ఆంతర్యం


"ఏమండి ....మనం ఈ ఇల్లు మారిపోదామండీ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు.  ఆఫీసు నుండి రాగానే కాఫీకప్పు చేతికి అందిస్తూ ఒక బాణం వేసింది రాజ్యం. అందులో అంతరార్ధం నాకు అర్ధంకాలేదు." పొద్దున్న మీరలా ఆఫీసు కి వెళ్ళగానే బాబిగాడికి జ్వరం తగిలింది. డాక్టర్ కి చూపించాను .... అజీర్ణం చేసి వచిన్దన్నారు! 'చెప్పింది రాజ్యం.
"అలాగా ఇప్పుడెలా ఉంది? " ఆత్రంగా అడిగాను..." ఏమో...ఎలా ఉందో...కన్నతల్లిని, నన్ను చూడనిస్తేగా ఆ మహాతల్లి?...అసలు పిల్లంటే ముచ్చట  పడిపోయేవాళ్ళు ఏ అనాధ పిల్లోడినో తెచ్చుకొని పెంచుకోవాలి  "- ఆవేశంగా అంటుంది.సరిగ్గా అపుడే గుమ్మం దగ్గర ప్రత్యక్షం అయ్యాడు విశ్వనాథం.రాజ్యం ' 'దూకుడు మాటలు' విన్నాడేమోనని సిగ్గుపడ్డాను.
విశ్వనాథం గబగబా లోపలి వచ్చాడు...వాడి భుజం మీద బాబు నిద్రపోతున్నాడు.
"బాబుని చిల్ద్రెన్ స్పెషలిస్ట్ కి చూపించి తీసుకోచ్చామ్రా  ఇంజెక్షన్ ఇచ్చారు.రాత్రికి తగ్గిపోతున్దన్నాడు."అంటూ వాడ్ని రాజ్యానికి అందించాడు."ఇందులో సాయి బాబా విభూది వుంది.... బాబుకు పెట్టండి.నేను ఆంజనేయ  స్వామి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వస్తాను!" హడావుడిగా వెల్లిపొతూ చెల్లెమ్మ వాడికి కాస్త దిష్టి తీసి పారేయ్ అన్నాడు.ఆ రాత్రి బాబి గాడి జ్వరం  తగ్గిందో లేదో కనుక్కునేందుకు రెండు సార్లు మా ఇంట్లోకి వచ్చి మా నిద్ర పాడు చేసాడు విశ్వనాథం!"కన్నవాళ్ళం మనకి లేని శ్రద్ద ఆయనకు ఎక్కువైపోయింది" - అంటూ విసుక్కుంది రాజ్యం.
విశ్వ్వనాథం తో నా స్నేహం ఇప్పడిది కాదు...చిన్నప్పుడు,నేను నిడదవోలు లో వున్నప్పుడు ఏడేళ్ళ పాటు వాడు నేను కలిసి హై స్కూల్ లో చదువుకున్నాం.వాళ్ళ ఇంట్లోనే మేము అద్దెకి వుండేవాళ్ళం.నేను,విశ్వనాథం,శేషగిరి అన్నదమ్ముల్లా కలిసి మెలిసి తిరిగేవాళ్ళం . విశ్వనాథం తమ్ముడే శేషగిరి....
కాలేజీ చదువు పూర్తికాగానే రాజ్యంతో పెళ్లి కావటం,హైదరాబాద్ లో  వుద్యోగం రావటం జరిగిపోయాయి.నేను వచ్చిన రెండు నెలలకే విశ్వనాథం కుడా వచ్చేసాడు   .ఒకే ఇంట్లోనే చెరో వాటా అద్దెకి తీసుకున్నాం.విశ్వనాథం భార్య పార్వతి.ఆ దంపతులకు పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు  కలగలేదు.అందుకే మా బాబి గాడిని  అంత గారాబం చేస్తారు. చాలా ప్రేమ , శ్రద్ద చూపిస్తారు.. ఆ విషయం చెప్పే రాజ్యాన్ని శాంతపరచడానికి ప్రయత్నించాను.
మా కంపెనీ తరపున అర్జెంటుగా కలకత్తా వెళ్ళే పనిబడింది. సరే నాతో పాటు రాజ్యం కూడా రావాలని ఆశ పడింది.ఎలాగు కంపనీ అక్కడ ఉండడానికి కావలసిన సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి, వెళ్ళాలని అనుకున్నాం.విశ్వనాథం వచ్చేసరికి మా హడావిడి చూసి ఎక్కడికైనా ప్రయాణమా అని అడిగాడు. అవును కలకత్తా వెళ్ళాలి మళ్లీ వచేసరికి వారం పడుతుంది అని అడగముందే వివరాలన్నీ చెప్పేశా.
బాబిని చూడకుండా అన్ని రోజులు ఉండాలంటే కష్టంగా ఉంటుందిరా ! వాణ్ని ఇక్కడే ఉండనివ్వు అని అడిగాడు...రాజ్యం ఒక్కసారిగా మీరు మరీ చెపుతారు అన్నయ్య.. వాణ్ని వదిలి మేము మాత్రం ఎలా ఉంటాం అంటూ తన మాటల్లో అసహనం పలికించింది.
