బర్త్ డే అలర్ట్..


అర్ధరాత్రి దాటింది ఫోన్లోంచి అలర్ట్ సౌండ్ ఆగకుండా మోగుతుంది... కళ్ళు విప్పార్చి చూసాను.. ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇలా చూసి డిలీట్ చేయాలని చేయి ముందుకు చాచి చేయకుండా వదిలేసినవి ఎన్నో లెక్కలు వేయడం మర్చిపోయాను...

నా ఫోన్లో నాకు గుర్తు చేసే అలర్ట్ లో కొందరు కాంటాక్టు చేయలేని లోకంలో ఉన్నారు... ఎందరో కాంటాక్ట్ నెంబర్ మారిపోయి ఉన్నారు....మరికొందరు ఇక్కడే ఉన్నా దూరం వెళ్ళినవారు... ఇంకొందరు నేను వెళ్ళిపోయినా, నువ్వెందుకు గుర్తుంచుకున్నావు అని ప్రశ్నిస్తారేమో అనే ఆలోచన... ఆప్త మిత్రులు అనలేను ...శత్రువులుగా చూడలేను..

అలర్ట్ వినిపిస్తుంది.... కొన్ని జ్ఞాపకాలు వచ్చి చేరుతాయి... కొన్ని తడి చేసి వెళ్తాయి... కొన్ని రగిలించి వెళతాయి... జ్ఞాపకాలన్నీ చెదిరిన గిజిగాడి గూడులా కంటి ముందు కనిపిస్తూనే ఉంటాయి...అయినా జ్ఞాపకాలు ఎప్పుడూ సన్నిహితులే...

అయినా ఫోన్లో ఒకసారి కాంటాక్ట్ లిస్టులో పెట్టుకున్న పేరుని తొలగించడానికి ఎందుకో మనసు రాదు... అన్ని అక్కడే కదా... తప్పిపోయిన వాళ్ళవి, తప్పుకు పోకుండా దాచుకోవాల్సిన వాళ్ళవి..

ప్రతి బర్త్ డే అలర్ట్ నాకు ఒక పాఠం గుర్తు చేస్తూనే ఉంటుంది.... మనిషిని మరింత ప్రేమించడం కూడా నేర్పిస్తూనే ఉంటుంది..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!