సంద్రంలోని ఉప్పెనలా

నా సమయం దొంగిలింపబడుతుందన్న కినుకతో
నీతో మాట్లాడను .. నీకై ఆలోచించను అని
నాపై నేను ఒట్టు పెట్టుకొని
అతనికో తెల్లకాగితపు లేఖను పంపాను...

ఝాము గడిచిందో లేదో
అలలు అలలుగా ఆలోచనలు మదినిండుగా
ఒకదానికొకటి ఎదురై చిక్కుముడిలా మారింది...
దిగులు దిగులుగా ఊహలరంగులు
ఒక దానితో నొకటి కలిసి నలుపెక్కిపోయాయి..

ఇంతలో
నా సమయం అంటూ వేరుగా ఎక్కడా కనిపించక
పెంకి పిల్ల .. మాట తప్పే పిల్ల నేనే అనుకుని
ప్రేమలో తప్పేమీ లేదంటూ
నాకు నేను కొన్ని మాటలతో సేదతీరి..

గత జన్మలో చేసిన పాపాన్ని మరిచినట్టు
పెట్టిన ఒట్టు .. పంపిన లేఖ ఆనవాళ్లు చెరిపేశా..

ఇంకేముంది
సాయంకాలనికి ఊహలు ఆశలు దరిచేరాయి
అతని చిత్రాన్ని గీస్తూ .. మోహపు గీతాలు ఆలపిస్తూ

ఇప్పుడు
నా సమయం దొంగిలింపబడుతుందా
నాకు నేను ప్రశ్నించుకుంటూ...

ఏ ఊరి బాటసారిగా పయణమయ్యాడో అని 
అతనికై ఊరువాడ ఏకం చేస్తూ
నాలో నేను ఇంకిపోతూ
సంద్రంలోని ఉప్పెనలా
అతనికై వెతుకుతున్న.....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!