బ్లాక్ బ్యూటీ - అన్నా సెవెల్ - అరుదైన నవల

రచయిత్రి పరిచయం:అన్నా సెవెల్ (1820-1878): అన్నా సెవెల్ బ్రిటీష్ రచయిత. ఈమె వ్రాసిన పుస్తకం ఇదొక్కటే, కాని ఈ పుస్తకం పబ్లిషింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. దీనిని గుర్రాలతో సంబంధం ఉన్నవాళ్ళ కోసం,వాటిని దయతో, ప్రేమతో చూడాలన్న భావనను వారిలో పెంచడానికి రాసింది.ఈ పుస్తకాన్ని కేవలం 40 పౌండ్లకే ప్రచురణకర్తకి అమ్మింది. ఈమె తన నవలను 51 వ ఏట ప్రారంభించి, 57 వ ఏట ముగించింది. ఆ తర్వాత ఐదు నెలలకే చనిపోయింది.

బ్లాక్ బ్యూటీ అనువాద రచయిత:

శ్రీ కృష్ణ వరప్రసాద్: వీరు బి.కాం మూడో సంవత్సరం నుంచీ పత్రికలకు రాస్తున్నారు. తర్వాత పాత్రికేయుడయ్యారు. బాలల పత్రిక, యంగ్ హేర్ ,చతుర, ఈనాడు ఆదివారం, స్వాతి సపరివారపత్రిక,స్వాతి మాసపత్రికల్లో ఉద్యోగాలు చేశారు. 2000 నవంబర్ 23 నుంచీ ఫ్రీలాన్స్ రచయిత.

బాలసాహితీకోసం ’చిన్నారి నేస్తం’, ‘వేసవి విహంగాలు’, మంచి పుస్తకం కోసం ‘వింతదృశ్యం’, పీకాక్ క్లాసిక్స్ కోసం ‘సీగల్,బ్లాక్ బ్యూటీ’ – పత్రికలకోసం రెండు నవలలు, కొన్ని కథలూ, ఎన్నో వ్యాసాలూ రాశారు.

బ్లాక్ బ్యూటీ అనేది ఒక గుర్రపుపిల్ల, అది తన జీవిత కథ (ఆటోగ్రాఫ్ ) చదువరులకోసం చెప్పిన కథనే ‘బ్లాక్ బ్యూటీ నవల’ .  బ్లాక్ బ్యూటీ మొదటి దశ నుండి ఆఖరి మజలీ వరకు జరిగిన కథను ఏకబిగిన చదివించగలిగిన ‘అన్నా  సెవెల్’ వ్రాసిన ఏకైక నవల.

నవల ఇలా మొదలవుతుంది...నేను గతాన్ని తలచుకున్నపుడు, నాకు మొదటగా గుర్తొచ్చేది చిన్నకొలనుతో ఉండే మైదానం, ఆకుపచ్చని, నీడనిచ్చే చెట్లకొమ్మలు కొలనువైపు వాలి ఉండేవి. కొలనులో బాగాలోతుగా ఉన్నచోట కలువలు పెరిగేవి. గుర్రం పిల్లగా ఉన్నపుడు నాకు పచ్చిక తినటం వచ్చేది కాదు. మా అమ్మ పాలతోనే బతికాను. పగలు ఆమె పక్కనే తిరిగేవాడ్ని.రాత్రిళ్ళు ఆమె పక్కనే నిద్రపోయేవాణ్ణి.

బ్లాక్ బ్యూటీ సంక్షిప్త కథనం....

చిన్నపుడు ఒక పెద్ద మైదానంలో ఆరు పోతు గుర్రాలతో పాటు తన తల్లి డచెస్ తో కలసి ఉండేవాడు. వెలిసిపోయిన నల్లరంగులో ఉండేవాడు కావట్టి యజమాని వాణ్ణి ‘బ్లాకీ’ అనేవాడు. ఒకసారి డచెస్ “ నువ్వు చక్కగా, మంచి గుర్రంగా పెరగాలి. ఎప్పటికీ చెడుమార్గాలు పట్టగూడదు. నీకిచ్చిన పని బాగా చేయి. ఎప్పుడూ కరవొద్దు. తన్నొద్దు. ఊరికే ఆడుకుంటున్నపుడైనాసరే.” అని తన కొడుక్కి సలహా చెప్పింది. తన తల్లి వివేకం గల గుర్రం అని నమ్మకం , అందుకే తన తల్లి సలహాని జీవితం లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని అనుకుంటాడు.

