కరణంగారి బైబిలు పఠనం

నేను చాల సంవత్సరాల తరవాత మా మామిడి తోట పైకం తీసుకోడానికి మా ఊరు వచ్చాను, ఎపుడూ నాన్నే చూసుకునేవాడు ఇవన్నీ కూడా.. నేను మా మేనత్త ఇంట్లో అడుగుపెట్టానో లేదో.."రాజూ" కరణం మామయ్య చనిపోయాడు..ఎలాగు వచ్చావు కదా.. పద వెళ్ళివద్దాం అంటూ బయలుదేరదీసింది.. మా మధ్య ఏమి చుట్టరికం లేకున్నా ఊరిలో పిలుపులన్నీ అలానే ఉంటాయి.  అక్కడకి వెళ్ళాక కరణం గారు ఎపుడు మతం పుచ్చుకున్నారా అని, ఉండబట్టలేక నాకు కాస్త పరిచయం ఉన్న మాస్టార్ని అడిగాను అయ్యో అలాంటిది ఏమి లేదయ్యా అన్నారు కంగారుగా,.మరీ టేప్ రికార్డులో బైబిలు  పఠనం  ఏంటండి! అన్నాను ఆశ్చర్యంగా... అది అంతా ఒక పెద్ద కథలే సాయంత్రం తీరిగ్గా మా ఇంటికి వస్తే చెప్పుకుందాం! అంటూ లేచి వెళ్ళి పోయారు మాస్టారుగారు. అక్కడ నాకు పెద్దగా ఎవరు తెలియక పోవడంతో అరగంటలో ఇంటికి వచ్చేసాను.


సాయంత్రం మాస్టార్ని కలిసివస్తాను అని అత్తకు చెప్పి బయలుదేరాను. నేను వెళ్లేసరికి మాస్టారుగారు పేపర్ చదువుతూ వసారాలో కూర్చొని ఉన్నారు. నన్ను చూడగానే ఏమోయ్! కథ కోసం రాజు వచ్చాడు కాస్తా కాఫీ పట్రా అన్నాడు. అప్పటివరకు అక్కడే కూర్చొని ఉన్నవాళ్ళ ఆవిడతో! మమ్మల్ని ఇద్దరినీ అనుమానంగా చూస్తూ ఆ.. తెస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. పడక్కుర్చిలో వాలిపోయి మెల్లిగా..ఇది ఎప్పుడో 20 ఏళ్లనాటి సంగతి అంటూ మొదలెట్టారు.


అపుడు ఈ ఊరు మరీ ఇంత పెద్దది కాదు. ఊరికి ఒక చివర చర్చి,మరోవైపు రాములవారి గుడి ఉండేది అది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి ఉండేదట. చర్చి ఫాదర్ అందరితో ఆదరంగా మాట్లాడేవాడు.అందుకే మతం తీసుకోని మాలాంటి వాళ్ళ ఇంటికి కూడా అతనికి ఆహ్వానం ఉండేది. ఒకసారి ఎక్కడో ఫారిన్ నుంచి మతగురువు ఇక్కడికి వస్తున్నాడట, ఆతను చెప్పే బైబిలు పఠంనం వినడానికి రమ్మని కరణం గారింటికి వచ్చాడు. ఏమయ్యా! మేము ఏమైనా మతం పుచ్చుకున్నామనుకున్నవా!  అంటూ కోపంతో చర్చి ఫాదర్నీ గెంటేసినంత పని చేసాడు.


అయ్యా! మీరు అలాగంటే నేను ఏమి చెప్పేది, మీరు ఊరి పెద్ద, మీరు వచ్చి ఒక్క పది నిముషాలు కూర్చుంటే చాలు, మీరే రాకుంటే నేను ఎవరినైనా రమ్మని కూడా పిలవగలనా, మీరు నన్ను చర్చి ఫాదర్ గా  కాకుండా, ఇన్ని ఏండ్ల పరిచయస్తుడిగా ఆదరించిన వారిగా  ఒప్పుకోండి, మీరు ఊరి పెద్దగా వస్తున్నారు అంతేకాని ఇందులో ఇంకేమి లేదు అని ఎంతో నచ్చచెప్పాడు. మీకు తగిన గౌరవ ఏర్పాట్లు చూసే బాధ్యత నాది అని అతి కష్టం మీద కరణం గారిని ఒప్పించాడు.
సరే! ఆ రోజు రానే వచ్చింది..కరణంగారు వెళితే మరీ ఊరంతా వెళ్ళాక తప్పుతుందా..అతనితో పాటే మేమంతా! అది రాత్రి 8గంటల సమయం..అపుడైతేనే అందరికి కావలసినంత తీరిక, 7గంటలకే భోజనాలు కానిచ్చి బయలుదేరాము. చర్చి ఆవరణ అంతా పండగ వాతావరణంలా ఉంది. కరణంగారికి మంచి దీవాణం వేయించారు. మాలాంటి పెద్దలకు మంచి కుషన్ కుర్చీలు వేయించారు, ఆ ఏర్పాట్లు  చూసి కరణంగారు చిన్నపిల్లాడిలా చాలా సంతోషపడిపోయారు కూడా..


