గ్రంధాలయాన్ని వల్లె వేసిన వారి కంటే
ఉత్తమ విద్యావంతుడనడంలో సందేహంలేదు
.


విలువలు, విలువను పెంచాలి

మనం మన కర్తవ్య నిర్వహణలో ముందు ముందుకు సాగిపోయేటప్పుడు అడుగడుగునా ప్రజాభిప్రాయం  కోసం ప్రాకులాడకుండా,  స్వతంత్రంగా సాగిపోవాలి.- మహాత్మాగాంధీ.

అలాగని ఇతరుల కోసం మీ విలువలను వదులుకోనక్కర లేదు. ఉదాహరణకు వయసులో భర్తను పోగొట్టుకున్న యువతి అత్తమామలో సేవలో ఉండిపోయింది అనుకోండి. ఉత్తమురాలు అనవచ్చు. కొన్నాళ్ళకు ఆమెను చేసుకోవడానికి ముందుకువచ్చిన యువకుడిని ఈమె ఇష్టపడినా కూడా సమాజానికి భయపడి మానేస్తే బాధపడేదెవరు? అలా అని సమాజాన్ని లెక్కచేయ వద్దని కాదు. విలువ సరైనదయినప్పుడు సమాజం గురించి మానక్కరలేదు. సరైనది కానప్పుడు సమాజంలో ఎలానూ విలువ ఉండదు. ఒక ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్లు సంపాదించినా అతని డబ్బుకే విలువ ఉంటుంది కానీ ఆ వ్యక్తికి ఉండదు. చాలా మంది ముందు ఏదో రకంగా డబ్బు సంపాదిస్తే, అప్పుడు విలువ అదే వస్తుంది అనుకుంటారు. డబ్బుతో వస్తువులను, సేవలను, అవార్డులను, పదవులను కొనగలరేమో గాని విలువను కొనలేరు.

"జపాన్ మేడ్" అనగానే మంచి నాణ్యత అని భావన రావడానికి వారు గతంలో చేసిన విలువైన ఉత్పత్తుల వల్లే కదా! భవిష్యత్ లో కూడా విలువైనవి అందిస్తే ఆ విశ్వాసం ఉంటుంది లేదా "మన కీర్తి మంచుకొండరా" అన్నట్టు కరిగిపోతుంది. మన చరిత్ర మనకు అవసరం లేదు. కానీ ఇతరులకు కావాలి. దీనినే "ఇమేజ్" అంటారు. బ్యాక్ గ్రౌండ్ బావుంటే ఇమేజ్ (చిత్రం) అందం పెరిగినట్లే, గత చరిత్ర బావుంటే వర్తమానంలో "ఇమేజ్" మారుతుంది. చరిత్రను ఎవరూ మార్చలేరు. మనం మార్చగలిగేది వర్తమానాన్నే. నేటి వర్తమానమే రేపటి చరిత్ర కదా!

మనిషి తానూ అత్యధికంగా దొరుకునేది "గౌరవింపబడాలని". మన జీవన విలువలే దీనికి పునాది. ఉదాహరణకు  "ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం" వల్ల విలువ పెరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల విలువ తగ్గుతుంది. పెళ్ళైన కొత్తలో ఫలానా టైముకు వస్తానని పట్టించుకోకుండా ఉంటారా? అందుకే అక్కడ విలువ ఎక్కువ. అదే కొన్నాళ్ళకు వస్తానని చెప్పిన విషయమే గుర్తుండదు. అందుకే విలువ తక్కువ. మాట తప్పడం తప్పు కాదు, ఒప్పుకోకపోవడం తిరిగి దబాయించడం తప్పు. పిల్లలకైనా, పెద్దలకైనా, మీకైనా సరే మాట ఇస్తే నిలబడడం లేదా క్షమించమని కోరడం వల్ల, ఆ జీవితంలో ఆనందలక్ష్మి ప్రవహిస్తుంది.

సాధారణ వ్యక్తుల విలువలను ఎవరూ పట్టించుకోరు. పైకి వెళ్ళే కొద్ది సూక్ష్మ విషయాలే కీలకం. ఒక ట్రాక్టరు తయారీలో చిన్న తేడా వచ్చినా అది పెద్ద నష్టం కాదు. కానీ ఆకాశంలో ఎగిరే విమానం, అంతరిక్ష నౌకను తయారుచేయడంలో మరింత శ్రద్ధ అవసరం కదా!
 
 

Comments

Post New Comment


gayathri baradwaj 09th Nov 2012 00:31:AM

realy wonderfull book iam searching for your books in the market from past 2 months but not availble print cheyatledu demand undi chala mandi adugutunaru antunaru book shop valu pls koncham care tiskondi e vishayam naku me speach and articls chala ishatam sir