నాలుగేళ్ళు ఉన్నపుడు బ్రేక్ ఇన్ ( బ్రేక్ ఇన్ అంటే గుర్రాలని లొంగతీసి తర్ఫీదు ఇవ్వడం, అది చాలా చిన్న విషయం కాదు.‘బిట్ ని నోట్లో అమర్చి కళ్ళెం వెయ్యడం, కాళ్ళకి నాడాలు వెయ్యడం, రద్దీ రోడ్లపై భయపడకుండా వెళ్ళడం,అనేది గుర్రాలకి ఒక పెద్ద పరీక్ష)అయ్యాక ఒక జమీందారు గారి అబ్బాయి అయిన గోర్ధాన్ కి అమ్మేశాడు. గోర్ధాన్ ‘బ్లాకీ’ కి కొత్త యజమాని.అక్కడ ‘మెర్రిలెగ్స్’ అనే మగ గుర్రం, ‘జింజర్’ అనే కోపిష్టి ఆడ గుర్రం పరిచయమవుతాయి. కొన్ని రోజులకు జింజర్, బ్లాకీ స్నేహితులవుతారు. అపుడు జింజర్ మూర్కులైన పాత యజమానుల వల్ల నేను దుడుకుగా, కోపిష్టిగా మారాల్సి వచ్చింది నన్ను నేను రక్షించుకోవడానికి  అంటూ తన దయనీయ కథని  బ్లాకీ కి చెపుతుంది.

ఒకరోజు అలా మేసి రావడానికి వదిలినపుడు బ్లాకీ కి ‘సర్ ఆలివర్’ అనే ముసలివాడైనా చాలా అందంగా ఉండే గుర్రం ఆరు లేదా ఏడు అంగుళాల పొడవు మాత్రమే ఉండే పొట్టి తోకతో ఉండి, దాని నుంచి వెంట్రుకలు కుచ్చుల వేలాడుతుంటూ కనిపిస్తే ఆశ్చర్యపోయి, ఎలా జరిగిందని అడిగింది. దానికి సర్ ఆలివర్ బుసగొట్టి, అది క్రూరులైన మనుషులు, ప్యాషన్ పేరుతొ చేసిన పని అని, దానివల్ల అది పడ్డ బాధ, తనకు తెలిసిన కుక్కపిల్లల చెవులు కూడా ఇలా కత్తిరించి అందం అంటూ పొంగిపోయే యజమానుల గురించి ఎన్నో చెపుతుంది.

యజమాని జాన్, జేమ్స్ ని పిలిచి ‘బ్లాక్ బ్యూటీ’ అనే పేరు పెడదాం ఈ గుర్రపు పిల్ల అందానికి సరియైన పేరు అని చెప్పడంతో బ్లాకీ ఇపుడు ‘బ్లాక్ బ్యూటీ’ అవుతుంది. ఒకరోజు గాలివానలో తన యజమాని తో వాగు దాటవలసి వస్తే బ్యూటీ ఎందుకో ప్రమాదంగా అనిపించి వంతెన దాటడానికి మొరాయిస్తుంది. ఆ వంతెన మధ్యలో కూలిపోయిందని తెలిసాక యజమాని బ్లాక్ బ్యూటీ  కృతజ్ఞతలు తెలపడం,బ్యూటీకి ఎంతో ఆనందం, మనిషి పై నమ్మకం ఇస్తుంది.

కొన్నాళ్ళ తరువాత యజమాని స్నేహితులని కలవాలని వెళ్ళినపుడు అక్కడ విశ్రాంతి కోసం ఒక గుర్రపుశాల లో ఉంచగా, పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. వేరే పనివాడు వచ్చి వాటి కట్లు విప్పి బయటికి పంపాలని ప్రయత్నించినా అవి వెళ్ళవు, నమ్మకమైనా తెలిసిన మనిషినే నమ్ముతాయి.కొన్ని అక్కడే చనిపోతాయి, ఆఖరికి జేమ్స్ మాట వినిపించడంతో బ్లాక్ బ్యూటీ బయటకు వస్తుంది.

