పద్మపూజ కథాసంపుటి..గుర్రం కథ ..రవీంద్రనాథ్ ఠాగూర్

విశ్వకవి రవీంద్రుడు రచించిన కథలు `పద్మపూజ’ పుస్తకంగా 1959లో తొలిముద్రణ అయింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన, పద్మపూజ కథలు సంపుటిని తెలుగులో కె.వి.రమణారెడ్డి అనువదించారు... పద్మపూజ కథల సంపుటి మొదటి ముద్రణ జులై ,1959 లో, తిరిగి ద్వితీయ ముద్రణ 1988 లో గావింపబడినది. ఇందులో 32 చిన్న కథలు ఉన్నవి... ప్రతీ కథ అందరికి నచ్చేవి,పెద్దలు మేచ్చేవి .. ఈ కథ సంపుటి విడుదలై శతాబ్దం గడిచిన ఇప్పటికాలానికి కూడా అన్ని కథలు గీటురాయి లాంటివే..
 

32 కథలలో ఒక కథ "పద్మపూజ".. ఆ కథ పేరునే ఈ కథలసంపుటి పేరుగా పెట్టారు...ఇందులోని కథలు వరుసగా...నాకో కథ చెప్పవే, ఆట బొమ్మలు, గుర్రం, విజయఫలం, పెళ్ళి, పద్మపూజ, మోక్షము, తల ఖరీదు, గురుగోవిందుడు, అంతిమ గీతిక, శిక్ష, లక్ష్య సిద్ధి, కార్మికుల స్వర్గాన కళాప్రియుడు, దివి - భువి, నరకంలో మజిలీ, బాట, మసక వెలుగు, రాహువు ప్రణయం, ప్రాణమూ..మనస్సు, భిక్షకుడు, అనంతుడూ -  నిత్యనూతనుడూ, మేఘదూత, తార ఆత్మహత్య, ప్రేతము, స్వర్గాచ్యుతి, రాజకుమారుడు, ఈకె, మీనూ, పేరు, మనసుకెక్కిన రాణి, దేవతా సుందరి, రాక.

 

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ .. పద్మపూజ కథాసంపుటి లోని.. గుర్రం ..కథ
 
బ్రహ్మదేవుడు మహాప్రపంచాన్ని సృష్టి చేసే పనిని దాదాపు పూర్తి కావచ్చింది. ఇంతలో ఆయనకు ఒక కొత్త ఆలోచన పుట్టింది.

