ఓయ్...ఓ మాట

ఓయ్ ..

నీకు మాటలు చెప్పనా... మనసులో మెదిలే ప్రతి మాట నీ వరకు చేరాలని ఎంత ఆశగా ఉంటుందో.. ఏదో పనిలో ఉంటూ.. ఉంటూ ఉండగానే హఠాత్తుగా గుర్తొస్తావ్. అప్పుడు నా చుట్టూ ఉన్న గాలి ధూళి అంతా నీ అలికిడే వినిపిస్తుంది.. అప్పుడెప్పుడో నీవు చెప్పిన మాటలు జానపద కథల్లా మరోసారి కదలాడుతాయి.. నీ మీద ఇష్టం ఒక్కసారి సముద్రపు అలల్లా ఎగిసిపడుతుంది...

నీపై ఇష్టానికి కారణాలేమి అంతు తేలవు.. నాకు అందిన అద్భుతాలు అన్నీ నీ తల వెంట్రుకల్లోనో  నీ కంటి వెలుగులో దాస్తానేమో... అందుకే నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి ఇంతకంటే అద్భుతం మరొకటి లేదనిపిస్తుంది..తప్పు చేయకపోయినా  క్షమించమనడం తప్పేం కాదనిపిస్తుంది... నా నుంచి తప్పుకు పోకుండా కట్టడి చేయాలనిపిస్తుంది... అయినా నన్ను నేను కోల్పోతున్నాను అనిపించదు.. నీకంటే ముందడుగుగా నేనున్నాననిపిస్తుంది.. నాకు నన్ను మరింత గొప్పగా చూపిస్తుంది... అదిగో అప్పుడే నీ మీద ఇష్టం ఏడేడు ఆకాశాలంతా విస్తరించుకుంటుంది. ఏది నువ్వో ..ఏది నేనో గీతలు గీయడం కష్టంగా మారుతుంది.

మా బాల్కనీలో మొక్కను చూస్తున్నప్పుడు, అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు, వంటలో రుచి కోసం ఉప్పు వేస్తున్నప్పుడు .. అంతేనా ఒక పాట విన్నప్పుడు ఓ కథ చదివినప్పుడు..ఎప్పుడు ఎక్కడ ఎదురవుతావో నాకు అంతు పట్టదు... నా కళ్ళ ముందు వేల రంగుల పొదరిల్లులా అల్లుకుంటావు అయినా కూడా నాకు ఎంత ఆశనో లోకంలో వెతికి వెతికి మరో కొత్త రంగును సృష్టించి నీకు కానుకగా ఇవ్వాలని...

నా నుంచి తప్పుకు పోవాలని, తప్పించుకుపోవాలని నీవు అనుకున్న సాధ్యం కాదని  నీ చుట్టూ దడికట్టే సామర్థ్యం ఎంతో ఉందని  నాపై నాకు ఎంత నమ్మకమో... అవును మరి నీ చుట్టూ ఓ సన్నని జలతారు వల కొన్ని యుగాలు కిందటే అల్లబడింది కదూ..

నీకు ఎన్ని వేల మాటలు చెప్పినా ఇంకా చెప్పాల్సినవి గుప్పెడు మిగిలే ఉంటాయి... నాకు తెలుసు నన్ను పలకరించిన ప్రతిసారి నీ ఆలోచనలో గుప్పెడుచోటు ఎప్పటికి నాదేనని..

ఈ మాటలు చెబుతున్న ఈ క్షణం అచ్చంగా నీది..  నీ అరచేతిలో గీతలు గీస్తూ చెప్పాలని ఉంది నువ్వంటే ఎంతో ఇష్టమని... ఎన్ని వేలసార్లు చెప్పినా తరగని ఇష్టం...

ఓహ్..ఎందుకో నీ పెదవిపై చిరునవ్వు...నీ అరచేతిలో చక్కిలిగిలి ఏమైనా అడుగెట్టిందా...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!