మరొకసారి రాత్రి జాన్ వచ్చి బ్యూటీ నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో పరిగెత్తు, యజమానిరాలి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి అన్నాడు. అపుడు గాలికంటే వేగంగా పరిగెత్తి, అలసిపోయి ఉన్నా మళ్ళీ డాక్టర్ని తీసుకొని అంతే వేగంగా ఇల్లు చేరింది బ్యూటీ. యజమానిరాలి ప్రాణాలు దక్కాయి కాని బ్యూటీ విపరీతంగా జబ్బు పడింది, అపడు అక్కడ ఉన్న జో గ్రీన్ అనే పనివాడు తెలియక దానికి వెచ్చగా సరియైన దుప్పట్లు కప్పకపోవడం, పూర్తిగా అలసిపోవడం ఊపిరితిత్తులు వాచి చాలా రోజులు జబ్బు పడుతుంది.

మూడేళ్ళ తరువాత యజమానురాలికి గాలి మార్పు అవసరం అవ్వడంతో మిస్టర్ యార్క్.. ‘బ్లాక్ బ్యూటీ’ ‘జింజర్’ కి కొత్త యజమానిగా మారతాడు. ఇక్కడ యజమానురాలికి ఫ్యాషన్ మీద మక్కువ ఉండడంతో బ్యూటీ, జింజర్  ఎంతో బాధ పడాల్సి వస్తుంది. భరించలేక జింజర్ యజమానిపై తిరగబడడంతో దాన్ని ఎపుడు బండికి కట్టలేదు , తరువాత యజమాని కొడుకుల్లో ఒకరు దాన్ని తీసుకెళతారు.

ఒకసారి యార్క్ ఎక్కడికో వెళ్ళినపుడు, రూబెన్ స్మిత్ ని గుర్రపుశాల పర్యవేక్షకుడిగా ఉంచుతాడు. అతను గుర్రాలని బాగా చూసుకుంటాడు గాని తాగితే ఏది పట్టించుకోడు. ఒకసారి ‘బ్యూటీ’ కాలికి ఒక నాడా లో ఒక మేకు వదులు అయ్యింది పనివాడు గమనించలేదు. రూబెల్ తాగి బ్యూటీ తో స్నేహితుడి ఇంటికి బయలుదేరాడు అది కూడా విపరీతమైన వేగంతో, దానితో నాడా ఊడి ‘బ్యూటీ’ డెక్క విరిగి చిగురువరకూ చీలి పడిపోయింది, ఆ వేగానికి రూబెల్ కింద పడి చనిపోతే, బ్యూటీ మోకాళ్ళు పాదం బాగా దెబ్బతిన్నాయి. ఆరోగ్యం బాగాయింది కాని మోకాళ్ళు మచ్చలు మిగిలి అందం పోగొట్టుకుంది.

మళ్ళీ కొత్త యజమాని .. మిస్టర్ బేరి, తరువాత వరుసగా జేరిమియా భార్కర్,మొక్కజొన్న డీలర్, స్కిన్నర్, థరోగుడ్ ఇలా ఎందరి చేతిలో మారుతుంది. ఈ నేపథ్యంలో జింజర్ ని చూస్తుంది. దాని స్థితిని చూడలేకపోతుంది బ్యూటీ.  

చివరకు మిస్ ఎలిన్ అని ఒక ముసలావిడ ని చేరింది. ఆవిడ మరి ఎప్పటికి ఎవరికీ బ్యూటీని అమ్మకూడదు అని అనుకుంటుంది.అక్కడ పనివాడు బ్యూటిని చూసి గుర్తించి, నేను’ జో గ్రీన్’ ని, నీకు జబ్బు చేసినపుడు తెలియక దుప్పటి కప్పలేదు అని అన్నాడు.అతన్ని గుర్తిస్తుంది. తన కష్టాలన్నీ ముగిశాయి. చివరి మజిలీగా చేరాల్సిన చోటుకే చేరుతుంది.

 ‘బ్లాక్ బ్యూటీ’ పీకాక్ క్లాసిక్స్  ప్రచురణల ఆన్లైన్ లో గానివిశాలాంద్ర బుక్ హౌస్ లోను మరియు అన్ని ప్రముఖ పుస్తక సంస్థలో  కూడా దొరుకుతుంది.​


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!