తనకు సహాయం చేస్తున్న వారిని పిలిచి " మరికొంత ముడిసరుకు యిటు పట్టుకొనిరా ; కొత్తరకపు జంతువును సృష్టిచేయాలి" అన్నాడు.
కాని అతను మొకరిల్లి, "అయ్యా, నాదొక మనవి చిత్తగించండి. సృష్టి చేసే ఉత్సాహం తమకు ఎక్కువయిన సమయాన ఏనుగులను, మొసళ్ళను, సింహాలను, కొండచిలువలను పుట్టించారు కాని అప్పుడే వాటి తయారీకి ఎంత సరుకు ఖర్చుపడిందో తమరు గమనించనేలేదు. బరువూ, గట్టితనమూ వున్న ముడిసరుకు దాదాపు పూర్తిగా ఖర్చు అయిపొయింది. కాని, తేలిక సరుకు కావలెనంటే చాలా ఉంది" అని విన్నవించాడు.
బ్రహ్మ కొద్దిసేపు ఆలోచించి "సరే, ఉన్నదే పట్టుకొనిరా" అని ఆజ్ఞాపించాడు.
ఈసారి బ్రహ్మదేవుడు గట్టి సరుకు చాలా కొద్దిగా మెలకువగా వాడాడు. తానూ తయారుచేసిన కొత్త జంతువుకు కొమ్ములు కానీ గోళ్ళుకాని పెట్టలేదు. దానికి పలువరుస్నైతే ఇవ్వక తప్పలేదు. ఆ పళ్లు నమలగలవే కాని కొరకలేవు. కొత్త జంతువుకు బ్రహ్మ యిచ్చిన శక్తి వలన అది యుద్ధరంగాలకు పనికివొస్తుంది. కాని అది తనంత తానూ యుద్ధాలకు తలపడదు. ఈ జంతువూ పేరే గుఱ్ఱము.
గాలీ, ఆకాశమూ యే పదార్ధాలతో తయారైనవో, అటువంటి పదార్ధాలనే వాడి, బ్రహ్మదేవుడు గుర్రాన్ని తయారుచేశాడు. అందుచేత గుర్రం మనసు స్వేచ్చను, స్వాతంత్ర్యాన్ని కోరుకుంటుంది. గాలితో పరుగు పందెం వేసుకుంటుంది. ఆకాశం వంగి భూమిని తాకే చోటికి దౌడు తీస్తుంది. ఇతర జంతువులు ఏదో ఒక ఉద్దేశ్యంతో పరుగెత్తితే, గుర్రం పుగుకు ఏ ఉద్దేశ్యమూ ఉండదు. తననుండి తానే ఎగిరిపోవలెనని కోరిక యేమో దీనికి! అది పోట్లాడేది కాదు; మరొక చిన్ని జంతువును చంపి తినేదికాదు; దానికి ఒకే ఒక కోరిక ; పరుగెత్తడం; గాలీ, ఆకాశము - వీటికి సంబంధించిన పదార్ధాలు ఎవరిలో ఎక్కువ మెండై వుంటాయో వాళ్ళు పరుగెత్త జూస్తారని తెలివి గల పెద్దలు అంటూ ఉంటారు.
తాను సృష్టించిన జంతువునుచూచి, బ్రహ్మదేవుడికి సంతోషమయింది. తాను సృష్టించిన జంతువులలో కొన్నిటికి నివాస భూములుగా కీకారణ్యాలను కల్పించాడు. మరికొన్నిటికిగాను, కొండలలో గుహలు మలచి యిచ్చాడు. నిర్లక్ష్యంగా పరుగు తీస్తున్న గుర్రాన్ని చూచి నప్పుడు, అన్తుపోతులు గానీ అడ్డంకులు కానీ లేని బహిరంగ స్థలాన్ని దాని నివాస భూమిగా ఏర్పాటుచేశాడు.
ఆ బహిరంగ స్థలాన్ని దాటితే, మరి మానవుడు నివసించే స్థలం వుంది. తాను ప్రోగుచేసిన వస్తువుల బరువు వలన, మానవుడు వంగిపోయి వున్నాడు. ఇంతలో అతడు గుర్రాన్ని చూచాడు. తాను మోస్తున్న భారాన్ని గుర్రపు వీపు మీద మోపగలను అనుకున్నాడు. దాన్ని చెరపట్టగలను అనుకున్నాడు.
ఒకానొక రోజున మానవుడు వలలను పన్నాడు. గుర్రాన్ని చెరపట్టాడు. దాని వీపున జీను వేశాడు. దీనినోట కళ్ళెం పెట్టాడు. దానిని బందిఖానాలో నిర్భందించాడు.
పెద్దపులి తన అరణ్యగృహంలోనూ, సింహం తన గుహలోనూ ఉంటున్నవి కాని ఎటువచ్చీ గుర్రమే తన గృహాన్ని పోగొట్టుకుంది. స్వేచ్ఛపట్ల దానికి ఎంతో కోరిక ఉన్నప్పటికీ, అది దాస్యాన్ని తప్పించికొనలేక పోయింది.
బ్రతుకు భరింపరానిదిగా తయారుకాగా, చెరసాల గోడలను శివమెత్తినట్లు కాళ్ళతో తన్నింది కానీ యీ తాపులూ యీ తన్నులూ చెరసాల నేమి బాధ పెట్టలేకపోయినవి. కాని ఎడతెరిపి లేని తన్నులవలన గోడల గచ్చు పెళ్లలు పెళ్లలుగావీడి వచ్చింది దీనిని చూచి మానవుడు కోపగించాడు. "కృతఘ్నత అంటే యిదే! నేను కడుపుకు తిండి పెడుతున్నాను, దీని బాగోగులు విచారించేదుకు సేవకులను నియమించాను, కాని యీ మడ్డివసరం నా దయను రవంతైన గుర్తించలేదు" అనుకొన్నాడు.