ఆ తరువాత చర్చిఫాదర్ వచ్చిన ఆ  విదేశీయుడికి అందరిని గొప్పగా పరిచయం చేసాడు.సభ మొదలయింది ఆతను మంచి ఇంగ్లీషులో చెప్పడం మొదలెట్టాడు, ఆ ఉచ్చారణ ఎంతో ఆకట్టుకునేట్టు ఉంది కాని మాకు అందులో 'ఓ గాడ్' అనే ఒక్క పదం తప్ప ఏమి అర్ధం కావడం లేదు, ఏదో పది నిముషాల్లో కరణంగారు వెళితే మేము వెళ్ళొచ్చు కదా! అని కూర్చున్నాం, పది నిముషాలు కాస్తా గంట అయింది కరణంగారు అలానే ఉన్నారు, ఆయన ఎపుడు లేస్తారా అని మేము కాచుకొని కూర్చున్నాం,సరే యింకోగంట గడిచింది..ఉండలేక నేను వెళ్ళి చూస్తె ఏముంది హాయిగా నిద్రపోతున్నారు కరణంగారు అతన్ని లేపలేకా, వదిలే వెళ్ళడం కుదరక ఉండిపోయాము. మాతో పాటు ఊరంతా కూడా అలా ఉండిపోకతప్పలేదు. రాత్రి 2గంటలకు ఆతను చెప్పడం ఆపాడో లేదో,ఇట్టే నిద్రలేచారు కరణంగారు. కరణం గారు తన మాట మన్నించి ఉన్నందుకు ఎంతో సంతోషపడిపోయారు అతని నిద్ర సంగతి తెలియక చర్చిఫాదర్.


మరుసటి రోజు ప్రొద్దుటే కబురంపారు నా కోసం కరణంగారు,
నేను వెళ్ళగానే చిన్నపిల్లాడిలా నా చేతులు  పట్టుకొని మాస్టారుగారు నాకు ఒక సహాయం చేయాలండి అన్నారు."చెప్పండి ఏమిచేయాలో అన్నాను" అతని కళ్ళల్లో తడి చూస్తూ అయోమయంగా...
కొన్ని సంవత్సరాల నుండి నిద్రలేమితో బాధ పడుతున్నానని మీకు తెలుసు కదా ....
నేను వాడని మందు లేదు, చూడని వైద్యుడు లేడు.
నిన్న రాత్రి అతడి మాటలకు వచ్చిన నిద్ర, నాకు ఏ మందుల వాళ్ళ రాలేదు ఇంతవరకు,
దయచేసి నాకు అతగాడి మాటల క్యాసెట్టు కావాలండి అన్నాడు. అపుడు నాకు నిజంగానే చంటిపిల్లాడిలా కనిపించారు కరణంగారు..


మతగురువు మాటల్లో  అంతో ఇంతో బలం ఉండే ఉంటది.. అందుకే ఎపుడూలేని వర్షాలు కురిసాయెమో అని కనిపించిన వాళ్ళతో నేను అనడం మొదలెట్టాను. బ్రాహ్మణుడి  నైన నేనే అలా అనేసరికి అందులో నిజం ఉండే ఉంటుంది అన్నట్టుగా చూసారు పల్లెవాసులు...అలా..కరణంగారి బాధ, అతగాడి గౌరవం దృష్టిలో పెట్టుకొని.... ఆ వారమే బాగా కురిసిన వర్షాన్ని కూడా  అడ్డం పెట్టుకొని..కథ నడిపించా..  ఆ మతగురువు మాటలు రోజు వింటే ఊరు బాగుంటుందని...అందరు వినక్కరలేదు ఊరిపెద్ద వింటే చాలు అని చర్చి ఫాదరుతోనే చెప్పించాను. అందులో నిజం ఉన్న లేకున్నా ఊరికోసం అన్నారు కదా చేస్తే తప్పేముంది అని కరణంగారిని  ఒప్పించారు ఊరిజనం అంతా కలసి...అదిగో! అప్పటినుంచి ఊరి కోసం అలా వింటూనే ఉన్నారు అందరి దృష్టిలో... అసలు నిజం తెలిసింది కరణంగారికి, నాకు, ఫాదరుకి మాత్రమే...వాళ్ళిద్దరూ ఇపుడు లేరు... ఇపుడు నేను,నువ్వు...నేను పోయేవరకు మాత్ర౦ ఎవరికీ చెప్పకు.... అన్నారు కథ ముగిస్తూ
"అలాగే మాస్టారు" మాట తప్పను అని చెప్పి, నాకు కూడా  ఊరు వెళ్ళే సమయం అవుతుంది అని చెప్పి వచ్చేసాను..


అపుడు కాబట్టి అలా ఒకరి బాధను ఒకరు అర్ధం చూసుకున్నారు..
ఆప్తులుగా ఒకరి బాధను అందరూ పంచుకున్నారు...
మానవత్వమే తప్ప మతం కనిపించలేదు నాకు ఎక్కడా మాస్టారిగారి మాటల్లో....

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!