కలకత్తాలో శేషగిరిని కలవాలని అనుకున్నా.అక్కడే ఆఫీసర్ హోదాలో ఉన్నాడు.వాడికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం.వ్రాసిన ప్రతి లెటర్ లోను  మా బాబిని చూడాలని ఉంది. అక్కడ మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు.పిల్లాడిని తన చేతులతో పెంచే అదృష్టానికి నోచుకున్నాడు అంటూ ఎపుడూ వ్రాసేవాడు.అదేమో కాని వాడికి కూడా పిల్లలు లేరు,ఈ మధ్యే ఎవరినో దత్తత తీసుకోవాలని అనుకున్నట్టు తెలిసింది.సరే ఎలాగు అక్కడికి వెళ్తున్నాం కదా అని విశ్వనాథంని ,శేషగిరి అడ్రస్ ఇమ్మని అడిగా..
నువ్వు వాడిని కలవకు అన్నాడు కొంచెం  కఠినమైన స్వరంతో.. ఏమైంది అని అడగకు,వాడు ఇదివరకుల లేడు అంతే..ఇంకేం అడగకు...నువ్వు వాణ్ణి కలవనని నాతో ఒట్టు వెయ్యి  అన్నాడు విశ్వనాథం.వాడిమీద కోపం వచ్చినా స్నేహాన్ని కాదనలేక సరేనని మాట ఇచ్చి కలకత్తా వెళ్ళాము.
అక్కడ వారం రోజులున్నాము అన్ని సదుపాయాలూ కంపనియే చేసింది.ఒక్కసారి ఐన శేషగిరిని కలిసి బాబిని చూపించాలని మనసు చాల కొట్టుకుంది.అన్ని ఉన్నవాడు ఎంతో ఆశగా కోరినది తీర్చకుండా కలకత్తా వదిలి తిరుగు ప్రయాణం అవుతున్నపుడు విశ్వనాథంకి మాట ఇవ్వకుండా ఉండాల్సింది అని అనిపించింది.
వచ్చి తాళం తీస్తుండగానే విశ్వనాథం వచ్చాడు.. బాబిని ముద్దాడుతూ చిక్కిపోయాడురా అన్నాడు.నేను ఏమి మాట్లాడలేదు. "ఏరా, శేషగిరి ఇంటిగ్గాని వెళ్ళవా ! "ఒక నిముషం తర్వాత తచ్చాడుతూ అడిగాడు.'ఎలా వెళ్తాను ? వెళ్ళవద్దని  ఒట్టు పెట్టుకున్నావ్గా!' - కొంచెం కోపంగానే చెప్పను. విశ్వనాథం కళ్ళల్లో సంతృప్తి కనిపించింది....
నాకు మాత్రం కోపం ఆగింది కాదు.చూడకుండా వచ్చినందుకు ఎంత బాధగా ఉందో తెలుసా అన్నాను..చూస్తే ఇంకా బాధపడేవాడివిరా అంటూ మెల్లిగా గునిగాడు విశ్వనాథం."అసలు నన్నెందుకు  వెళ్లొద్దు అన్నావు ?" తీవ్రంగా అడిగాను.
మేము ఇద్దరం దురదృష్టవంతులంరా.."శేషగిరికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం, బాబి గురించి చెప్పినపుడు వాడు ఎంత పొంగిపోయదో తెల్సా "....అక్కడికి నువ్వు వెళ్తే ఇంత త్వరగా వదిలిపెట్టే వాడు కూడా కాదు...ఆపై  క్షణం కూడా బాబిగాడిని వదిలి ఉండే వాడూ కాదు!...
'అందులో తప్పేమిట్రా ...పిల్లలలు లేని వాళ్ళు ఎవరినా ముచ్చట పడతారు..నువ్వు మాత్రం బాబిని అస్తమానం గారం చెయ్యవా.. దగ్గరికి తీసుకోవడం లేదూ'అడిగాను.
"అది కాదురా నీకు తెలీదు శేషగిరి కి లెప్రసీ ఎటాక్ అయింది "నా కళ్ళలోకి చూస్తూ చెప్పాడు ....
"కుష్టు వ్యాదా?.... శేషగిరి కి కుష్టు వ్యాదా ?"-అదిరిపడ్డాను . అప్రయత్నంగా రాజ్యం వైపు చూసాను....
విశ్వనాథం ఆంతర్యం ఏంటో ఆ క్షణాన అర్థం చేసుకోగలిగిన రాజ్యం కళ్ళు చెమ్మగిల్లాయి .
ఇంకా ఏదో అడగాలని ఆత్రంగా అటు తిరిగాను .
అప్పటికే విశ్వనాథం గుమ్మం దాటుతున్నాడు.


జీడిగుంట రామచంద్రమూర్తి  గారు వ్రాసిన "గోదానం "కథ సంపుటి లోనిది. ప్రధమ ముద్రణ 1992 . ఆ తరవాత ముద్రణ వివరాలు తెలియలేదు...ఈ సంపుటిలో 11 కథలు ఉన్నాయి..అన్ని కూడా 1980 -1990 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రచురింపబడినవే....



Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!