గుర్రాన్ని మరపడానికి, దాని పొగరు అణచడానికి అతడు గట్టి చర్యలు తీసికొన్నాడు. అంతా అయిన తర్వాత, యింతకంటే తనకు నమ్మకమయిన జంతువు మరొకటి లేదు, అని చెప్పుకోగలిగాడు.
దానికి పదునైన గోళ్ళు లేవు, కూచి కొమ్ములా లేవు, కరుకైన పలువరుసా లేదు. కాళ్ళనెత్తి తన్నుదామా అంటే కొరడా ఝుళిపిస్తారు, ఇక మిగిలిన దేమిటి? ఒకే ఒకటి సకిలింత.
ఒక రోజున బ్రహ్మదేవుడికి బాధతో కూడిన గుర్రపు సకిలింత వినవచ్చింది. ధ్యానమందు మునిగినవాడల్లా ఒక్క పెట్టున మేలుకొన్నాడు. భూమిపై గల బహిరంగ స్థలాలను వంగి చూశాడు. గుర్రం అక్కడ వుంటే గదా!
యమధర్మరాజుని పిలిపించాడు. యముదంటే చావు. పిలిపించి " ఇది నిజంగా నీ పనే, సందేహం లేదు. నా గుర్రాన్ని దొంగిలించేశావు", అని నిందించాడు.
యముడి కేమి తెలియదు. "లోకపితా, నన్నెప్పుడూ తమరు నమ్మలేదు. నేనంటే మీ కెప్పుడూ అనుమానమే. తమ దృష్టిలో నేను పాపాల భైరవున్ని. కాని ఒక్కసారి మానవుడి యింటిమీదికి తమ చూపు తిప్పండి," అని చేతులు కట్టుకొని చెప్పాడు.
బ్రహ్మదేవుడు మళ్ళీ క్రిందికి చూచాడు. గోడల నడుమ యిరుకు జాగాలో నిలిచి సత్తువ ఉడిగి, బాధతో సకిలిస్తున్న గుర్రం కనిపించింది.
ఆయన గుండె నీరైపోయింది. మానవుని పిలచి, "ఈ గుర్రాన్ని స్వేచ్ఛగా విడిచివేయకుంటే పెద్దపులికి ఉన్నట్టు దీనికి కోరపళ్ళు పదునైన గోళ్ళు కల్పిస్తాను చూచుకో," అని బెదిరించాడు.
మానవుడు మోసగాడు. "లోకపితా, మీరు సృష్టించిన యీ జంతువు స్వేచ్ఛకు తగదు. చూడండి, దీనికొరకని ఎంత అందమైన శాల కట్టించానో," అని చెప్పాడు.
కాని  బ్రహ్మదేవుడు గుర్రాన్ని స్వేచ్ఛగా వదిలివేయాలని పట్టుబట్టాడు.
"తమ ఉత్తర్వులను అక్షరాల పాటిస్తాను. కాని ఒక వారం రోజులలో తమరు మనసు మార్చుకోవలసివస్తుంది. నేను దీనికై కట్టిన శాలయే ఉత్తమ నివాస స్థలమని ఒప్పుకొంటారు చూడండి" అన్నాడు మానవుడు.
అలా వెళ్ళిన మానవుడు ఏం చేశాడు, గుర్రపు ముంగాళ్ళకు బంధంవేసి, వదలిపెట్టాడు. అలా వదిలిన గుర్రం పరుగెత్తలేక, గోదురుకప్పవలె దుమికి పడసాగింది.
సత్యలోకం నుండి బ్రహ్మదేవుడికి గుర్రమే కనిపించింది కాని, దాని ముంగాలి బంధం కనిపించలేదు. అవమానంతో ఆయన ముఖం ఎర్రబారింది. ఇదా చివరకు తానూ సృష్టించిన జంతువు ఛీ.. ఛీ ! ఇంతటి గొప్ప పొరపాటు తానెన్నడూ చేయలేదనుకొన్నాడు.
మానవుడు వచ్చాడు. "ఏమిచేయమంటారు దీన్ని? మీ లోకంలో బహిరంగ స్థలాలు లేవు? ఉంటే దీనిని అక్కడికి తోలిస్తాను," అన్నాడు.
"చాలు చాలు! ఇక ఈ వికారపు జంతువును చూడలేను. తిరిగి దీనిని తీసికొనిపోయి, నీ శాలలోనే ఉంచుకో," అన్నాడు బ్రహ్మ. "కాని లోకపితా, దీనిని పోషించడం అంటే సులువా? దీని భారం నామీద ఎందుకు మోపుతారు? కనికరించండి నన్ను",అని దొంగ విన్నపం చేశాడు.
"తప్పదు దీని బరువు నీమీద వేసుకోవాలి. అప్పుడే నీ గొప్పదనం ఉదారబుద్దీ లోకానికి వెల్లడి అవుతుంది," అని ఒప్పించాడు బ్రహ్మ.
 

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!